కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసు: మమతాబెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల నిరసన - టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

బెంగాల్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యకు నిరసనగా సెక్రటేరియట్ వైపు వెళ్తున్న ఆందోళనకారుల్లో ‘పశ్చిమబంగ ఛాత్ర సమాజ్‌’కు చెందిన విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం-హత్య కేసులో న్యాయం కోరుతూ ఆందోళన చేస్తోన్న వేలాది మంది నిరసనకారులపై కోల్‌కతా పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు.

మంగళవారం, కోల్‌కతాలో వేలాది మంది నిరసనకారులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ రాష్ట్ర సెక్రటేరియట్ వైపు మార్చ్ నిర్వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మమతా బెనర్జీ రాజీనామా డిమాండ్ చేస్తూ రాష్ట్ర సెక్రటేరియట్ వైపుగా వెళ్తోన్న నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఆగస్టు 9న ఉదయం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది.

ఈ ఘటన తరువాత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.

ఈ ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.

ఆ రాష్ట్ర పోలీసులు ఈ కేసు విచారణలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలతో దీన్ని ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తోంది.

‘పశ్చిమబంగ ఛాత్ర సమాజ్’ అనే విద్యార్థి సంస్థ చేపట్టిన ‘నబాన్న అభియాన్’ నిరసన మార్చ్‌పై ప్రభుత్వ అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవి నుంచి దిగిపోవాలని వారు డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ దిశగా కదిలారు. దీంతో సెక్రటేరియట్ వద్ద భద్రతా చర్యలను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది.

ఈ సమయంలో నినాదాలు చేస్తూ సెక్రటేరియట్ వైపుగా వెళ్తున్న నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

పోలీసుల లాఠీ చార్జ్‌కు ముందు నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో ఒక కాలేజీ విద్యార్థి నమితా ఘోస్ అన్నారు.

ఘర్షణలు సృష్టించిన సుమారు వందమందిని తాము అరెస్ట్ చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

లాఠీ చార్జ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారులపై లాఠీ చార్జ్

ఆగస్టు 9న ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగస్ట్ 14న రాత్రి పూట ‘రిక్లయిమ్ ది నైట్ మార్చ్’ పేరుతో నిర్వహించిన ఆందోళనల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వేల మంది మహిళలు పాల్గొన్నారు.

అప్పటి నుంచి ఆందోళనల్లో కొన్ని రాజకీయ ర్యాలీలు కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్తలు.. పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం మహిళలకు అభద్రత వాతావరణాన్ని కల్పిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నిరసనకారులపై వాటర్ కెనాన్లను ప్రయోగించిన పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ చేపట్టింది.

ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఆస్పత్రి యాజమాన్యం ఏం చేస్తోందని ప్రశ్నించింది.

“పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతూ, సంఘటన స్థలాన్ని సురక్షితంగా ఉంచాల్సింది. కానీ వారు అలా ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వర్క్ ప్లేస్‌లలో మహిళల భద్రతా కోసం పలు చర్యలు ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీటీవీ పర్యవేక్షించే సేఫ్ జోన్లు, విశ్రాంతి గదులను కేటాయిస్తున్నట్లు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)