భార్యకు డ్రగ్స్ ఇస్తూ, పదేళ్లపాటు అపరిచితులతో అత్యాచారం చేయించిన భర్త

- రచయిత, లూసీ క్లార్క్ బిల్లింగ్స్
- హోదా, బీబీసీ న్యూస్
ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు.
భార్యకు పదేపదే మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడటంతో పాటు డజన్ల కొద్దీ ఇతర వ్యక్తులతో ఆమెను రేప్ చేయించారనే ఆరోపణలతో ఫ్రాన్స్‌లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
71 ఏళ్ల డొమినిక్ అనే వ్యక్తి ఈ కేసులో నిందితుడు. పదేళ్లుగా ఆయన ఈ నేరానికి పాల్పడుతున్నారని, భార్యను లైంగికంగా వేధించేందుకు ఆన్‌లైన్‌లో అపరిచితులతో సంప్రదింపులు జరిపేవారని డొమినిక్‌పై ఆరోపణలు ఉన్నాయి.
తనపై జరుగుతున్న ఈ అఘాయిత్యాల గురించి బాధితురాలికి తెలియదని ఆమె తరఫు న్యాయవాదులు చెప్పారు.
ఈ కేసు తీవ్రత ఫ్రాన్స్ ప్రజలను ఆందోళనకు గురి చేసింది.

72 మంది పురుషులు 92 సార్లకు పైగా డొమినిక్ భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. వీరిలో యాభై మందిని అదుపులోకి తీసుకుని అభియోగాలు నమోదు చేశారు. బాధితురాలి భర్తతో పాటు వీరిని కూడా ప్రశ్నిస్తున్నారు.
బాధితురాలి వయస్సు 72 ఏళ్లు. ఆమెకు తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి 2020లో పోలీసుల ద్వారానే తెలిసింది.
ఈ విచారణకు హాజరవ్వడం బాధితురాలికి ఒక భయంకర పరీక్ష అని ఆమె తరఫు న్యాయవాది ఆంటోని కామస్ చెప్పారు. ఎందుకంటే, తనపై జరిగిన వేధింపులకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను ఆమె తొలిసారి చూడనున్నారని ఆయన వెల్లడించారు.
‘‘పదేళ్లకు పైగా ఆమెపై జరిగిన అఘాయిత్యాలను ఆమె తొలిసారి ప్రత్యక్షంగా చూడబోతున్నారు.’’ అని ఆంటోని ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.
2020 సెప్టెంబర్‌లో డొమినిక్ ఒక షాపింగ్ సెంటర్‌లో రహస్యంగా ముగ్గురు మహిళల స్కర్ట్ లోపలి భాగాల్ని చిత్రీకరిస్తుండగా ఒక సెక్యూరిటీ గార్డు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
డొమినిక్ కంప్యూటర్‌లో ఆయన భార్యకు సంబంధించిన వందలాది ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. ఆ ఫోటోల్లో, వీడియోల్లో బాధితురాలు స్పృహలో లేనట్లుగా పోలీసులు గుర్తించారు.
వారి ఇంట్లో ఆమెపై చాలాసార్లు వేధింపులు జరిగినట్లుగా ఆ ఫోటోలు చూపిస్తున్నాయి. 2011 నుంచి ఆమెను వేధించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
తన ఇంటికి వచ్చి తన భార్యను రేప్ చేయాలంటూ అపరిచితులతో డొమినిక్ చేసిన చాట్‌ను కూడా ఒక వెబ్‌సైట్‌లో పోలీసులు గుర్తించారు.
యాంగ్జైటీని తగ్గించే డ్రగ్‌తో పాటు బాగా శక్తిమంతమైన మత్తుమందుల్ని తన భార్యకు ఇచ్చినట్లు పోలీసులు ముందు డొమినిక్ అంగీకరించారు.
భార్యను అత్యాచారం చేయించడంతో పాటు, వాటిని చిత్రీకరించారని, అసభ్య పదజాలంతో ఇతర పురుషులను ప్రోత్సహించారని ప్రాసిక్యూటర్లు డొమినిక్‌పై ఆరోపణలు చేశారు. కాకపోతే, ఇందుకోసం ఆయన డబ్బుల లావాదేవీలేవీ జరపలేదని చెప్పారు.
ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, అత్యాచారాలకు పాల్పడిన నిందితుల్లో 26 నుంచి 74 ఏళ్ల వారున్నారు. అందులో కొందరు ఒక్కసారి మాత్రమే ఈ నేరంలో పాల్గొనగా, మరికొందరు ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ దంపతులు తమ ఫాంటసీల్లో జీవించేందుకు తాము సాయపడ్డామని నిందితులు చెబుతుండగా, తన భార్యకు మత్తు ఇచ్చిన సంగతి నిందితులందరికీ తెలుసని పోలీసులకు డొమినిక్ వెల్లడించారు.
బాధితురాలి పరిస్థితి నిద్రకన్నా కోమాకు దగ్గరగా ఉందని ఒక నిపుణుడు చెప్పారు.
తొమ్మిదేళ్ల వయస్సులో అత్యాచారానికి గురైన డొమినిక్ ఇప్పుడు భార్యను, కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన లాయర్ బేట్రిస్ జవారో ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
1991లో ఒక హత్య, రేప్‌కు సంబంధించి కూడా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. వీటిని ఆయన ఖండించారు. 1999లో అత్యాచారానికి ప్రయత్నించారని నమోదైన మరో కేసులో ఆయన నేరాన్ని ఒప్పుకున్నారు.
ఈ విచారణ డిసెంబర్ 20 వరకు కొనసాగనుంది.
ట్రయల్ మొదటి రోజైన సోమవారంనాడు బాధితురాలు కోర్టులో హాజరయ్యారని, ఆమె ముగ్గురు పిల్లలు ఆమెకు మద్దతుగా నిలిచారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














