ఈ బ్లాక్‌ హోల్ రోజుకొక సూర్యుడిని మింగేస్తోంది.. దీని కథేంటి?

అతిపెద్ద క్వాసార్

ఫొటో సోర్స్, ESO

ఫొటో క్యాప్షన్, ఆర్ట్‌ వర్క్

సుదూర విశ్వంలో అత్యంత ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్మతున్న ఓ పదార్థాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సూర్యుడికంటే 17 బిలియన్ రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న బ్లాక్ హోల్ (కృష్ణబిలం) నుంచి దీనికి శక్తి సమకూరుతున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని క్వాసార్‌ అని వ్యవహరిస్తారు.

దీనికి J0529-4351 అనే పేరు పెట్టారు. దీని శక్తిని చిలీలోని అతి పెద్ద టెలిస్కోప్ అబ్జర్వేటరీ నిర్థరించింది.

ఈ క్వాసార్ ఇంతగా వెలుగును విరజిమ్మడానికి కారణమవుతున్న బ్లాక్ హోల్ అత్యంత ఆకలిగొన్నదానిలా రోజుకో సూర్యుడంతటి ద్రవ్యరాశిని స్వాహా చేస్తోందని శాస్త్రవేత్తలు నేచర్ ఆస్ట్రానమీ అనే జర్నల్‌లో నివేదించారు.

చాలా సంవత్సరాల కిందట J0529-4351 సమాచారాన్ని శాస్త్రవేత్తలు నమోదు చేశారు. కానీ ఇప్పుడు దాని ఘనత ఏమిటో అర్థం చేసుకున్నారు.

‘‘మేమొక వస్తువును కనుగొన్నాం. గతంలో అదేమిటనే విషయాన్ని మేం గుర్తించలేదు. కానీ దాని తేజస్సు మా కళ్ళను వదిలిపోలేదు. బహుశా మానవ పరిణామానికి ముందునుంచే అది వెలుగులీనుతున్నట్టుంది. ఇప్పటి దాకా మేం దానిని పాలపుంతలో మనకు కనిపించే ఓ నక్షత్రం అనే భావించాం. కానీ అది చాలా చాలా దూరంలో ఉందనే విషయం ఇప్పుడు గుర్తించాం’’ అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)కు చెందిన క్రిస్టియన్ ఉల్ఫ్ బీబీసీకి చెప్పారు.

నక్షత్ర మండల కేంద్ర భాగాన్ని తెలిపేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు క్వాసార్ అనే పదం వినియోగిస్తుంటారు.

ఈ బ్లాక్ హోల్ అమితమైన వేగంతో పదార్థాలను తనలోకి లాగేసుకొంటోంది.

ఈ బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే పదార్థాలు భారీగా వెలుగును విరజిమ్ముతుంటాయి.

క్వాసార్ నుంచి వెలువడిన కాంతి యూరోపియన్ సదరన్ అబ్బర్వేటరీ ఆర్గనైజేషన్‌లోని అతిపెద్ద టెలిస్కోప్ డిటెక్టర్స్ వద్దకు చేరడానికి 12 బిలియన్ సంవత్సరాలు పట్టింది.

ప్రతిదీ ఆశ్చర్యకరమే

క్వాసార్

ఫొటో సోర్స్, ESO

ఫొటో క్యాప్షన్,

ఈ తేజోమయ పదార్థం గురించిన ప్రతి విషయం ఆశ్చర్యకరంగానే ఉంది.

‘‘ఇందులోని అసాధారణ విషయం ఏమిటంటే.. ఆ బ్లాక్ హోల్ ఎంత వేగంగా ద్రవ్యరాశిని మింగుతోందనేది. ఒక సూర్యుడంతటి ద్రవ్యరాశిని ఒక్కరోజులో స్వాహా చేస్తోంది. ఇది నిజంగానే అంతులేని వేగం. దీనివల్ల అతిపెద్ద వెలుగు ఏర్పడుతోంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌కు చెందిన రాచెల్ వెబ్‌స్టర్ చెప్పారు.

బ్లాక్ హోల్ ద్వారా శక్తిని సమకూర్చుకుంటున్న క్వాసార్ చిమ్మే వెలుగులు 500 లక్షల కోట్ల సూర్యుళ్ళకు సమానం.

ఈ బ్లాక్ హోల్ నుంచి వెలువడి విస్తరించే కాంతి వ్యాసార్ధం ఏడు కాంతి సంవత్సరాలకు సమానంగా ఉంది. అంటే సుమారుగా సూర్యుడికి, నెఫ్ట్యూన్‌కు మధ్య ఉన్న దూరం కంటే 15 వేల రెట్లు ఎక్కువ అన్నమాట.

నక్షత్ర మండలాలన్నింటికీ అంతర్లీనంగా అత్యంత శక్తిమంతమైన బ్లాక్ హోల్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. బహుశా గెలాక్సీలు ఏర్పడటానికి ఈ అంతర్లీన బ్లాక్ హోల్సే కారణమై ఉండవచ్చు.

‘‘సాధారణ భాషలో చెప్పుకోవాలంటే ఈ బ్లాక్ హోల్స్ లేకపోయి ఉంటే బహుశా ఈ రోజు మనం చూస్తున్న గెలాక్సీలు మరో విధంగా ఉండేవేమో. నిజానికి ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ లేకపోయి ఉంటే గెలాక్సీలు భిన్నంగా ఉండేవి. బహుశా గెలాక్సీలన్నీ ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ చుట్టూనే ఉండే అవకాశం కూడా ఉంది’’ అని ఏఎన్‌యూ పరిశోధక విద్యార్థి, సహరచయిత శామ్యూల్ లాయ్ చెప్పారు.

అసలు చిక్కుముడి ఏమిటంటే ఈ విశ్వంలో కొన్ని బ్లాక్ హోల్స్ ఇంత త్వరగా ఎలా పెద్దవిగా మారాయన్నదే. బిగ్ బ్యాంగ్ తరువాత ఏర్పడిన వాయువుల నుంచి బహుశా నక్షత్రాలు ఏర్పడక ముందే నేరుగా ఈ పదార్థాలు పెరిగాయా అనే కోణాన్ని పరిగణించే దిశగా శాస్త్రవేత్తలను ఇది పురిగొల్పుతోంది.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)