ఫ్రీ సైకిల్: దేశంలో నిశ్శబ్దంగా ఓ విప్లవాన్ని సృష్టించిందా...

మహిళలు, బాలికా విద్య

ఫొటో సోర్స్, AP

ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌: పాఠశాల నుంచి సైకిళ్లతో ఇంటికి వెళుతున్న గ్రామీణ బాలికలు
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లోని అత్యంత పేద రాష్ట్రమైన బిహార్‌కి చెందిన నిభా కుమారి, తనకు 15 ఏళ్లు ఉన్నప్పుడు లభించిన ఒక సైకిల్ తన జీవితాన్ని ఎలా మార్చేసిందో గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సైకిల్‌ మీద ఆమె రెండేళ్ల పాటు, వారంలో ఆరు రోజులు ఇంటి నుంచి పాఠశాలకి, కోచింగ్ క్లాసులకి వెళ్లివచ్చేవారు.

"నాకు సైకిల్ లేకపోయి ఉంటే, హైస్కూల్ చదువు పూర్తి చేసి ఉండేదాన్నని అనుకోవడం లేదు. సైకిల్ నా జీవితాన్ని మార్చేసింది.” అని 27 ఏళ్ల నిభా చెప్పారు.

బెగుసరాయ్ జిల్లాకు చెందిన ఒక రైతు కుమార్తె నిభా. ప్రాథమిక విద్య కోసం ఆమెను 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ల అత్తయ్య వద్దకు పంపించారు. బాలికలు పాఠశాలకు వెళ్లి రావడం ఓ పెద్ద సవాల్. అందులోనూ ప్రజారవాణాపై భరోసా పెట్టుకోలేం.

బీబీసీ న్యూస్ తెలుగు

హైస్కూల్ విద్య కోసం నిభా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అధ్వానంగా ఉన్న రోడ్లపై సైకిల్‌ పైనే వెళ్లివచ్చేవారు.

“పాఠశాలకు, కోచింగ్ క్లాసులకి వెళ్లడానికి సైకిళ్లు వాడడం మొదలుపెట్టిన తర్వాత బాలికల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాఠశాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉచితంగా ఇచ్చిన సైకిళ్లు చాలామంది దగ్గర ఉన్నాయి” అని బెగుసరాయ్‌కి చెందిన ఆరోగ్య కార్యకర్త భువనేశ్వరి కుమారి చెప్పారు.

మహిళలు, బాలికా విద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాఠశాలల్లో బాలికల సంఖ్యను పెంచేందుకు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బాలికలకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తున్నాయి

ఆమె చెప్పింది నిజమే. సైన్స్‌డైరెక్ట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం, భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లే పిల్లలకి, సైక్లింగ్‌తో ఉన్న సంబంధం గురించి వివరంగా పేర్కొంది.

సృష్టి అగర్వాల్, ఆదిత్ సేథ్, రాహుల్ గోయెల్ చేసిన ఈ అధ్యయనం ప్రకారం, దేశంలో గ్రామీణ బాలికల్లో సైక్లింగ్‌ చాలా పెరిగింది. 2007లో 4.5 శాతం నుంచి 2017 నాటికి 11 శాతానికి పెరగడంతో పాటు దేశంలో సైకిల్ తొక్కే స్త్రీపురుషుల మధ్య అంతరాన్ని కూడా తగ్గించింది.

“ఇది నిశ్శబ్ద విప్లవం. ఎందుకంటే మన దేశంలో సాధారణంగా బయట తిరిగే విషయంలో లైంగిక అసమానత్వం ఉంది, సైక్లింగ్ విషయంలో ఇది ఇంకా ఎక్కువ. ఈ నేపథ్యంలో సైకిల్ తొక్కే అమ్మాయిల సంఖ్య పెరగడాన్ని మేము విప్లవంగానే చెబుతాం’’ అని అగర్వాల్ చెప్పారు.

2004 నుంచి ప్రభుత్వం బాలికల కోసం ఉచిత సైకిల్ పంపిణీ పథకాన్ని చేపట్టింది. ఇంటి పనులు చేసుకుంటూ, ఎక్కువ దూరం నడిచి వెళ్లాల్సి రావడం వల్ల పాఠశాల మానేసిన ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈ సైకిళ్ల పంపిణీ కేవలం భారతదేశంలోనే కాకుండా, కొలంబియా, కెన్యా, మలావి, జింబాబ్వే వంటి దేశాల్లోనూ పాఠశాలల్లో బాలికల నమోదును పెంచి, వాళ్లు స్కూలు మానేయడాన్ని ప్రభావవంతంగా తగ్గించిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో ఇది కాస్త ఎక్కువే.

మహిళలు, బాలికా విద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాఠశాలకు వెళ్లే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసిన మొదటి రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి

దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబయిలోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌కు చెందిన ముగ్గురు పరిశోధకులు దేశవ్యాప్తంగా 5-17 సంవత్సరాల మధ్య వయసున్న, పాఠశాలకు వెళ్లే పిల్లల రవాణా విధానాలను ఈ సర్వేలో విశ్లేషించి, ఉచితంగా అందించే ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని పరిశీలించారు. విద్యార్థులకు సైకిళ్లు, సైక్లింగ్ రేటుపై ఈ పథకాల ప్రభావాన్ని సమీక్షించారు.

జాతీయంగా, పాఠశాలకు సైకిల్‌పై వెళ్లే విద్యార్థుల శాతం 2007లో 6.6% నుంచి 2017లో 11.2%కి పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం పదేళ్లలో రెండింతలు పెరిగింది. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇది స్థిరంగా ఉంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం, రోడ్లపై కార్ల వంటి వాహనాల వల్ల నగరాల్లోని రోడ్లు అంత సురక్షితం కావు, అందువల్ల ఇక్కడ పాఠశాలకు సైకిల్‌పై వెళ్లడం తక్కువగా ఉంది.

దేశంలో సైక్లింగ్ విప్లవం గ్రామాలలో ఎక్కువగా ఉంది. దీనిలో బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఈ రాష్ట్రాల జనాభాను కొన్ని పెద్ద యూరోపియన్ దేశాలతో పోల్చవచ్చు.

మహిళలు, బాలికా విద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రామీణ బిహార్‌లో, 2007లో ఏ ఒక్క బాలిక సైకిల్‌పై స్కూల్‌కి వెళ్లలేదు, పదేళ్లలో ఇది 13 శాతానికి పెరిగింది

2011లో జరిగిన చివరి జనాభా గణన నుంచి సైక్లింగ్ వినియోగాన్ని కూడా రిపోర్ట్ చేయడం ప్రారంభమైంది. బయట పనుల కోసం వెళ్తున్న వారిలో 20% మంది సైకిల్‌ మీద వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, నగరాల్లో (17%) కంటే గ్రామీణ ప్రజలు ఎక్కువగా (21%) సైకిల్‌ను ఉపయోగిస్తున్నారు.

అలాగే, మహిళలతో పోలిస్తే (4.7%), పురుషులు (21.7%) ఎక్కువగా సైకిళ్లను వాడుతున్నారు. "ఇతర దేశాలతో పోలిస్తే సైక్లింగ్‌లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం ప్రపంచంలో మన దేశంలోనే అత్యధికం" అని అగర్వాల్ చెప్పారు.

ఓటు హక్కు కోసం పోరాడిన అమెరికాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త సుసాన్ బి ఆంథోనీ సైకిల్ గురించి ఒక మాట అన్నారు. "మహిళలకు ప్రపంచంలోని మిగతా వాటికంటే ఎక్కువ విముక్తి కలిగించింది సైకిల్. ఇది మహిళలకు స్వేచ్ఛ, స్వావలంబన అనుభవాన్ని ఇస్తుంది." అన్నారు.

ఉద్యోగావకాశాలు తగ్గిపోవడం, పని మానుకోవడం తదితర కారణాల వల్ల మహిళలు వయస్సు పెరిగే కొద్దీ సైకిల్‌పై వెళ్లడం తగ్గిపోతుండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

పెళ్లి తర్వాత, అత్తమామల ఇంటికి వెళ్లిన నిభా సైకిల్‌పై తిరగడం మానేశారు. ఇప్పుడెలా వెళ్తున్నారని టీచర్ ట్రైనింగ్‌కు వెళ్తున్న నిభాను అడిగినప్పుడు "నాకు ఇకపై సైకిల్‌ అవసరం లేదు." అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)