ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే..

ఫొటో సోర్స్, FB/Janasena,TDP,YSRCP
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఓటర్లు ప్రీపోల్ సర్వేలకు చిక్కలేదు. ఎగ్జిట్ పోల్స్‌కు దొరకలేదు. దీంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. దీంతోపాటు కొన్ని చోట్ల రికార్డు స్థాయి మెజార్టీ కట్టబెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా గాజువాక నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు నిలిచారు. ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై 95,235 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
గాజువాక తరువాత భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు తన సమీప వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై 92,401 ఓట్ల తేడాతో నెగ్గారు.
అలాగే మంగళగిరి నుంచి పోటీచేసిన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్ తన సమీప వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల తేడాతో గెలిచారు.
పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు 81,870 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌పై ఈ మెజార్టీ సాధించారు.
నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం అభ్యర్థి పి.నారాయణ, వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌పై 72,489 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
తణుకు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 72,121 ఓట్ల తేడాతో గెలిచారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై 72,040 ఓట్లతో గెలిచారు.
రాజమండ్రి సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌పై 71,404 ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
విశాఖపట్నం తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వెలగపూడి రామకృష్ణ, వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణపై 70,877 మెజార్టీతో గెలిచారు.
పవన్, చంద్రబాబు, జగన్ మెజార్టీ ఎంత?
కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై 48,006 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2019లో చంద్రబాబు తన సమీప వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళిపై 30,722 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. 2019తో పోల్చుకుంటే చంద్రబాబుకు 18వేల మెజార్టీ పెరిగింది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ తన సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 మెజార్టీతో నెగ్గారు.
పవన్ 2019 ఎన్నికలలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాకలో ఆయనకు మొత్తం 58,539 ఓట్లు పోలవ్వగా, ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి 74,769 ఓట్లు దక్కించుకుని 16,230 ఓట్లమెజార్టీతో గెలిచారు.
భీమవరంలో 2019 ఎన్నికలలో పవన్ కల్యాణ్‌కు 61,951 ఓట్లు, ఆయనకు ప్రత్యర్థిగా, వైసీపీ తరపున పోటీచేసిన గ్రంథి శ్రీనివాస్‌కు 69,743 ఓట్లు వచ్చి, 7,792 మెజార్టీతో శ్రీనివాస్ గెలిచారు.
2019లో పై రెండు నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈసారి పవన్ కు భారీగా ఓట్లు లభించాయి. ఆయనకు పిఠాపురంలో మొత్తం 1,34,394 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి వంగా గీతకు 64,115 ఓట్లు వచ్చాయి. దీంతో పవన్ 70,279 ఓట్ల తేడాతో గెలిచారు.
పులివెందులలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవిపై 61,687 ఓట్ల తేడాతో గెలిచారు.
2019లో జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డిపై 89,708 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2019తో పోల్చుకుంటే ఆయన మెజార్టీ 28,021 తగ్గింది.

అత్యల్ప మెజార్టీ ఎంతంటే..
వెయ్యి ఓట్ల లోపు మెజార్టీ..
సత్యసాయి జిల్లా మడకశిరలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు, వైసీపీ అభ్యర్థి ఈర్ల లక్కప్పపై కేవలం 351 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ఇక గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డిపై 973 ఓట్ల తేడాతో నెగ్గారు.
మూడు వేల ఓట్ల లోపు మెజార్టీ..
ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి బి. విరూపాక్షి టీడీపీ అభ్యర్థి బి. వీరభద్ర గౌడ్ పై 2,831 ఓట్ల తేడాతో నెగ్గారు.
అలాగే దర్శి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీచేసిన బి. శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై 2,456 మెజార్టీతో గెలిచారు.
రాయచోటి నుంచి తెలుగుదేశం అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి పై 2,495 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేల జాబితా..
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి: కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోయిన కెరటం
- తెలుగుదేశం పార్టీ విజయానికి దారులు వేసిన 5 పరిణామాలివే...
- ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్, ఫలితాలపై ఆయన ఏమన్నారంటే..
- లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ వ్యూహం ఎలా ఫలించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














