కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య: ‘‘ఏ కష్టం వచ్చినా నేనున్నా అనేది’’ అంటూ కూతురుని గుర్తు చేసుకున్న తండ్రి

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యను ఖండిస్తూ ఆగస్టు 17న దేశవ్యాప్తంగా డాక్టర్లు చేపట్టిన నిరసనల్లో బెంగళూరు వైద్యులు కూడా పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆగస్టు 9వతేదీ రాత్రి, బాధితురాలు, జూనియర్ డాక్టర్ 36 గంటల నైట్ షిఫ్ట్‌లో ఉన్నారు. రాత్రిపూట సెమినార్ హాల్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని వెళ్లారు. కానీ, ఉదయానికల్లా ఆమె మృతదేహం సెమినార్ హాల్‌లో కనిపించింది.
    • రచయిత, కీర్తి దుబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(భారతీయ చట్టాల ప్రకారం బాధితులు లేదా వారి కుటుంబ సభ్యుల గుర్తింపును బహిర్గతం చేయకుండా, ఈ కథనం నుంచి కుటుంబ సభ్యుల పేర్లను, వివరాలన్నింటినీ తొలగిస్తున్నాం)

‘‘62 ఏళ్ల వయసులో, నా కలలన్నీ చెదిరిపోయాయి. నిందితునికి కఠిన శిక్ష పడాలని మేం కోరుకుంటున్నాం’’

పశ్చిమ బెంగాల్‌లో ఓ ఆస్పత్రిలో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల వైద్యురాలి తండ్రి మాతో అన్నమాటలివి.

ఈ ఘటనతో భారత్‌లో మహిళల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చనిపోయిన వైద్యురాలి తండ్రి తమ ఇంట్లో బీబీసీతో మాట్లాడారు.

తమ కూతురుపై ఈ ఘటన జరిగిన తర్వాత సాధారణమైన వారి ఇంటిపై మీడియా దృష్టి పడింది.

‘‘మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం మొత్తం న్యాయం కోసం పోరాడుతోంది’’ అని బాధితురాలి తండ్రి అన్నారు. బాధితురాలి తల్లి మౌనంగా కూర్చుని ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘నా కూతురు నన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది’

ఆగస్టు 9వ తేదీ ఉదయం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. అర్థరాత్రి ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది.

ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు తన తల్లితో మాట్లాడారు. తన కూతురు చివరి మాటలను ఆమె తల్లి గుర్తు చేసుకున్నారు.

‘‘నాన్న టైమ్‌కు మందులు వేసుకునేలా చూడమ్మా. నా గురించి భయపడొద్దు’’ అని అన్నట్టు తల్లి చెప్పారు.

‘‘ఆమె మాతో మాట్లాడిన చివరి మాటలు అవే. తర్వాత రోజు, ఆమె ఫోన్ రింగ్ అవుతూనే ఉంది’’ అని చెప్పారు.

బాధితురాలి తండ్రి అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సమయానికి మందులు వేసుకోవడం అత్యంత ముఖ్యం.

‘‘నేను మందులు వేసుకోవడం మర్చిపోకుండా ఆమె నిత్యం నన్ను చూసుకునేది’’ అని తన ఇంట్లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి గుర్తుచేసుకున్నారు.

‘‘ఒకసారి మందులు అయిపోయినప్పుడు, తర్వాత రోజు కొనుక్కుందాం అనుకున్నా. కానీ, మందులు అయిపోయిన విషయాన్ని నా కూతురు గమనించింది. అప్పుడు సమయం రాత్రి పదో, పదకొండో అవుతోంది. సరిగ్గా భోజనానికి ముందు బాపి (స్థానిక భాషలో తండ్రిని పిలవడం) మీ మందులు వచ్చేవరకూ ఇంట్లో ఎవరూ భోజనం చేయరు’’ అని కూతురు చెప్పిన విషయాన్ని ఆయన వివరించారు.

‘‘నేను దేని గురించీ బాధపడకుండా నా కూతురు చూసుకునేది’’ అని చెప్పారు.

యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ ‘ది నైట్ ఈజ్ ఆల్సో అవర్స్’ అనే పేరుతో నిరసనల్లో పాల్గొన్న వైద్య సిబ్బంది, కార్యకర్తలు, పౌరులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యపై సత్వర న్యాయం కోరుతూ, దేశంలోని లక్షల మంది మహిళలకు రక్షణ కల్పించాంటూ ‘రీక్లైమ్ ది నైట్ మార్చ్’ పేరుతో ఆందోళనకు దిగిన వైద్యులు, మహిళలు

‘నిర్భయ’ను గుర్తుచేసిన ఘటన

ఈ ఘటన 2012లో దేశ రాజధాని దిల్లీలో కదులుతున్న బస్సులో ఒక ఫిజియోథెరపీ ఇంటర్న్‌పై జరిగిన సామూహిక అత్యాచారాన్ని గుర్తు చేస్తుంది.

తీవ్రమైన గాయాలతో ఆమె చాలా పోరాడింది. కానీ, ఆమె అంతర్గత అవయవాలకు చాలా గాయాలయ్యాయి. రెండు వారాల తర్వాత ఆమె మరణించారు.

ఆ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది.

ఆ తర్వాత, మహిళలపై హింసను మరింత సవివరంగా నిర్వచించడం, దోషులకు మరణ శిక్షతో పాటు కఠినమైన శిక్షలు విధించడం లాంటి సవరణలతో కొత్త చట్టాలు తీసుకొచ్చారు.

అయితే, లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్నాయి కానీ, సత్వర న్యాయం లభించడం మాత్రం ఇంకా భారతీయ మహిళలకు సవాలుగానే ఉంది.

కోల్‌కతాలో జరిగిన అత్యాచారం, హత్య తర్వాత వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు మరోసారి తెరమీదకు వచ్చాయి.

ఈ ఘటనపై క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని, పని ప్రదేశాల్లో మహిళలను కాపాడేలా చట్టాలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పని ప్రదేశాల్లో మెరుగైన భద్రతను కల్పించేలా కఠిన చర్యలు తీసుకొస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వైద్యులకు భరోసా ఇచ్చారు.

పని ప్రదేశాల్లో సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని వైద్య విద్యను నియంత్రించే ప్రభుత్వ సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్ అన్ని వైద్య కాలేజీలు, సంస్థలకు పలు సూచనలు జారీ చేసింది.

కోల్‌కతాలోని ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై ఆగస్టు 14న వైద్యులు నిరసన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ డేటా ప్రకారం, 2022లో రోజుకు సగటున సుమారు 90 అత్యాచార ఘటనలు రిపోర్ట్ అయ్యాయి.

బాధితురాలి ఇంటి వద్ద పోలీసు రక్షణ

కోల్‌కతా నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక ఇరుకైన వీధిలో ఉన్న బాధితురాలి ఇంటికి మేం వెళ్లాం.

ఒకవైపు పోలీసు బారికేడ్లు, వివిధ న్యూస్ చానళ్లకు చెందిన కెమెరాలు పదుల సంఖ్యలో కనిపించాయి. అక్కడ కనిపిస్తున్న ప్రతి దృశ్యాన్నీ వారు తమ కెమెరాల్లో చిత్రీకరిస్తున్నారు.

మరోవైపు, 10 నుంచి 15 మంది పోలీసు అధికారులు అక్కడ నిల్చుని ఉన్నారు.

బారికేడ్లను దాటి, బాధితురాలి ఇంట్లో జరిగే విషయాలను ఆ కెమెరాలు చిత్రీకరించకుండా చూసుకోవడమే వారి ఏకైక బాధ్యత.

ఆగస్టు 9 రాత్రి, బాధితురాలు అయిన జూనియర్ డాక్టర్ 36 గంటల నైట్ షిఫ్ట్‌లో ఉన్నారు. సెమినార్ హాల్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఆమె వెళ్లారు. కానీ ఉదయానికల్లా సెమినార్ హాల్‌లో ఆమె శవమై కనిపించారు. ఈ ఘటనపై కేవలం కోల్‌కతాలోనే కాకుండా, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వైద్యులు నిరసనలు, ర్యాలీలు చేస్తూ.. న్యాయం కోరుతున్నారు.

పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ‘నో సేఫ్టీ, నో డ్యూటీ’ అనే ప్లకార్డులను పట్టుకుని నినదించిన వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఘటనపై కేవలం కోల్‌కతాలోనే కాకుండా, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డాక్టర్ల ర్యాలీలు, న్యాయం కోరుతూ ఆందోళనలు

‘గోల్డ్ మెడల్ సాధించాలనుకుంది’

ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. ఆమె ఎప్పుడూ తనగురించి కాకుండా, ఇతరుల గురించి ఆలోచించేదని ఆమె తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘ఆమె పెళ్లి దాదాపు ఖరారైంది. అప్పుడు నా కూతురు... కానీ... బాపి (నాన్నా) ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారు? మీరు ఆందోళన చెందొద్దు. నేను చూసుకుంటా అని ఆమె చెప్పింది’’ అని తండ్రి తెలిపారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, బాధితురాలి తల్లి ఏడుస్తున్న గొంతు మెల్లగా వినిపించింది.

వారు ఉంటున్న గదిలో టైలర్‌గా తండ్రికి చెందిన పరికరాలు, కుట్టుమెషిన్, దారం, బట్టల ముక్కలు పడి ఉన్నాయి. లివింగ్ రూమ్‌ పక్కనే మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు బాధితురాలి బెడ్‌రూమ్‌కు వెళ్లే దారి.

గత 11 రోజులుగా ఆ గది మూసి ఉంది. ఆగస్ట్ 10వ తేదీ నుంచి ఆమె తల్లిదండ్రులు కూతురి గదిలోకి అడుగు పెట్టలేదు.

‘‘ఆమె చిన్నతనంలో, మేం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం’’ అని తండ్రి గుర్తు చేసుకున్నారు.

‘‘ఆమెకు అప్పుడు ఐదేళ్లు ఉంటాయనుకుంటా. ఆమెకు దానిమ్మ పండ్లంటే బాగా ఇష్టం. ఒకసారి నడుచుకుంటూ వెళ్తూ దారిలో దానిమ్మ పండ్లను చూసి, ‘బాపి, పూజ కోసం దానిమ్మలు కొనవా?’ అని అడిగింది. తన కోసం ఆమె ఇప్పటి వరకు ఏదీ అడగలేదు..’’ అని కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

పక్కనే ఉన్న వారి బంధువు ఆయనను ఓదారుస్తూ ధైర్యంగా ఉండమని చెప్పారు.

అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి మట్టి ప్రతిమకు రాఖీలు కట్టిన వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి మట్టి ప్రతిమకు వైద్యులు రాఖీ కట్టారు.

తన భుజాలపై ఉన్న బాధ్యతల గురించి ఆమె ఎప్పుడూ ధైర్యంగా ఉండాలనుకునేది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. ఏ విషయాన్నైనా నేర్చుకోవాలనే తాపత్రయం చిన్నప్పటి నుంచి తనకు ఎక్కువగా ఉండేది. స్కూల్‌లో టీచర్లు తనను చూసి ముచ్చటపడేవారు.

‘‘చిన్నప్పుడు, టీచర్లు ఆమెను ఎత్తుకుని స్కూల్‌కు తీసుకెళ్లేవారు’’ అని తండ్రి గుర్తు చేసుకున్నారు.

‘‘మేం చాలా పేద కుటుంబం నుంచి వచ్చాం. ప్రతి ఒక్కటీ సొంతంగా మేం నిర్మించుకున్నదే’’ అని ఆయన చెప్పారు.

‘‘మీ కూతురిని డాక్టర్‌ను చేయించలేరని అందరూ అనేవారు. కానీ, అలా అన్న ప్రతి ఒక్కరూ తప్పు అని నా కూతురు నిరూపించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆమెకు అడ్మిషన్ వచ్చింది’’ అని తెలిపారు.

బాధితురాలి తండ్రి మాట్లాడేటప్పుడు ఆమె తల్లి మౌనంగా వింటూ, అన్నింటినీ గుర్తు చేసుకుంటున్నారు.

ఎరుపు, తెలుపు గాజుల మధ్యనున్న బంగారు గాజును ఆమె చేతులతో పదేపదే పట్టుకుంటున్నారు. తన కూతురితో కలిసి ఆమె ఆ గాజు కొనుక్కున్నారు.

ప్రతిరోజూ నిద్రపోవడానికి ముందు ఆమె డైరీ రాసుకునేదని తల్లి గుర్తు చేసుకున్నారు.

‘‘మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడల్ సంపాదించుకోవాలని ఆమె డైరీలో రాసుకుంది. మంచి జీవితాన్ని గడపాలనుకుంది. మమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంది’’ అని ఆమె మెల్లగా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)