'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?

బీల్ ప్రయోగం

ఫొటో సోర్స్, DERRICK TURNER/MSU

ఫొటో క్యాప్షన్, 1879లో మొదలైన బీల్ ప్రయోగం 2100 వరకు కొనసాగనుంది.
    • రచయిత, డారియో బ్రూక్స్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

145 ఏళ్ల క్రితం సమాధి చేసిన అత్యంత విలువైన ఖజానాను వెతికేందుకు 2021 ఏప్రిల్‌లో ఒక తెల్లవారుజామున పాత మ్యాప్, ఫ్లాష్‌లైట్స్, గడ్డపార, ఒక టేపు పట్టుకుని బయలుదేరారు అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు.

ఈ చిన్న శాస్త్రవేత్తల బృందానికి సారథి ప్రొఫెసర్ ఫ్రాంక్ టెలెవ్స్కీ. ఈయనొక బయోలజిస్ట్. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకుల బృందానికి నాయకుడు కూడా. ఎన్నో తరాలుగా వస్తున్న ఈ మ్యాప్‌ను ఎంతో సురక్షితంగా ఉంచారు ఈయన.

మ్యాప్‌లో చూపించిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత, గడ్డపారతో తవ్వి ఆ ఖజానా ఉంచిన ప్రాంతాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు.

ఈ గ్రూప్‌లో తొలి మహిళా శాస్త్రవేత్త మర్జోరీ వెబర్ తన చేతులతో జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గడ్డపార కారణంగా మట్టిలోపల ఉన్న ఆ వస్తువు దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నారు.

భూమి లోపల ఏదో గట్టిగా తగిలినట్లు ఆమెకు అనిపించింది. అది వారందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. కానీ, అది చెట్టు వేరు. మళ్లీ గడ్డపారతో తవ్విన దగ్గర మట్టిని తొలగించడం ప్రారంభించారు. రాయి తగిలేంత వరకు ఆమె అలా మట్టిని తొలగిస్తూ ఉన్నారు. దీంతో, వారికి ఏదో తేడా అనిపించింది.

వెంటనే మ్యాప్ తీసుకొని పరిశీలించారు. వారు తొలుత అంచనావేసిన దానికి 60 సెంటీమీటర్ల దూరంలో ఉన్నట్లు వారు గుర్తించారు. దీంతో, వారు మళ్లీ కాస్త వెనక్కి వెళ్లి తవ్వడం ప్రారంభించారు.

కాసేపటికి ఇసుక, విత్తనాలతో నింపిన అర లీటరు నీరు పట్టే ఒక గాజు సీసా కనిపించింది. ‘‘ఎంతో సురక్షితంగా కడుపులోని బిడ్డను ప్రపంచంలోకి తీసుకొచ్చినట్లు అనిపించింది’’ అని వెబర్ చెప్పారు.

1879లో ఈ విలువైన సంపదను సమాధి చేశారు. 15 దశాబ్దాల తర్వాత చిన్న శాస్త్రవేత్తల బృందం దీన్ని వెలికి తీసింది. బయోలాజికల్ సైన్సెస్‌ చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం జరిపిన ప్రయోగాల్లో ఇది ఒకటి.

బోటనిస్ట్ విలియం జేమ్స్ బీల్ ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. విత్తనం ఎంత కాలం అలానే ఉంటూ, మొలకెత్తడానికి అనుకూలంగా ఉంటుందని ఈ ప్రయోగంలో పరీక్షించాలనుకున్నారు.

తవ్వడం

ఫొటో సోర్స్, DERRICK TURNER/MSU

ఫొటో క్యాప్షన్, శాస్త్రవేత్తల బృందంలో ప్రొఫెసర్ లార్స్ బ్రడ్వింగ్

ఏడుగురు శాస్త్రవేత్తలు ఈ గాజు సీసాల సంరక్షకులు

ఆయన చేపట్టిన ఈ మిషన్‌కు ఎంతో మంది సంరక్షకులుగా వ్యవహరించారు. వీరిలో చాలా మంది ఈ ప్రయోగంలో చివరికి ఏమైందో చూడలేదు, చూడరు కూడా. ఎందుకే ఈ ప్రయోగం 2100లో ముగుస్తుంది.

‘‘బీల్ సమాధి చేసిన ఈ విత్తన ప్రయోగంలో పాల్గొనడం నా వృత్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన దానిలో ఒకటిగా నిలవనుంది’’ అని ప్రొఫెసర్ లార్స్ బ్రడ్వింగ్ చెప్పారు.

ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఎంపికైన చిన్న శాస్త్రవేత్తల బృందంలో లార్స్ బ్రడ్వింగ్ ఒకరు.

‘‘బీల్ చివరిసారి 141 ఏళ్ల క్రితం పట్టుకున్న ఈ గాజు సీసాను 2021లో వెలికితీయడం, పట్టుకోవడం, ఈ విత్తనాల నుంచి మొక్క మొలకెత్తడం చూడటం నిజంగా అద్భుతం’’ అని లార్స్ బ్రడ్వింగ్ చెప్పారు.

ఈ బృందంలో భాగం కావడం తనకెంతో సంతోషాన్ని, గౌరవాన్ని కలిగించిందన్నారు.

స్టేట్ యూనివర్సిటీ మిచిగాన్ అగ్రికల్చర్ కాలేజీలో విలియం జేమ్స్ బీల్ బొటానికల్ సైంటిస్ట్‌గా పనిచేశారు.

కలుపును నిర్మూలిస్తూ, పంట ఉత్పత్తిని పెంచేందుకు స్థానిక రైతులకు ఆయన సాయం చేయాలనుకున్నారు. అందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

విలియం జేమ్స్ బీల్

ఫొటో సోర్స్, MSU

ఫొటో క్యాప్షన్, విలియం జేమ్స్ బీల్

కలుపు మొక్కలు పంట పొలాల్లో విపరీతంగా పెరిగాయి. 19వ శతాబ్దం చివరిలో, పారతో తవ్వుతూ కలుపు మొక్కలను తొలగిస్తూ ఉండేవారు. ఎక్కువ సమయం పాటు కలుపు మొక్కలను తొలగించేందుకే రైతులు ఇబ్బందులు పడేవారు.

దీనికోసం ఆయన తొలుత ఎంతకాలం పాటు కలుపు మొక్కల విత్తనాలు భూమిలో ఉండి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉంటాయో తెలుసుకోవాలనుకున్నారు.

దీనికి సమాధానం కనుగొనేందుకు 23 రకాలకు చెందిన కలుపు మొక్కల 50 విత్తనాలను తీసుకుని 20 గాజు గ్లాసులో నింపారు.

వాటిని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ నేలలో దాచారు. వీటి లోపలకి నీరు కూడా వెళ్లకుండా ఆయన పాతిపెట్టారు. ఈ గాజు సీసాలను ఎక్కడ పాతారో మర్చిపోకుండా ఉండేందుకు మ్యాప్‌ను కూడా తయారు చేశారు బీల్.

ఈ విత్తనాలు మొలకెత్తడానికి వీలుగా ఉన్నాయో లేదో చూసేందుకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒక సీసాను వెలికితీయాలని తొలుత నిర్ణయించారు. అవి బయటికి తీసిన ప్రతీసారి మొలకెత్తేవి.

తొలి దశాబ్దాలలో ఈ ప్రయోగానికి ఆయననే ఇంచార్జ్‌గా వ్యవహరించే వారు. ఆయనకు 77 ఏళ్లు వచ్చాక, పదవీ విరమణ తీసుకున్న ఈ ప్రయోగ బాధ్యతలను తన సహోద్యోగి 31 ఏళ్ల బొటనీ ప్రొఫెసర్ హెన్రీ టీ డార్లింగ్టన్ చేతుల్లో పెట్టారు. తర్వాత చాలాకాలం పాటు డార్లింగ్టన్ ఈ ప్రయోగ బాధ్యతలను కొనసాగించారు.

తొలుత ఐదేళ్లకు ఒకసారి విత్తనాల మొలకపై ప్రయోగాలు చేసేవాళ్లు. 1920 నాటికి ఈ ప్రయోగ వ్యవధి కాలాన్ని 10 ఏళ్లకు పెంచారు. ఆ సమయ వ్యవధి తర్వాత కూడా విత్తనాలు బయటికి తీశాక మొలకెత్తుతున్నాయని గుర్తించిన తర్వాత, 1980ల్లో ఈ వేచిచూసే సమయాన్ని 20 ఏళ్లకు పెంచారు.

శాస్త్రవేత్తల బృందం

ఫొటో సోర్స్, DERRICK TURNER/MSU

ఫొటో క్యాప్షన్, 2020లో 14వ గాజు సీసాను వెలికితీసిన శాస్త్రవేత్తల బృందం

స్లీపింగ్ బ్యూటీతో పోలిక

దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ, ఈ ప్రయోగానికి ఏడుగురు సంరక్షకులుగా వ్యవహరించారు. వారిని వారు ‘స్పార్టాన్స్’గా పిలుచుకుంటారు. ఔత్సాహిక ప్రజలకు దూరంగా ఈ గాజు సీసాలను ఉంచారు.

‘‘దీన్ని మార్కు చేయడం కానీ లేదా సంరక్షించడంగానీ చేయరు. ఇది చాలా సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాయి. ఏ రూపంలో కూడా వీటిని కనుగొనడానికి వీలుండదు’’ బ్రడ్వింగ్ చెప్పారు.

కీ ల్యాండ్‌మార్క్‌ల ద్వారా ఆ ప్రాంతాన్ని త్రిభుజీకరణ చేసేందుకు తాము మ్యాప్‌ను వాడామని తెలిపారు. 2016 నుంచి ఈ ప్రయోగానికి ఫ్రాంక్ టెలెవ్క్సీ సారథ్యం వహిస్తున్నారు. ఈ మ్యాప్ కాపీకి సంరక్షకుడిగా కూడా ఉన్నారు. బీల్ భూమిలో పాతిపెట్టిన 20 గాజు సీసాల్లో 14వ సీసాను 2021లో వెలికితీశారు.

సుమారు 150 ఏళ్లు అవుతున్నా ఇంకా కొన్ని విత్తనాలు మొలకెత్తుతున్నాయి. వాటి దీర్ఘాయువు గురించి మరింత సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందిస్తున్నాయి.

దశాబ్దం క్రితం లాగా కాకుండా, బీల్ సమయంలో ఊహించని విధంగా శాస్త్రవేత్తలు ప్రస్తుతం అధ్యయనాలు చేపడుతున్నారు. ఇటీవల చేపట్టిన మాలిక్యులర్ జెనెటిక్స్ పరీక్షల్లో హైబ్రిడ్ ఉనికిని ధ్రువీకరించాయి.

వెర్బాస్కమ్ బ్లాటరియా, వెర్బాస్కం థాప్సస్ లేదా కామన్ ముల్లెయిన్ మొక్కల విత్తనాలను 14వ బాటిల్‌లో ఉంచారు.

ఇతర మొక్కల విత్తనాలు తొలి 60 ఏళ్లలో వాటి మొలకెత్తే సామర్థ్యాలను కోల్పోతున్నప్పటికీ, వెర్బాస్కమ్ మొక్కల విత్తనాలు మాత్రం దీర్ఘాయువుతో ఉంటున్నాయి.

కలుపు మొక్కల విత్తనాలను పూర్తిగా నిర్మూలించి రైతులకు సాయం చేయాలని బీల్ లక్ష్యమైనప్పటికీ, 144 ఏళ్లు అయినప్పటికీ ఇంకా దీనికి సమాధానం దొరకలేదు.

‘‘స్లీపింగ్ బ్యూటీ’’ స్టోరీలోని యువరాణి అరోరా మాదిరి ఈ విత్తనాలని బ్రడ్వింగ్ చెప్పారు.

‘‘భూమిలోపల దాచి ఉంచిన విత్తనాలు జీవంతోనే ఉన్నాయి. కానీ, సుప్తావస్థలో ఉన్నాయి. మొలకెత్తడానికి ముందు ఇవి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాయి. యువరాణి అరోరా ఆమె నిజమైన ప్రేమ ముద్దును పొందాలని వేచిచూసినట్లు, సాయిల్ సీడ్ బ్యాంకులోని ఈ విత్తనాలు కూడా మొలకెత్తేందుకు, ఎదిగేందుకు వాటికి అవసరమైన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, సరైన తేమ వాతావరణం కోసం అంతే వేచిచూశాయి’’ అని బ్రడ్వింగ్ వివరించారు.

వివిధ రకాల మొక్కలకు చెందిన విత్తనాలు వివిధ కాలాల్లో సుప్తావస్థ దశలో జీవించగలిగాయని అన్నారు.

కలుపు మొక్కలు

ఫొటో సోర్స్, DERRICK TURNER/MSU

కలుపు మొక్కలు ఎప్పటికీ చనిపోవా?

స్థిరమైన ఫలితాలతో విత్తన నిర్వహణను ఈ గ్రూప్ సునిశితంగా పరిశీలిస్తోంది. సూర్యరశ్మి వాటిపై పడి అవి ప్రభావితం చెందకుండా రాత్రిపూట ఈ విత్తనాలను వెలికితీస్తున్నారు. సహజ వాతావరణానికి తగ్గ పరిస్థితులు వారు లేబోరేటరీల్లో ఏర్పాటు చేస్తున్నారు.

‘‘ఈ ప్రయోగంలో మొక్కలు మొలకెత్తేటప్పుడు నియంత్రిత ఉష్ణోగ్రతలు, వెలుతురు, తేమను జాగ్రత్తగా నియంత్రించే గ్రోత్ ఛాంబర్‌ను మేం ఉపయోగించాం’’ అని బ్రడ్వింగ్ చెప్పారు.

బీల్‌కు తొలుత వచ్చిన ప్రశ్నలకు మించి, ఈ ప్రయోగంలో కొత్త ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి కూడా సమాధానాలను రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఫ్రాంక్ టెలెవ్స్కీ

ఫొటో సోర్స్, DERRICK TURNER/MSU

‘‘ఈ ప్రయోగ ప్రాముఖ్యం పెరుగుతూ వస్తోంది. గత 150 ఏళ్ల క్రితం బీల్ ఇది ఊహించి ఉంటారని నేననుకోను’’ అని ఈ శాస్త్రవేత్త చెప్పారు.

ఉదాహరణకు, అరుదైన జాతులకు చెందిన మొక్కలు, పర్యావరణంలో జీవావరణపరంగా, ఆర్థికంగా హానిచేసే కొన్ని రకాలు కొన్నిసార్లు ఎన్నో ఏళ్ల పాటు భూమిలో సుప్తావస్థ దశలో ఉంటున్నాయి. మొక్కల సహజ ఆవాసాల వ్యవస్థ నిర్వహణకు ఇవి ప్రయోజనాలను, సవాళ్లను రెండింటినీ అందిస్తున్నాయి.

పాత పంట ప్రాంతాల నుంచి పచ్చిక బయళ్లు, అడవులు వంటి సహజ ఆవాస వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించేందుకు ఇదెలా సాధ్యపడుతుందో మరింత తెలుసుకోవచ్చు. 20వ గాజు సీసాను చేరుకునేందుకు మరిన్ని తరాలు పట్టేలా ఉంది.

2100 ఏడాదిలో దీన్ని వెలికి తీయాల్సి ఉంది. కానీ, ప్రతి గాజు సీసా వెలికితీత కాల వ్యవధిని పెంచుతారనే వాదనను మాత్రం శాస్త్రవేత్తలు కొట్టివేశారు. 220 ఏళ్లు దాటినా కలుపు మొక్కలు మొలకెత్తుతాయా? కలుపు మొక్కలు ఎప్పటికీ మరణించవా? అనే దాన్ని కనుగొనేందుకు మరిన్ని తరాలు పట్టేలా ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)