బిహార్: బీసీలు ఎంత శాతం? కులాల వారీ జన గణనలో ఏం తేలింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
బిహార్ ప్రభుత్వం కుల జనగణన వివరాలను విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 13 కోట్లు.
ఇందులో ఇతర వెనుకబడిన కులాల వారు(ఓబీసీలు) 27.12 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాల వారు(ఈబీసీలు) 36.01 శాతం, షెడ్యూల్డ్ కులాల వారు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు 1.68 శాతం ఉన్నారు.
జనాభాలో అగ్రవర్ణాలుగా చెప్పే వారి సంఖ్య 15.52 శాతంగా ఉంది.
ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం కలుపుకొని బీసీలు 63.13 శాతం మంది ఉన్నారు.
ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే ఈ లెక్కల్ని విడుదల చేశారని బీజేపీ ఆరోపించింది.
హిందూ- ముస్లింలు ఎంతమంది?
ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం బిహార్‌లో హిందువులదే మెజార్టీ జనాభా. 10,71,92,958 మంది తాము హిందువులమని ప్రకటించారు. జనాభాలో హిందువులు 81.9 శాతం. ముస్లింల జనాభా 2.31 కోట్లు. జనాభాలో ఈ వర్గానిది 17.7 శాతం.
మిగతా మతాల విషయానికొస్తే క్రైస్తవులు 0.05 శాతం, బౌద్దులు 0.08 శాతం, జైనులు 0.009 శాతం ఉన్నారు. 2,146 మంది తాము ఏ మతాన్ని అనుసరించడం లేదని చెప్పారు.
కులగణన ఎలా నిర్వహించారు?
బిహార్‌లో కులాల వారీగా జనాభా లెక్కించేందుకు 2019 ఫిబ్రవరి 18న అసెంబ్లీ తీర్మానం చేసిందని అదనపు కార్యదర్శి వివేక్ కుమార్ సింగ్ చెప్పారు.
2022 జూన్ 2న బిహార్ మంత్రివర్గం రెండు దశల్లో కుల గణన నిర్వహించేందుకు నిర్ణయించింది. మొదటి దశలో ఇళ్లకు నంబర్లు ఇచ్చి ఈ ఏడాది జనవరి 7న జాబితా ప్రచురించారు. రెండో దశలో ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి కులాల వారీగా జనాభాను లెక్కించారు.
ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ ఏడాది ఆగస్టు 5న లెక్కలన్నింటినీ సేకరించి మొబైల్ యాప్ ద్వారా అందించారు.
రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 83 లక్షల 44 వేల 107 ఇళ్లున్నాయి. జనాభా మొత్తం 13 కోట్ల 7 లక్షల 25 వేల 10 మంది ఉన్నారు.
53 లక్షల 72 వేల 22 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు కులగణనలో తేలింది.

ఫొటో సోర్స్, ANI
కులాల వారీ జనగణనపై ఎవరేమన్నారు?
“అందరికీ అభినందనలు. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణకు 9 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ గణన వల్ల ఏ కులం వారు ఎందరు ఉన్నారనేది తెలియడంతోపాటు వారి ఆర్థికస్థితి గతులు తెలిశాయి. త్వరలోనే 9 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కూడా సమాచారం అందిస్తాం” అని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“ఇది చరిత్రాత్మక సందర్భం, బీజేపీ కుట్రలు, కుట్రదారుల ఆటంకాలు అన్నింటినీ దాటుకుని బిహార్ ప్రభుత్వం కుల జనగణన వివరాలు విడుదల చేసింది. జనాభాలో అన్ని వర్గాల వారికీ జనసంఖ్యను బట్టి అధికారంలో వాటా కల్పించాలి. 2024లో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా కులాల వారీ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది” అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు.
“కులాల వారీగా జనగణన బిహార్ పేద ప్రజల్లో అయోమయం కల్పించడానికి తప్ప దేనికీ పనికిరాదు” అని అన్నారు బీజేపీ నేత గిరిరాజ్ కిషోర్ సింగ్.
“వాళ్లు 33 ఏళ్ల పనితీరుపై రిపోర్టు కార్డు ఇస్తే బావుండేది. లాలూ యాదవ్ 15 ఏళ్లు, నితీశ్ కుమార్ 18 ఏళ్లు పాలించారు. వాళ్లు పేద ప్రజలకు ఏం చేశారు? ఎంత మందికి ఉద్యోగాలిచ్చారు? ఎంత మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు? ఇలాంటి వాటి మీద రిపోర్టు కార్డు ఇవ్వాలి” అని గిరిరాజ్ సింగ్ కిషోర్ కోరారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
జాతీయ కులగణన చరిత్ర ఏంటి?
1931 వరకు భారతదేశంలో కులాల వారీగా జనాభా లెక్కల్ని సేకరించారు. 1941లోనూ సేకరించినా ప్రచురించలేదు.
1951 నుండి 2011 వరకు జనాభా లెక్కల సేకరణలో ప్రతీ సారి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల డేటా సేకరించి ప్రచురిస్తున్నారు. కానీ ఓబీసీ, ఇతర కులాల డేటాను వెల్లడించడం లేదు.
1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం రెండో బీసీ కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. దీనినే మండల్ కమిషన్‌గా పిలిచేవారురు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు అన్ని స్థాయుల్లోనూ 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయం భారతదేశం, ముఖ్యంగా ఉత్తర భారతదేశ రాజకీయాలను మార్చింది.
భారతదేశంలో ఓబీసీ జనాభాఎంత శాతం అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని నిపుణులు భావిస్తున్నారు.
1931 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకుని మండల్ కమిషన్ భారతదేశంలో ఓబీసీ జనాభా 52 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
కులాల వారీగా జనగణనకు సంబంధించిన వివరాలు ప్రభుత్వాల వద్ద పక్కాగా లేకున్నా.. కులాల ఆధారంగా కొన్ని విధానాల రూపకల్పన జరుగుతోంది. తాజా ఉదాహరణగా నీట్ ఎగ్జామ్ తీసుకుంటే ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ అంశాన్ని ఎప్పుడు ఏ పార్టీ లేవనెత్తింది?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021 జులై 20న లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, తెగలు మినహా మరే ఇతర కులాన్ని లెక్కించాలని ఆదేశించలేదని చెప్పారు.
గతంలో మాదిరిగానే ఈసారి కూడా కేవలం ఎస్సీ, ఎస్టీలను మాత్రమే జనాభా లెక్కల్లో చేర్చారు.
దేశవ్యాప్తంగా కులగణనకు ప్రస్తుతం బీజేపీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, 10 ఏళ్ల క్రితం ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు కులాల వారీగా జనాభా లెక్కల్ని సేకరించాలని డిమాండ్ చేశారు.
2011 జనాభా లెక్కలకు ముందు 2010లో బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే పార్లమెంటులో మాట్లాడుతూ, "ఈసారి కూడా ఓబీసీలను లెక్కించకపోతే, వారికి సామాజిక న్యాయం అందించడానికి మరో 10ఏ ళ్లు పడుతుంది. ఇది వాళ్లకు అన్యాయం చెయ్యడమే” అని అన్నారు.
నరేంద్ర మోదీ తొలి హయాంలో రాజ్‌నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు, 2021 జనాభా లెక్కల సేకరణకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో కొత్తగా చేపట్టే జనాభా లెక్కల్లో ఓబీసీల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మీడియా ముఖంగా చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గతంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- ఎలుగుబంట్లను హడలెత్తిస్తున్న రోబో తోడేళ్లు, ఇక పంటలు భద్రమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














