గ్రేట్ నికోబార్: భారత ప్రభుత్వ 74 వేల కోట్ల ప్రాజెక్ట్ ఆ తెగకు మరణ శాసనంగా మారనుందా

ఫొటో సోర్స్, ANTHROPOLOGICAL SURVEY OF INDIA
- రచయిత, ఫ్లోరా డ్రురి
- హోదా, బీబీసీ న్యూస్
అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం చేపట్టిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ప్రమాద ఘంటికలు మోగుతున్న ద్వీపంలో భారత రాష్ట్రపతి పర్యటించారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల అక్కడి స్థానిక గిరిజన తెగ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం గ్రేట్ నికోబార్ ఐలాండ్‌ను సందర్శించారు. మారుమూల ద్వీపమైన ఈ ఐలాండ్ షిప్పింగ్ హబ్‌గా, పర్యటక కేంద్రంగా మారుతుందని భారతీయ అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రాంతానికి అంత సామర్థ్యం ఉందని, ఈ ప్రణాళికలు ఐలాండ్ అభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రభుత్వం అంటోంది.
కానీ, ఇక్కడి షోంపెన్ తెగ ప్రజలకు ఇది 'మరణ శాసనం' అని నిపుణులు అంటున్నారు.
గ్రేట్ నికోబార్ ఐలాండ్ దక్షిణ ప్రాంతాన్ని 'ఇండియన్ హాంకాంగ్'గా మార్చే ప్రాజెక్ట్ అక్కడి గిరిజన తెగ వినాశనానికి దారితీస్తుందని 39 మంది నిపుణులు, ఈ నెల ప్రారంభంలో భారత రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచినప్పటికీ, ప్రభుత్వం తన ప్రణాళికలను పునఃపరిశీలించేలా చేయడంలో విఫలమైందనే ఆందోళనలు ఉన్నాయి.
మరీముఖ్యంగా, రాష్ట్రపతి ముర్ము దేశానికి అధ్యక్షురాలు. కానీ, కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించరు.

ఫొటో సోర్స్, PRESIDENT OF INDIA/X
''రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే ప్రభుత్వ స్థిరమైన నిర్ణయానికి సంకేతమైతే, అది అక్కడి స్థానిక షోంపెన్ తెగకు మరణ శాసనమే'' అని సర్వైవల్ ఇంటర్నేషనల్ ప్రతినిధి కల్లమ్ రస్సెల్ హెచ్చరించారు.
సర్వైవల్ ఇంటర్నేషనల్ ప్రకారం, ఐలాండ్‌లో షోంపెన్ తెగకు చెందిన 100 నుంచి 400 మంది ఉంటారు.
వీరు ఐలాండ్‌లోని వర్షారణ్యాల్లో నివసించే సంచార వేటగాళ్లు.
నికోబార్, అండమాన్ ఐలాండ్‌లలో మనుగడ ముప్పు తీవ్రంగా ఉన్న ఐదు తెగల్లో వీరు ఒకరు. కానీ, గ్రేట్ నికోబార్‌లో ఉన్న ఏకైక తెగ ఇదే.
షోంపెన్ తెగలో చాలా కొద్దిమందికి మాత్రమే బయటి ప్రపంచంతో సంబంధం ఉంది. భారత దేశానికి తూర్పు ప్రాంతానికి దిగువన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రేట్ నికోబార్‌లో కేవలం 8,000 మంది నివసిస్తున్నారు.
అయితే, ప్రభుత్వం చేపట్టనున్న 9 బిలియన్ డాలర్ల (సుమారు 74,606 కోట్ల రూపాయలు) ప్రాజెక్టు ప్రకారం, ఈ ఐలాండ్ పట్టణం, షిప్పింగ్ పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం, పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేనాటికి దాదాపు 6,50,000 మంది ఇక్కడ నివసిస్తారు.
అంతర్జాతీయ షిప్పింగ్ వాణిజ్యానికి ఈ ఐలాండ్ అనువైన ప్రాంతమని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి సవాల్‌గా కూడా మారుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ (ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ) ప్రచార కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన వీడియోలో కొత్త పోర్టు వెనక ఆకాశహర్మ్యాలు, విహార కేంద్రాలు కనిపిస్తాయి.
ఈ షిప్పింగ్ పోర్ట్ ద్వారా గ్రేట్ నికోబార్‌లో ప్రస్తుతం నివసిస్తున్న వారు, భవిష్యత్తు తరాల వారి జీవన నాణ్యత మెరుగుపడుతుందని ఆ వీడియో చెబుతోంది.
కానీ, ఈ కొత్త ప్రణాళికలు షోంపెన్ తెగ నివసించే, వేట సాగించే భూభాగాన్ని మింగేయడమే కాకుండా, ఇతరులతో పరిచయం వారికి ముప్పుగా మారుతుందని సర్వైవల్ అంటోంది.

ఫొటో సోర్స్, INDIA PORTS MINISTRY/X
అది ఎలాంటి పరిచయమైనా ఆ తెగను నాశనం చేస్తుంది. '' ఒక సాధారణ పరిచయం కూడా.. పరిమిత సంఖ్యలో ఉన్న ఆ తెగ పతనానికి దారితీయడం ఖాయం. ఎందుకంటే, బయటి నుంచి వచ్చే వ్యాధులను తట్టుకునే రోగనిరోధక శక్తి షోంపెన్ తెగకు చాలా తక్కువ, దాదాపు లేదు'' అని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మార్క్ లెవెన్ నేతృత్వంలోని నిపుణులు తమ లేఖలో హెచ్చరించారు.
ఇతరులతో సంబంధాలు ఏర్పడకపోయినా, అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఆ సమూహంపై పడుతుంది.
''వారు నివసిస్తున్న సహజ జీవావరణ వ్యవస్థలో ఏదైనా మార్పు జరిగినా, లేదా దానికి భంగం కలిగినా అది వారి ఉనికికి తీవ్రమైన ముప్పు కలిగించవచ్చు'' అని ప్రభుత్వ నివేదిక కూడా తెలియజేస్తోంది.
ఇలాంటి భయాలు ఉన్నప్పటికీ, షోంపెన్ తెగ మాత్రమే కాకుండా ఇతర సమూహాల గురించి కూడా ఇలాంటి హెచ్చరికలే వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ ఏడాది చివరి నుంచి ప్రాజెక్టు పనులు మొదలవుతాయని భావిస్తున్నారు. అది ఐలాండ్‌లోని ప్రత్యేకమైన జీవావరణానికి కూడా హాని కలిగించే అవకాశం ఉంది.
ఈ ప్రాణాంతక ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూనే ఉన్నామని, షోంపెన్ తెగను సంరక్షించేందుకు ప్రభుత్వం దీనిని రద్దు చేయాలని రస్సెల్ బీబీసీతో అన్నారు.
''వారికి తెలిసిన ఏకైక ఇల్లు ఇది. ఈ ఐలాండ్‌లో వచ్చే భారీ మార్పుల తర్వాత వారు మనుగడ సాగించే అవకాశం లేదు. ఇలాగే ముందుకు సాగితే ఇదే జరుగుతుందని అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి'' అని ఆయన బీబీసీతో అన్నారు.
భారత ప్రభుత్వ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది.
ఇవి కూడా చదవండి:
- దేశంలో పంటలకు కనీస మద్దతు ధర అవసరం లేదా? రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కావాల్సిన వేరే పద్ధతులేంటి
- యువ ఆటగాళ్ల ఆట కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ల రిటైర్మెంట్కు కారణమవుతుందా?
- విమానం ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే తొలి బ్యాగును అందించాలి: కేంద్రం
- ఎస్. జైశంకర్: రష్యా విషయంలో భారత్ 'స్మార్ట్' అని అమెరికా విదేశాంగ మంత్రితో ఎందుకన్నారు?
- నదియా: బాలీవుడ్ సినిమాల్లో మగాళ్లకు ధీటుగా స్టంట్స్ చేసి ఉర్రూతలూగించిన ఈ విదేశీ మహిళ ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














