కరోనావైరస్: అండమాన్‌లో ఆదిమ తెగల వారికీ పాకిన మహమ్మారి

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలోని అండమాన్ దీవులలో మారుమూలన నివసించే ఒక ఆదిమ తెగలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. గ్రేటర్ అండమాన్ ప్రాంతంలోని నలుగురు ఆదిమవాసులకు కోవిడ్-19 పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి బీబీసీకి తెలిపారు.
అందులో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చగా, మరో ఇద్దరి క్వారంటైన్‌లో చేర్చారు.
అండమాన్‌లో మనుషులు ఉండే 37 దీవులలో గ్రేటర్ అండమాన్ ఒకటి కాగా, ఇందులో 53 మంది గ్రేటర్ అండమానీస్ తెగవారు నివాసముంటున్నారు.
తూర్పు అండమాన్ ప్రాంతంలో ఇప్పటి వరకు 2,985 కోవిడ్-19 కేసులు బైటపడగా, 41 మంది చనిపోయారు.
స్ట్రెయిట్ ఐలాండ్‌లో ఉంటున్న 53మంది గ్రేటర్ అండమాన్ జాతి ప్రజలకు టెస్టులు నిర్వహిచామని పోర్ట్ బ్లేయర్‌లోని ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అవిజిత్ రాయ్ బీబీసీకి తెలిపారు.
‘‘ఆరోగ్యశాఖ సిబ్బంది పడవల మీద వెళ్లి ఒక రోజులు అందరికీ టెస్టులు నిర్వహించారు. “వారు మాకు చాలా సహకరించారు” అని డాక్టర్ రాయ్ తెలిపారు.
విసిరేనట్లు దూరంగా ఉన్న ఈ దీవి నుంచి ఆ తెగకు చెందిన వారు తరచూ పోర్ట్ బ్లేయర్‌కు వస్తుంటారు. వీరిలో కొందరు అక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఈ రాకపోకల వల్లే వారికి కోవిడ్-19 సోకి ఉంటుందని డాక్టర్ రాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అండమాన్ నికోబార్ ప్రాంతంలోని మిగతా ద్వీపాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటమే ఇప్పుడు తమ లక్ష్యమని డాక్టర్ రాయ్ తెలిపారు. “ఈ దీవులకు రాకపోకలు, టెస్టుల మీద మేం దృష్టి పెట్టాం” అని డాక్టర్ రాయ్ తెలిపారు.
ప్రస్తుతం అండమాన్‌లో అంతరించిపోయే దశలో ఉన్న జరవా, నార్త్ సెంటినెలీస్, గ్రేటర్ అండమనీస్, ఒంజే, షోంపెన్ అనే ఐదు ఆదిమ తెగలు ఉన్నాయి.
జరవా, సెంటినెలీస్ తెగ ప్రజలు సాధారణ జనజీవనంలో కలిసిపోలేదు. నార్త్ సెంటినెలీస్ తెగవారు తమ ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వరు. 2018లో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించిన ఒక అమెరికా పౌరుడిని ఆ తెగ ప్రజలు బాణాలతో కొట్టి చంపారు.
1850ల నాటికి గ్రేటర్ అండమాన్ తెగకు చెందినవారు 5,000మంది ఉండేవారని లండన్ కేంద్రంగా పని చేస్తున్న సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఆదిమ తెగల హక్కుల కోసం పోరాడుతుంది.
సాధారణ ప్రజలు తరచూ ఆ దీవులను సందర్శించడం వల్ల వారిలో వ్యాధులు ప్రబలి జనాభా క్రమంగా తగ్గిపోయింది. “గ్రేటర్ అండమానీస్ తెగకు కోవిడ్-19 వైరస్ సోకడం అత్యంత ప్రమాదకరమైన అంశం. తమ తెగ ప్రజలను కాపాడుకోవడానికి దానివల్ల కలిగే పరిణామాలను వారు కూడా తెలుసుకోవాలి” అని సర్వైవల్ ఇంటర్నేషనల్‌లో పరిశోధన చేస్తున్న సోఫీగ్రిగ్ తెలిపారు.
గ్రేటర్ అండమానీస్ భాషను మాట్లాడగలిగిన చిట్టచివరి మహిళ బోవా సీనియర్ 2010 సంవత్సరంలో మరణించారు. అండమాన్‌లోని కొన్ని ద్వీపాలను ఆంథ్రోపాలజిస్టుల స్వర్గంగా చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ అత్యంత భాషా వైవిధ్యం ఉన్న ప్రాంతాలుగా వీటికి పేరుంది.
476 మంది సభ్యులున్న జారవా తెగ ప్రజలు మధ్య అండమాన్ ప్రాంతంలోని అడవులలో జీవిస్తుంటారు. వైరస్ వ్యాప్తి గురించి తెలియగానే వారిని అడవులలో మరింత లోపలికి పంపించి వేశామని అధికారులు తెలిపారు.
అండమాన్ నికోబార్‌లోని 400 గ్రామాలకు లింకుగా పని చేస్తున్న అండమాన్ ట్రంక్ రోడ్ ఈ అడవుల గుండానే వెళుతుంది. ప్రజలు అటు ఇటూ ప్రయాణాలు సాగిస్తుండటం వల్ల వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉందని, వారికి ఈ వైరస్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలలో భాగంగానే ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.
115 మంది సభ్యులున్న ఒంజే తెగవారి కోసం ఒక వైద్య బృందాన్ని పంపామని డాక్టర్ అవిజిత్ రాయ్ తెలిపారు. షోంపెన్ తెగవారికి కూడా పరీక్షలు నిర్వహించామని ఆయన వెల్లడించారు.
తమ దీవుల నుంచి బయటకు వెళ్లేవారికి టెస్టులు నిర్వహించాకే అనుమతిస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉండేలా నిబంధనలు విధిస్తున్నారు.
అండమాన్‌లోని ఇప్పటి వరకు 10 దీవులలో కోవిడ్-19 టెస్టులు నిర్వహించామని డాక్టర్ రాయ్ తెలిపారు. కోవిడ్-19 ట్రీట్‌మెంట్ కోసం రెండు ఆసుపత్రులు, మూడు హెల్త్ సెంటర్లు, పది కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఇండియాలో అత్యధిక టెస్టింగ్ రేట్ ఉన్న ప్రాంతాలో ఒకటిగా ఈ ప్రాంతం నిలిచింది.
బ్రెజిల్, పెరూలలో ఉన్న ఆదిజాతి తెగల ప్రజల్లో కూడా ఈ వైరస్ వ్యాపించింది. 280 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








