పెమ్మసాని చంద్రశేఖర్: పోటీ చేసిన తొలిసారే గెలిచి కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్న డాక్టర్

ఫొటో సోర్స్, uworld.com
టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన ఎన్డీయే ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
ఆయనకు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేటాయించారు. ఆ శాఖకు సహాయమంత్రిగా ఉంటారాయన.
తాజా ఎన్నికల్లో డా. పెమ్మసాని చంద్రశేఖర్ 3.4 లక్షల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై గెలిచారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో పెమ్మసాని ఒకరు.


పోటీచేసిన తొలిసారే గెలుపు, మంత్రి పదవి కూడా..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఎన్నికల అఫిడివిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం దేశంలోనే ధనవంతుడైన ఎంపీగా ఆయనకు పేరుంది.
తెలంగాణకు చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హరియాణాలోని కురుక్షేత్ర నుంచి గెలిచిన నవీన్ జిందాల్ వంటి వారిని అధిగమించి ధనవంతులైన లోక్‌సభ అభ్యర్థుల్లో ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు.
ఎన్నికల బరిలో దిగిన తొలిసారే ఘన విజయం సాధించిన ఆయనకు ప్రస్తుతం 18వ లోక్ సభలో అడుగుపెట్టడంతో పాటుగా నరేంద్ర మోదీ మంత్రివర్గంలోనూ అవకాశం దక్కింది.
పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి లోక్‌సభలో ప్రవేశించకముందే నేరుగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రవాసాంధ్రుడిగా ఉంటూ ప్రత్యక్షరాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో 3,44,695 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఫొటో సోర్స్, FB/pemmasaniofficial
పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు?
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి పేరు సాంబశివరావు.
ఆరంభం నుంచి చదువుల్లో రాణించిన ఆయన అప్పట్లో ఏపీ ఎంసెట్, ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకర్‌గా నిలిచారు.
1999లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన చంద్రశేఖర్, ఆ తరువాత అమెరికా వెళ్లి అక్కడ పెన్సిల్వేనియాలో ఇంటర్నల్ మెడిసిన్‌లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్(ఎండీ) 2005లో పూర్తిచేశారు.
ఆయన భార్య శ్రీరత్న కూడా వైద్యురాలు. అమె కూడా వివిధ పరిశోధనలు చేశారు.
తనది, భార్యది ప్రధాన వృత్తి వ్యాపారమని ఆయన తన నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించారు.
‘యూవరల్డ్’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం స్థాపించి ప్రస్తుతం దానికి సీఈవోగా ఉన్న పెమ్మసానికి అదే ప్రధాన ఆదాయ వనరు.
మెడికల్, నర్సింగ్, అకౌంటింగ్, ఫైనాన్స్, లీగల్, ఫార్మసీ ఇలా అనేక రంగాలలో పరీక్షలకు ఆన్‌లైన్‌లో మెటీరియల్ విక్రయించే పోర్టల్ ఇది.

ఫొటో సోర్స్, FB/Pemmasani Chandra Sekhar
రాజకీయ అరంగేట్రానికి పదేళ్లుగా ఎదురుచూపులు
పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే గెలిచి, కేంద్ర మంత్రి అయ్యారు. అయితే, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన చాలాకాలం వేచి చూశారు.
తొలుత 2014లో పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. అప్పట్లో నరసరావు పేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైంది. కానీ, చివరి నిమిషంలో ఆ సీటు రాయపాటి సాంబశివరావుకు కేటాయించారు.
2019లోనూ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపినప్పటికీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
అయితే, 2024 ఎన్నికలకు ముందు గుంటూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించడంతో ఈసారి పెమ్మసానికి అవకాశం దొరికింది. తొలి ప్రయత్నంలో ఆయన విజయం సాధించారు.

ఫొటో సోర్స్, FB/Pemmasani Chandra Sekhar
ఆస్తుల విలువ ఎంతంటే..
ఈసీకి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కారణంగా ఒక్కసారిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది.
దేశంలోనే ధనవంతుడైన అభ్యర్థిగా పెమ్మసానికి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు 18వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో అఫిడవిట్ లెక్కల ప్రకారం అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీగా ఆయన నిలిచారు.
పెమ్మసాని చరాస్తులు రూ. 2,316 కోట్ల 54 లక్షల 45,165 కాగా, భార్య కోనేరు శ్రీరత్న చరాస్తులు రూ.2,289 కోట్ల 35 లక్షల 36 వేల 539గా వెల్లడించారు.
ఆయన సంతానం పెమ్మసాని అభినవ్ చరాస్తులు 496 కోట్ల 27 లక్షల 61 వేల 94 రూపాయలు, మైనర్ కుమార్తె పెమ్మసాని సహస్ర పేరిట ఉన్న చరాస్తులు 496 కోట్ల 47 లక్షల 37 వేల 988 రూపాయలుగా చెప్పారు.
మొత్తంగా వారి చరాస్తుల విలువ 5,598 కోట్ల 64 లక్షల 80 వేల 786 రూపాయలు.
అవే కాకుండా వారసత్వంగా వచ్చిన, సొంతంగా సంపాదించిన స్థిరాస్తుల ప్రస్తుత విలువ ప్రకారం, పెమ్మసాని చంద్రశేఖర్‌కు రూ. 72,00,24,245.. ఆయన భార్య పేరిట రూ. 34,82,22,507 విలువైన ఆస్తులున్నాయి.
మొత్తంగా భార్య, పిల్లల సంపదతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ రూ. 5,705,47,27,538. అంటే 5,705 కోట్ల 47 లక్షల 27 వేల 538 రూపాయలు.
అమెరికాలో 101 లిస్టెడ్ కంపెనీలలో పెమ్మసాని దంపతులకు షేర్లు ఉన్నాయి. వాటి విలువ ఆయన అఫిడవిట్ ఇచ్చిన నాటికి 28 కోట్ల 93 లక్షల 3 వేల 933 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 2,415 కోట్లు.

ఫొటో సోర్స్, FB/Pemmasani Chandra Sekhar
గుంటూరు నుంచి రెండో మంత్రి
గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన తొమ్మిదో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. వారిలో ఎన్జీ రంగా వంటి ఉద్దండులు కూడా ఉన్నారు. కానీ, ఇప్పటివరకు కొత్త రఘురామయ్యకి మాత్రమే గుంటూరు ఎంపీగా కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం వచ్చింది. ఆయన నాలుగుసార్లు గెలిచారు.
ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు కూడా ఇక్కడ నాలుగుసార్లు గెలిచారు. గల్లా జయదేవ్ రెండుసార్లు గెలిచారు. వీరికి కేంద్ర మంత్రిగా పని చేసే అవకాశం రాలేదు.
2014 నుంచి 2018 వరకు ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పుడు ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం వచ్చింది. అప్పట్లో మోదీ మంత్రివర్గంలో టీడీపీ కోటాలో పూసపాటి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీ మంత్రులయ్యారు.
ఇవి కూడా చదవండి:
- 2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే...
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే..
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














