వరదలతో అప్పుల పాలై కూతుళ్లను అమ్ముకొంటున్న రైతులు

బలూచిస్తాన్
    • రచయిత, సహార్ బలూచ్, బీబీసీ ఉర్దూ
    • హోదా, చౌకి జమాలి, బలూచిస్తాన్ నుంచి

‘‘గత ఏడాది వరదలు వచ్చిన సమయంలో నా భార్యకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. బిడ్డ లేదా తల్లి ఇద్దరిలో ఒకరు చనిపోతారని డాక్టర్ చెప్పారు. మూడున్నర లక్షలు అప్పు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయించాను.

ఆ తర్వాత అప్పు కట్టుకుంటూ వచ్చాను. వడ్డీ సహా డబ్బులు తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మూడున్నర లక్షలకు బదులు నేను ఇప్పుడు ఐదు లక్షలు చెల్లించాల్సి వచ్చింది.

ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో కిలోమీటరు దూరంలో నివసిస్తున్న వారికి నా పదేళ్ల కూతుర్ని అమ్ముకున్నాను.’’ - ఈ విషయంబలూచిస్తాన్‌లోని చౌకి జమాలి ప్రాంతానికి చెందిన ఒక కూలీ చేసుకునే వ్యక్తి మాకు చెప్పాడు.

వరదలు వచ్చిన తర్వాత ఏడాదికి ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మేం వెళ్లాం.

గత ఏడాది వరదలు వచ్చిన బలూచిస్తాన్‌లో చాలా ప్రాంతాలను నేను సందర్శించాను.

ఆ సమయంలో బలూచిస్తాన్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిలో చౌకి జమాలి ప్రాంతం ఒకటి.

సాధారణంగా ఇక్కడికి అధికారులెవరూ రారు. కానీ, 2022లో వరదలు వచ్చిన తర్వాత, ప్రభుత్వ సంస్థలు చౌకి జమాలి, ఇతర ప్రాంతాలను సందర్శించాయి.

దీంతో చాలా నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి.

నేను ఇక్కడికి చేరుకున్న తర్వాత, 2022 వరదల తర్వాత చాలా కుటుంబాలు తీవ్ర పేదరికంలో కూరుకుపోయినట్లు తెలిసింది.

దీంతో చాలా మంది తమ కూతుర్లను అమ్ముకుంటోన్న దుస్థితి తలెత్తింది.

సింధ్, బలూచిస్తాన్ సరిహద్దులో చౌకి జమాలి ప్రాంతం ఉంది. ఈ ప్రాంత జనాభా ప్రస్తుతం సుమారు 50 వేలు. ఇక్కడ నివసిస్తున్న వారిలో చాలా మంది రైతులు, రోజువారీ కూలీలే.

2022 వరదల సమయంలో సుమారు 32 లక్షల కుటుంబాలు నిరాశ్రయులైనట్లు మాజీ పర్యావరణ మంత్రి షెర్రీ రెహ్మాన్ బీబీసీకి తెలిపారు.

సింధ్, బలూచిస్తాన్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమైనట్లు చెప్పారు.

1976లో తాము భారీ వరదలను చూశామని, ఆ తర్వాత 2010లో, మళ్లీ 2022లో ఇలాంటి వరదలు పోటెత్తాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

వరదల తర్వాత చౌకి జమాలి పరిస్థితి చాలా దారుణంగా మారింది.

ఈ పరిస్థితితో చాలా మంది ప్రజలు తమ కూతుర్లను బలవంతంగా ఇతరులకు అమ్ముకోవాల్సి వచ్చింది.

తమ కూతుర్ని అమ్మినట్లు ఒప్పుకున్న ఒక పేద కుటుంబం
ఫొటో క్యాప్షన్, తమ కూతుర్ని అమ్మినట్లు ఒప్పుకున్న ఒక పేద కుటుంబం

అప్పుల ఉచ్చులో ప్రజలు

అమ్మాయిలను ఎందుకు అమ్ముకోవాల్సి వస్తోందో ఒక స్కూల్ టీచర్ వివరించారు.

వరదలు వచ్చిన తర్వాత కూడా రైతులు వడ్డీపై అప్పులు తీసుకున్నారు.

అప్పులిచ్చిన వారు వడ్డీపై వడ్డీలేశారు. ఒకవేళ అప్పు చెల్లించకపోతే, వారు చిన్న వయసున్న తమ కూతుళ్లను 40 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి అమ్ముకోవాల్సి వచ్చింది.

ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత వెంటనే 2022లో వరదలు వచ్చాయని, ఇలాంటి ఘటనలు అంతకుముందు కంటే ఎక్కువగా చవిచూడాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.

నేను ఇక్కడ ఒక రోజువారీ కూలీని కలిశాను. ఆయన ఏం చెప్పారంటే, తమ పదేళ్ల కూతుర్ని 40 ఏళ్ల వ్యక్తికి అమ్ముకున్నామన్నారు.

‘‘నేను నిస్సహాయుడిగా మారాను. నా భార్యకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. బిడ్డ బతకలేదు. ఎలాగో అలా భార్యను ప్రాణాలతో కాపాడుకున్నాను. వరదలు వచ్చిన కొద్ది రోజుల తర్వాత, ఒకదాని తర్వాత ఒకటి రోడ్లన్నీ మూసుకుపోయాయి. ఎక్కడా హాస్పిటల్ తెరవలేదు. ఒకవేళ తెరిచినా ఎమర్జెన్సీకి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేదు. ఒకవేళ మార్గం ఉన్నా అక్కడికి వెళ్లేందుకు మా వద్ద డబ్బులు లేవు’’ అని ఆయన తెలిపారు.

‘‘నేనిప్పుడు తీసుకున్న రుణాన్ని ఎలా తిరిగి చెల్లించాలి? ఆ సమయంలో నేను నా కూతురికి వివరించాను. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, తిరిగి మనకు డబ్బులిస్తారని చెప్పాను. అలా నా తల్లికి ఆపరేషన్ చేయొచ్చని, ఔషధాలు అందించవచ్చని వివరించాను’’ అని చెప్పారు.

నేను వెళ్లిన కార్మికుల ఇంట్లో కనీసం ఒకపూట తినేందుకు కూడా ఆహారం లేదు. ఒక్కసారి రోటీ చేసేందుకు కూడా సరిపడ పిండి లేదు.

‘‘మేం వారంలో మూడు రోజులే తింటున్నాం. మిగిలిన నాలుగు రోజులు ఆకలితో పస్తులు ఉండాల్సి వస్తుంది’’ అని ఆ ఇంటి మహిళ చెప్పారు.

40 ఏళ్ల వ్యక్తికి పదేళ్ల కూతుర్ని అమ్ముకున్నారు
ఫొటో క్యాప్షన్, 40 ఏళ్ల వ్యక్తికి తమ పదేళ్ల కూతుర్ని అమ్ముకున్నట్లు చెప్పిన ఒక తండ్రి

‘రూ.3-5 లక్షలకు అమ్ముకుంటున్నారు’

చాలా మంది అమ్మాయిలను మూడు నుంచి ఐదు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు.

ఈ మొత్తాన్ని రైతులు, కూలీలు తమ అప్పులను తిరిగి చెల్లించడం కోసం, వైద్య చికిత్సకు కరాచీకి వెళ్లేందుకు లేదా కొడుకుల చదువులకు ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

‘‘అమ్మాయిలనే ఎందుకు విక్రయిస్తున్నామంటే భవిష్యత్తులో వారు పిల్లల్ని కని ఇవ్వగలరు. అబ్బాయిల నుంచి మాకేమీ లభించదు కాబట్టి వారిని మేం అమ్మం’’ అని ఒక తండ్రి చెప్పారు.

కొంత మంది తమ ఇళ్ల తలుపులనే తెరవలేదు. వారి ఇంట్లో కూతుర్లు లేరని చెప్పారు. వరదల తర్వాత మిగిలిపోయిన వస్తువులను విక్రయించుకుని తమ రుణాలను తిరిగి చెల్లిస్తున్నామన్నారు.

అప్పులు కూడా రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి వ్యవసాయం కోసం కూలీలు అప్పులు చేసి, తక్కువ కూలీకి పనిచేయడం.

ఇక రెండోది వైద్య చికిత్స కోసం, ఇంట్లో ఖర్చుల కోసం తీసుకున్న రుణాలు.

ఈ రెండు పరిస్థితుల్లో కూడా అప్పును తిరిగి చెల్లించేందుకు వారు తమ కూతుర్లను అమ్ముకుంటున్నారు.

బాలికలను రెండు నుంచి మూడుసార్లు అమ్ముతున్న ఘటనలు తలెత్తుతున్నట్లు స్థానిక టీచర్ చెప్పారు.

ఎందుకంటే ఒక దగ్గర అమ్మాయిలు ఇమడలేకపోతే, వెంటనే వారిని మళ్లీ అమ్మేస్తున్నారన్నారు.

వారిని అమ్మేస్తున్నట్లు వినగానే చాలా సార్లు అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోతున్నారు. ఒకవేళ వారికి చెల్లెళ్లుంటే, వారు పారిపోగానే, వారి స్థానంలో చిన్న వారిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.

రైతులు ఎవరి భూమిలో పనిచేస్తారో ఆ భూయజమానులు ఎప్పుడైనా తమ బాలికలపై జినా(వ్యభిచార) ఆరోపణలు చేయొచ్చని, దీంతో తమ పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు తమ బాలికలకు తొందరపడి వివాహం చేస్తున్నారని టీచర్ చెప్పారు.

స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాదియా
ఫొటో క్యాప్షన్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాదియా

‘క్లైమేట్ బ్రైడ్స్’

ఈ పరిస్థితిలో పడుతున్న బాలికలకు ‘క్లైమేట్ బ్రైడ్స్’ అనే పదాన్ని వాడుతున్నారు.

వాతావరణ మార్పులు, వరదలతో వ్యవసాయం నుంచి డబ్బులు సంపాదించడం చాలా కష్టమవుతుందని బలూచిస్తాన్‌లో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ‘మదాద్ కమ్యూనిటీ’ చెప్పింది.

‘‘బలూచిస్తాన్ మధ్యతరగతి వర్గ ప్రజలతో పాటు చాలా మంది బలవంతంగా వలస వెళ్లారు. పేద రైతులు మాత్రం ఎక్కడికి వెళ్లలేక ఇక్కడే ఉండిపోయారు. విపరీతమైన వేడితో భారీ వరదలు లేదా తీవ్ర కరువును ఇక్కడ అంచనావేస్తున్నారు’’ అని ఆర్గనైజర్ మరియమ్ జమాలి చెప్పారు.

వ్యవసాయం చేసే రైతులకు ప్రస్తుతం మరింత కష్టతరమవుతుందన్నారు.

వ్యవసాయోత్పత్తులపై, భూమిపైనే ఆదాయాన్ని నమ్ముకున్న వారికి ప్రతి సీజన్‌లో రాబడి తగ్గుతోంది.

పైగా ఆహార ఉత్పత్తులు సరిగ్గా పండకపోతుండటంతో, వారు తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్నారు’’ అని మరియమ్ తెలిపారు.

తక్కువ ఆదాయాలతో, చౌకి జమాలి గ్రామంలోని ప్రజలు పూట గడిపేందుకు తమ కూతుళ్లను ఇతరులకు అమ్ముకుంటున్నారు.

బలూచిస్తాన్‌లో పేదరికం

13 శాతం పెరిగిన బాల్య వివాహాలు

బాల్య వివాహాలు అంతకుముందు కూడా ఉన్నాయని ఈ ప్రాంతంలో నివసించే వారంటున్నారు.

2022 ఆగస్టులో బలూచిస్తాన్‌లో 14 జిల్లాల్లో సర్వే చేసినట్లు ప్రకృతి సంక్షోభాలను ఎదుర్కొనే ప్రభుత్వ సంస్థపీడీఎంఏ(ప్రొవెన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) తెలిపింది.

ఈ సర్వేలో చిన్న వయసులో పెళ్లిళ్ల కోసం అమ్మాయిలను అమ్ముతున్న ఘటనలు 13 శాతం పెరిగినట్లు వెల్లడైందని చెప్పింది.

చౌకి జమాలి ప్రాంతంలోని ఒక స్కూల్‌కి నేను వెళ్లాను. చిన్న పిల్లలకు పెళ్లి చేసినప్పుడు, ఆ ఇంట్లో వారు ఎదుర్కొంటున్న హింస గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సాదియా చెప్పారు.

‘‘చదువు వల్ల కొంత మార్పు వచ్చింది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఇంకా పిల్లల్ని అమ్ముతూనే ఉన్నారు’’ అని తెలిపారు.

ఈ పాఠశాలకు కాస్త దూరంలో చౌకి జమాలి ఆరోగ్య కేంద్రం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో చనిపోతున్న కేసులు కూడా నమోదవుతున్నాయని చౌకి జమాలి ఆరోగ్య కేంద్రంలో పనిచేసే షాహజాదీ చెప్పారు.

కొన్ని కేసులలో బాలికలు పురిటి నొప్పులను తట్టుకోలేక బాగా ఏడుస్తున్నారని, కొందరు ఇక్కడే చనిపోతున్నారని తెలిపారు.

‘‘అప్పటికీ మేం దీనిపై గట్టి స్వరాన్ని వినిపిస్తున్నాం. మేం ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాం. కానీ, ఈ విషయంలో ఆ బాలికల తల్లులు నోరు విప్పడం లేదు. ఎందుకంటే, అమ్మాయిలను అమ్మే నిర్ణయం ఆ ఇంట్లో పురుషులే తీసుకుంటున్నారు’’ అని షాహజాదీ చెప్పారు.

ఇటీవల తన వద్దకు 16 ఏళ్ల కూతురితో ఒక తల్లి వచ్చినట్లు తెలిపారు.

‘‘వరదల తర్వాత తలెత్తిన కటిక పేదరికంతో వారి 16 ఏళ్ల కూతుర్ని ఒక 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిపారు’’ అని చెప్పారు.

కడుపుతో ఉన్నప్పుడే చనిపోతున్న బాలికలు

కడుపుతో ఉన్నప్పుడే చనిపోతున్నారు

కడుపుతో ఉన్నప్పుడే చనిపోతున్న చాలా మంది బాలికల కేసులు సింధ్, బలూచిస్తాన్‌లలో నమోదవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

అంతేకాక, ఫిస్టులా సమస్య రావడం, గర్భం దాల్చడం కష్టతరంగా మారడం, మూత్రనాళం నుంచి తీవ్ర రక్తస్రావం కావడం వంటి ఘటనలు కూడా బాలికలలో చూస్తున్నామని చెప్పారు.

యూఎన్ఎఫ్‌పీఏలో పనిచేస్తున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాలలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, 2022 వరదల తర్వాత ఈ వివాహాలు మరింత పెరిగాయని తాను గుర్తించినట్లు కరాచీకి చెందిన డాక్టర్ సజ్జద్ బీబీసీకి చెప్పారు.

‘‘కడుపుతో ఉన్న బాలికలు చనిపోతున్న కేసులను నేను చూశాను. తల్లిదండ్రులు వారి వయసును దాచిపెడుతున్నారు. కానీ, వారి మణికట్టు పట్టుకుని చూసినప్పుడు బాలికల వయసు తెలిసిపోతుంది’’ అని అన్నారు సజ్జద్.

ఈ ప్రాంతాల్లో చిన్న వయసులోనే అమ్మాయిలకు వివాహాలు జరుగుతున్న విషయం తమకు ఎంతో కాలంగా తెలుసని, కానీ, 2022 వరదల తర్వాత అమ్మాయిలను అమ్ముతున్న ఘటనలు మరింత పెరిగాయని వెల్లడించారు.

2022 వరదలు

ఫొటో సోర్స్, NAZAR ALI

అంతా తెలిసినా అధికారులు ఎందుకు ఈ పెళ్లిళ్లను ఆపలేకపోతున్నారు?

బలూచిస్తాన్‌లో చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు పెరుగుతూ వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఫౌజియా షాహీన్ చెప్పారు.

‘‘మేం పూర్తి గణాంకాలను ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే, ఈ పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. కానీ, చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని తేల్చి చెప్పారు.

బాల్య వివాహాలను ఆపేందుకు ఎలాంటి సమర్థవంతమైన చట్టం లేదని ఫౌజియా షాహీన్ తెలిపారు.

బాల్య వివాహాల నిరోధక బిల్లును ఆమోదించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఎన్నో దశాబ్దాలుగా బలూచిస్తాన్‌లో ప్రతి అసెంబ్లీ సమావేశాల సమయంలో దీన్ని ప్రవేశపెట్టి, ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు ఈ బిల్లుకు ఆమోదం లభించడం లేదన్నారు.

ఈ పెళ్లిళ్లకు ఏ కారణం చెప్పినా, వరదల వల్ల వచ్చిన నష్టానికి పరిహారంగా బలూచిస్తాన్‌లో చిన్న పిల్లల అమ్మకాలు చేపడుతున్నారన్నది మాత్రం వాస్తవం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)