‘డూమ్స్‌డే క్లాక్’ అంటే ఏమిటి? అర్ధరాత్రికి ఇంకా 90 సెకన్లే ఉందంటే అర్థం ఏమిటి?

గడియారం
    • రచయిత, జేన్ కార్బిన్
    • హోదా, బీబీసీ న్యూస్

‘డూమ్స్‌డే క్లాక్‌’‌ను 2024లో కూడా అర్ధరాత్రికి ఇంకా 90 సెకన్లు మాత్రమే ఉన్నట్లు చూపించాలని నిర్ణయించినట్లు సైంటిస్టులు ఇటీవల ప్రకటించారు. 2023లో కూడా దీనిని ఇలాగే చూపించారు.

ఈ గడియారంలో ముల్లులు అర్ధరాత్రికి ఎంత దగ్గరగా ఉంటే అణు విధ్వంసానికి ప్రపంచం అంత దగ్గరగా ఉన్నట్టు అర్థం.

ఇంతకూ ‘డూమ్స్‌డే క్లాక్‌’‌ అంటే ఏమిటి? ఈ గడియారాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? దీన్ని ఎవరు నిర్వహిస్తారు?

అణు విధ్వంసం లాంటి పెద్ద విపత్తుకు ప్రపంచం ఎంత దగ్గరగా ఉందో సూచించేదే డూమ్స్‌డే క్లాక్.

అణు బాంబును అభివృద్ధి చేసిన జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్‌, ఇతర అమెరికా శాస్త్రవేత్తలు డూమ్స్‌డే క్లాక్‌ను 1947లో రూపొందించారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో 1945 ఆగస్టులో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణు బాంబులు సృష్టించిన వినాశనాన్ని వారు చూశారు.

ఈ గడియారంతో ప్రజలను హెచ్చరించాలని, అణ్వాయుధాలను మళ్లీ ఉపయోగించకుండా ప్రపంచ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుకున్నారు.

మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఈ గడియారంలో సమయాన్ని మారుస్తూ ఉంటారు.

డూమ్స్‌డే గడియారాన్ని ఏటా 'బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్' సెట్ చేస్తారు.

ఈ గడియారాన్ని 2024 ఏడాది కోసం అర్ధరాత్రికి 90 సెకన్ల ముందుకు ఎందుకు జరపాల్సి వచ్చిందో ‘బులెటిన్’ శాస్త్రవేత్తలు వివరించారు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పుల గురించి ఆందోళన వెలిబుచ్చారు. కొత్త అణ్వాయుధాల పోటీ, యుక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులను వారు ప్రస్తావించారు.

2007 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పు లాంటి మనుషుల వల్ల ఎదురుకాగల విపత్తులను ఈ శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రధాన ముప్పుగా ఇప్పటికీ అణు యుద్ధాన్నే పరిగణిస్తున్నారు.

చైనా, రష్యా, అమెరికా తమ అణ్వాయుధాలను విస్తరించడానికి లేదా ఆధునీకరించడానికి భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయని 'బులెటిన్' ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది.

పొరపాటు లేదా తప్పుడు అంచనా అణు యుద్ధానికి దారితీస్తుందని బులెటిన్ ఆందోళన వెలిబుచ్చింది. యుక్రెయిన్‌లో యుద్ధం కూడా అణు తీవ్రతను పెంచే ప్రమాదాన్ని సృష్టించిందని పేర్కొంది.

వాతావరణ మార్పులపై చర్య లేకపోవడం, అభివృద్ధి చెందుతున్న బయోలాజికల్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల దుర్వినియోగంతో ముడిపడి ఉన్న నష్టాలు కూడా ఉదహరించింది.

డూమ్స్ గడియారం

ఫొటో సోర్స్, Getty Images

'గడియారం 25 సార్లు తిప్పేశారు'

ఇప్పటివరకు ఈ గడియారం ముల్లులు 25 సార్లు తిప్పారు. 1947లో అర్ధరాత్రికి 7 నిమిషాల ముందు శాస్త్రవేత్తలు క్లాక్ ప్రారంభించారు.

1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో అర్ధరాత్రికి 17 నిమిషాల ముందు గడియారం సెట్ చేశారు.

"యూకే సహా ప్రధాన దేశాలు తమ అణ్వాయుధాలను చాలా కాలం ఉపయోగించగలిగేలా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది చాలా ప్రమాదకర సమయం, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు" అని బులెటిన్ ప్రెసిడెంట్ రాచెల్ బ్రోన్సన్ బీబీసీతో అన్నారు.

రష్యా అణ్వాయుధ నిపుణుడు పావెల్ పోడ్విగ్ అనేక సంవత్సరాలుగా డూమ్స్‌డే గడియారాన్నిసెట్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు .

యుక్రెయిన్ దాడి తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ దళాలను అప్రమత్తం చేసినప్పుడు షాకయ్యానని పోడ్విగ్ అన్నారు.

పుతిన్ బెదిరింపులపై ప్రపంచం భయాందోళన వ్యక్తం చేసింది, అయితే రష్యా అధ్యక్షుడు ఉద్దేశపూర్వకంగా అణ్వాయుధాల గురించి చెప్పినట్లు తెలుస్తోంది.

"పుతిన్ ఈ ప్రకటన చేయడం ద్వారా పశ్చిమ దేశాలను యుక్రెయిన్‌లో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవచ్చని భావించారు" అని పోడ్విగ్ అన్నారు.

డూమ్స్‌డే క్లాక్
యూకే హెచ్ఎంఎస్ సబ్‌మెరైన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూకే హెచ్ఎంఎస్ సబ్‌మెరైన్

దశాబ్దాల నుంచి ఆయుధ నియంత్రణ ఒప్పందాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 13,000 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. వాటిలో 90 శాతం రష్యా, అమెరికన్ దేశాలవే.

వీటితో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా అణు శక్తులుగా మారాయి. ఇజ్రాయెల్‌కు ఈ ఆయుధాలున్నట్లు చాలా మంది భావిస్తారు, కానీ ఇది ధృవీకరణ కాలేదు.

ఇప్పుడున్న అణ్వాయుధాల్లో చాలా వరకు హిరోషిమా, నాగసాకీలను నాశనం చేసిన వాటి కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తిమంతమైనవి.

2021లో యూకే తన వార్‌హెడ్‌ల సంఖ్యను 225 నుంచి 260కి పెంచుకుంది. ఆ దేశం అణుశక్తిలో చాలా అప్రమత్తంగా ఉంది.

యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కో అణ్వాయుధాలను బ్రిటన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని ఒక చర్చ కూడా జరిగింది.

యూకే అణు నిరోధక (న్యూక్లియర్ డిటెర్రెంట్) వ్యవస్థ స్కాట్లాండ్‌కు పశ్చిమాన గల ఫాస్లేన్ వద్ద ఉంది. అక్కడ అణు వార్‌హెడ్‌లతో కూడిన ట్రైడెంట్ క్షిపణులను మోసుకెళ్లే నాలుగు జలాంతర్గాములు ఉన్నాయి.

అణ్వాయుధాల జాబితా
ఫొటో క్యాప్షన్, అణ్వాయుధాల జాబితా

ట్రైడెంట్ (డమ్మీ వార్‌హెడ్‌) క్షిపణిని ప్రయోగించిన కొంత మందిలో ఫియర్గల్ డాల్టన్ ఒకరు. ఆయన సబ్‌మెరైన్ హెచ్ఎంఎస్ విక్టోరియస్‌లో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేశారు.

"ఒక సబ్‌మెరైన్ ఎక్కడో ఒక చోట ఉంటుంది. 15 నిమిషాల్లో కాల్పులు జరపొచ్చు" అని డాల్టన్ చెప్పారు.

"అక్కడ న్యూక్లియర్ ఆయుధ వ్యవస్థ (న్యూక్లియర్ డిటెర్రెంట్) ఉంది. వ్లాదిమిర్ పుతిన్ వంటి వారికి అది అక్కడుందని తెలుసు, అది విశ్వసనీయమైనది, అవసరమైతే దాన్ని ఉపయోగించొచ్చు" అని అన్నారు.

అమెరికా విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూఎస్ ప్రత్యేక ఆయుధాలను బేస్ వద్ద ఉంచే అవకాశాలపై పెంటగాన్ మొదట రిపోర్టు చేసింది.

ఎప్పుడైతే అణుబాంబు సృష్టించారో అప్పటి నుంచి ఈ ఆయుధాలపై వ్యతిరేకత ఉంది. 1980లలో గ్రీన్‌హామ్ కామన్ పీస్ క్యాంప్‌ మహిళలు యూకేలో అమెరికా అణు క్షిపణులను తొలగించాలని పోరాడారు. దీంతో అక్కడి నుంచి క్షిపణులను తరలించారు, 2008లో చివరి వార్‌హెడ్‌ తీసుకెళ్లారు.

అయితే, అమెరికా ఆయుధాలు తిరిగి వచ్చే అవకాశం ఉందని సఫోల్క్‌లోని ఆర్ఏఎఫ్ లేకెన్‌హీత్ వద్ద అణు నిరాయుధీకరణ క్యాంపెయిన్ (సీఎన్డీ) సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ ప్రత్యేక ఆయుధాలను బేస్ వద్ద ఉంచే అవకాశాలపై పెంటగాన్ మొదట రిపోర్టు చేసింది.

ఆయుధాలను ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న అమెరికా యుద్ధ విమానాలు 2021లోనే లేకెన్‌హీత్‌కు చేరుకున్నాయి. ఇదే ప్రాంతంలో అణు కార్యక్రమంలో సేవలకు బలగాల కోసం వసతి గృహాలు (డార్మిటరీల)ను నిర్మించేందుకు యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం ప్రణాళికలు సిద్ధం చేసింది.

సీఎన్డీకి చెందిన సోఫీ బోల్ట్ అనే మహిళ బేస్ కంచె వద్ద నినాదాలు చేస్తూ "మాకు ప్రజల మద్దతుందని తెలుసు" అని తెలిపారు.

"దాదాపు 60 శాతం జనాభా బ్రిటన్‌లో అణు బాంబులు ఉండటానికి ఇష్టపడరు" అని అన్నారు.

"ఈ బేస్‌తో మాకు ఒరిగేదేమీ లేదు, ఇది పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉంది" అన్నారు మరొక నిరసనకారుడు అలాన్ రైట్.

"మేం ట్రంప్‌ను మళ్లీ ప్రెసిడెంట్ చేస్తే , రష్యా కంటే పెద్ద ఆయుధాలు అమెరికాలో ఉన్నాయని బటన్ నొక్కొచ్చు. అప్పుడు మనమే వారి టార్గెట్ అవుతాం" అని రైట్ తెలిపారు.

సీఎన్డీ
ఫొటో క్యాప్షన్, సఫోల్క్‌లోని ఆర్ఏఎఫ్ లేకెన్‌హీత్ వద్ద అణు నిరాయుధీకరణ క్యాంపెయిన్ (సీఎన్డీ) సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు

అయితే, డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన 24 గంటల్లో యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగిస్తానని గతంలో చెప్పారు. కానీ, ఎలా అనేది వివరించలేదు.

యుక్రెయిన్‌కు అమెరికా మద్దతు తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

న్యూక్లియర్ క్లబ్‌లో చేరిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ కూడా అణు యుద్ధం భయాన్ని సృష్టించారు. అణ్వాయుధ సామర్థ్యమున్న క్షిపణులను పరీక్షించి అమెరికాను చేరుకోగలనని గొప్పగా చెప్పుకున్నారు కిమ్.

ఒక శాస్త్రీయ పరిశోధన కార్యక్రమంలో భాగంగా బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్ మాజీ సభ్యుడు, డూమ్స్‌డే క్లాక్ సలహాదారు సిగ్ హెకర్ ఉత్తర కొరియా అణు కేంద్రాలను ఏడుసార్లు సందర్శించారు.

ఇప్పటికి 50 నుంచి 60 అణు వార్‌హెడ్‌లు ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.

"అణ్వాయుధాలు, అణు ఉగ్రవాదం, అణ్వాయుధాల వ్యాప్తి.. ఇవన్నీ తప్పు దిశలో వెళుతున్నాయి" అని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)