దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?

ఓ సినిమాలో దేవ్ రతూడి

ఫొటో సోర్స్, DEV RATUDI

ఫొటో క్యాప్షన్, ఓ సినిమాలో దేవ్ రతూడి
    • రచయిత, అసిఫ్ అలీ
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘స్నేహితుడా.. నీరులా ఉండు. నీరులా ఉండటం అంటే అర్థం- ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటికి తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండమని’’ - చైనాలో నటుడిగా విజయవంతమైన భారతీయుడు దేవ్ రతూడి ఈ మాటతో తన కథను మొదలుపెట్టారు.

‘‘బ్రూస్‌ లీ చెప్పిన ఈ డైలాగ్ వల్ల నా జీవితం ప్రత్యేక మలుపు తీసుకుంది. బ్రూస్‌లీ జీవితం ఆధారంగా తీసిన ‘డ్రాగన్’ సినిమా చూశాక నాలో మరో మార్పు మొదలైంది.

బ్రూస్‌ లీని చూసే నేను పోరాట విద్యలు నేర్చుకున్నాను. అవి నాకిప్పుడు పనికొస్తున్నాయి. నా సినిమాల్లో చాలా యాక్షన్ ఉంటుంది. దీంతో నేను నేర్చుకున్న పోరాట విద్యల్ని బాగా ఉపయోగించుకుంటున్నాను.’’

ఇది 46 ఏళ్ళ ద్వారకాప్రసాద్ రతూడి కథ. ప్రపంచానికి ఈయన దేవ్ రతూడిగా తెలుసు. ఉత్తరాఖండ్‌లోని కెమరియా సౌద్ ఈయన స్వగ్రామం.

1998లో ముంబయిలో మొదటిసారి ఈయన కెమెరా ముందు నిలబడినప్పుడు చాలా ఆందోళన చెందారు.

చైనా చిత్ర పరిశ్రమలో తనకు అంత గుర్తింపు లభిస్తుందని దేవ్ ఏనాడూ అనుకోలేదు. ఆయన ఎంతలా పాపులర్ అయ్యారంటే చైనా స్కూలు పాఠ్య పుస్తకాల్లో ఆయన జీవితం ఓ పాఠంగా పిల్లలకు చెబుతున్నారు.

దేవ్ రతూడి ఎదుర్కొన్న సంఘర్షణను ఆయన మాటల్లోనే చదవండి.

భార్య, పిల్లలతో దేవ్ రతూడి

ఫొటో సోర్స్, DEV RATUDI

ఫొటో క్యాప్షన్, భార్య, పిల్లలతో దేవ్ రతూడి

స్కూలు నుంచి ఇంటికి వచ్చే సరికి...

ఇలా తరచుగా జరిగేది.. నేను స్కూలు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తినడానికి ఏమీ ఉండేది కాదు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళందరం కలిపి మేము ఐదుగురం. మా కుటుంబానికి మా నాన్న జీతమొక్కటే ఆధారం. అందుకే పై చదువులు చదవాలన్న నా కోరిక తీరలేదు. పదవతరగతి వరకే చదువుకున్నాను.

పదో తరగతి పూర్తైన తర్వాత 1991లో ఏదైనా ఉద్యోగం చేద్దామని దిల్లీకి వచ్చాను. అక్కడ ఓ పాలకేంద్రంలో పని దొరికింది. జీతం 350 రూపాయలు. అది కూడా దిల్లీలో పని చేసే మా అంకుల్ సిఫార్సు వల్ల వచ్చింది.

కాప్ సహీరాలోని పాలకేంద్రం నుంచి పాలు తీసుకెళ్లి సైకిల్‌పై తిరుగుతూ చుట్టుపక్కల ఊళ్లలో అమ్మేవాడిని. దీని వల్ల ఉద్యోగం పొందడమే కాకుండా సైకిల్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఇలా పాలకేంద్రంలో ఒక ఏడాది పనిచేశాకా, ఒక బిల్డర్ దగ్గర పనికి కుదిరాను.

కొన్నిసార్లు ఆ బిల్డర్ కారు తుడిచేవాడిని, కొన్నిసార్లు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడిని. ఇప్పుడు నా జీతం 500 రూపాయలు. 1993 నుంచి 2004 దాకా 11 ఏళ్ళు బిల్డర్ దగ్గరే పనిచేశాను.

ఆయన కఠినమైన క్రమశిక్షణ కొన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టేది.

చైనా భాషలో దేవ్ రతూడి సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, DEV RATUDI

ఫొటో క్యాప్షన్, చైనా భాషలో దేవ్ రతూడి సినిమా పోస్టర్

యజమానిపై కోపం వచ్చి ఉద్యోగం మానేశా

1998లో నా యజమానిపై బాగా కోపం వచ్చింది, ఉద్యోగం మానేశాను. ‘‘ఏదో ఒక రోజు నేను హీరో అవుతాను చూడు అంటూ వెళ్లిపోయాను.” ఆ సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పింది.

నేను చూసిన మొదటి సినిమా బ్రూస్‌ లీ నటించిన ‘ఎంటర్ ద డ్రాగన్’. బ్రూస్‌ లీ సినిమాలు చూశాక నాకు మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలు ఇంగ్లిష్‌లోకి డబ్ అయ్యేవి. పైగా ఈ సినిమాలలోని ఇంగ్లిష్ స్పష్టంగా, సరళంగా ఉండటంతో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి నాకు అవకాశం దొరికింది. సినిమాలో వేసే సబ్ టైటిల్స్ చదువుతూ ఇంగ్లిష్ నేర్చుకునేవాడిని.

బ్రూస్‌ లీ జీవితకథ ఆధారంగా తీసిన డ్రాగన్ మూవీ బాగా నచ్చింది. బ్రూస్‌ లీ హాంగ్‌కాంగ్ వదిలి అమెరికాకు ఎందుకు వెళ్ళాడో ఆ సినిమాలో చూపించారు. బ్రూస్‌ లీ వెళ్లగా లేనిది నేనెందుకు వెళ్లలేను అని అనుకున్నాను.

ఈ సినిమా చూశాక హీరో కావాలనే మొండి పట్టుదలతో ముంబయి వెళ్ళాను. అక్కడో ఏడాది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను.

ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో దేవ్ రతూడి

ఫొటో సోర్స్, ASIF ALI

ఫొటో క్యాప్షన్, ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో దేవ్ రతూడి

కెమెరా స్టార్ట్ అవగానే అంతా మర్చిపోయాను

1998లో పునీత్ ఇస్సార్ ( కూలీ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఈయనతో ఫైట్ చేస్తూనే గాయపడ్డారు) హిందూస్థానీ అనే టీవీ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తూ కెమెరా ముందు నిలబడి నన్ను ఓ చిన్న డైలాగ్ చెప్పమన్నారు.

ఆ డైలాగ్ ను పదేపదే మననం చేసుకున్నాను. కానీ ఒక్కసారి మొహంపై లైట్ పడి, కెమెరా స్టార్ట్ అవ్వగానే అంతా మరిచిపోయాను. ఏమీ చెప్పలేకపోయాను. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను.

కొన్నిరోజుల తరువాత దిల్లీకి తిరిగొచ్చాను. సినిమాలలో నటించాలనే నా కోరిక నెరవేరలేదు. కానీ ముంబయిలో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించాను.

భార్య, పిల్లలతో దేవ్ రతూడి

ఫొటో సోర్స్, DEV RATUDI

ఫొటో క్యాప్షన్, భార్య, పిల్లలతో దేవ్ రతూడి

దిల్లీలో వెయిటర్ పని నుంచి చైనాలో అడుగు పెట్టే దాకా..

2004లో దిల్లీకి తిరిగొచ్చాక హరియాణా చిత్రం ‘చన్ను ది గ్రేట్’ లో ఆరు నిమిషాలు నిడివి ఉండే సాహసికుడి పాత్రలో నటించే అవకాశం వచ్చింది.

కానీ నా బుర్రలోంచి బ్రూస్‌ లీ పోలేదు. నేను బ్రూస్‌ లీ దేశానికి ఎలా వెళ్లాలి. అక్కడకి వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనేది నా కోరిక. ఆ సమయంలో చైనావాళ్ళందరికీ మార్షల్ ఆర్ట్స్ వచ్చనే భ్రమలో ఉండేవాడిని.

చైనా వెళ్ళడానికి నేను ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య డబ్బు. ఈ సమయంలో నేను చాలా గందరగోళానికి గురయ్యాను. నా స్నేహితుడొకరు తనకు చైనాలో ఓ రెస్టారెంట్ తెలుసని, అక్కడ నాకు పని దొరుకుతుందని చెప్పాడు.

కానీ ఆ ఓనర్ పని వచ్చా అని అడిగినప్పుడు, ‘‘నాకు తెలియదు, కానీ నేర్చుకుంటాను, ఒక్క అవకాశం ఇవ్వండి’’ అని అడిగాను. దిల్లీలోని ఏదైనా రెస్టారెంట్‌లో మూడు, నాలుగు నెలలు పని చెయ్యాలని సలహా ఇచ్చాడు. దీంతో దిల్లీలోని ఓ రెస్టారెంట్లో నెలకు ఐదు వేల రూపాయల జీతంతో వెయిటర్‌గా పనిచేయడం మొదలుపెట్టాను.

దిల్లీలో మూడు నెలలు పనిచేశాక ఓ చైనీస్ రెస్టారెంట్ ఓనర్ వీసా వచ్చేందుకు నాకు సాయం చేశారు. 2005లో చైనాలో అడుగు పెట్టాను.

దేవ్

ఫొటో సోర్స్, DEV RATUDI

చైనా రావడానికి ముందు కొంత మంది స్నేహితులు ‘‘ఇక్కడ బాగానే స్థిరపడ్డావు కదా, చైనా వెళ్ళి ఏం చేస్తావు’’ అంటూ నన్ను ఆపే ప్రయత్నం చేశారు. కానీ నేను చైనా వెళ్లి అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నాను.

నేను హాంగ్‌కాంగ్ కు చేరుకోగానే అక్కడి ఎత్తైన భవనాలు, వీధులు చూసి ఆశ్చర్యపోయాను. అక్కడి నుంచి షెన్‌జన్‌కు హై స్పీడ్ మెట్రో రైల్లో ప్రయాణించాను. ఇక్కడే నేను ఓ పంజాబీ రెస్టారెంట్‌లో పనిచేయడం మొదలుపెట్టాను. ఇక్కడ దాదాపు ఏడాదిన్నర కాలం పనిచేశాను.

ఆ సమయంలో నేను కనిపించినవారినల్లా మార్షల్ ఆర్ట్స్ నేర్పమని అడిగేవాడిని. నేను అడిగిన వాళ్లంతా నువ్వు మాకు యోగా నేర్పు అని అడిగేవారు. నాకు యోగా తెలియదంటే, మాక్కూడా మార్షల్ ఆర్ట్స్ తెలియవనేవారు. చైనాలో అందరికీ మార్షల్ ఆర్ట్స్ తెలుసనే నా భ్రమ చాలా కాలానికి పటాపంచలైంది.

సినిమా ఛాన్స్ మళ్లీ వచ్చినప్పుడు కాళ్లు వణికాయి

పంజాబీ రెస్టారెంట్‌లో రెండేళ్ళు పనిచేశాక బీజింగ్‌లోని ఓ జర్మన్ రెస్టారెంట్‌లో ఉద్యోగం దొరికింది. 2010లో బీజింగ్‌లోని అమెరికన్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్ గా పనిచేయడం మొదలుపెట్టాను. నా సంపాదన బావుండటంతో రెస్టారెంట్ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాను.

చైనా ప్రజలకు భారతీయ ఆహారం గురించి పెద్దగా తెలియదు. అందుకే జీయాన్ నగరంలో 2013లో ‘ది రెడ్‌ ఫోర్ట్’ రెస్టారెంట్ ప్రారంభించాను. దీనిని అందరు మెచ్చుకునేవారు. దీంతో రెండేళ్ళ వ్యవధిలోనే ఆరు రెస్టారెంట్స్ ప్రారంభించాను.

2015లో థాన్ అనే చిత్రదర్శకుడు నా రెస్టారెంట్‌కు వచ్చి అక్కడో సినిమా షూట్ చేయాలనుకుంటున్నానని, నాకూ ఓ చిన్నపాత్ర ఉందని చెప్పారు.

ఇందులో కథానాయకుడిని ప్రధాన ద్వారం నుంచి తీసుకువచ్చి ఓ టేబుల్ ముందు కూర్చోపెట్టి భారతీయ ఆహారం గురించి మాట్లాడాలి. దీంతో నాకు 1998 నాటి రోజులు గుర్తుకు వచ్చి, నా కాళ్ళు వణికాయి. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది. దేవుడా ఈ రోజు కాకపోతే, ఇంకెప్పుడూ కాదు అని నాకు నేను చెప్పుకున్నాను.

ఈ సీన్ తీసినప్పుడు నా పాత్రను నేను బాగా చేశాను. అదొక ఆన్‌లైన్ మూవీ. దాని పేరు ‘స్వాత్’.

ఈ సినిమా చూసి మరో డైరక్టర్ తన సినిమాలో మెయిన్ విలన్ పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో వరుసపెట్టి అవకాశాలు రావడం మొదలైంది.

ఇప్పటిదాకా దేవ్ 35 సినిమాలు, డ్రామాలలో నటించారు. ఈయనకు చైనాలో మొత్తం 11 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో 8 ఇండియన్, ఒక చైనీస్ రెస్టారెంట్ ఉన్నాయి.

ఇప్పటి వరకూ 52 సినిమాలలో నటించిన దేవ్ రతూడి

ఫొటో సోర్స్, DEV RATUDI

ఫొటో క్యాప్షన్, ఇప్పటి వరకూ 35 సినిమాలలో నటించిన దేవ్ రతూడి
సాత్విన్ జమాత్ పాఠ్య పుస్తకంలో దేవ్ రతూడి ప్రస్తావన

ఫొటో సోర్స్, ASIF ALI

ఫొటో క్యాప్షన్, సాత్విన్ జమాత్ పాఠ్య పుస్తకంలో దేవ్ రతూడి ప్రస్తావన

చైనా: ఏడో తరగతి పాఠ్యపుస్తకాల్లో దేవ్ పాఠం

ఒక రోజు నా స్నేహితుడి కుమార్తె సహా కొంత మంది స్కూల్ పిల్లలు నన్ను చూడటానికి వచ్చారు. తమ 7వ తరగతి ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలో దేవ్ రతూడి గురించి పాఠం బోధిస్తున్నారని చెప్పారు.

అప్పుడు నా స్నేహితుడి కుమార్తె మాట్లాడుతూ... ‘‘అంకుల్... నాకు మీరు తెలుసంటే వీళ్ళు నమ్మడంలేదు. అందుకే వీళ్ళను ఇక్కడకు తీసుకువచ్చాను’’ అని చెప్పింది.

2018లో చైనాలోని పాఠ్య పుస్తకాల్లో నా కథతో ఓ పాఠం చేర్చారు. అది చైనాకు నా ప్రయాణం, విజయవంతమైన నా కెరీర్ గురించిన పాఠం. ఇది నాకెంతో గర్వకారణం.

నేనెప్పుడు కాలేజీ ముఖం చూడకపోయినా ఈ రోజున చైనాలో చాలా యూనివర్సిటీలు పిల్లలను ప్రోత్సహించేందుకు నన్ను పిలుస్తున్నాయి. నేను చైనాలో చాలా అవార్డులు తీసుకున్నాను.

దేవ్

ఫొటో సోర్స్, DEV RATUDI

ఉత్తరాఖండ్‌లోని నా స్వగ్రామం కెమ్రియా సౌద్ నుంచి విదేశాలకు వెళ్ళేందుకు పాస్‌పోర్ట్ పొందిన మొదటి వ్యక్తిని నేనే. ఉత్తరాఖండ్ నుంచి నేను దాదాపు 150 మందిని చైనాకు పిలుచుకువచ్చాను. ఇందులో 50 మంది నా రెస్టారెంట్స్‌లో పనిచేస్తున్నారు. ఈ రోజు నా స్వగ్రామానికి చెందిన వారు కూడా చైనాలో ఉన్నారు.

నా పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయానని నేనెప్పుడూ బాధపడతూ ఉంటాను. అందుకే ఉత్తరాఖండ్‌లో, ప్రత్యేకించి నా స్వగ్రామంలో పిల్లలు చదువుకోవడానికి సహాయం చేసేందుకు రతూడి ఫౌండేషన్ స్థాపించాను.

ఓ పాత్రలో రతూడి

ఫొటో సోర్స్, DEV RATUDI

ఫొటో క్యాప్షన్, ఓ పాత్రలో రతూడి

దేవ్ రతూడి స్నేహితులు ఏం చెబుతున్నారు?

“ మేమిద్దరం 2000లో ఓ నిర్మాణ సంస్థలో పని చేశాం. ఆ సమయంలో నేనాయన ఆసక్తి ఏంటో గమనించాను. అప్పుడే అనుకున్నాను. అతడు ఏదో ఒక రోజు గొప్పవాడవుతాడని” అని దేవ్‌తో 23 ఏళ్లు సహవాసం చేసిన మహావీర్ రావత్ చెప్పారు.

‘‘దేవ్ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. ఆయనకు ఎదురైన ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొన్నారు. అందుకాయన్ని అభినందించి తీరాలి. అవే ఆయన జీవితాన్ని మార్చేశాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

దేవ్ చిన్ననాటి స్నేహితుడు రమేష్ పనోలి పంజాబ్‌లో ఉంటున్నారు. దేవ్ దిల్లీ వెళ్లిన తర్వాత రమేష్ కూడా దిల్లీ వచ్చి ఏడు నెలల పాటు ఆయనతో కలిసి ఉన్నారు. రమేష్‌ను చైనా రావాలని దేవ్ ఆహ్వనించినప్పటికీ, కుటుంబ ఇబ్బందుల వల్ల ఆయన వెళ్లలేకపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)