టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎందుకు వివాదాస్పదమైంది

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉపాధ్యాయురాలు (ఫైల్ ఫొటో)
    • రచయిత, బళ్ల సతీష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం, పేపర్లు దిద్దడం లాంటి చదువులకు సంబంధించిన పనులు చేయాలి తప్ప ఇతరత్రా పనుల్లో వారి జోక్యం ఉండకూడదు. తద్వారా వారి పూర్తి దృష్టి పిల్లల చదువులపై మాత్రమే ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్నికలు విధులకు ప్రభుత్వ టీచర్లను దూరంగా ఉంచాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పార్టీకి నాయకులు పలు సందర్భాల్లో పైకి చెప్పిన కారణం ఇదే.

అంతేకాదు, వాస్తవానికి చాలా ఉపాధ్యాయ సంఘాలు సుదీర్ఘ కాలంగా చేస్తోన్న డిమాండ్ కూడా ఇది.

‘‘టీచర్లు పాఠాలు చెప్పడం వంటి అకడమిక్ పనులకు పరిమితం కావాలి. వారిని ఎన్నికల విధులు, జనాభా లెక్కలు, ఇలా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకూ వాడుతుంటే వారి ఫోకస్ చదువులు-విద్యార్థులపై ఉండదు. కాబట్టి టీచర్లకు వేరే విధులు ఇవ్వకూడదు’’ ఇది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ తరచూ చెబుతోన్న మాట.

మరీముఖ్యంగా ప్రభుత్వ విద్యలో నాణ్యత లోపాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి వచ్చే మొట్టమొదటి సమాధానం కూడా ఇదే.

ఆంధ్రప్రదేశ్

విద్యా హక్కు చట్టంలో ఏముంది?

2009 నాటి విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం, జనాభా లెక్కలు, శాసన సభలు, పార్లమెంటు ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, విపత్తు సాయం, తప్ప మరే పనులకూ ఉపాధ్యాయులను ఉపయోగించుకోకూడదు. అయితే, ఆ చట్టానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ నిబంధనలు -2010ని ఇటీవల వైఎస్సార్సీపీ ప్రభుత్వం సవరించింది.

ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం పెట్టేలా మార్పులు చేసింది.

ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు కోరుకున్నదే ఆంధ్రలో జగన్ చేశారు కదా.. మరి ఇక వివాదమెందుకు?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఆ వ్యవస్థలోని సచివాలయ ఉద్యోగులకు ఈ ఎన్నికల విధులు అప్పగించాలని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది.

ఓటర్ల జాబితా సవరణకు కూడా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవడం ఈ వాదనకు బలం చేకూర్చింది.

ఎందుకంటే, ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించినా వారికి సిబ్బందిని కేటాయించేది రాష్ట్రప్రభుత్వమే కాబట్టి, టీచర్లను ఎన్నికల విధులకు పంపనక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం తలచింది.

జనాభా లెక్కల నుంచి కూడా టీచర్లను మినహాయించాలని భావించింది.

ఆ మేరకు 2022 నవంబర్ 29వ తేదీన జీవో 185 కూడా ఇచ్చింది.

అన్ని ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని వాడుకున్న తరువాత, ఇంకా అవసరం ఉంటేనే టీచర్లను వినియోగించుకోవాలని జీవోలో స్పష్టంగా రాశారు.

కానీ, ఎన్నికల సంఘం మాత్రం తమకు టీచర్లే కావాలని తేల్చి చెప్పింది.

జిల్లాల వారీగా ఎన్నికల డ్యూటీకి అందుబాటులో ఉన్న టీచర్ల జాబితా పంపమని ఇప్పటికే కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు (ఫైల్ ఫొటో)

టీచర్లే ఎందుకు?

ఎన్నికల విధులు చాలా జాగ్రత్తగా నిర్వహించాలి . చిన్న టిక్కు పెట్టడంలో తేడా వచ్చినా, సీల్ వేయడంలో తేడా వచ్చినా ఉద్యోగాలు పోవడంతోపాటు జీవితాంతం కేసులు ఎదుర్కోవాలి.

అందుకే ప్రతి దశలోనూ అత్యంత జాగ్రత్తగా నిబంధనల ప్రకారం ఎన్నికలు ప్రక్రియ చేస్తారు.

కొన్ని దశాబ్దాలుగా పోలీసు, రెవెన్యూ, ఉపాధ్యాయులు – ఈ మూడు శాఖల వారు ఎన్నికల విధులు నిర్వహించడంలో ఆరితేరారు.

ప్రతి ఎన్నికల ముందూ వారందరికీ శిక్షణ ఇస్తారు. అయినప్పటికీ, శిక్షణ లేకుండా ఇప్పటికిప్పుడు డ్యూటీకి పంపినా ఎన్నికలు డ్యూటీ సక్రమంగా చేయగలిగినంత అనుభవం వేల మంది టీచర్లు, రెవెన్యూ సిబ్బందికి వచ్చేసింది.

అసెంబ్లీ, లోక్ సభతో పాటు మునిసిపల్, పంచాయితీ, జెడ్పీ ఎన్నికలు నిర్వహించే అనుభవం వారికి ఉంది. అందుకే ఎటువంటి పొరపాటు జరగకుండా ప్రతీ ఎన్నికలకూ ఈ రెవెన్యూ, టీచర్ వ్యవస్థలను వాడుకుంటుంది ఎన్నికల సంఘం. అందుకే ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ బూత్ ఇంచార్జులుగా టీచర్లనే నియమిస్తారు.

Nara Lokesh

ఫొటో సోర్స్, TELUGUDESAMPARTYOFFICIAL/YT

జగన్ టీచర్లను ఎందుకు వద్దనుకుంటున్నారు?

ప్రభుత్వం బోధన కాని ఇతర విధుల నుంచి టీచర్లను తప్పించాలనుకుంటున్నట్టు, తద్వారా చదువులపై ఫోకస్ పెంచాలనుకుంటున్నట్టు చెబుతోంది.

అయితే, ఇది పైపైకి చెప్పే కారణమేననీ, అసలు గుట్టు వేరే ఉందనీ ప్రతిపక్షాలు అంటున్నాయి.

‘‘కేవలం ఎన్నికల విధులే బోధనేతర పనులా? ఎన్నికలకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల దగ్గర కాపలా కాయడానికి, మరుగుదొడ్ల ఫోటోలు తీయడానికి, సీఎం టూర్లు ఉంటే ఆ జనాలను తీసుకెళ్లే బస్సులకు కాపలా కాయడానికీ పనికొస్తారా?’’ అని ప్రశ్నిచారు లోకేశ్.

ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తితో ఉన్న టీచర్లు, ఎన్నికల విధుల్లో ఉంటే తమకు నష్టం జరుగుతుందనే భయం వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉందని ఆయన ఆరోపించారు.

నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలవడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆ పార్టీకి ఓట్లేశారని విశ్లేషకులు చెప్తారు.

సీపీఎస్ రద్దు చేయడం అనే ప్రధాన డిమాండ్ జగన్ ఎన్నికలు ముందు ఇచ్చారు. కానీ తరువాత అమలు చేయలేకపోయారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడ కేంద్రంగా భారీ నిరసన చేపడితే, ప్రభుత్వం ఆ నిరసన జరగకుండా కఠినంగా వ్యవహరించింది. టీచర్లను అష్టదిగ్బంధం చేశారు.

ఒక రకంగా రాష్ట్ర డీజీపీ బదిలీకి కూడా ఆ నిరసన కారణమైంది.

ఆ తర్వాతి నుంచి ఉపాధ్యాయులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం మధ్య గ్యాప్ వచ్చినట్టు చెబుతారు. దానికి తోడు సీపీఎస్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉపాధ్యాయుల్లోనే ఎక్కువ ఉన్నారు. ఇక వైద్యం రీఎంబర్సుమెంటు, పీఎఫ్ సమస్యలు కూడా వారిని వేధిస్తున్నాయి. దీంతో ఇంత అసంతృప్తితో ఉండే టీచర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని వైఎస్సార్సీపీ భావించిందని చెబుతారు.

ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ వైఖరిపై భిన్నవాదనలు

ముందు నుంచీ ఈ బోధనేతర విధులు వద్దనే విషయాన్ని డిమాండ్ చేసిన ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ నిర్ణయం మంచిదంటూనే, దాని వెనుక అసలు ఉద్దేశాలు వేరని వ్యాఖ్యానిస్తున్నారు.

‘‘మేం ఎప్పటి నుంచో కోరుకుంటున్నది ఇదే. కానీ ప్రభుత్వం ఉద్దేశం వేరే. మమ్మల్ని కేవలం ఎన్నికల విధుల్లోంచి తప్పించేస్తే సరిపోదు. ఎప్పుడో ఒకసారి వచ్చే ఎన్నికల విధుల వల్లే జరిగే నష్టం కంటే రోజూవారీగా చేసే బోధనేతర విధుల వల్ల ఎక్కు నష్టం జరుగుతోంది.

ఉదాహరణకు, ప్రతిరోజూ పాఠాలు చెప్పడం కాకుండా నాడు - నేడు పనుల పర్యవేక్షణ, టాయిలెట్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన నిర్వహణ, అనేక రకాలు.. అంటే ఒకట్రెండు కాదు పదుల సంఖలోని ప్రభుత్వ యాప్‌లలో డేటా అప్లోడ్ చేయడం.. ఇలాంటి పనులు రోజుకు కొన్ని గంటల సమయం తినేస్తున్నాయి.

ఇదంతా పిల్లలపై అకడమిక్‌గా శ్రద్ధ పెట్టాల్సిన సమయం కదా? వాటిని తప్పిస్తే అప్పుడు పాఠాలపై శ్రద్ధ పెట్టి ఫలితాలను చూపించగలం. అంతేకానీ, ఎప్పుడో ఒకసారి చేసే ఎన్నికల డ్యూటీలను మాత్రమే తప్పించినంత మాత్రాన మామీద ఒత్తిడి తగ్గించినట్టు కాదు కదా?’’ అని బీబీసీతో అన్నారు అనంతపురానికి చెందిన గవర్నమెంటు టీచర్ శ్రీనివాసులు.

బోధనేతర విధుల నుంచి తప్పించాలనుకున్న ప్రభుత్వం, నాడు - నేడు డబ్బు మొత్తాన్ని స్కూల్ హెచ్ఎంల ద్వారానే ఖర్చు పెట్టించిందనీ, అది చాలా పెద్ద పని అని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం అన్ని విషయాలకూ అమలు చేయాలని కేవలం ఎన్నికలకు మాత్రమే కాదనేది వారి వాదన.

అయితే, ఈ వాదనను వైఎస్సార్ కాంగ్రెస్ తప్పు పడుతోంది. ‘‘ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చేసింది. నాడు నేడు కింద వేల కోట్లు ఖర్చు పెట్టాం. టీచర్ల మీద ఒత్తిడి ఉండకూడదనే ఎన్నికలు విధుల నుంచి తప్పిస్తున్నాం. స్కూళ్లు మెరుగుపరిచింది జగనన్న ప్రభుత్వం, ఇక చదువులు మెరుగు పరచాలి అని ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాల్లో కూడా వంకలు వెతకడం ప్రతిపక్షాలకే చెల్లింది. దశాబ్దాలుగా తమకు ఎలక్షన్ డ్యూటీల వంటివి వద్దు మొర్రో అన్న ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు ఇలా మాట్లాడడం ఆశ్చర్యకరం. జగన్‌మోహన్ రెడ్డి గారి విజయానికీ, ఈ ఎన్నికల విధులకూ ఏ సంబంధం లేదు’’ అని బీబీసీతో అన్నారు వైఎస్సార్సీపీ నాయకులు పాటి శివ కుమార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)