చంద్రబాబు నాయుడు: ‘నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను’

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘మళ్లీ చెప్తున్నా.. ముఖ్యమంత్రిగానే ఈ హౌస్‌కు వస్తాను తప్ప, అదర్‌వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇదో కౌరవ సభ. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేనుండను. మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నాకు జరిగిన అవమానాన్ని మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారాలు’ అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి నారా చంద్రబాబు నాయుడు తన టేబుల్‌పైన ఉన్న కాగితాలు పట్టుకుని విసవిసా బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయిన దృశ్యం మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది.

అది జరిగిన రోజు టీవీ చానళ్లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో ఎక్కడ చూసినా అదే వీడియో.

2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ నుంచి వాక్‌అవుట్ చేసుకుంటూ బయటకు వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆ తరువాత మళ్లీ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.

వైసీపీ ఎమ్మెల్యేలు తనపై, తన కుటుంబ సభ్యులపై దూషణకు దిగారంటూ, తన భార్యను కూడా అనరాని మాటలు అన్నారంటూ, అంత జరుగుతున్నా స్పీకర్ ఏమీ చేయలేకపోయారంటూ ఆయన ఆ రోజు అసెంబ్లీని వీడారు.

ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ చంద్రబాబు ఆ రోజు సభ నుంచి బయటకు వెళ్లగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయన వెంటే వెళ్తూ ‘మీకు ఈ రోజే పతనం మొదలైంది.. మీకు ఈ రోజే పతనం మొదలైంది’ అంటూ వైసీపీని శపిస్తూ బయటకు వెళ్లారు.

రెండున్నర ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు గెలిచింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

chandrababu, Narendra Mo

ఫొటో సోర్స్, Getty Images

ఆ నాయ్‌డూ ఈ నాయుడు ఒక్కరే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, విభజన తరవాత ఒకసారి కలిపి మొత్తం మూడుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడిది రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకమైన ముద్ర.

తెలుగు రాష్ట్రాలు దాటి దేశంలోని ఇతర ప్రాంతాలలో పర్యటించే తెలుగువారిని అక్కడ ఎవరైనా మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే వారు గుర్తు చేసే పేరు ‘నాయ్‌డూ’.. ఆ ‘నాయ్‌డూ’ ఈ చంద్రబాబు నాయుడే.

తెలుగు రాజకీయాలలో నలభయ్యేళ్లుగా నిరంతరాయంగా వినిపిస్తున్న ఆ పేరుకు అభిమానులూ ఉన్నారు, అదేసమయంలో ఆ పేరు వినపడగానే తీవ్రస్థాయిలో విరుచుకుపడే వ్యతిరేకులూ ఉన్నారు.

ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికి 46 ఏళ్లు.

chandrababu

ఫొటో సోర్స్, Getty Images

ఎన్జీ రంగాతో ఎంట్రీ

తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీ యూనివర్సిటీ)లో చదువుతున్నప్పుడే ఆయన రాజకీయాల వైపు పూర్తిగా ఆకర్షితులయ్యారు.

అప్పటి ఎమ్మెల్సీ గల్లా రాజగోపాల్ నాయుడి అండదండలు సంపాదించిన చంద్రబాబు ఆయన ద్వారా ఎన్జీ రంగా దృష్టిలో పడ్డారు.

అప్పటికి ఆంధ్ర కాంగ్రెస్‌లో నీలం సంజీవరెడ్డి, ఎన్జీ రంగాలు ప్రధాన వర్గాలుగా ఉండేవారు. రంగా అనుచరుడిగా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు 1978లో తొలిసారి శాసనసభకు పోటీ చేశారు.

ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఆ ఎన్నికలలో చంద్రబాబు ఇందిర కాంగ్రెస్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీచేశారు. జనతా పార్టీ నుంచి కొంగర పట్టాభిరామ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి బాలసుబ్రమణ్యం చౌదరి, మరో నలుగురు ఇండిపెండెంట్లు ఆ ఎన్నికలలో పోటీ చేశారు.

గాంధేయవాదిగా పేరున్న పట్టాభిరామ చౌదరి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ చంద్రబాబు 2,494 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

చంద్రబాబుకు 35,092 ఓట్లు రాగా పట్టాభిరామ చౌదరికి 32,598 ఓట్లు పోలయ్యాయి.

ఆ విజయంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబునాయడు అక్కడికి కొద్దికాలంలోనే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో చోటు సంపాదించారు.

Chandrababu, NTR

ఫొటో సోర్స్, Getty Images

అంజయ్య ఇచ్చిన శాఖే చంద్రబాబుకు టర్నింగ్ పాయింటా?

అంజయ్య చంద్రబాబుకు తన మంత్రివర్గంలో చోటు ఇచ్చిన తరువాత ఆయనకు సాంకేతిక విద్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటి పారుదల శాఖలతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా అప్పగించారు.

సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకు సినిమారంగంలోని వారితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్‌తోనూ సాన్నిహిత్యం ఏర్పడింది.

అనంతరం ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహం చేశారు.

చంద్రబాబును అల్లుడిని చేసుకున్న కొన్ని నెలలకు ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని(టీడీపీ) స్థాపించారు.

అయితే, పార్టీ ఏర్పడిన వెంటనే చంద్రబాబు అందులో చేరలేదు. కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

chandrababu

ఫొటో సోర్స్, Getty Images

తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోయిన చంద్రబాబు

1983 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తొలిసారి పోటీ చేసినప్పుడు చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో దిగారు.

ఆ ఎన్నికలలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకటరామనాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ ఓటమి తరువాత చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశంలో చేరారు.

1984 ఆగస్ట్ సంక్షోభం సమయంలో..

పార్టీలో చంద్రబాబు చొరవ, చాతుర్యం ఎన్టీఆర్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు సమయంలో చంద్రబాబు అనుసరించిన రాజకీయ వ్యూహాలు ఎన్టీఆర్‌ను మెప్పించాయి.

ఎన్టీఆర్ భారీ మెజారిటీతో అధికారంతో చేపట్టిన తరువాత 1984లో అనూహ్యంగా అధికారం కోల్పోయారు. 1984లో ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు.

1984 ఆగస్ట్‌లో నాదెండ్ల భాస్కరరావు తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలతో గవర్నరు రాంలాల్‌ను కలిసి ముఖ్యమంత్రి పీఠమెక్కారు.

అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజుల సమయం ఇవ్వగా ఆలోగా చంద్రబాబు తెలుగుదేశం ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని అప్పటి రాష్ట్రపతిని కలిసి ఎన్టీఆర్‌కే తమ మద్దతని ప్రకటించారు.

ఎన్టీఆర్ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతును చంద్రబాబు కూడగట్టడంతో నాదెండ్ల బలనిరూపణకు ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ ఘటన తరువాత చంద్రబాబుకు ఎన్టీఆర్ మరింత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. నాదెండ్ల తిరుగుబాటు తరువాత 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేశారు.

అనంతరం 1989లో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని వీడి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.

కానీ.. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా తాను ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వెళ్లనంటూ చంద్రబాబుకే సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారు ఎన్టీఆర్.

అది పార్టీలోఆయన పట్టును పెంచింది.

ఎన్టీఆర్‌పై అవిశ్వాసం.. ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబు

ప్రతిపక్షంగా అయిదేళ్లు ఉన్న తెలుగుదేశం పార్టీ 1994 ఎన్నికలలో మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

కానీ, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరుగుతోందన్న ఆరోపణలతో చంద్రబాబు, ఎన్టీఆర్ కుమారులు కొందరు తిరుగుబాటు చేశారు.

160 మంది ఎమ్మెల్యేల మద్దతుతో చంద్రబాబు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించి తాను బలం నిరూపించుకుని ముఖ్యమంత్రి పీఠమెక్కారు.

అప్పటి పరిణామాలను చంద్రబాబు అనుకూలురు ఒకలా, ఆయన వ్యతిరేకులు మరోలా చెప్తుంటారు. చంద్రబాబు చర్యను ఆయన అనుకూలురంతా పార్టీని రక్షించుకోవడంగా చెప్తారు. ఆయన విమర్శకులు మాత్రం చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచారని అంటారు.

లక్ష్మీపార్వతి

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ అప్పుడేం జరిగింది?

అప్పటి పరిణామాలను కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి పన్నెండేళ్ల పాటు ఆ పార్టీలో ఉండి బహిష్కరణకు గురైన పర్వతనేని ఉపేంద్ర తన జీవిత చరిత్ర ‘గతం – స్వగతం’లో వివరించారు.

ఎన్టీఆర్ పదవి కోల్పోవడం, ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడం 1989లోనే జరిగాయని.. ఆయన జీవిత చరిత్ర రాయడానికి అభిమానిగా వచ్చిన ఆమె 1993 నాటికి ఆయన భార్య అయ్యారని, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు మారాయని ఉపేంద్ర రాసుకొచ్చారు.

1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌తో పాటు లక్ష్మీపార్వతి కూడా విస్తృతంగా ప్రచారం చేశారని, పార్టీలో బలీయమైన శక్తిగా మారారని ఆయన రాశారు.

‘1993 ఏప్రిల్ 19న లక్ష్మీపార్వతికి ఆమె మునుపటి భర్తతో విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి ఎన్టీఆర్‌ను ఆయన కుటుంబసభ్యులకు దూరం చేసింది. లక్ష్మీపార్వతి టీడీపీ రోజువారీ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ ప్రధాన శక్తిగా మారారు. ఎన్టీఆర్‌తో పనులున్నవారంతా ఆమెనే కలిసి ఆమె ద్వారా పనులు చేయించుకునేవారు. ఇది చంద్రబాబు సహా పార్టీ నేతల్లో ఆగ్రహాన్ని పెంచింది. ఆ ఆగ్రహం, అసంతృప్తి ఎన్టీఆర్‌పైకి మళ్లడానికి ఎంతోకాలం పట్టలేదు’ అని ఉఫేంద్ర తన పుస్తకంలో రాసుకున్నారు.

నిజానికి ‘ఎన్టీఆర్ తన రాజకీయ వారసుడిగా చంద్రబాబును ఎంపికచేసుకున్నారని పార్టీలో అందరికీ తెలుసు. కానీ, తన జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత పరిస్థితులు మారాయి. చివరకు చంద్రబాబును కూడా అనుమానించి ఎన్టీఆర్ ఆయన్ను దూరం పెట్టే ప్రయత్నం చేశారు’ అని ఉపేంద్ర ఆ పుస్తకంలో రాశారు.

1994 ఎన్నికలలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వెంటపెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేయగా టీడీపీకి ఆ ఎన్నికలలో 216 స్థానాలు వచ్చాయి. దాంతో 1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్ నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేశారు.

‘ఆ తరువాత పార్టీలో, ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి ప్రాభవం పెరగడం మొదలైంది. ఆ ఎన్నికలలో ఎన్టీఆర్ హిందూపురం, టెక్కలి స్థానాల నుంచి పోటీ చేసి గెలిచాక టెక్కలిని వదులుకోగా ఆ స్థానం కోసం లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణల మధ్య పోటీ ఏర్పడింది. కానీ, ఎన్టీఆర్ చివరికి ఆ స్థానాన్ని హనుమంతు అప్పయ్యదొరకు ఇచ్చారు. కానీ, తండ్రితో విభేదించిన హరికృష్ణ 1995 జులైలో జిల్లాల పర్యటన ప్రారంభించారు. మరోవైపు చంద్రబాబు మద్దతుదారులైన 8 మంది ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ పార్టీ నుంచి బహిష్కరించారు’’.. ఇవన్నీ పార్టీలో కొత్త పరిణామాలకు దారి తీశాయని ఉపేంద్ర రాసుకొచ్చారు.

చివరకు ఆగస్ట్ మూడో వారంలో చంద్రబాబు తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో వైస్రాయ్ హోటల్‌లో సమావేశం కావడం, 30 మంది తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా చంద్రబాబు పక్షం వహించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని ఉపేంద్ర రాశారు.

అయితే, మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షం వహించిన తరువాత కూడా చంద్రబాబు చివరి ప్రయత్నంగా ఎన్టీఆర్‌ను ఒప్పించాలని ప్రయత్నం చేశారని.. అశోక్ గజపతి రాజు, దేవేంద్రగౌడ్, ఎస్వీ సుబ్బారెడ్డిలను ఎన్టీఆర్ వద్దకు పంపించి ‘లక్ష్మీపార్వతిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి.. ఆమె మద్దతుదారులను మంత్రి పదవుల నుంచి తప్పించాలి.. పార్టీ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలి’ అనే మూడు డిమాండ్లు ఉంచారని ఉపేంద్ర రాశారు.

లక్ష్మీపార్వతి

ఫొటో సోర్స్, Getty Images

‘నాతోనే పార్టీ.. పార్వతితోనే నేను’

‘‘కానీ, ఎన్టీఆర్ ఆ డిమాండ్లను తోసిపుచ్చుతూ ‘నాతోనే పార్టీ.. పార్వతితోనే నేను’ అని స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీని, ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తాను అని ఎన్టీఆర్ అన్నారు. ఆ తరువాత హరికృష్ణ, బాలకృష్ణ వచ్చి చెప్పినా ఆయన వినలేదని, చంద్రబాబుతో ముఖాముఖి చర్చలు కూడా విఫలమయ్యాయి’ అని ఉపేంద్ర రాశారు.

చివరకు ఆగస్ట్ 25న చంద్రబాబు వర్గం సమావేశమై ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానించి.. చంద్రబాబును లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకుంటూ 144 మంది ఎమ్మెల్యేలు తీర్మానించి ఆ లేఖను గవర్నరుకు పంపించారు.

దాంతో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆగస్ట్ 30లోగా ఎన్టీఆర్‌కు బలం నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. ఆలోగా ఆగస్ట్ 27న అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు చంద్రబాబు గ్రూపును అసలైన తెలుగుదేశం పార్టీగా గుర్తిస్తూ నిర్ణయం ప్రకటించారు.

ఆగస్ట్ 28న నేషనల్ ఫ్రంట్ నాయకులు వీపీ సింగ్ వంటివారు వచ్చి రాయబారం చేసినా ఫలించకపోవడంతో ఆగస్ట్ 31న ఎన్టీఆర్ రాజీనామా చేశారు.

దాంతో చంద్రబాబు సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అప్పటి పరిణామాలపై ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లినప్పటికీ హైకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పు వచ్చింది.

chandrababu

ఫొటో సోర్స్, Getty Images

ఐటీకి ప్రాధాన్యం

చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. స్మార్ట్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటివాటికి ప్రాధాన్యమిచ్చారు.

ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, పచ్చదనం – పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు.

ఇజ్రాయెల్ సాగు పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ వంటివి రాష్ట్రానికి పరిచయం చేశారు. 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగ విస్తృతికి కృషి చేశారు.

అంతర్జాతీయంగానూ చంద్రబాబు ప్రతిష్ఠ పెంచుకున్నారు. ఉత్తమ ముఖ్యమంత్రిగానూ అవార్డులు అందుకున్నారు.

అయితే, అదే సమయంలో రాష్ట్రం జీఎస్‌డీపీ, విద్య, ఆరోగ్యం, సగటు జీవితకాలం వంటి విషయాలలో మిగతా దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకబడిందన్న విమర్శలు చంద్రబాబు ఎదుర్కోకతప్పలేదు.

chandrababu

ఫొటో సోర్స్, Getty Images

1999లో సొంతంగా ఎన్నికల బరిలోకి..

నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత తొలిసారి 1999లో తన ఫేస్‌తో ప్రజల ముందుకు వెళ్లారు చంద్రబాబు.

అంతకుముందు వరకు ఎన్టీఆర్ చరిష్మా తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఆకర్షణ శక్తి.. కానీ, ఎన్టీఆర్ చరిష్మాతో పోల్చినప్పుడు అప్పటికి చంద్రబాబు జనాకర్షణ శక్తి తక్కువే. కానీ, తన రాజకీయ వ్యూహాలు, ఆచరణా సామర్థ్యాలతో ఆ ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు.

అంతేకాదు.. ఆ ఎన్నికలలో చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం కూడా పనిచేసింది. అందుకు కారణం 1999 నాటి కార్గిల్ యుద్ధం.. వాజపేయీ ఒక్క ఓటుతో ఓడిపోయి సానుభూతి పొందడం.. అలాంటి బీజేపీతో చంద్రబాబు కలిసి ప్రయాణించడం ఆ ఎన్నికలలో ఆయనకు అదనపు బలంగా మారింది.

ఫలితంగా 1999 అక్టోబర్ 7న వెలువడిన ఫలితాలలో 178 స్థానాలు గెలుచుకుంది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ.

దాంతో అక్టోబర్ 11న చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

రెండో విడత పాలనలో వ్యతిరేకత

చంద్రబాబు తన రెండో విడత పాలనలో వివిధ పథకాలను అమలు చేశారు. అదే సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల ఫలితంగా కరవు వంటివి ఆయన పాలనపై క్రమేణా వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి.

2000 సంవత్సరం ఆగస్ట్‌లో పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద వామపక్షాలు, రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపడం, ఆ కాల్పులలో ముగ్గురు మరణించడం చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది.

టెలికాన్ఫరెన్సులు, ప్రజల వద్దకే పాలన, ఆకస్మిక తనిఖీలు వంటివాటితో ఉద్యోగులపై ఒత్తిడి పెరగడంతో వారి నుంచీ వ్యతిరేకత ఎక్కువైంది.

అయితే, చంద్రబాబు పాలనలో పంచాయతీ వ్యవస్థను నీరుగార్చారన్న విమర్శలున్నాయి. నీటి సంఘాలు, జన్మభూమి, విద్యాసంఘాలు, నోడల్ ఆఫీసర్లకు అధికారాలు కట్టబెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను చంద్రబాబు బలహీనం చేశారని ఉపేంద్ర అభిప్రాయపడ్డారు.

నీటి తీరువా, విద్యుత్ చార్జీలు, బస్ టికెట్లు, మున్సిపల్ పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా చంద్రబాబు హయాంలో భారీగా పెరిగాయని ఆయన తన ‘గతం-స్వగతం’లో రాశారు.

అదే సమయంలో చంద్రబాబుకు సంస్కరణలపై దృఢమైన విశ్వాసం ఉందని ఉపేంద్ర రాశారు.

అలిపిరి దాడిలో ధ్వంసమైన చంద్రబాబు కారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలిపిరి దాడిలో ధ్వంసమైన చంద్రబాబు కారు

అలిపిరి దాడి..

రెండో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోవడానికి ఇంకా పది రోజులు ఉందనగా ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న ఆయనపై 2003 అక్టోబర్ 1న నక్సలైట్లు దాడి చేశారు. ఏడుకొండలకు ప్రవేశమార్గమైన అలిపిరి వద్ద నక్సలైట్లు చంద్రబాబు లక్ష్యంగా క్లేమోర్ మైన్లు పేల్చారు.

చంద్రబాబు ప్రయాణిస్తన్న కారు తీవ్రంగా దెబ్బతింది. ఆయన గాయాలతో బయటపడ్డారు. ఆయన వెంట ఉన్న అప్పటి సమాచార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ దాడిలో గాయపడ్డారు.

అలిపిరి దాడి తరువాత చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలిపిరి వద్ద తనపై జరిగిన దాడిలో గాయపడిన చంద్రబాబు

కనిపించని సానుభూతి.. 2004లో ఓటమి

అలిపిరి దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రబాబు అక్కడి నెల రోజుల తరువాత 2003 నవంబర్ 14న శాసనసభను రద్దు చేశారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు.

ప్రజల నుంచి తనకు సానుభూతి దక్కుతుందని.. లోక్‌సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం వల్ల పూర్తి ఫోకస్ పెట్టొచ్చని భావించి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు ప్రయత్నించారని ఉపేంద్ర రాసుకొచ్చారు.

కానీ, ఎలక్షన్ కమిషన్ లోక్‌సభ ఎన్నికలతో పాటుగా 2004 ఏప్రిల్, మే నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది.

బీజేపీతో కలిసి పొత్తులు పెట్టుకుని ఆ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి ఫలితాలు నిరాశపరిచాయి. అసెంబ్లీలో 47 సీట్లకు పరిమితమైంది టీడీపీ. ఫలితంగా చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. లోక్‌సభ స్థానాలలోనూ అయిదింటిని మాత్రమే గెలుచుకోగలిగింది టీడీపీ.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

పదేళ్ల తరువాత పాదయాత్రతో పాలనలోకి..

2004లో అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి పదేళ్లు పట్టింది.

2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికలలోనూ కాంగ్రెస్ విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే, హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు.

ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

అయితే, వరుసగా రెండు ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలవడంతో 2014 ఎన్నికలకు చాలా ముందుగానే చంద్రబాబు పాదయాత్ర తలపెట్టారు. ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో 2012లో గాంధీ జయంతి రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోని 16 జిల్లాలు, 86 నియోజకవర్గాల మీదుగా 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ఆ తరువాత రాష్ట్ర విభజన వద్దంటూ దిల్లీలోనూ నిరాహార దీక్ష చేశారు. 2014 ఎన్నికలలో విజయం సాధించి విభజన తరవాత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు.

ఐకే గుజ్రాల్, జ్యోతి బసు, చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

జాతీయ రాజకీయాలలో..

జాతీయ రాజకీయాలలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి నౌపడా సత్యనారాయణ చెప్పారు.

విపక్షాలను ఏకం చేసి దేవెగౌడ, గుజ్రాల్‌లను ప్రధానులను చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని అన్నారు.

చంద్రబాబుని ప్రధాని పదవి చేపట్టాలని ఇతర పార్టీలు ప్రతిపాదించినా ఆయన అందుకు అంగీకరించలేదని, రాష్ట్రమే తొలి ప్రాధాన్యమన్న విధానంలో ఆయన ఉండేవారని సత్యనారాయణ చెప్పారు.

1996లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత బలం లేకపోవడంతో హంగ్ పార్లమెంటు ఏర్పడింది. అప్పటికి చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నారు.

వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం బలం నిరూపించుకోలేక రెండు వారాలకే కూలిపోయింది.

దాంతో యునైటెడ్ ఫ్రంట్‌కు కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ నుంచి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడంతో ఫ్రంట్ కన్వీనర్‌గా చంద్రబాబు కీలక పాత్ర పోషించారని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామమోహనరావు తన ‘నేను – తెలుగుదేశం’ పుస్తకంలో రాశారు.

జాతీయ నాయకులతో చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

‘‘అయితే, 1998 ఎన్నికల తరువాత దేశంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మారాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే తాము బయట నుంచి మద్దతిస్తామని, అందుకు ప్రతిఫలంగా తమ పార్టీకి చెందిన దళిత నేత జీఎంసీ బాలయోగిని స్పీకర్ చేయాలని చంద్రబాబు బీజేపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు బీజేపీ సరేననడంతో బాలయోగి స్పీకరయ్యారు. కానీ, చంద్రబాబు చేసిన పనితో ఆగ్రహించిన ఫ్రంట్ నేతలు ఆయన్ను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ పదవి నుంచి తొలగించారు’’ అని కంభంపాటి రాశారు.

ఆ తరువాత టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని, వాజపేయి ప్రధానిగా ఉన్నన్నాళ్లు చంద్రబాబు సంకీర్ణ ధర్మాన్ని పాటించారని కంభంపాటి రాశారు.

అప్పటికి తెలుగుదేశం పార్టీకి 29 మంది లోక్‌సభ ఎంపీలు, 18 మంది రాజ్యసభ ఎంపీలు ఉండేవారని... వాజపేయితో చంద్రబాబుకు చాలా మంచి సంబంధాలు ఉండేవని నౌపడ సత్యనారాయణ గుర్తుచేసుకున్నారు.

అభివృద్ధి విషయంలో చంద్రబాబు సూచనలను, సలహాలను వాజపేయి కోరుకునేవారని... దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ చేపట్టిన హైవే ప్రాజెక్ట్ ‘స్వర్ణ చతుర్భుజి’(గోల్డెన్ క్వాడ్రిలేటరల్) వెనుక చంద్రబాబు సూచనలున్నాయని ఆయన తెలిపారు.

ఉత్తరాఖండ్ వరదలు.. హుద్‌హుద్, తిత్లీ తుపానులు, యుక్రెయిన్ యుద్ధం

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలను ఆదుకోవడం కోసం వెంటనే స్పందిస్తారని సత్యనారాయణ చెప్పారు.

2013 నాటి కేదారనాథ్-బద్రీనాథ్ వరదలను అందుకు ఉదాహరణ అని చెప్పిన సత్యనారాయణ అప్పటి సంగతులను గుర్తుచేశారు.

2013లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్‌లో కొద్దిగంటలలోనే కుంభవృష్టి కురవడంతో వందల మంది తెలుగు పర్యటకులు చిక్కుకుపోయారు.

‘కేదారనాథ్ వరదల సమయంలో చంద్రబాబు అమెరికాలో ఉన్నారు. అప్పటికి ఆయన అధికారంలో కూడా లేరు. తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలిసి వాళ్లను ఆదుకోవడానికి ఏం చేద్దామంటూ టీడీపీ నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. దిల్లీలో ఉన్న నాతోనూ ఫోన్లో మాట్లాడితే మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నాను. వెంటనే ఆయన బయలుదేరి వచ్చారు. వచ్చాక బాధితులకు ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో అకామడేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి చూసి ఆయన ఏపీ భవన్ గోదావరి బ్లాక్ ఎదురుగా నేలపై కూర్చుని ధర్నా చేశారు’ అని సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు.

అధికారులను కదిలించి అప్పటికప్పుడు వారందరికీ వసతి ఏర్పాటు చేయించడమే కాకుండా బస్సులు, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయించి పంపించారని సత్యనారాయణ చెప్పారు.

అలాగే, హుద్‌హుద్ తుపాను సమయంలో తీవ్ర దెబ్బతిన్న విశాఖ నగరాన్ని కోలుకునేలా చేయడానికి అక్కడే ఉంటూ పాలన సాగించారని.. తిత్లీ తుపాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేంద్రంగా పాలన సాగించారని చెప్పారు.

యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మొదలయ్యాక అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను వెనక్కు తీసుకురావడంలోనూ ఆయన చొరవచూపారన్నారు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

విభజన తరువాత అయిదేళ్లు అధికారంలో, అయిదేళ్లు ప్రతిపక్షంలో

రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పార్టీని విజయం వైపు నడిపించలేకపోయారు.

అంతేకాదు 175 అసెంబ్లీ సీట్లున్న కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 23 స్థానాలను మాత్రమే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ గెలవగలిగింది.

అయితే, నిత్యం ప్రజల్లో ఉంటుండడంతో చంద్రబాబు మళ్లీ వారి మద్దతు సాధించగలిగారు.

ఎన్నికలకు రెండు నెలల ముందు తాను చంద్రబాబును కలిసినప్పుడు విజయంపై ఆయన పూర్తి విశ్వాసం కనబరిచారని సీనియర్ జర్నలిస్ట్ వెంకటనారాయణ ‘బీబీసీ’తో చెప్పారు.

ఏపీ రాజధానిగా అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

స్కిల్ డెవలప్మెంట్, ఓటుకు నోటు కేసులు

చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో రెండు కేసులు ఆయనపై తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అందులో ఒకటి ఓటుకు నోటు కేసు కాగా రెండోది స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో అవకతవకలకు పాల్పడ్డారంటూ చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. 52 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణ ఎదుర్కొన్న ఆయన అక్టోబర్ 31న బెయిలుపై విడుదలయ్యారు.

చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ. 371 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. దానిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ అనేక ఆరోపణలు చేశారు.

అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలతో చంద్రబాబుపై కేసు పెట్టారన్నది టీడీపీ వాదన.

చంద్రబాబును వెన్నాడిన మరో కేసు ‘ఓటుకు నోటు’. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఓ నామినేటెడ్ సభ్యుడికి అప్పటికి టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి డబ్బు ఇవ్వజూపారన్నది ఆరోపణ. ఆ సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు కూడా ఫోన్లో మాట్లాడారంటూ ఆడియో రికార్డులు బయటకొచ్చాయి.

ఈ కేసులో రేవంత్ రెడ్డి అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. చంద్రబాబు పేరును ఈ కేసులో చేర్చాలంటూ, కేసు సీబీఐకి అప్పగించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జులై 24న విచారణ ఉంది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, పల్నాడు జిల్లాలో నీట మునిగిన పంటల పరిశీలనకు గట్లపై దూకుతూ వెళ్లిన చంద్రబాబు - 2022 అక్టోబర్ 19 నాటి చిత్రం

చంద్రబాబు ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా పడతారని, ఎన్ని రాళ్లనైనా ఎదుర్కొంటారని.. తనను అరెస్టు చేసినా, తన భార్యను దూషించినా తట్టుకుని ప్రజల కోసం మళ్లీ వచ్చారని సత్యనారాయణ అన్నారు.

2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు తన మార్క్ చూపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

‘నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అంటూ అధికారులతో పని చేయించిన చంద్రబాబు మళ్లీ రాష్ట్రాన్ని ముందుకు పరుగెత్తిస్తారని టీడీపీ నాయకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)