వైఎస్ జగన్‌పై కోడికత్తి దాడి కేసులో అయిదేళ్ళు దాటినా నిందితునికి బెయిల్ ఎందుకు రాలేదు... జైల్లో నిరాహారదీక్ష ఎందుకు చేస్తున్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీద 2018లో దాడి చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో జైలులో ఉన్న జనుపెల్ల శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) ప్రస్తుతం జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు.
శ్రీను కొన్నేళ్లుగా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. శ్రీను బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు.
“సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, లేదా ఎన్వోసీ ఇచ్చి న్యాయం చేయాలి” అంటూ కోడికత్తి శ్రీను, ఆయన కుటుంబ సభ్యులు జనవరి 18న నిరాహార దీక్షకు దిగారు. శ్రీను తల్లి సావిత్రమ్మ, అన్న సుబ్బరాజు విజయవాడలో దీక్ష చేపట్టారు.

నాడు ఏం జరిగింది?
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి చేశారు. ఆ దాడిలో జగన్ ఎడమ భూజానికి గాయమైంది. ఆ రోజుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 294వ రోజుకు చేరుకుంది. విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆ విమానాశ్రయం క్యాంటీన్‌లో పని చేస్తున్న జనుపెల్ల శ్రీనువాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కత్తితో దాడి చేశారు.
భుజం గాయంతో జగన్ అలాగే హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్‌లోనే తన గాయానికి చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో జనుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. సంఘటన స్థలంలోనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి కోడి పందేలలో వాడే కత్తిగా పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ కేసు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కోడికత్తి అనే పదం వాడటంతో ఈ కేసు కోడికత్తి కేసుగా, ఈ కేసులో ముద్దాయిగా ఉన్న జనుపెల్ల శ్రీనివాసరావు కోడికత్తి శ్రీనుగా ప్రాచుర్యం పొందారు.
2019 జనవరి 1న ఈ కేసును ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిఫార్సుతో ఎన్‌ఐఏకి బదిలీ చేశారు. RC-01/2019/NIA/HYD నెంబర్‌తో ఈ కేసు రిజిస్టర్ చేశారు. విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ లభించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ వేసిన పిటిషన్‌ని కోర్టు అంగీకరించడంతో రెండు నెలల తర్వాత ఆగస్ట్ 13న నిందితుడు మళ్లీ జైలుకి వెళ్లారు. అప్పటి నుంచి రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం జైలులో ఉన్న శ్రీనివాసరావును 2023 సెప్టెంబర్ 6న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

ఫొటో సోర్స్, B. venkatrao
ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాని జగన్
ఈ కేసులో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నది ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కావడంతో బాధితుడి వాంగ్మూలం లేకుండా బెయిలు ఇచ్చే అవకాశం లేదని న్యాయవాదులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్వయంగా కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని చెప్పాలి. లేదంటే, ఈ కేసు విషయంలో తనకు, గవర్నమెంట్‌కు ఎటువంటి ఆసక్తి లేదని చెప్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని న్యాయవాది ముప్పాల సుబ్బారావు బీబీసీతో అన్నారు. లేని పక్షంలో ఈ కేసు ఎప్పటికీ తేలే అవకాశం లేదని, కోడికత్తి శ్రీనుకు బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదని చెప్పారు.
ఈ కేసులో జైల్లో జీవితం గడుపుతున్న కోడికత్తి శ్రీనుకు బెయిల్ పొందడం కోసం శ్రీను కుటుంబ సభ్యులు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా, అవకాశం దక్కలేదని, దీంతో ఏం చేయాలో తెలియక దీక్షలకు దిగినట్లు కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు బీబీసీతో చెప్పారు.
ఎస్సీలపై పెట్టిన కేసుల్లో 19 కేసుల్ని కొట్టివేస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు ఇచ్చారని, తన కేసును కూడా అలాగే కొట్టేయాలని శ్రీనివాసరావు కోరుతున్నాడని దళిత సంఘాలు అంటున్నాయి. లేదా శ్రీను బెయిల్ పొందేందుకు అవకాశం కల్పించే విధంగా సీఎం జగన్ కోర్టుకు హాజరుకావాలంటూ డిమాండ్ చేస్తూ విశాఖ సెంట్రల్ జైల్ వద్ద నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, B. VenkatRao
‘‘ఈ కేసు రాజకీయాలతో ముడిపడటంతో దీన్ని పెద్దదిగా చూస్తున్నారు. కానీ, తీవ్రత దృష్ట్యా ఈ కేసు చిన్నదే. కాకపోతే ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో ఉంది. దీంతో ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు’’ అని న్యాయవాది ముప్పాల సుబ్బారావు బీబీసీతో చెప్పారు.
“ఈ కేసు విషయంలో ముద్దాయి కోడికత్తి శ్రీను ఇప్పటికే ఐదేళ్లకు పైగా శిక్ష అనుభవించారు. ఈ కేసులో ఆయనకు శిక్షపడినా ఏడు నుంచి పదేళ్ల లోపే ఉంటుంది. సగం కంటే ఎక్కువ శిక్ష ఇప్పటికే ఆయన అనుభవించారు. సీఎం జగన్ ఈ కేసు విషయంలో ఇప్పటికైనా కోర్టుకు హాజరై తన వాంగ్మూలన్ని ఇస్తే సరిపోతుంది. సీఎం జగన్ కోర్టుకు వస్తే కోడికత్తి శ్రీనుకు బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే అతడు ఎంత కాలమైనా జైల్లోనే ఉంటాడు” అని ముప్పాల సుబ్బారావు వ్యాఖ్యానించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీను బెయిల్ పొంది బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే అది తనకు, తన పార్టీకి ఎన్నికల్లో నష్టం చేస్తుందేమోనని సీఎం జగన్ భయపడుతున్నట్లుగా న్యాయవాది సుబ్బారావు అన్నారు.
“కారణాలు ఏవైనా ఒక వ్యక్తిని ఇంత కాలం ఎటువంటి వాదనలు వినకుండా జైల్లో ఉంచడం రూల్ ఆఫ్ లాకి విరుద్ధం. ఇలా చేస్తే చట్టం ముందు అందరూ సమానమే అనే భావన తగ్గిపోతుంది. బెయిల్ పొందడం ఒక హక్కు. దీన్ని దక్కకుండా చేయడం రాజ్య హింస కిందే చూడాలి” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, B. VenkatRao
జైల్లో దీక్ష విరమించారా? లేదా?
దీక్ష చేస్తున్న సావిత్రమ్మ, సుబ్బరాజుల ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం పోలీసులు వారి దీక్షను భగ్నం చేసి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిని పరామర్శించందుకు టీడీపీ నాయకులు బొండా ఉమా, మాజీ ఎంపీ హర్షకుమార్, సీపీఐ రామకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ కూడా వీరిద్దరూ దీక్షని కొనసాగిస్తుండటంతో వారిని వారించి, దీక్షను విరమింప చేశారు.
“త్వరలోనే తమ సోదరునికి న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే దీక్షను విరమించుకున్నాం. కోర్టుల ద్వారా మా న్యాయ పోరాటం సాగుతుంది. కొద్ది రోజుల్లోనే జగన్ మెహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తారని ఆశిస్తున్నాం” అని కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు బీబీసీతో చెప్పారు. జైల్లో తమ సోదరుడు దీక్ష కొనసాగిస్తున్నాడో లేదో తమకు తెలియదని తెలిపారు.
“ఈ కేసులో శిక్ష పడినా మూడేళ్లే పడుతుందని న్యాయవాదులు చెప్తున్నారు. కానీ ఆయన ఐదేళ్ల నుంచి జైల్లో ఉన్నారు. ఇప్పటికైనా కోడికత్తి శ్రీను కేసులో సీఎం జగన్ కోర్టుకు హజరై వాంగ్మూలం ఇవ్వాలి” అని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.
“తల్లి, సోదరుడు దీక్ష విరమించుకున్నారనే విషయం జైల్లో దీక్షలో ఉన్న శ్రీనుకు తెలియజేశాం. అతడు కూడా దీక్ష విరమించుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆహారం తీసుకుంటున్నాడు. అతడికి రోజూ వైద్య పరీక్షలు చేస్తున్నామని ఆరోగ్యం నిలకడగానే ఉందని’’ బీబీసీతో చెప్పారు విశాఖ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. కిషోర్ కుమార్.
జైలు సూపరింటెండ్‌తో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బీబీసీ మాట్లాడింది.
కోడికత్తి శ్రీను దీక్ష చేపట్టాడనే విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘం నేతలు సెంట్రల్ జైల్లో అతడిని ములాఖత్‌లో కలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే జైలు అధికారులు వారికి అవకాశం ఇవ్వలేదు.
‘‘దీక్షలో ఉన్న కోడికత్తి శ్రీను ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తాయి. విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) తరపున మళ్లీ ములాఖత్ ప్రయత్నం చేశాం. దీక్షలో ఉన్న వ్యక్తులను కలవడం జైలు నిబంధనల ప్రకారం కుదరదని జైలు అధికారులు చెప్పారు. కానీ ఏవేవో కారణాలు, కాగితాలు, అనుమతులు అంటూ ఉదయం నుంచి మమ్మల్ని తిప్పి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ములాఖత్ ఇచ్చారు. శ్రీనును కలిసేందుకు అతడి న్యాయవాది జె. శరత్ కుమార్ వెళ్లారు’’ అని బీబీసీతో విదసం కన్వీనర్ బూసి వెంకట్రావు చెప్పారు.
కోడికత్తి శ్రీనును ములాఖత్‌లో కలిసిన న్యాయవాది జె. శరత్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.
“శ్రీనును ఒక కానిస్టేబుల్, ఒక ఖైదీ మోసుకుంటూ నా దగ్గరకు తీసుకుని వచ్చారు. చాలా నీరసంగా ఉన్నారు. అతడు దీక్షను కొనసాగిస్తున్నట్లు నాతో చెప్పారు” అని శరత్ కుమార్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, B. VenkatRao
హైకోర్టులో రేపు విచారణ
కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలైంది. కోడికత్తి శ్రీను తరఫున సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు.
కోడికత్తి శ్రీను జైల్లో దీక్ష చేయడంతో పాటు అతడి తల్లి, సోదరుడు విజయవాడలో దీక్ష చేయడం వంటి పరిణామాలను కోడికత్తి శ్రీను తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ లేకుండా జైలులో శ్రీను మగ్గుతున్నారని కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకొచ్చారు. న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. రేపు (23.01.24) జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
ఈ విషయం మీద స్పందన కోసం కొందరు వైసీపీ నేతలను సంప్రదించగా వారు స్పందించడానికి నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










