రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ

లాటరీ టికెట్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో రూ.2,800 కోట్ల(340 మిలియన్ డాలర్ల) విలువైన జాక్‌పాట్ గెలుచుకున్న వ్యక్తికి, ఆ లాటరీ కంపెనీ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది.

పొరపాటున ఆయన లాటరీ నంబర్లను పబ్లిష్ చేసినట్లు పవర్‌బాల్, డీసీ లాటరీ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీపై వాషింగ్టన్‌ డీసీకి చెందిన ఈ వ్యక్తి న్యాయపోరాటానికి దిగారు.

2023 జనవరిలో జాన్ చీక్స్ అనే వ్యక్తి పవర్‌బాల్ లాటరీని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రోజు పవర్‌బాల్ డ్రాయింగ్ జరగలేదు. కానీ, రెండు రోజుల తర్వాత పవర్‌బాల్‌ గేమ్‌కు చెందిన డీసీ లాటరీ వెబ్‌సైట్‌లో తన నంబర్లు పోస్టు అయినట్లు ఆయన చూశారు.

డీసీ లాటరీ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసిన లాటరీ సెట్ నంబర్లు తను కొన్న టికెట్‌కు సరిపోయినట్లు ఈ వ్యక్తి గుర్తించారు.

కానీ, జాన్ తన టికెట్‌ను లాటరీ అండ్ గేమింగ్ ఆఫీసులో సమర్పించినప్పుడు తను గెలుచుకున్న డబ్బులను ఇచ్చేందుకు వారు నిరాకరించారు. తన టికెట్ సరిగ్గా లేదని, చెత్త బుట్టలో దీన్ని పడేయాలని వారు అన్నట్లు జాన్ చీక్స్ బీబీసీకి చెప్పారు.

ఈ టికెట్‌ను తీసుకుని జాన్, న్యాయపోరాటానికి దిగారు. తనకు కలిగిన నష్టానికి లాటరీ కంపెనీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

పవర్‌బాల్ జాక్‌పాట్, దానిపై రోజుకు వచ్చే వడ్డీని కలుపుకుని చెల్లించాలని కోరుతూ జాన్ దావా వేశారు.

లాటరీ

ఫొటో సోర్స్, Getty Images

కోర్టులో లాటరీ కంపెనీ ఏం చెప్పింది?

సాంకేతిక కారణాల వల్ల ఈ గందరగోళం ఏర్పడిందని పవర్‌బాల్ లాటరీ కాంట్రాక్టర్ వాషింగ్టన్ డీసీకి చెందిన టయోటి ఎంటర్‌ప్రైజస్‌ కోర్టు డాక్యుమెంట్లలో తెలిపింది.

జాన్ ఈ టికెట్‌ను జనవరి 6, 2023న కొన్నారని టయోటి ఉద్యోగి కోర్టు ఫైలింగ్‌లో చెప్పారు. అయితే, క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్ తమ వెబ్‌సైట్‌లో పలు పరీక్షలు చేపడుతుందని, ఇలా టెస్టులు చేపట్టే రోజు జాన్‌ టికెట్‌తో సరిపోయే పవర్‌బాల్ నంబర్లు పొరపాటున వెబ్‌సైట్‌లో పోస్టు అయ్యాయని చెప్పారు. ఈ నంబర్లు జనవరి 9 వరకు అంటే మూడు రోజుల పాటు అలానే ఉన్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లో పబ్లిష్ అయిన నంబర్లు, లాటరీ డ్రా తీసినప్పుడు వచ్చిన నంబర్లతో మ్యాచ్ కాలేదని టయోటి ఉద్యోగి చెప్పారు.

ఈ విషయంపై వివరణ కోసం పవర్‌బాల్, టయోటిలను బీబీసీ సంప్రదించగా అవి స్పందించలేదు.

కాంట్రాక్ట్ ఉల్లంఘన, నిర్లక్ష్యం, మానసికంగా ఒత్తిడికి గురిచేయడం వంటి ఎనిమిది రకాల ఫిర్యాదులతో జాన్ పవర్‌బాల్ కంపెనీపై దావా దాఖలు చేశారు.

‘‘గెలుపొందిన నంబర్లు, జాన్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌తో సరిపోయాయి. మొత్తం జాక్‌పాట్‌ను పొందేందుకు ఆయన అర్హులు. లేదంటే, తప్పుడు లాటరీ నంబర్లను పోస్టు చేస్తూ నిర్లక్ష్యం వహించినందున జాన్‌కు నష్టపరిహారాన్ని చెల్లించాలి’’ అని ఆయన న్యాయవాది రిచర్డ్ ఇవాన్స్ చెప్పారు.

లాటరీ కార్యకలాపాల్లో పారదర్శకత, సమగ్రతలపై ఈ దావా పలు ప్రశ్నలను రేకెత్తిస్తుందన్నారు.

‘‘ఇది కేవలం వెబ్‌సైట్‌లో పోస్టు అయిన నంబర్లు కాదు. జీవితాలు మారే అవకాశాలు అందించే కంపెనీల విశ్వసనీయతకు సంబంధించినది. లాటరీ ప్రక్రియలో ఈ కంపెనీలు కూడా చాలా లాభాలను పొందుతున్నాయి’’ అని చెప్పారు.

‘‘న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. లాటరీ గెలుచుకుని ఉంటే నా జీవితం, కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయేది’’ అని ఆశించినట్లు జాన్ బీబీసీకి చెప్పారు.

ఇళ్లు కొనేవారికి సాయంగా హోమ్ ట్రస్ట్ బ్యాంకును తెరుద్దామని అనుకున్నానని తెలిపారు.

ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)