జేఈఈలో 360కి 355 మార్కులు సాధించిన వేద్ లాహోటీ, ఆ 5 మార్కులు ఎక్కడ తగ్గాయంటే

వేద్ లాహోటీ

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, వేద్ లాహోటీ
    • రచయిత, మోహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నన్నడిగితే, బాగా చదవాలన్న దృఢసంక్పం ఉండాలి. ఆ సంకల్పం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు టాపర్ కావాలంటే, మీకంటూ ఒక కల ఉండాలి, దానికి తగ్గ మోటివేషన్ ఉండాలి''

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష చరిత్రలో తొలిసారిగా 98.61 శాతం మార్కులతో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన వేద్ లాహోటీ మాటలు ఇవి.

వేద్ లాహోటీ 360కి 355 మార్కులు సాధించారు.

అంతకుముందు, 2020లో ముంబయి జోన్‌కి చెందిన చిరాగ్ ఫేలార్ పేరిట అత్యధిక మార్కుల రికార్డు ఉండేది. చిరాగ్‌ ఆ ఏడాది 352 మార్కులు సాధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు

రికార్డ్ స్థాయిలో మార్కులతో టాపర్, ఎలా ?

వేద్ చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తారు. ఎవరైనా కనిపిస్తే చిన్న చిరునవ్వు నవ్వుతారు. కొన్నిసార్లు ఆసక్తిగా గమనిస్తుంటారు.

జేఈఈ 2024 ఫలితాలపై తాను, తన తల్లిదండ్రులు, లెక్చరర్లు ఆనందంగా ఉన్నామని వేద్ లాహోటీ చెప్పారు.

ఐదు మార్కులు ఎక్కడ తగ్గాయన్న ప్రశ్నకు బదులిస్తూ, ‘ఫిజిక్స్‌లో రెండు, మ్యాథ్స్‌లో మూడు మార్కులు పోయాయి. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే తప్పు రాస్తే మార్కులు తగ్గి, నెగెటివ్‌ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అస్సలు రిస్క్ తీసుకోలేదు. అందువల్లే ఐదు మార్కులు తగ్గాయి" అన్నారు.

ఇప్పుడాయన తన భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. “ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనుకుంటున్నా. విదేశాలకు వెళ్లే ఆలోచన ఇప్పటికైతే లేదు. చిన్నప్పటి నుంచి నాకు కంప్యూటర్లు, ఏఐ, కోడింగ్ అంటే ఇష్టం. అందుకే ముంబయి ఐఐటీ ద్వారా కంప్యూటర్స్‌లో చేరి, ఆ రంగంలో మరింత రాణించాలనుకుంటున్నా'' అని వేద్ చెప్పారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్

ఫొటో సోర్స్, ANI

ఫెయిలైన విద్యార్థులకు సలహా..

రికార్డు మార్కులతో వేద్ ఆలిండియా టాపర్‌గా నిలిచారు. జేఈఈలో ఉత్తీర్ణులైన దాదాపు 48 వేల మంది విద్యార్థుల్లో ఆయన అగ్రస్థానంలో నిలిచారు.

అలాగే, ఈ పరీక్షలో లక్ష మందికి పైగా విద్యార్ధులు అర్హత సాధించలేకపోయారు.

వారి గురించి మాట్లాడుతూ, “ఐఐటీలో చదవలేకపోయినంత మాత్రాన జీవితం ఇక్కడితో ఆగిపోదు. ఇంకా చాలా చేయొచ్చు. జీవితంలో గెలుపోటములు సహజం" అన్నారు.

''నేనెప్పుడూ టైం చూసుకుని చదవలేదు. నాకు చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం. టీచర్లు చెప్పిన దాని ప్రకారం చదివాను" అన్నారు వేద్

ఈ రికార్డును బద్దలుకొట్టడం కష్టం

వేద్ లాహోటీ మార్కుల గురించి కోటాకు చెందిన కెరీర్ కౌన్సెలర్ అమిత్ ఆహూజా మాట్లాడుతూ, "ఈ రికార్డును బద్దలుకొట్టడం అంత సులభం కాదు.పేపర్ కష్టంగా వచ్చినా 98.61 శాతం మార్కులు సాధించడం చాలా పెద్ద విజయం" అన్నారు.

కోటాలో శిక్షణ ఎలా సాగింది?

"నాకు గణితమంటే ఇష్టం. కోటా గురించి చాలా విన్నా. దేశం నలుమూలల నుంచి తెలివైన విద్యార్థులు ఇక్కడికి వస్తారు. అందువల్ల ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. దీంతో బాగా చదవాలన్న కోరిక కూడా కలుగుతుంది. అందుకే నా అంతట నేనుగా కోటాకు వచ్చా" అని వేద్ చెప్పారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, వేద్ తండ్రి యోగేశ్ లాహోటీ

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం గురించి చెబుతూ, ''నా కుటుంబం నాకెప్పుడూ అండగా ఉంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా, నేను నిరుత్సాహానికి గురయ్యేలా ఎప్పుడూ ఒక్క మాట కూడా అనేవారు కాదు. మంచి మార్కులు సాధించాలంటూ నన్ను మోటివేట్ చేసేవారు.

నా కోసం నా కుటుంబం చాలా త్యాగాలు చేసింది. నన్ను కలవడం కోసం మా అమ్మానాన్న ఇందోర్ నుంచి కోటాకు వచ్చేవాళ్లు. ఇంట్లో కూడా కొంచెం కష్టంగానే ఉండేది. కానీ, ఇంట్లో ఇబ్బందుల ప్రభావం నా చదువుపై ఎప్పుడూ పడనివ్వలేదు'' అన్నారు వేద్.

కోటాలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలపై వేద్ స్పందిస్తూ, ''నేను ఇంటికి దూరంగా ఉన్నా ఎప్పుడూ మా కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉండేవాడిని. అందువల్ల నాకెప్పుడూ నిరాశ ఎదురవలేదు'' అన్నారు.

వేద్ తండ్రి యోగేశ్ లాహోటీ ఇందోర్‌లోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

"వేద్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుమించిన ఆనందం మాకేముంటుంది. ఇప్పటివరకూ ఎవ్వరికీ ఇన్ని మార్కులు రాలేదు’’ అని ఆయన అన్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, వేద్ తల్లి జయా లాహోటీ

వేద్ తల్లి ఏమన్నారు

వేద్ తల్లి జయా లాహోటీ మాట్లాడుతూ , “నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష చరిత్రలోనే అత్యుత్తమ మార్కులు సాధించిన బిడ్డను చూసి ఏ తల్లి సంతోషించదు.

రెండేళ్లుగా హాస్టల్‌లోనే ఉంచాం. ప్రతినెలా వచ్చిచూసేదాన్ని. ఇంటి పనులతో పాటు వేద్‌నూ చూసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడైనా వేద్ డల్‌గా కనిపిస్తే ప్రోత్సాహకరంగా మాట్లాడేదాన్ని. బాగా తినమని, వ్యాయామం చేయమని చెబుతుండేదాన్ని'' అన్నారు.

స్కూల్‌లోనూ టాపరే..

2006 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో వేద్ లాహోటీ పుట్టారు. ఇందోర్‌లోనే చదువుకున్న వేద్, 2022లో ఒక కలతో కోటాకు వచ్చారు.

కోటాలో జేఈఈకి ప్రిపేర్ అవుతూనే వేద్ 10, 12వ తరగతులు పూర్తి చేశారు. 10వ తరగతిలో 98.6 శాతం, 12వ తరగతిలో 97.6 శాతం మార్కులు సాధించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA

ఫొటో క్యాప్షన్, వేద్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులో చేరి దేశానికి సేవ చేయాలని తాతయ్య సోమానీ కోరుకుంటున్నారు

వేద్ తన 78 ఏళ్ల తాతయ్య ఆర్‌సీ సోమానీని తన రోల్‌మోడల్‌గా భావిస్తారు. ఆయనో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వేద్ ఫలితాలు చూసి అతని తల్లిదండ్రుల తర్వాత, ఎక్కువగా సంతోషించింది కూడా ఆయనే. మనవడి ఫలితాలు చూసి ఆయన డ్యాన్స్ కూడా చేశారు.

సోమానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వ శాఖలో ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ''రెండున్నరేళ్ల వయసున్నప్పటి నుంచి వేద్ నాతోనే ఉండేవాడు. ఒలింపియాడ్, టాలెంట్ హంట్ వంటివి ఎక్కడ జరిగినా తీసుకెళ్లేవాడిని'' అన్నారు.

''తనేం కావాలనుకుంటున్నాడో తనే నిర్ణయించుకుంటాడు. అయితే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి, దేశానికి సేవ చేయాలనేది నా కోరిక. వేద్ కూడా దేశంలోనే ఉండాలని, దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నాడు'' అన్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్ ఎలా ఉంటుంది?

''ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఉంటుంది'' అని కెరీర్‌ కౌన్సెలర్‌ అమిత్‌ ఆహుజా చెప్పారు.

"ఐఐటీకి చెందిన అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల బృందం ఈ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. దీన్నే అత్యంత కష్టమైన పరీక్ష పేపర్‌గా పరిగణిస్తారు" అని ఆహుజా అన్నారు.

పేపర్ ఎలా ఉంటుందో ముందుగా ఊహించడం కూడా కష్టమని ఆయన అన్నారు.

"ప్రశ్నపత్రం అందుకున్న తర్వాతే ఎంత కష్టంగా ఉందో విద్యార్థికి తెలుస్తుంది. పరీక్ష రాసేప్పుడే ఎలా మార్క్ చేయాలి, ఎంత కష్టంగా ఉందనేది తెలుస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్‌లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, వాటిని ఎలా మార్కింగ్ చేయాలనేది కూడా ముందుగా తెలియదు'' అని ఆహుజా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)