అనంతపురం: కరవుసీమలో పచ్చదనం ఎలా వచ్చింది? హార్టికల్చర్ సాగులో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఎలా నిలిచింది?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
అనంతపురం జిల్లా పేరు వినగానే కరవు, వలసలు గుర్తుకు వస్తాయి. కానీ, ఇక్కడ పచ్చగా కళకళలాడే ప్రాంతాలు ఉన్నాయి.
ఉద్యాన పంటల సాగులో ప్రస్తుతం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో టాప్‌లో ఉంది.
అనంతపురంలో పండే అరటి వంటి పంటలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
వానలు కురవని కరవు సీమలో ఈ పచ్చదనం ఎలా సాధ్యమైంది?
నేటి ఈ పచ్చదనానికి కొన్ని దశాబ్దాల కిందట పునాదులు పడ్డాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు రైతులను ఉద్యాన పంటల వైపుకు వెళ్లేలా చేశాయి. అనంతపురం జిల్లాలో వానలు కురవడం తక్కువ. భౌగోళిక స్వరూపమే ఇందుకు కారణం.
అనంతపురం జిల్లా సగటు వర్షపాతం 500 మిల్లీ మీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 900 మిల్లీలీటర్ల కన్నా చాలా తక్కువ.
నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల రైతులు పొదుపు చర్యల్ని ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కరవు నివారణ పథకంతో పాటు ఆర్డీటీ లాంటి స్వచ్ఛంద సంస్థలు చెక్ డ్యాములు కట్టి నీటిని ఎలా పొదుపు చేయాలో రైతులకు నేర్పించాయి.

సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు పచ్చదనానికి సంబంధం ఏంటి?
తక్కువ నీటితో పంటలు పండించే డ్రిప్ ఇరిగేషన్ వైపు రైతులు మళ్లారు.
“భూగర్భ జలాలతో పాటు తుంగభద్ర హెచ్ఎల్సీ కెనాల్, హంద్రీనీవా వల్ల ఇక్కడ పచ్చదనం పరుచుకుంది. ప్రతీ ఇంట్లోనూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తయారవ్వడం, వారివల్ల రైతుకు పెట్టుబడి దొరికింది. దాంతో బోర్లు వేయడం, డ్రిప్, స్ప్రింక్లర్లు వంటి ఆధునిక టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకున్నారు. కరవు సీమలో రైతులకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నది సాఫ్ట్ వేర్ పరిశ్రమ’’ అని సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ నాయుడు తెలిపారు.
తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్సీ కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్లు, రాయదుర్గం, తనేకల్లు, ఉరవకొండ నియోజకవర్గంలో కొంత భాగాన్ని, గుంతకల్లు నియోజవర్గం, పెద్దవడుగు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం రూరల్ ప్రాంతాలను తడుపుతుంది.
హంద్రీ నీవా నుంచి గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణ్ దుర్గం, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర, హిందూపురం, కదిరి ప్రాంతాలను నీళ్లు వస్తాయి. బైరవాని తిప్ప ప్రాజెక్టు కింద రామగిరి, పడమటి మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది.
ఇలా జిల్లా అంతటా పంటలకు సాగునీరు అందేలా ప్లాన్ చేశారని దామోదర్ నాయుడు చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చే రకరకాల రాయితీలు కూడా అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెరగడానికి తోడ్పడ్డాయి. 2005-06లో తీసుకొచ్చిన నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఇందుకు చాలా ఉపయోగపడింది.

వరంగా డ్రిప్ ఇరిగేషన్
2020 నుంచి జిల్లాలో భూగర్భజలాలు బాగా పెరిగాయని, నీటి సరఫరాకు ఇబ్బంది లేదని స్థానిక రైతులు చెబుతున్నారు.
ఏ పంటకైనా తమ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు సాగు చేస్తున్నామని దోసలేడు మండలం రైతు ఆదినారాయణ రెడ్డి చెప్పారు.
‘‘మేం డ్రిప్ ద్వారా పంటలు పండిస్తాం. సాగునీటితో ఒక ఎకరానికి సరిపడే నీళ్లను, డ్రిప్ ద్వారా అయితే రెండు ఎకరాలకు పారించవచ్చు. డ్రిప్‌తో ఎక్కువ గడ్డి కూడా పెరగదు. కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. లేబర్ ఖర్చు తగ్గుతుంది. వరి వేయడానికి మాకు నీళ్లు తక్కువ. కాబట్టి, ఈ భూముల్లో ఉద్యానపంటలు మాత్రమే బాగా పండుతాయి. వాటి ఎగుమతులు కూడా బాగా జరుగుతున్నాయి. మా పంటలకు మంచి డిమాండ్ ఉంది.
అనంతపురం ఉమ్మడి జిల్లాలోని 63 మండలాల్లో 30 మండలాలు పచ్చటి పొలాలతో కళకళలాడుతుంటాయి. మిగిలిన కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం లాంటి కొన్ని నియోజకవర్గాల్లో నీళ్లు తక్కువ కావడంతో భూములు బీడువారాయి. 2020 నుంచి గ్రౌండ్ వాటర్ బాగా పెరగడంతో ఇంతకుముందు తీవ్రంగా ఉన్న నీటి సమస్య ఇప్పుడు లేదు’’ అని రైతు ఆదినారాయణ రెడ్డి వివరించారు.

లాభసాటిగా అరటి సాగు
అనంతపురం జిల్లాలో 12 వేల హెక్టార్లలో అరటి సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులు ఎక్కువగా టిష్యూ కల్చర్ ప్లాంట్స్‌కి అలవాటు పడిపోయారు.
మంచి లాభాలు ఉండడం, అరటి ఎగుమతులు కూడా జోరందుకోవడంతో రైతులు ఆ పంటవైపు ఆసక్తి చూపిస్తున్నారని తాడిపత్రి వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పెద్దిరెడ్డి చెప్పారు
‘‘ఒక ఎకరాకు 1400 నుంచి 1500 అరటి చెట్లు సాగు చేసే అవకాశం ఉండటంతో చిన్న రైతులు కూడా అరటి సాగు చేస్తున్నారు. 10, 15 ఏళ్ల క్రితం అరటి సాగు ఈ విధంగా ఉండేది కాదు. ఈ నాలుగైదు ఏళ్ల నుంచి కొన్ని కంపెనీలు రావడం, ఎగుమతులు జరగడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. అరటి సాగుకు డ్రిప్‌లో వాటర్ వెళ్తుంటుంది. మందులు కూడా అందులోనే పంపిస్తారు. అందుకే ప్రతీ రైతూ అరటివైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గతంలో వేరుశెనగ ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు, చిన్న రైతులు కూడా అరటి వైపే మొగ్గు చూపుతున్నారు’’ అని పెద్దిరెడ్డి వివరించారు.

సబ్సిడీలతో రైతులకు ప్రోత్సాహం
అనంతపురం జిల్లాలోని పొడి వాతావరణం, అనువైన భూములు వల్ల పంటలకు వచ్చే జబ్బులు కూడా చాలా తక్కువగా ఉంటాయని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు.
‘‘అనంతపురం జిల్లాను నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ క్లస్టర్‌గా తీసుకుంది. దేశంలోని రెండు క్లస్టర్లలో అనంతపురం ఒకటి. క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద అనంతపురంను తీసుకున్నారు. ఇందులో ప్లాంట్ మెటీరియల్ నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇన్‌పుట్స్ అన్నీ ఇస్తారు. ఈ చర్యల వల్ల రైతులకు మంచి ధర అందుతుంది’’ అని అనంతపురం జిల్లా హార్టికల్చర్ అధికారి రఘునాథరెడ్డి చెప్పారు.
2001లో ప్రారంభించిన సబ్సిడీలను గత ఏడాది వరకు అరటి రైతులకు అందించినట్లు రఘునాథరెడ్డి చెప్పారు. ఇప్పుడు జిల్లాలో రైతులకు మైక్రో ఇరిగేషన్ పథకాల ద్వారా స్ప్రింక్లర్స్, డ్రిప్ లాంటివి ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్న రైతులతో పోలిస్తే, అనంతపురం జిల్లా రైతులు కొత్త టెక్నాలజీని బాగా అందిపుచ్చుకుంటారని, ఇక్కడి భూములు కూడా వారికి కలిసొచ్చాయని ఆయన తెలిపారు.

‘‘మట్టితో పాటు వాతావరణం అనుకూలించడం వల్ల ఇక్కడ పుచ్చకాయలు, కర్బూజ, అరటి లాంటివి ప్రధానంగా పండిస్తున్నారు. బొప్పాయి పొడి వాతావరణంలో పండుతుంది. ఎక్కువ వర్షాలు పడితే బొప్పాయికి వైరస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అరటి, బొప్పాయి కాకుండా చీని మాత్రమే అనంతపురం జిల్లాలో 95 వేల ఎకరాల్లో పండుతుంది. మామిడి 10 వేల హెక్టార్లు, దానిమ్మ 6000 ఎకరాల్లో సాగు అవుతుంది. మిరప 67,000 ఎకరాల్లో సాగు అవుతుంది’’ అని రఘునాథరెడ్డి వివరించారు.
వివిధ పంటలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల వల్ల ఎక్కువ మంది ఉద్యాన పంటలు వేయడంపై ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
‘‘మామిడి, చీని, జామ, నేరేడు, సీతాఫలం లాంటి వాటికి న్యూ ఏరియా ఎక్స్‌టెన్షన్ స్కీం కింద సబ్సిడీ ఇస్తాం. టెక్నికల్ గైడెన్స్ కూడా ఇస్తాం. మామిడి, చీని పంటలకు రూ. 9000 చొప్పున సబ్సిడీని నేరుగా రైతుల అకౌంట్‌లోనే వేస్తాం’’ అని రఘునాథ రెడ్డి చెప్పారు.

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చీని, మామిడి, బొప్పాయి, అరటి, దానిమ్మ, జామ, రేగు, నేరేడు, సపోటా, ఆవకాడో, ఖర్జూరం లాంటివి పండిస్తున్నారు.
వీటితోపాటు కూరగాయల పంటలకు కూడా డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక వేరుశనగ లాంటి పంటలకు స్ప్రింక్లర్స్ అందిస్తున్నారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగు చేస్తున్నారు.
జిల్లాలో చాలామంది చదువుకున్నవారు కూడా వ్యవసాయం వైపు మళ్లుతున్నారని దామోదర్ నాయుడు చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నమ్ముకోవాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలే పెట్టుబడి పెడుతుండటంతో రైతులు జిల్లాలో ఉద్యానపంటలు విస్తారంగా పండిస్తున్నారని తెలిపారు.
‘‘రైతులు ధరల విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం మంచి మార్కెటింగ్ కల్పిస్తే బాగుంటుంది. రిజర్వాయర్లు, కాలువలను పూర్తి స్థాయిలో నింపడం ద్వారా ఆయకట్టును స్థిరీకరిస్తే కరవు జిల్లా అనే పేరును అనంతపురం పూర్తిగా పోగొట్టుకుంటుంది’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














