యూటీఐ: మూత్ర సంబంధ వ్యాధులు మహిళలకే ఎందుకు ఎక్కువగా వస్తాయి?

యూటీఐ సమస్య

ఫొటో సోర్స్, GETY IMAGES

    • రచయిత, అంజలీ దాస్
    • హోదా, బీబీసీ కోసం

అమెరికాలో ప్రతీ ఏటా రెండున్నర లక్షల మందిలో యూరినరీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది ఈ వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నారు.

యూరినరీ బ్లాడర్‌లో మంటను వైద్య పరిభాషలో సిస్టిటిస్ అంటున్నారు. దీన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ( UTI) అని పిలుస్తున్నారు. చాలా కేసుల్లో ఇన్ఫెక్షన్ వల్ల లేదా బ్యాక్టీరియాతో వచ్చే ఇన్పెక్షన్ల విస్తరణ వల్ల ఈ వ్యాధి వస్తుంది.

యూరినరీ బ్లాడర్, దాని పైపుకి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఇది వస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏ వయసు వారికైనా రావచ్చు.

అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి పెద్ద వయసు వారిలో ఎవరికైనా ఇది సోకవచ్చు.

పరీక్షలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

మహిళలు వారి ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోరా?

ఓ పరిశోధన ప్రకారం మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు రావడానికి 60 శాతం అవకాశం ఉంది. పురుషుల్లో 13 శాతం ఉంది.

43 ఏళ్ల రేణు (పేరు మార్చాం) గృహిణి. ఆమె రోజు వారీ పనులు, ఇతర కార్యకలాపాలతో బిజీగా ఉన్నానని చెప్పేవారు. ఆమెకు తన ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక లేదు.

ఆమె భర్త ప్రొఫెసర్. దెహ్రదూన్‌లో పని చేస్తున్నారు. నెలలో ఒకటి, రెండుసార్లే ఇంటికి వస్తారు.

“నాకు తరచుగా పొట్టలో నొప్పి వస్తోంది. అయితే ఎక్కువసేపు ఉండటం లేదు. అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు ”అని ఆమె చెప్పారు.

‘‘ఒకరోజు కడుపునొప్పితో పాటు మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా అనిపించింది. మూత్రంలో కొద్దిగా రక్తం కూడా వచ్చింది. దీంతో భయం వేసింది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లాను. డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చారు." అన్నారామె.

మందులతో కొంత ఉపశమనం లభించినా కొన్ని నెలల తర్వాత అవే లక్షణాలు మళ్లీ కనిపించాయి. ఈసారి రేణు యోగా, ప్రాణాయమం లాంటివి చేస్తూ ఇంటి వద్దనే ఉండి ఈ వ్యాధిని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అసిమాకు 37 ఏళ్లు, ఆమె స్కూల్ టీచర్.

‘‘టీచర్లకు ఎప్పుడూ పనే. వాళ్లు వారి శరీరాన్ని, ఆరోగ్యాన్ని పట్టించుకునే టైమ్ ఉండదు. పైగా స్కూళ్లలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండవు” అని ఆమె చెప్పారు.

ఒకరోజు స్కూల్లో ఉండగా ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది.

ఆ రోజును గుర్తు చేసుకుంటూ, "మొదట్లో నొప్పి తగ్గింది కానీ కొంతసేపటికి భరించలేక పోయాను. వెంటనే హాఫ్ డే సెలవు తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అప్పుడు నాకు యూటీఐ ఉందని తెలిసింది. డాక్టర్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. 5 రోజుల తర్వాత తగ్గింది." అని వెల్లడించారు.

యూటీఐ సమస్య

ఫొటో సోర్స్, GETTY IMAGES

యూటీఐ మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది?

మూత్రాశయం లేదా మూత్రాశయ ట్యూబ్‌కి బ్యాక్టీరియా సోకినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

ఈ ఇన్ఫెక్షన్ పురుషులు, మహిళలు ఎవరికైనా రావచ్చు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

“వాస్తవానికి, పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా సిస్టిటిస్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే స్త్రీలలో మూత్రనాళం (మూత్రం బయటకు వచ్చే మార్గం) పురుషుల కంటే చిన్నది. పురుషులలో ఇది సుమారుగా 20 సెం.మీ ఉంటే స్త్రీలలో ఇది దాదాపు 4.8 నుండి 5.1 సెం.మీ ఉంటుంది” అని గ్రేటర్ నోయిడాలోని శారదా మెడికల్ కాలేజ్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ తనూజ్ లవానియా చెప్పారు.

డాక్టర్ తనూజ్ లవానియా

ఫొటో సోర్స్, డాక్టర్ తనూజ్ లవానియా

ఫొటో క్యాప్షన్, డాక్టర్ తనూజ్ లవానియా

"ఒక మహిళకు బ్యాక్టీరియా సోకినప్పుడు, బ్యాక్టీరియా మూత్రాశయంలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతాయి. మూత్రనాళం పొడవు తక్కువైనందున బ్యాక్టీరియా అక్కడికి చేరుకోవడం సులభం. అందుకే పురుషుల కంటే స్త్రీలతో యూటీఐ సమస్య ఎక్కువగా ఉంటుంది” అని తనూజ్ లవానియా బీబీసీకి వివరించారు.

"కనీసం 10 శాతం మంది స్త్రీలకు ఒకసారి సిస్టిటిస్‌ వస్తుంది. వారిలో సగం మందికి మళ్లీ వస్తోంది” అని అన్నారామె

‘‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే, అది కిడ్నీలకు వ్యాపిస్తుంది. ఈ- కొలి బ్యాక్టీరియా వల్ల కూడా యూటీఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇదే కాక ఇతర బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు" అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని సెంటర్ ఫర్ యూరలాజికల్ బయాలజీ హెడ్ జెన్నిఫర్ రాన్ చెప్పారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

యూటీఐ లక్షణాలు

మహిళల్లో చాలా లక్షణాలు ఉంటాయని డాక్టర్ తనూజ్ చెప్పారు.

  • తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం
  • మూత్రవిసర్జన సమయంలో మంట లేదా తీవ్రమైన నొప్పి
  • మూత్ర విసర్జన చేసేటప్పుడు యోని చర్మంపై మంటలు
  • మూత్రంలో రక్తం

చాలాకాలం పాటు నిర్లక్ష్యం చేసే మహిళల్లో అధిక జ్వరం కూడా ఒక లక్షణం కావచ్చు.

డాక్టర్లు ఏయే పరీక్షలు చేస్తారు?

‘‘క్లినికల్ విచారణలో ఎవరికైనా యూటీఐ ఉందనిపిస్తే, అప్పుడు మేము ఆ మహిళకు మూత్ర పరీక్ష చేయించాలని అడుగుతాము. అలాగే యూరిన్ రొటీన్ మైక్రోస్కోపీ, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ కూడా చేయించుకోవాలని సూచిస్తాం’’ అని డాక్టర్ తనూజ్ లవానియా చెప్పారు.

ఇందుకు కారణాల గురించి ఆమె వివరిస్తూ “ రొటీన్ మైక్రోస్కోపీ టెస్టుతో ఇన్ఫెక్షన్ బాక్టీరియా లేదా ఫంగస్ వల్ల వస్తుందా అని చూస్తారు. యూరిన్ కల్చర్ టెస్ట్ సాయంతో ఏ బ్యాక్టీరియా వల్ల వ్యాధి సంక్రమించిందో తెలుస్తుంది. దీనివల్ల ఆ బ్యాక్టీరియా నివారణకు మందులు సూచించవచ్చు” అని చెప్పారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

మహిళల్లో ఎవరు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు?

"యూటీఐ అన్ని వయసులవారిలో కనిపిస్తున్నప్పటికీ, పెళ్లైన వారికి ఇది సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది” అని డాక్టర్ తనూజ్ చెప్పారు.

"తక్కువ నీరు త్రాగే మహిళల్లో ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఎక్కువ సేపు మూత్ర విసర్జన చేయకుండా బిగబట్టుకునే వారిలోనూ ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఎందుకంటే ఇలా చెయ్యడం వల్ల బ్యాక్టీరియా పేరుకు పోయే అవకాశం ఉంది’’ అని ఆమె చెప్పారు.

డాక్టర్ తనూజ్ ప్రకారం ఇంకా ఏ కారణాల వల్ల యూటీఐ వస్తుందంటే....

  • టాయిలెట్ సమయంలో జెట్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు.
  • టాయిలెట్‌ను శుభ్రపరచడానికి రసాయన ఉత్పత్తులను ఉపయోగించే వారు
  • పరిశుభ్రతపై దృష్టి పెట్టని వారు
  • తరచుగా అండర్ గార్మెంట్స్ మార్చుకోని వారికి.
  • మధుమేహం ఉన్న మహిళలకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
  • గర్భధారణ సమయంలో యూటీఐ సంక్రమణ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.

రుతుక్రమం తర్వాత కూడా యూటీఐ సోకవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో యోనిలో వ్యాధి నిరోధక బ్యాక్టీరియాల సంఖ్య తగ్గుతుంది.

యూటీఐ పదే పదే వస్తుంటే..?

ఒక మహిళకు మళ్లీ మళ్లీ యూటీఐ ఎందుకు సోకుతుంది? దీనిని ఎలా అడ్డుకోవచ్చు?

"తరచుగా యూటీఐ ఇన్‌ఫెక్షన్లు సోకిన స్త్రీలు ఇతర పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా అల్ట్రా సౌండ్ టెస్టు చేయించాలి. అందులో కిడ్నీ, కిడ్నీ ట్యూబ్ బాగానే ఉన్నాయా లేదా అనేది చూస్తారు. కిడ్నీలో రాళ్లు లేదా రాయి ఉందా అని చూస్తారు. ఆ రాయి మూత్ర నాళంలో ఇరుక్కుపోతే అది కూడా మూత్ర సంబంధిత వ్యాధులకు, కడుపు నొప్పికి కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి’’ అని ఆమె చెప్పారు.

యూటీఐ లక్షణాలు కనిపిస్తే, స్త్రీలు గైనకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లాలని డాక్టర్ తనూజ్ చెప్పారు. గైనకాలజిస్టుల సలహా మేరకే మాత్రమే ఇతర వైద్యుల వద్దకు వెళ్లడం మంచిదని ఆమె సూచించారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

వృద్ధులను ఇబ్బంది పెడుతున్న యూటీఐ

ప్రతి ఏటా సుమారు కోటిన్నర మందికి యూటీఐ సోకుతున్నట్లు జెన్నిఫర్ రాన్ చెప్పారు. ఇది పురుషుల్లో కూడా ముసలి వాళ్లకే ఎక్కువగా వస్తుందని ఆమె చెప్పారు.

"వృద్ధాప్యంలో మూత్రవిసర్జన సమయంలో మంట, జ్వరం, నడుము నొప్పి, మూత్రంలో దుర్వాసన మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలని జెన్నిఫర్ రాన్ తెలిపారు.

దీనికి గల కారణాన్ని డాక్టర్ తనూజ్ వివరిస్తూ.. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరిగితే మూత్రాశయంపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల మూత్రాశయం నుంచి వచ్చే మూత్రం తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో వారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నారు.

"యూటీఐ స్త్రీల కంటే పురుషులలో చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి పురుషులు యూటీఐ ఇన్ఫెక్షన్ వల్ల ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది." అని డాక్టర్ తనూజ్ చెప్పారు.

వృద్ధ మహిళలు ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడల్లా వైద్య సలహా లేకుండా మందులు తీసుకోవద్దని, ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.

యూటీఐ నుంచి ఎలా కాపాడుకోవాలి?

వైద్యులు సూచించకుండా లేకుండా ఎలాంటి యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారంపై శ్రద్ధ వహించాలని డాక్టర్ తనూజ్ సలహా ఇస్తున్నారు. యూటీఐ రాకుండా ఉండేందుకు ఇంకా ఏమేం చెయ్యాలంటే..

  • నీరు పుష్కలంగా త్రాగాలి. రోజుకు కనీసం రెండు మూడు లీటర్ల నీరు తాగాలి.
  • పురుషులతో సెక్స్ చేసేటప్పుడు కండోమ్‌లను తప్పకుండా వాడండి.
  • కండోమ్‌లు ఉపయోగించలేని మహిళలు సెక్స్ చేసిన వెంటనే మూత్ర విసర్జన చేయాలి. సెక్స్ తర్వాత ప్రైవేట్ భాగాలను నీటితో కడుక్కోవాలి.
  • యోనిని పరిశుభ్రపరిచే ఉత్పత్తుల్ని వాడకండి.
  • పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించే ముందు, టాయిలెట్ షీట్ ను సాధారణ నీటితో కడగాలి.

యూటీఐ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రూఢకోట గ్రామంలో తల్లులకు దడ పుట్టిస్తున్న పసికందుల మరణాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)