నీట్ 2024: ఆలిండియా కోటా సీట్లతో తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2024 అత్యంత వివాదాస్పదంగా మారింది. పేపర్ లీక్ ఆరోపణలతో అడ్మిషన్ల ప్రక్రియ సందిగ్ధంలో పడింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం మీద విచారణ జరుగుతోంది. పార్లమెంటులోనూ విపక్షాలు దీని మీద చర్చకోసం పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
మరోవైపు ఈసారి అడ్మిషన్లకు సంబంధించి ఆలిండియా కోటా విషయమై అనేక మంది నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆలిండియా కోటా వల్ల అన్యాయం జరుగుతున్నందున దానిని రద్దు చేయాలంటూ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
ఆలిండియా కోటా ఎందుకు?
నీట్ తొలిసారి 2013లో అమల్లోకి వచ్చింది.
అంతకుముందు ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలకు స్థానికంగా పరీక్ష నిర్వహించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఉండేది.
ఎయిమ్స్ కోసం ఓ పరీక్ష, జిప్‌మర్ కోసం మరో పరీక్ష రాయాల్సి వచ్చేది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే అక్కడి ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉండేది.
దాంతో జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా వైద్య విద్యలో సీట్లు కేటాయించే విధానం అవసరమని 2013లో నీట్‌ను తీసుకొచ్చారు. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు వ్యతిరేకించడం, కొందరు కోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు నీట్‌ను అప్పట్లో తాత్కాలికంగా నిలిపివేసింది.
ఆ తరువాత సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేయడంతో తిరిగి 2016లో నీట్ ఎగ్జామ్ ప్రారంభమైంది. అప్పటికీ కొన్ని రాష్ట్రాలు విడిగా పరీక్షలు నిర్వహించాయి. దీంతో 2017 నుంచి అన్ని రాష్ట్రాలు ‘నీట్’నే అనుసరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నీట్ ర్యాంకుల ద్వారా ప్రముఖ వైద్య సంస్థలతో పాటుగా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటాకు 15 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకొచ్చింది.
దాంతో గడిచిన 8 ఏళ్లుగా ఏపీ, తెలంగాణా పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా ఆలిండియా కోటాలో సీట్ల భర్తీ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన కాలేజీలు, సీట్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ కాలేజీలు పెరిగాయి. అందులోనూ ప్రైవేటు కన్నా ప్రభుత్వ కాలేజీల సంఖ్య ఎక్కువగా పెరిగింది.
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణాలో 2,950 సీట్లు మాత్రమే ఉండేవి. అందులో 850 ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు కాగా, మరో 2,100 ప్రైవేట్ కాలేజీ సీట్లుండేవి. 2023 నాటికి అవి 7,390 సీట్లకు చేరాయి. వాటిలో 3,590 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనే ఉన్నాయి. అంటే ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి.
దేశమంతా గడిచిన పదేళ్లలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు దానికి మించి పెరిగాయి. దాంతో ప్రస్తుతం ఆలిండియా కోటా కింద తెలుగు రాష్ట్రాల నుంచి కేటాయించాల్సిన సీట్ల సంఖ్య పెరిగింది.
2017 నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ సీట్ల సంఖ్య 4,750 నుంచి 2023-24 విద్యాసంవత్సరానికి గానూ 6,435కి పెరిగింది. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు 1,685 సీట్లు పెరిగాయి.
అదే సమయంలో ప్రస్తుతం ఒడిశాలో ఎంబీబీఎస్ సీట్లు 2,525, హరియాణాలో 2,185, బిహార్‌లో 2,665, పంజాబ్‌లో 1,850 చొప్పున మాత్రమే సీట్లున్నాయి. అందులో కూడా ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల సంఖ్య తక్కువే.
దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనే మెడికల్ సీట్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది.

ఫొటో సోర్స్, UGC
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో..
దేశవ్యాప్తంగా 2017లో నీట్ పరీక్షకు కేవలం 6 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. కానీ 2024 నాటికి ఆ సంఖ్య 24.5 లక్షలకు పెరిగింది. అంటే ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ తీవ్రమైంది. అదే సమయంలో సీట్ల సంఖ్య మాత్రం పదేళ్లలో కేవలం రెట్టింపు మాత్రమే చేశారు.
దేశంలోనే మెడికల్ యూజీ సీట్లలో కర్ణాటక, తమిళనాడు ముందంజలో ఉన్నాయి. కర్ణాటకలో 11,695 సీట్లు ఉండగా, తమిళనాడులో 11,600 సీట్లున్నాయి. మహారాష్ట్రలో కూడా 10,745 సీట్లున్నాయి.
ఆయా రాష్ట్రాల్లో డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గణనీయంగా ఉండటం వల్ల సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఏపీ, తెలంగాణాలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిధులతో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాయి. చేస్తున్నాయి.
ఏపీలో గడిచిన ఐదేళ్ళలోనే 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాటిలో 5 మెడికల్ కాలేజీలను ఇప్పటికే ప్రారంభించారు. ఈ ఏడాది మరో 5 కాలేజీలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో కూడా 2018 తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతీ జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాలేజీలు నిర్మించడం వల్ల మొత్తం 30 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆలిండియా కోటా సీట్లతో ఇతర రాష్ట్రాల వారికే..
ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన కాలేజీలలో సైతం 15 శాతం ఆలిండియా కోటాలో సీట్లు కేటాయించాల్సి వస్తోంది.
దాంతో తెలంగాణాలో మారుమూల ములుగు, మహబూబాబాద్, నిర్మల్ వంటి ప్రాంతాల్లో నిర్మించిన కాలేజీల్లో సైతం ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి చేరుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
2023-24 విద్యాసంవత్సరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆలిండియా కోటాలో భర్తీ చేసిన సీట్లలో 90 శాతం ఇతర రాష్ట్రాల విద్యార్థులకే దక్కాయని మెడికోస్ పేరెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు.
"నీట్ పరీక్షల్లో టాప్ 1000 లోపు ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. ఆ తర్వాత ర్యాంకులు పెరిగే కొద్దీ తెలుగు విద్యార్థుల శాతం తగ్గుతోంది. దాంతో ఆలిండియా కోటాలో ఎయిమ్స్, జిప్‌మర్ వంటి చోట గణనీయంగా సీట్లు సాధిస్తున్న తెలుగు విద్యార్థులు తదుపరి ఆలిండియా కోటా సీట్లలో పోటీపడలేకపోతున్నారు. పైగా సీట్ల సంఖ్య పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పోటీ తక్కువ. 2023 కౌన్సిలింగ్‌లో ఆలిండియా ర్యాంకు 1.4 లక్షల వరకూ తెలంగాణ స్టేట్ కోటాలో విద్యార్థికి ఏ కేటగిరి సీటు దక్కింది. కానీ ఆలిండియా కోటాలో జనరల్ విద్యార్థికి 20 వేల ర్యాంకు వచ్చినా సీటు కష్టమవుతుంది. దాంతో తెలుగు విద్యార్థులు ఆలిండియా కోటాలో పోటీపడటం సాధ్యం కావడంలేదు" అని వెంకటేశ్వర్లు వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే నిమ్స్, గాంధీ, విశాఖ ఏఎంసీ, కర్నూలు మెడికల్ కాలేజీ వంటి కాలేజీలుండటంతో ఆలిండియా కోటాలో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు టాపర్స్ ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు.
ఎయిమ్స్, జిప్‌మర్ లాంటి ప్రముఖ కాలేజీల్లో వస్తే తప్ప మిగిలిన వాళ్లంతా స్థానికంగా గుర్తింపు ఉన్న కాలేజీలకు పరిమితం కావడంతో ఇతర మెడికల్ కాలేజీల్లోని ఆలిండియా కోటా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు దక్కుతోందని వెంకటేశ్వర్లు అన్నారు.

ఫొటో సోర్స్, facebook/Vinod Kumar Boianapalli
'సుప్రీంకోర్టులో కేసు వేయాలి'
తెలంగాణలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసినా ఫలితం పూర్తిగా దక్కడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ అన్నారు.
"సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ పరీక్ష అనుమతించాం. ఈసారి నీట్ పేరుతో అతిపెద్ద కుంభకోణం సాగినట్లు బట్టబయలైంది. పేపర్ లీకేజీల నుంచి మాస్ కాపీయింగ్ వరకూ అనేక అవకతవకలు జరిగాయి. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందన్నది స్పష్టం. ఫలితంగా ఆలిండియా కోటా సీట్లన్నీ వారికే దక్కుతాయి. తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన కాలేజీల్లో తెలంగాణ బిడ్డలకు సీటు లేకుండా ఇతర రాష్ట్రాల వారికి ఆలిండియా కోటా పేరుతో కట్టబెట్టడం భావ్యం కాదు. దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అన్ని సీట్లకు కౌన్సెలింగ్ రాష్ట్ర పరిధిలోనే చేసుకునేలా అనుమతించాలని కోరాలి" అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
అవకతవకలు జరిగిన ప్రాంతాల వారికే అధిక ప్రయోజనం దక్కే విధానం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కాలేజీల సీట్లను స్థానికంగా భర్తీ చేసేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే..
ఇరు రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కౌన్సెలింగ్‌కు ముందు ఆ రాష్ట్రం నుంచి నీట్ 2024కి హాజరైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. కానీ ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఆలిండియా కోటా సీట్లను రద్దు చేసి కేవలం ఎయిమ్స్, జిప్‌మర్ వంటి జాతీయ ప్రాధాన్యత ఉన్న సీట్ల వరకూ కేటాయించి, మిగిలిన వాటిని ఆయా రాష్ట్రాల పరిధిలోనే భర్తీ చేసేందుకు అనుగుణంగా పాతపద్ధతిలో ఎంసెట్ వంటి పరీక్షా విధానం తీసుకురావాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
"ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు ఎన్ఎంసీ సిద్ధమవుతోంది. వారి ఆదేశాలను మేం పాటించాల్సి ఉంటుంది. ఆలిండియా కోటా సీట్ల మీద అభ్యంతరాలున్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం. కానీ తుది నిర్ణయం కోర్టు ఉత్తర్వుల మేరకే ఉంటుంది" అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ కోరుకొండ బాబ్జీ అన్నారు.
ఈసారి మెడికల్ సీట్ల భర్తీ విషయమై స్పష్టత కోసమే అంతా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.
ఎంబీబీఎస్‌తో పాటుగా పీజీ సీట్లలోనూ ఆలిండియా కోటా మీద వివాదం ఉంది. పీజీ సీట్లలో సగం సీట్లను మాత్రమే స్థానికులకు, మిగిలిన సగం ఆలిండియా కోటాలో భర్తీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చాంగ-6: చంద్రుని ఆవలి వైపు నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చిన చైనా వ్యోమనౌక
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














