మీ ఇంటికి పావురాలు వస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రుచితా పుర్బియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ సమీపంలో ఉన్న కబూతర్ ఖానా (పావురాల ఇల్లు)ను అధికారులు మూసివేశారు. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతంలోని ప్రజలకు శ్వాస సంబంధిత, అలర్జీ సమస్యలు రావడమే కారణం. ఇంతకీ వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి పావురాలకు సంబంధమేంటి? అవును ఉంది.. అదే ఫైబ్రోసిస్.
"కరోనా తర్వాత నా భార్య ఆరోగ్యం క్షీణించడంతో ఆక్సిజన్ అందించాం. అప్పటి నుంచి 24 గంటలూ ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది" అని సిద్ధార్థ్ తెలిపారు. ఆయన భార్యకు ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధి ఉంది.
"2011లో మేం మౌంట్ అబూకు వెళ్లినపుడు, నా భార్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. అబూ నుంచి తిరిగొచ్చాక ఆసుపత్రికి వెళ్లాం. కొన్ని చెకప్‌ల తర్వాత ఆమెకు ఫైబ్రోసిస్ ఉందని తెలిసింది'' అని అన్నారు.
"ఆ వ్యాధికి మూల కారణం బాత్రూం కిటికీ వెలుపల, మా ఇంటి ప్రాంగణంలో పావురాలు సంచరిస్తుండటమే అని తెలుసుకుని ఆశ్చర్యపోయాం" అని తెలిపారు సిద్ధార్థ్.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉండే రూపల్‌బెన్ పారిఖ్ సమస్య కూడా ఇలాంటిదే.
"1992లో నాకు నిరంతర దగ్గు, జ్వరం, చలి మొదలైంది. అప్పుడు నా వయసు 24 ఏళ్లు. నాకు టీబి ఉందని వైద్యులు చెప్పారు. టీబీ మెడిసిన్ తీసుకున్నా, కానీ అది పనిచేయలేదు. పైగా అది నా శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపించింది. తర్వాత ముంబయికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, నా ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ ఉందని తెలిసింది" అని రూపల్ పారిఖ్ చెప్పారు.
"జనం నా ఇంటి దగ్గర పావురాలకు గింజలు చల్లేవారు. ఆ పావురాల నుంచి ఆర్గానిక్ కణాలు శ్వాస ద్వారా లోపలికి వెళ్లి ఊపిరితిత్తులను నాశనం చేశాయి" అని తెలిపారు రూపల్.
"1992 నుంచి 2017 వరకు మెడిసిన్ వాడుతూ ఆరోగ్యంగానే ఉన్నాను, కానీ 2017 నుంచి 24 గంటలపాటు ఆక్సిజన్ సిలిండర్ అవసరం పడింది. 2022 వరకు ఆక్సిజన్ సిలిండర్‌తోనే నా జీవితం. 2022లో నాకు రెండు ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది" అని రూపల్ తెలిపారు.
వడోదరలోని జరోడ్ గ్రామానికి చెందిన డింపుల్ షాదీ ఇలాంటి కథే.
వీళ్లందరికీ ఫైబ్రోసిన్ వ్యాధి వచ్చింది.
2019లో గ్లాస్గోలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో ఇద్దరు మరణించారు. వారి మరణానికి కారణం పావురం రెట్టలు అని తరువాత నిర్ధరించారు.

ఫొటో సోర్స్, ALPABEN SHAH/RUPALBEN PARIKH
ఎలా సోకుతుంది?
"మన ఊపిరితిత్తులు ఒక పెద్ద ట్యాంక్ వంటివి. ఒక్క శ్వాసలో 750 మి.లీ. గాలిని తీసుకోగలం. నిమిషంలో 10 లీటర్లు , 1 రోజులో 14,400 లీటర్ల గాలి మన శరీరంలోకి వెళుతుంది. ఈ గాలి తేలియాడే ధూళి, శిథిలాలు, జంతువులు, పక్షి, మొక్కల పదార్థం వంటి జీవ కణాలను కలిగి ఉంటుంది'' అని అహ్మదాబాద్‌కు చెందిన పల్మోనాలజిస్ట్ డాక్టర్ పార్థివ్ మెహతా తెలిపారు.
"చాలామందికి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే కణాలను నిరోధించడానికి బలమైన హైపర్‌రియాక్టివిటీ ఉండదు" అని గుర్తుచేస్తున్నారు మెహతా.
"ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే కణాల్లో ఫంగస్ ఉంటుంది. తేమతో కూడిన వాతావరణం ఆ ఫంగస్ పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను అందిస్తుంది. తరువాత ఫంగస్ రెట్టింపవుతుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అంటారు" అని తెలిపారు.
ఈ ఫంగల్ నుంచి ఊపిరితిత్తులను రక్షించడానికి, వారి శరీరాలు ఊపిరితిత్తులపై ప్రోటీన్ పొరను సృష్టిస్తాయి. దీంతో కాలక్రమేణా ఇది ఊపిరితిత్తులలోని వాయుకోశాల చర్మం మందంగా, బిగుతుగా మారవచ్చు, ఈ పరిస్థితిని ఫైబ్రోసిస్ అంటారు.
"మానవ ఊపిరితిత్తులలో 30 కోట్ల వరకు వాయుకోశాలు ఉంటాయి. వీటిలో 50 నుంచి 70 లక్షల వాయుకోశాలకు నష్టం జరిగే వరకు ఊపిరితిత్తులలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సంఖ్య పెరిగితే అనారోగ్యానికి గురవుతారు. పట్టించుకోకపోతే 20 నుంచి 25 కోట్ల వాయుకోశాలు ప్రభావితమవుతాయి" అని మెహతా అంటున్నారు.
అప్పటికే ఉబ్బసం, జన్యుపరమైన అలెర్జీలు ఉన్నవారికి లేదా ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకునే వారు, బాల్యంలో అరుదైన రోగాలకు గురైన వారు ఫైబ్రోసిస్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువ.
"ఊపిరితిత్తులలోని వాయుకోశాల చర్మం దృఢంగా, మందంగా మారడంతో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అంటే మీ రక్తంలోకి తగినంత ఆక్సిజన్ అందడం లేదని అర్థం" అని పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులు జితేంద్ర కొట్డియా అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గాలిని పీలిస్తేనే వస్తుందా?
"దేశంలో చాలావరకు హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ కేసులకు పావురం రెట్టలే కారణం. పక్షి రెట్టలు, ఈకల నుంచి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటీన్లు విడుదలవుతాయి. వీటివల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఇవి పక్షుల శరీరం నుంచి కూడా విడుదలవుతాయి. పక్షులకు చికిత్స చేసే వెటర్నరీ వైద్యులకూ ఈ వ్యాధి సోకుతుంటుంది. ఇది కాకుండా పౌల్ట్రీ హౌస్‌లు, రూనీ ఫ్యాక్టరీలలో పనిచేసే వ్యక్తులు దీని బారిన పడతారు" అని జితేంద్ర చెప్పారు.
"ఒక పావురం ఎగిరినప్పుడు, అది దాని రెక్కలను విప్పుతుంది. ఇది గాలిలో తేలియాడే ప్రోటీన్లను విడుదల చేస్తుంది. ఈ ప్రొటీన్లు అలా చాలారోజుల వరకు గాలిలో ఉంటాయి. వాటిని మనం పీల్చుకొని ఊపిరితిత్తులలోకి పంపిస్తాం. దీంతో వ్యాధికి గురవుతాం. అలాగే, పావురం రెట్టలు మన డాబాలు లేదా బాల్కనీలపై పడుతుంటాయి. ఆ గాలిని మనం పీలుస్తాం. ఈ వ్యాధి అభివృద్ధి అనేది కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది'' అని తెలిపారు జితేంద్ర.

ఫొటో సోర్స్, Getty Images
రోగ నిర్ధరణ ఎలా చేస్తారు?
దీని పర్యావసానాలను వివరిస్తూ ''బాధితులకు మొదట్లో చాలాసేపు నడిచాక ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. కొన్నిరోజుల తర్వాత కొద్దిదూరం నడిచినా ఊపిరి అందడం కష్టమవుతుంది'' అని మెహతా అంటున్నారు.
X- రే ద్వారా ఫైబ్రోసిస్ గుర్తించొచ్చు. అయితే, దాని ఉనికిని నిర్ధారించడానికి హై-రిజల్యూషన్ సిటీ స్కాన్ ఉపయోగిస్తారు. అరుదైన సందర్భాల్లో బయాప్సీ అవసరమవుతుందని ఆయన అన్నారు.
ఈ వ్యాధిని నయం చేయవచ్చా?
"నాకు 1992 నుంచి పల్మనరీ ఫైబ్రోసిస్ ఉంది. నేను ఈ రోజు ఆరోగ్యకరమైన జీవితాన్నే గడుపుతున్నా. అయితే, వైద్యుల సలహాలను ఖచ్చితంగా పాటించాలి" అని రూపల్‌బెహన్ ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
"ఆల్పా నేటికీ వాకింగ్‌కు వెళుతుంది. అందరం ఫంక్షన్లకు కూడా వెళ్తాం. ఆక్సిజన్‌తో ఉన్నప్పటికీ, ఆమె పూర్తిగా సాధారణ జీవితాన్నే గడుపుతోంది" అని సిద్ధార్థ్ తెలిపారు.
ఈ వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తిస్తే నష్టం తగ్గించడం సులువు అవుతుందని, ఊపిరితిత్తులు తమను తాము పునరుద్ధరించుకునే సామర్థ్యం ఉండదని డా. జితేంద్ర గుర్తుచేస్తున్నారు.
మరోవైపు ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని, అయితే, అందరికీ ఊపిరితిత్తుల మార్పిడి అవసరం లేదని మెహతా చెప్పారు.
బాధితుడికి వ్యాధి ఎలా సోకిందో వైద్యుడి ద్వారా తెలుసుకుని, మళ్లీ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులు.
వైద్యుల సూచనలన్నింటినీ సరిగ్గా పాటించినట్లయితే రోగి ఆరోగ్యకరమైన, సాధారణ జీవితాన్ని గడపవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
"రోగి తేమగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి, వర్షం పడితే బయటకు వెళ్లవద్దు. వానలో ఎక్కువసేపు తడవొద్దు. జలుబు, దగ్గును కలిగించే ఆహారాలు తినకూడదు. వాకింగ్ చేస్తుండాలి. ఎక్కువగా శ్వాసను ప్రాక్టీస్ చేయాలి, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయాలి, క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష, CT స్కాన్ వంటివి చేయించుకోవాలి" అని జితేంద్ర చెప్పారు.
"పావురాలను దూరంగా ఉంచడానికి మేం మా ఇంటి చుట్టూ వలలు కట్టాం. వాటి గాలిని పీల్చకుండా బాల్కనీలో జాగ్రత్తలు తీసుకున్నాం'' అని సిద్ధార్థ్ అంటున్నారు.
''ఏసీ కారణంగా తేమతో కూడిన వాతావరణం ఉండటంతో అది పావురాలకు విశ్రాంతి స్థలంగా మారుతోంది. దీంతో వాటికి మనం దగ్గరగా ఉంటాం. అందుకే తలుపులు, కిటికీలు తెరవాలి, సూర్యకాంతిని ఇంటిలోకి రానివ్వాలి'' అని సూచిస్తున్నారు డా. మెహతా.
కరోనా బారిన పడిన ఫైబ్రోసిస్ బాధితులు తప్పకుండా చికిత్స తీసుకోవాలని ఆయన అంటున్నారు.
పక్షి నిపుణులు ఏమంటున్నారు?
పక్షుల కారణంగా జనం వ్యాధులకు గురవుతున్నారని, వాటికి ముందు ఆహారం అందించడం తగ్గించాలని పక్షి శాస్త్రవేత్త డా. ఇంద్ర సూచిస్తున్నారు.
పక్షులకు సొంతంగా ఆహారం సమకూర్చుకునే అవకాశం ఇవ్వాలని తెలిపారు.
ప్రజలు పక్షులకు ఆహారం వేయడం మానేస్తే, అవి జనావాసాలు వదిలి అడవుల్లోకి వెళతాయిన పక్షి శాస్త్రవేత్త బకుల్ త్రివేది అంటున్నారు.
దీనికి జరిమానాలే కాదు అవగాహన సైతం కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పక్షుల కారణంగా మానవులకు వచ్చే రోగాలు గురించి ప్రచారం చెయ్యాలని వారు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో పావురాలకు ఆహారం వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని మహారాష్ట్రలోని పుణే, థానే, పన్వేల్ కార్పొరేషన్లు ప్రకటించాయి. బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి.
ఇవి కూడా చదవండి
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- అంతరిక్షంలో ఏడాది గడిపితే శరీరానికి ఏమవుతుంది?
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... ఈ బిల్లు గురించి తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














