తిరుమల: లడ్డూ తీసుకోవాలంటే ఆధార్ కావాలా? కొత్త విధానంలో ఏం మార్పులు వచ్చాయి....

తిరుమల లడ్డూ

ఫొటో సోర్స్, Rajesh

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

తిరుమలలో లడ్డూల విక్రయానికి సంబంధించిన నిబంధనలలో ఇటీవల కొన్ని మార్పులు జరిగాయి. దర్శనం చేసుకున్న వారికి, చేసుకోని వారికి విడివిడిగా నిబంధనలు పెట్టారు.

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విక్రయానికి ఆధార్ నిబంధన పెట్టింది. మరి అందరికీ ఆధార్ ఉంటేనే లడ్డూ ఇస్తారా? ఉంటే ఎన్ని లడ్డూలు ఇస్తారు? ఇలాంటి వాటిపై చాలామందికి స్పష్టత లేదు. దీంతో నిబంధనల్లో మార్పుల మీద టీటీడీ ఈఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం...

వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు లడ్డూ కావాలంటే టోకెన్ చూపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తాం. ఇంకా కావాలంటే ఒక్కో లడ్డూకు రూ.50 చొప్పున ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు.

దర్శనం చేసుకోని భక్తులకు లడ్డూలు కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. అది కూడా ఒక కార్డుకు రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారు. ఒక ఫ్యామిలీలో ఐదుగురు, ఆరుగురు ఉన్నా కార్డుకు రెండేసి చొప్పున లడ్డూలు తీసుకోవచ్చు. ఒక ఆధార్ కార్డు మీద నెల రోజుల్లో ఎన్ని తీసుకున్నారనే విషయాన్ని మానిటర్ చేస్తాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లడ్డూలు

ఫొటో సోర్స్, Rajesh

ఆధార్ లేకపోతే లడ్డూలు ఇవ్వరా?

దర్శనం చేసుకున్న వాళ్లకు ఆధార్ అవసరం లేదు. దర్శనం చేసుకున్నట్టు టోకెన్ చూపిస్తే చాలు. దర్శనం చేసుకోని వారికి మాత్రం ఆధార్ తప్పకుండా కావాలి. లేదంటే వారికి లడ్డూలు ఇవ్వరు.

‘‘ఆధార్ లేకపోవడం వల్ల ప్రాక్టికల్ సమస్యలున్నాయి. ఒక కౌంటర్ దగ్గరికి వెళితే రెండు లడ్డూలు ఇస్తారు. పక్క కౌంటర్ దగ్గరికి వెళితే ఇంకొక రెండు వస్తాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దానికి లిమిట్ లేదు. ఇలా ఉండకూడదని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఆధార్‌తో లింక్ చేశాం.’’ అని శ్యామలరావు తెలిపారు.

తిరుమల లడ్డూ

ఫొటో సోర్స్, Rajesh

పాత విధానం ఎలా ఉండేది?

దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇచ్చేవారని, ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతోందని టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాధం బీబీసీతో చెప్పారు.

‘‘దర్శనం చేసుకున్న భక్తుడికి ఉచిత లడ్డూతో పాటు రూ. 50కి ఒకటి చొప్పున అడిగినన్ని చిన్న లడ్డూలు ఇచ్చేవాళ్లం. దర్శనం చేసుకోని వాళ్లకు ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా రెండు చిన్న లడ్డూలు ఇచ్చే విధానం ఉండేది. అలాగే అన్ని కౌంటర్లలో ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒక పెద్ద లడ్డూ, ఒక వడ ఇచ్చేవాళ్లం. అయితే రోజుకు 7,500 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తాం. ఆ రోజు స్టాకు ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వగలిగేవాళ్లం.’’ అని లోకనాధం చెప్పారు.

‘‘ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్.. వీళ్లంతా ప్రోటో‌కాల్ కిందికి వస్తారు. వాళ్లు ప్రత్యేకంగా 45 వ నెంబర్ కౌంటర్‌లో ధరను చెల్లించి పెద్ద లడ్డూలు, వడలు, చిన్న లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అయితే బ్రహ్మోత్సవాలు, ఎక్కువ రద్దీ ఉన్న సమయాల్లో మాత్రం రద్దీని బట్టి లడ్డూల విక్రయం ఉంటుంది.’’ అని ఆయన అన్నారు.

గతంలో భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు ఒక్కొక్కటి రూ.25 చొప్పున రెండు మాత్రమే ఇచ్చేవారు. 2008లో ఈ విధానాన్నిమార్చి, లడ్డూ ధరను రూ.25 నుంచి రూ.50కు పెంచి భక్తులు అడిగినన్ని ఇచ్చారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి రేటు పెంచి లడ్డూల సంఖ్య మీద నియంత్రణ తీసేశామని అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డి తెలిపారు.

తిరుమలలో రోజుకు మూడున్నర లక్షల లడ్డూలు తయారవుతాయని లోకనాధం తెలిపారు. కౌంటర్ల ద్వారా సుమారు లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్లకు వెళుతున్నాయని వెల్లడించారు.

లడ్డూ

ఫొటో సోర్స్, Rajesh

ఇప్పుడు ఆధార్ ఎందుకు తీసుకొచ్చారు?

కొంతమంది పెళ్లి వేడుకల్లో తిరుపతి లడ్డూలు పంచుతున్నారనే కారణంతో ఆధార్‌తో లింక్ చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

‘‘హైదరాబాద్‌లో హైటెక్స్‌లాంటి పెద్ద పెద్ద వేదికల మీద జరుగుతున్న పెళ్లిళ్లలో తిరుపతి లడ్డూను ఒక స్టేటస్ సింబల్ మాదిరిగా పంచడం చూసి ఆశ్చర్యం కలిగింది. స్వామి వారి లడ్డూ అంటే ఒక ప్రసాదం. స్వీట్ కాదు. దాన్ని స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం కరెక్టు కాదు. ఇక మీదట వందలకొద్దీ లడ్డూలు తీసుకెళ్లడం కుదరదు. దాన్ని అరికట్టాలన్నదే మా ఉద్దేశం.

సాధారణ భక్తులకి ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలనేది పాలసీ. కానీ ఇపుడు అడిగినన్ని ఇవ్వడం లేదు. ఎందుకంటే దర్శనం టికెట్ లేకుండా బయట నుంచి వచ్చి, కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకొని వెళ్లిపోతూ ఉంటారు. మరికొంతమంది బ్రోకర్లు కూడా తయారయ్యారు. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకుని బయట విక్రయిస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించడానికే ఆధార్ లింక్ చేశాం.’’ అని ఈవో శ్యామలరావు అన్నారు.

ఈ విషయంలో విజిలెన్స్ విభాగం గట్టి చర్యలు తీసుకుంటే తప్ప బ్లాక్ మార్కెట్ ఆగదని సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ అభిప్రాయపడ్డారు.

‘‘ఆధార్ లింక్ చేసినంత మాత్రాన బ్లాక్ మార్కెట్ ఆగదు. టీటీడీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు, లడ్డూ కౌంటర్‌లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రకరకాల మార్గాల్లో తెప్పించుకుంటారు. రూల్స్ కఠినం అయితే బ్లాక్ మార్కెట్‌లో లడ్డూల రేటు పెరుగుతుందే తప్ప బ్లాక్ మార్కెట్ అరికట్టడం సులువు కాదు. కాకపోతే భయం అనేది కలుగుతుంది. ఎక్కడో వివాహ వేడుకల్లో లడ్డూలు పెట్టారని, దాన్ని చూసి మార్పులు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు చేస్తున్న హడావిడి తప్పితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు.’’ అని రవికుమార్ బీబీసీతో అన్నారు.

లడ్డూ ప్రసాదానికి ఆధార్ లింక్ చేయడంపై వస్తున్న విమర్శలు సరికాదని శ్యామలరావు అన్నారు.

దళారీ వ్యవస్థను అరికట్టేందుకే లడ్డూ జారీ విధానంలో మార్పులు చేశామని, మిగిలినదంతా పాత విధానమేనని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)