కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యునా కు
- హోదా, బీబీసీ కొరియన్
మీరు కుక్క మాంసం తింటారా? దక్షిణ కొరియాకు వెళ్లే విదేశీయులు అడిగే అత్యంత వివాదాస్పద ప్రశ్నలలో ఇది ఒకటి.
అయితే ఏ వయసు వ్యక్తిని అడిగారనే దానిపై మీకొచ్చే జవాబు ఉంటుంది.
"నాకు చెప్పి చెప్పి విసుగేస్తోంది, నేను తిననని ప్రతిసారీ చెబుతూనే ఉండాలి. కొరియాలో కుక్క మాంసం వంటకాలు ఎక్కువగా వృద్ధుల కోసం చేస్తారు. అయితే, విదేశీయులు తరచుగా ఇలాంటి ప్రశ్నే అడుగుతారు" అని ప్రస్తుతం జర్మనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల పార్క్ యున్-క్యోంగ్ అనే కన్సల్టెంట్ చెప్పారు.
ఈ ప్రశ్న ఇబ్బందికరంగా ఉంటుందని పార్క్ అంటున్నారు.
‘ఈ ప్రశ్న ప్రతికూల అర్థాన్నిస్తుంది. కొరియన్లు తినకూడనిది ఏదో తింటారనేలా... ఈ సంస్కృతి అనాగరికం అనేలా సూచిస్తుంది" అని పార్క్ అన్నారు.
కానీ ఇలాంటి ప్రశ్నలకు ఇక కాలం చెల్లింది. ఎందుకంటే 2027 వరకు కుక్కలను మాంసం కోసం పెంచడం, మాంసం అమ్మేవారికి వాటిని విక్రయించడాన్ని నిషేధిస్తూ దక్షిణ కొరియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఇది శతాబ్దాల నాటి ఆచారాన్ని(కుక్క మాంసం తినడం) అంతం చేసే అవకాశముంది.

ఫొటో సోర్స్, Getty Images
కుక్క మాంసాన్ని ఎందుకు తింటున్నారు?
చారిత్రకంగా చూస్తే కొరియాలో ఆవులకు అత్యంత విలువ ఇచ్చేవారు. 19వ శతాబ్దం చివరి వరకు వాటిని వధించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ కొరియన్ స్టడీస్‌లో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జూ యంగ్-హా అన్నారు.
కాబట్టి, మనిషికి తినడానికి ఇతర ప్రోటీన్‌లు అవసరం. కొరియన్ ద్వీపకల్పంలో కొంతమంది కుక్క మాంసాన్ని మంచి ఆహారంగా భావించేవారు. ఆయా తరగతుల ప్రజలు వీటిని ఇష్టపడినప్పటికీ దానిని వద్దనే వారూ ఉన్నారు.
ఇతర రకాల మాంసాల్లో ప్రజలకు ఇష్టమైన వంటకాలున్నట్లే దక్షిణ కొరియాలో కూడా కుక్క మాంసంతో చేసిన ప్రసిద్ధ వంటకాలు ఉన్నాయి.
ఒక వంటకాన్ని "బోసింటాంగ్" అని పిలుస్తారు, ఇది కుక్క మాంసంతో చేసిన సూప్. కుక్క మాంసం ముక్కలను ఉడకబెట్టి తినడం మరొకటి. ఈ వంటకాలు కొరియాలోని కొంతమందికి బాగా నచ్చాయి.
పాతకాలం నాటి దక్షిణ కొరియన్లతో మాట్లాడితే చాలామంది ఇప్పటికీ దాని రుచిని కీర్తిస్తారు. వేసవిలో దీనిని జీర్ణం చేసుకోవడం సులభమని, శక్తిని పెంచుతుందనీ అంటారు.
ఒలింపిక్స్ సమయంలో కొరియాకు షాక్
1988 సియోల్ ఒలింపిక్స్ సమయంలో ఇది చాలామందికి షాక్ ఇచ్చింది. అంతకుముందు వరకు దక్షిణ కొరియా అంత పెద్ద అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు లేవు.
ఆ సమయంలో కుక్క మాంసం వినియోగంపై విమర్శలు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా అది ముఖ్యాంశంగానూ మారింది.
"ప్రారంభంలో చాలామంది ప్రజలు ముఖ్యంగా సామాజిక ప్రముఖులు కుక్క మాంసం వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇతర సంస్కృతులను అగౌరవపరచడమే అన్నారు.
కాలక్రమేణా చాలామంది ప్రజలు కుక్క మాంసం వినియోగాన్ని అవమానంగా భావించారు, విమర్శించడమూ మొదలుపెట్టారు" అని ప్రొఫెసర్ జూ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా ఇప్పుడెలా ఉంది?
మూడు దశాబ్దాల తర్వాత దక్షిణ కొరియా చాలా భిన్నమైన దేశంగా మారింది. కుక్క మాంసం తినే వాళ్లు తగ్గిపోయారు.
గాలప్ పోల్ ప్రకారం గత 12 నెలల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే కుక్క మాంసాన్ని తిన్నారు. 2015లో అది 27 శాతంగా ఉండేది.
'కొరియన్ అసోసియేషన్ ఆఫ్ ఎడిబుల్ డాగ్' అందించిన గణాంకాలు కూడా దీనినే సూచిస్తున్నాయి.
దక్షిణ కొరియాలో ఇప్పుడు దాదాపు 3,000 కుక్కల పెంపకం కేంద్రాలు ఉన్నాయి, అయితే 2010 ప్రారంభంలో వాటి సంఖ్య పదివేలు.
అయితే ఈ గణాంకాలు మరీ ఎక్కువగా ఉన్నాయని, తాజా లెక్కల ప్రకారం కేవలం 1,100 కేంద్రాలు మాత్రమే ఉన్నాయని 'కొరియన్ అసోసియేషన్ ఆఫ్ ఎడిబుల్ డాగ్' తెలిపింది.
కొన్నేళ్లుగా పెంపుడు జంతువులను పెంచేవారు ఎక్కువయ్యారు. వ్యవసాయం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 ప్రకారం దక్షిణ కొరియాలో ప్రతి నలుగురిలో ఒకరికి పెంపుడు జంతువులున్నాయి.
2023 డిసెంబరులో మొదటిసారిగా బేబీ బగ్గీలను మించి పెట్ స్ట్రోలర్స్ అమ్ముడయ్యాయి. అయితే ఇది దక్షిణ కొరియా తగ్గుతున్న జనన రేటుకు ప్రతిబింబం కూడా కావచ్చు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీలు ఆరు కుక్కలు, ఐదు పిల్లులను పెంచుకుంటున్నారు.
దశాబ్దాల క్రితం నుంచి దక్షిణ కొరియాలో కుక్క మాంసం వ్యాపారంపై నిషేధం విధించడానికి ప్రయత్నాలు జరిగినా సఫలం కాలేకపోయారు. అయితే, తాజా ప్రభుత్వానికి ఈ చట్టం తీసుకురావడానికి రెండేళ్లు పట్టింది.
గత పాలకులు ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించినపుడు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ కొత్త చట్టం ప్రకారం వచ్చే మూడేళ్లలో కుక్క మాంసం వ్యాపారం చేస్తే జరిమానా లేదా జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కుక్క మాంసం తినడాన్ని మాత్రం నిషేధించలేదు.

ఫొటో సోర్స్, AFP
'వేధింపులను ఆపడానికి ఉత్తమ మార్గం'
కొరియన్ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేఏడబ్ల్యూఏ) అధినేత జో హీ క్యుంగ్, దాని కార్యకర్తలు ఈ చట్టాన్ని స్వాగతించారు.
జో హీ క్యుంగ్ 1990ల చివరి నుంచి కుక్క మాంసం అమ్మకాలను నిషేధించాలని ప్రచారం చేస్తున్నారు.
కుక్కలపై వేధింపులను ఆపడానికి నిషేధమే ఉత్తమ మార్గమని జో హీ క్యుంగ్ చెప్పారు.
అయితే ఈ చట్టాన్ని అందరూ స్వాగతించడం లేదు. వ్యతిరేకిస్తున్న వారిలో ఈ మాంసం వ్యాపారం జీవనోపాధిగా బతికేవారూ ఉన్నారు.
''చాలామంది కుక్క మాంసాన్ని తినరని తెలుసు. మార్కెట్ తగ్గుతోందనీ తెలుసు. అయినప్పటికీ వ్యాపారాన్ని నిర్వహించడం మా హక్కు" అని కుక్కల పెంపకందారు జూ యోంగ్-బాంగ్ అన్నారు.
ఆయన కొరియన్ అసోసియేషన్ ఆఫ్ ఎడిబుల్ డాగ్ అధ్యక్షుడు కూడా. జంతు హక్కుల కోసం పోరాటం చేయడానికి అనేక విధానాలు ఉన్నాయని ఆయన వాదిస్తున్నారు.
వీరి జాబితాలో చుంగ్నామ్ నేషనల్ యూనివర్శిటీలో మాజీ ఫుడ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ అహ్న్ యోంగ్ గ్యున్ కూడా చేరారు. ఆయనను "డాక్టర్ డాగ్ మీట్" అని కూడా పిలుస్తారు.
దక్షిణ కొరియాలోని అతి కొద్దిమంది కుక్క మాంస పరిశోధకులలో ఒకరైన ఆయన 1988 ఒలింపిక్స్ సమయంలో తన పరిశోధనను ప్రారంభించారు.
కుక్క మాంసం తినడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం ఆయన వాదిస్తున్నారు.
డాక్టర్ అహ్న్ ప్రకారం కుక్క మాంసంలో తక్కువ, అసంతృప్త కొవ్వు పదార్థం ఉంటుంది, బీఫ్, పోర్క్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది.
ఈ చట్టం దేశ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని ఆయన ప్రశ్నించారు.
'ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు?'
"ప్రజలు ఏం తినాలి, తినకూడదని మీరు నిర్దేశించలేరు" అని కుక్కల పెంపకందారు జూ చెప్పారు.
కుక్క మాంసం తినడాన్ని వ్యతిరేకిస్తూ కొత్త చట్టాన్ని స్వాగతిస్తున్న వారిలో కుక్క యజమాని లీ బోరా (30) కూడా ఉన్నారు.
అయితే దానితో వచ్చే చిక్కుల గురించి ఆందోళన చెందుతున్నట్లు లీ తెలిపారు.
"ప్రజలు ఆహారం కోసం కుక్కలను పెంచి, చంపకూడదని కోరుకుంటున్నా" అని అన్నారు.
"అయితే ఇక్కడ కుక్కల పరిస్థితి ఆవులు లేదా పందుల కంటే భిన్నంగా ఏమీ లేదు" అని తెలిపారు లీ బోరా.
ఇవి కూడా చదవండి
- ‘నా నాలుక కోసేశారు’.. ‘హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉండగా నన్ను ఎత్తుకొచ్చి నిర్బంధించారు’.. మానవ అక్రమ రవాణా ముఠా దారుణాలను వివరించిన బాధితులు
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
- పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం: ‘నా కుటుంబం ఒక్కపూట భోజనానికి రూ.1500 కావాలి’
- పాకిస్తాన్ వాఖీ మహిళా గొర్రెల కాపరుల ప్రత్యేకత ఏంటి... వీరు ఎందుకు కనిపించకుండా పోతున్నారు?
- పాకిస్తాన్: కూతురి మార్ఫింగ్ ఫోటోను చూసి పరువు హత్యకు పాల్పడిన తండ్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














