పాకిస్తాన్: కూతురి మార్ఫింగ్ ఫోటోను చూసి పరువు హత్యకు పాల్పడిన తండ్రి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాన్సిస్ మయో& ముహమ్మద్ జుబైర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మార్ఫింగ్ ఫోటోలో తన కూతురి ముఖం ఉందన్న కారణంగా తండ్రే పరువు హత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్న కేసుపై పాకిస్తాన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తన కూతురు, మరో యువకుడితో కలిసి ఉన్న మార్ఫ్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన కారణంగా ఆమె తండ్రి, బంధువు కలిసి కాల్చి చంపినట్లు అధికారులు చెప్తున్నారు.
ఆ యువతి వయసు 18 ఏళ్ళు ఉంటుందని చెప్పినా, ఆ పేరు మాత్రం వెల్లడించలేదు.
హత్యకు గురైన యువతి తండ్రిని అరెస్ట్ చేసినట్లు, బంధువు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
కోహిస్తాన్‌లోని గ్రామీణ ప్రాంతంలో గతవారం జరిగిన ఈ ఘటనలో జిర్గా గిరిజన (కౌన్సిల్) పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆమె తండ్రి, బంధువు కలిసి కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు.
ఆ యువతితోపాటు ఫోటోలో కనిపించిన యువకుడిని కూడా చంపేస్తామంటూ జిర్గా ప్రకటించిన నేపథ్యంలో అతడిని పోలీస్ కస్టడీలో ఉంచి, భద్రత కల్పిస్తున్నారు.
మరో ఇద్దరు యువతీ యువకుల ప్రాణాలు తీస్తామని బెదిరింపులు వచ్చాయి. వారి మార్ఫ్ ఫోటోలు కూడా పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లుగా పోలీసులు చెప్పారు.
ఈ రెండు కేసుల్లో వైరల్ అయిన ఫోటోలు ఫేక్ అని, వాటిని ఫోటోషాప్ చేసి, నకిలీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేసిన వారు ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు పోలీసులు.
స్థానిక అధికారుల రక్షణలో ఉన్న మరో యువతిని న్యాయస్థానం ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుటుంబ సభ్యుల వలన ఎలాంటి ప్రమాదమూ లేదని ఆ యువతి చెప్పడంతో న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.
పర్వత ప్రాంతమైన ఉత్తర ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహిస్తాన్ ప్రాంతంలో సాంప్రదాయిక కుటుంబాల్లో ఈ పరువు హత్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.
కుటుంబ పరువును కాపాడే పేరుతో సొంత కుటుంబ సభ్యులే ఈ హత్యలకు పాల్పడుతున్నారు.
పాకిస్తాన్ మీడియా సంస్థ జియో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం, హత్యకు గురైన యువతి ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. ఈ హత్యలో గ్రామస్తుల ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హత్యను గౌరవంగా భావించే ఆచారం..
కోహిస్తాన్ లాంటి ప్రాంతాల్లో పరువు హత్య అనేది గౌరవానికి ప్రతీకగా నమ్మడం గిరిజన ఆచారాల నుంచి వచ్చిందని చెబుతారు.
మహిళలపై వచ్చిన ఆరోపణల వలన బంధువుల్లో తమ కుటుంబ పరువుకు మచ్చ ఏర్పడుతుందనే భావంతో ఈ హత్యలకు పాల్పడుతున్నారు.
ఈ ఆచారం ప్రకారం తమ కుటుంబంలోని స్త్రీ, తమ కుటుంబంతో సంబంధంలేని వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నా, కలిసి కనిపించినా మొదట ఆ మహిళ ప్రాణాలు తీసి, ఆ తరువాత పురుషుడి ప్రాణాలు తీస్తారు.
బాధిత మహిళలు పెద్దలు కుదిర్చిన వివాహాన్ని తిరస్కరించడం లేదా అత్యాచారానికి గురవడం లేదంటే లైంగికంగా వేధింపులకు గురికావడం వంటివి ఈ పరువు హత్యలకు కారణాలవుతున్నాయని మానవహక్కుల సంఘాలు చెప్తున్నాయి.
ఇవే కాకుండా మహిళల వస్త్రధారణ, ప్రవర్తన సరిగా లేకపోవడం, కుటుంబం నియమాలపట్ల అశ్రద్ధగా ఉండటం వంటి చిన్న చిన్న కారణాలతో కూడా పరువు హత్యలకు పాల్పడుతున్నారు.
ఏటా ఇలా వందలకొద్దీ మహిళలు పాకిస్తాన్‌లో హత్యకు గురవుతున్నారు. అయితే, పురుషుల హత్యలు మాత్రం తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.
2011లో కోహిస్తాన్‌కు చెందిన నలుగురు మహిళలు వివాహ వేడుకలో పాటలు పాడి, చప్పట్లు కొడుతుండగా ఇద్దరు పురుషులు డ్యాన్స్ చేస్తున్న వీడియో దృశ్యాలు పరువు హత్యలకు దారి తీశాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు హత్యకు గురయ్యారు. ఆ తదనంతర పరిణామాల్లో మరో నలుగురు పురుషులను కూడా హత్య చేశారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరువు హత్యలను నిర్మూలించే విధంగా కఠిన చట్టాలు తీసుకురావాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది.
2016లో పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో నిందితులకు జీవితఖైదు తప్పనిసరి చేస్తూ, సవరణలు చేసింది. గతంలో ఇలాంటి కేసుల్లో బాధిత కుటుంబం క్షమాభిక్షను అంగీకరిస్తే, జైలు శిక్షలో మార్పులు చేసే అవకాశం ఉండేది.
అయితే, చట్టంలో మార్పులు చేసినప్పటికీ, హత్యలకు పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకుంటున్నారని మానవహక్కుల సంఘాలు చెప్తున్నాయి.
2016లో తమ కుటుంబ పరువును నాశనం చేస్తోందన్న కారణంతో పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్సర్ ఖండీల్ బలోచ్‌ను ఆమె సోదరుడే హత్య చేశాడు. న్యాయస్థానంలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నందున్న న్యాయస్థానం అతడికి జీవితఖైదు విధించింది.
అయితే, అప్పీల్‌పై గతేడాది నిర్దోషిగా విడుదలయ్యాడు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














