ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?

పింఛన్ల పంపిణీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది వివిధ సామాజిక పింఛన్లు పొందుతున్నారు.

మార్చి వరకు ప్రతి నెలా ఒకటో తేదిన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వీటిని పంపిణీ చేశారు. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) తప్పించింది. దీంతో ఏప్రిల్ 1న లబ్ధిదారుల చేతికి పింఛన్లు అందలేదు.

వాలంటీర్లను తప్పించడంతో లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే, సచివాలయం దగ్గర వద్దు, సచివాలయ సిబ్బందే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ గందరగోళం ఎందుకు?

లబ్ధిదారులకు పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి?

పింఛన్ల పంపిణీ విషయంలో అధికార, ప్రతిపక్షాల వాదనలేంటి, ఆందోళనలేంటి?

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశముంది?

ఎన్నికల కమిషన్

ఫొటో సోర్స్, Getty Images

ఈసీ నిర్ణయానికి దారితీసిన పరిణామాలు

వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. వీరిని వివిధ ప్రభుత్వ పథకాల పంపిణీకి వినియోగించుకుంటోంది.

అయితే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని, వారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్న క్రమంలో ఆ పార్టీకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ, జనసేన, ఇతర ప్రతిపక్షాలు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తుండంతో వాలంటీర్లపై వివాదం మరింత రాజుకుంది.

వాలంటీర్లు పెన్షన్లు ఇస్తూ వైసీపీకి ప్రచారం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో లబ్ధిదారుల సమాచారాన్ని అధికార పార్టీ నేతలకు అందిస్తూ వైసీపీకి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సహయపడుతున్నారంటూ ఆరోపించాయి.

ఆ సమాచారంతో అధికార పార్టీ నేతలు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఓటర్లను ప్రలోభపెడతారని టీడీపీ, జనసేన ప్రధానంగా విమర్శిస్తున్నాయి. ఈ విషయమై ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి.

దీనిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ వాలంటీర్ల నుంచి మొబైల్ డివైజ్‌లు వెనక్కు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు- వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించవద్దంటూ ‘సిటిజన్ ఫర్ డెమొక్రసీ’ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నఈసీ, వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది.

రాజకీయ రంగు పులుముకున్న ఈసీ చర్య

ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది.

టీడీపీ వల్లే పింఛన్ల పంపిణీ ఆగిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే నిధులు లేకపోవడం వల్లే పింఛన్లు పంపిణీ చేయకుండా వైసీపీ నేతలు నెపాన్ని తమపైకి నెట్టేస్తున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికే ఎండలు ముదిరి పోయాయని, వాలంటీర్లను ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించడం వల్ల వేల మంది వృద్ధులు, వికలాంగులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇదంతా టీడీపీ, జనసేన వల్లేనని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

సమయానికి పెన్షన్లు అందకపోవడంతో కొందరు మనస్తాపంతో, ఇంకొందరు సచివాలయానికి ఎండలో వెళ్తూ మృతి చెందారని వైసీపీ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టులు పెట్టింది.

మొదటి నుంచీ వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కక్షపూరిత ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో పెన్షన్ల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ చంద్రబాబు జేబు సంస్థ అని, దానితోనే ఈసీకి ఫిర్యాదు చేయించారని ఆయన ఆరోపించారు.

వాలంటీర్ల మీద ఆంక్షలపై ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, FACEBOOK / CHANDRA BABU NAIDU

ఫొటో క్యాప్షన్, పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు.

సీఎస్‌‌కు చంద్రబాబు లేఖ

పెన్షన్ల పంపిణీని కావాలనే వివాదాస్పదంగా మార్చి మేలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

అవకాశమున్నా సచివాలయ సిబ్బందితో ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇప్పించకుండా, సచివాలయానికి వచ్చి తీసుకోవాలనే ఆదేశాలు జారీ చేశారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు.

పెన్షన్‌ల పంపిణీకి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయని, గతంలో ఇచ్చిన విధంగా 1వ తేదీ నుంచి 5 తేదీ మధ్యలో పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు.

పింఛన్లు పంపిణీ చేయకుండా టీడీపీ అడ్డుకుంటోందనే విష ప్రచారాన్ని వైసీపీ చేస్తోందని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఎన్నికల ముంగిట నిధులను పక్కదారి మళ్లించడం వల్ల ఖజానా ఖాళీ అయిందని, అందుకే పింఛన్లు ఇవ్వలేక జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందని జనసేన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRA PRADESH CM

ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏమిటి?

పెన్షన్ సహా అన్ని నగదు పంపిణీ పథకాలకూ ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులకు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆదేశాలు జారీ చేసింది.

సీఈవో డి. మురళీధర్ రెడ్డి పేరిట అన్ని జిల్లాల అధికారులకు సెర్ప్ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఉండదని, సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని లబ్ధిదారులకు సూచించింది.

సచివాలయంలో ఉద్యోగులంతా సచివాలయాల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని, పింఛన్ దారులు తమ వెంట ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని, తమ వెంట పాస్ పాస్తకాలు తీసుకురావొద్దని, దానిపై సీఎం జగన్ చిత్రం ఉన్నందుకు ఎన్నికల నియమావళికి విరుద్దమని పేర్కొంది.

ఏప్రిల్ 2 నుంచి 6 వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

పింఛన్ల పంపిణీ కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి, అస్వస్థతకు గురైనవారికి, వితంతువులకు ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది.

సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సెర్ప్ సూచించింది.

అంతేకాకుండా వాలంటీర్ల వద్ద ఉన్న బయోమెట్రిక్ మిషన్లు, ఇతర పరికరాలను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఆదేశించారు.

పొలిటికల్ ఇష్యూగా మార్చారు: యుగంధర్ రెడ్డి

‘‘ఏపీలో పింఛన్ల పంపిణీని రెండు పార్టీలు పొలిటికల్ ఇష్యూగా మార్చాయి. ప్రభుత్వం ఇప్పటివరకు పెన్షన్ల పంపిణీకి ‘వెల్ఫేర్ సెక్రటరీ’ల ఖాతాలకు డబ్బులు వేయలేదు. డబ్బులు లేక పింఛన్ల పంపిణీ ఆలస్యమైన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి’’ అని రాజకీయ విశ్లేషకుడు యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం పెద్ద పనేమీ కాదు, ఎందుకంటే సచివాలయం పరిధి మూడు కిలోమీటర్లలోనే ఉంటుంది” అని అభిప్రాయపడ్డారు.

“మాకు మూడో తేదీన సచివాలయానికి వస్తే పెన్షన్లు ఇస్తామని సచివాలయం నుంచి కబురు వచ్చింది. పోయిన ఏడాది ఏప్రిల్‌లో కూడా 3వ తేదీనే పింఛను వచ్చింది. ఏటా ఏప్రిల్ నెలలో బ్యాంకులో ఏదో సమస్య వస్తుందట, అందుకే పింఛన్ లేటవుతుందట” అని చెప్పారని అనకాపల్లి జిల్లా నాయుడుపాలెంకు చెందిన అక్కిరాజు సూరిబాబు బీబీసీతో చెప్పారు.

ఈ ఎన్నికల సమయంలో వాలంటీర్లు పింఛన్లు ఇచ్చి, అధికార పార్టీకే ఓటు వేయాలనే ప్రచారం చేయడంతో పాటు, ఓటుకు కొంత సొమ్మును కూడా ముట్టచెప్పి ప్రలోభపెడతారేమోనని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని యుగంధర్ రెడ్డి అన్నారు.

పింఛన్ల పంపిణీపై రాజకీయాలు చేయడం వల్ల దీనిపై ఆధారపడే లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, దీనిని రాజకీయ కోణంలో చూడకుండా అధికార, ప్రతిపక్షాలు వెంటనే పింఛన్ల పంపిణీకి సహకరించాలని ఆయన సూచించారు.

వాలంటీర్లు

ఫొటో సోర్స్, YSRCP

వాలంటీర్లు ఎప్పుడు వచ్చారు?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2.66 లక్షల మంది వాలంటీర్లున్నారు. వైసీపీ ప్రభుత్వం 2019 ఆగస్టులో నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. దీనికి ఏడాదికి రూ. 1,596 కోట్లు ఖర్చవుతుంది.

వేతనాలు పెంచాలంటూ 2021లో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో, ప్రభుత్వం ఇది సేవాభావంతో చేయాల్సిన పనే కానీ, ప్రభుత్వ ఉద్యోగం కాదని, పైగా రూ. 5 వేలు గౌరవ వేతనం కూడా ఇస్తున్నామని తెలిపింది.

అలాగే ఏటా కొందరు వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున వివిధ అవార్డుల పేరుతో ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. దీనితోపాటు పనితీరు ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర పేరుతో రూ.30 వేలు, మరో 20 మందికి సేవా రత్న పేరుతో రూ.20 వేల చొప్పున నగదు అందిస్తోంది. వీటన్నింటికి ఏటా రూ.250 కోట్లు ఖర్చు పెడుతోంది.

అలాగే రూ. 233 కోట్ల ఖర్చుతో స్మార్ట్ ఫోన్లు అందించారు. వీటికి తోడు వార్తాపత్రికలకు డబ్బులు చెల్లిస్తుంది ప్రభుత్వం.

2023 ఆగస్టులో మరో రూ. 750 వేతనం పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు దానిని పెంచలేదని విజయనగరం జిల్లా రేగిడి మండలం ఉంగరాడ గ్రామంలో వాలంటీరుగా పనిచేస్తున్న కృష్ణమూర్తి నాయుడు బీబీసీతో చెప్పారు.

ప్రస్తుతం తమకు గౌరవ వేతనం రూ. 5 వేలు, వార్తాపత్రికల బిల్లు రూ. 200 కలిపి నెలకు రూ. 5,200 వస్తుందని, ఈసీ తమను విధుల్నుంచి తొలగించడంతో జీతం వస్తుందో, రాదో తెలియదన్నారు కృష్ణమూర్తి.

పింఛన్ పంపిణీకి వాలంటీర్లకు ఈసీ అనుమతించకపోవడంతో చాలా మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి, నేరుగా రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నారు.

దానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈసీ నిర్ణయం ప్రకారం వాలంటీర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. జూన్ నెలలో ఎన్నికల కోడ్ ముగిసిందని ఈసీ ప్రకటించిన తర్వాతే మళ్లీ వాలంటీర్లు విధుల్లో చేరే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)