రాజమండ్రి సెంట్రల్ జైల్: ముగ్గురు మాజీ సీఎంలు ఖైదీలుగా గడిపిన ఈ జైలు ప్రత్యేకతలు ఏంటి?

ఫొటో సోర్స్, SB Rajeswara Rao
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం...
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి హోదా అనుభవించిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
రిమాండ్ ఖైదీగా ఆయన్ని ఈ జైలులో ఉంచారు. కోర్టు ఆదేశాలతో సీఐడీ కస్టడీలో ఉన్న ఆయన్ని జైల్లోనే విచారిస్తున్నారు. సీఐడీ కస్టడీ ముగియడం, ఆయన రిమాండ్‌ను పొడిగించాలని సీఐడీ కోరడంతో విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు అక్టోబర్ 5 వరకు పొడిగించింది.
చంద్రబాబు ఈ జైలుకు రావడంతో దీని పేరు మరోసారి వార్తల్లో మారుమోగిపోయింది. అయితే, శతాబ్ధానికి పైగా చరిత్ర ఉన్న ఈ జైలులో చంద్రబాబు కాక మరో ఇద్దరు సీఎంలు, అంతకు ముందు ప్రముఖ స్వాతంత్ర్య యోధులు కూడా ఇక్కడ ఖైదీలుగా కొన్నాళ్లు గడిపారు.
వారెవరూ? ఎందుకు బందీలయ్యారు అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, SB Rajeswara Rao
తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది. అయితే, ఆయన సీఎం పదవి చేపట్టక ముందు జైలుకెళ్ళారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో తొలిదశ ఉద్యమం మొదలైంది. అందులో మర్రి చెన్నారెడ్డి వంటివారు పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
1970లో ఆయన ఇతర తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కొద్ది రోజుల పాటు ఈ జైలులో ఉన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంధ్ర కేసరి
ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు కూడా ఈ జైలులో కొంత కాలం గడపాల్సి వచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఆయన బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి జైలుకి వెళ్ళారు. ఆ సమయంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆయన్ని అరెస్ట్ చేశారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన్ని అరెస్ట్ చేసి పుణెలోని ఎరవాడ జైలులో బంధించారు. అరెస్టయిన కాంగ్రెస్ నేతలు జైలు లోపల ఆందోళనలకు దిగారు.
దాంతో కొద్ది మంది నాయకులను అక్కడి నుంచి తరలించాలన్న నిర్ణయంతో కొద్ది రోజుల పాటు ప్రకాశం పంతులుని రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు.
ముఖ్యమంత్రి హోదా అనుభవించిన తర్వాత చంద్రబాబు జైలుకి వెళ్తే, ఆ జైలులో కొద్ది రోజులు గడిపిన ప్రకాశం పంతులు, చెన్నారెడ్డి వంటి నేతలు ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.
ప్రకాశం పంతులు అరెస్ట్ కాకముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, SB Rajeswara Rao
తొలుత డచ్ వారి కోట
రాజమండ్రి సెంట్రల్ జైలుకి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. తొలుత డచ్ వారు నిర్మించిన కోటనే అనంతరం జైలుగా మార్చారు అంటూ పలు చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావించారు.
డచ్ వారి కోటను బ్రిటిష్ పాలకులు జైలుగా మార్చినట్టు చెబుతారు. జైలు రికార్డుల ప్రకారం 1864 నాటికే ఇది జిల్లా జైలుగా ఉంది. 1890లో సెంట్రల్ జైలుగా గుర్తింపు పొందింది. అంటే 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.
స్వాతంత్ర్య పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటుగా భగత్ సింగ్ సహచరులు శివవర్మ వంటి వారు సైతం ఈ జైలులో బందీలుగా ఉన్నారు. లాహోర్ కుట్రకేసు పేరుతో వారిని ఇక్కడికి తరలించారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా వివిధ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారిని ఈ జైలుకే తరలించారు.
నక్సల్స్ ఉద్యమానికి నాయకత్వం వహించిన కొండపల్లి సీతారామయ్య, నాగభూషణం పట్నాయక్ వంటి వారు కూడా ఇక్కడ శిక్ష అనుభవించారు.

ఫొటో సోర్స్, SB Rajeswara Rao
విశాల ప్రాంగణం, కట్టుదిట్టమైన భద్రత
వైశాల్యం పరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు దేశంలోనే నాలుగో పెద్ద జైలు. 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అందులో 39.02 ఎకరాల్లో జైలు కట్టడాలు ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఈ జైలును నిర్మించారు.
2015 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ జైలుని ఆధునీకరించారు. అంతకు ముందు జైలు ప్రధాన ద్వారం కోటగుమ్మాన్ని తలపించేలా ఉండేది. ప్రస్తుతం దాని రూపం మారింది.
ఇటీవల చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లివచ్చిన ఆయన భార్య భువనేశ్వరి ‘‘ఆయన నిర్మించిన బ్లాకులోనే ఆయన్ను బంధించారు’’ అంటూ వాపోయారు.
ఈ జైలులో సుమారు మూడు వేల మంది ఖైదీలను ఉంచేందుకు సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం 2,064 మంది ఉన్నారు. వారిలో అత్యధికులు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. కొందరు రిమాండ్ ఖైదీలు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా రిమాండ్ ఖైదీయే
జైలు కార్యకలాపాల నిర్వహణలో మరో రెండు వందల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, SB Rajeswara Rao
ఈ జైలులో 47 మందికి ఉరి
1947 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 450 మందికి వివిధ నేరాల్లో న్యాయస్థానాలు మరణశిక్ష విధించాయి. అయితే అప్పీలు చేసుకోవడంతోనూ, రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారాను 366 మందికి ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవ శిక్షలుగా మార్చారు. మిగిలిన 92 మందిని ఉరితీశారు.
అప్పట్లో రాజమండ్రి జైలుతో పాటు విశాఖ, ముషీరాబాద్ జైల్లో కూడా ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు ఉండేవి. దీంతో విశాఖపట్నం జైల్లో 13 మందిని, ముషీరాబాద్ జైల్లో 32 మందిని, రాజమహేంద్రవరం జైల్లో 47 మందిని ఉరితీశారు.
కొంతకాలం తర్వాత ముషీరాబాద్, విశాఖలలో ఉరి అమలు చేసే ఏర్పాటు తొలగించడంతో రాజమండ్రి జైలులోనే ఏకైక ఉరికంబం ఉండేది. ఈ జైలులో ఒకేసారి ఇద్దరిని ఉరి తీసే ఏర్పాటు ఉంది.
ఈ జైలులో ఉరి తీసిన వారి లెక్కలు పరిశీలిస్తే, 1948లో అయిదుగురిని, 1949లో ఇద్దరినీ, 1956లో ముగ్గురిని, 1957లో ఒకరిని, 1959 లో ఎనిమిది మందిని, 1961లో ఇద్దరినీ,1962లో నలుగురిని,1963 లో ఏడుగురిని, 1964లో అయిదుగురిని, 1967లో ముగ్గురిని, 1958లో ఒకరిని, 1971లో ముగ్గురిని, 1972లో ఒకరిని, 1974లో ఒకరిని ఉరితీశారు.
చివరగా 1976లో నంది కిష్టప్పను ఉరి తీశారు. ఆ తర్వాత ఈ సెంట్రల్ జైలులో ఉరికంబానికి వేలాడిన నేరస్థుడు ఎవరూ లేరు.

ఫొటో సోర్స్, SB Rajeswara Rao
రెండు గంటల ముందు ఇద్దరికి ఉరి ఆగింది
రాజమండ్రి జైలులో ఇద్దరిని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరో రెండు గంటలలో వారిని ఉరి తీయాల్సి ఉంది. ఇంతలో రాష్ట్రపతి క్షమాభిక్ష ఉత్తర్వులు రావడంతో శిక్ష అమలు నిలిపివేశారు.
1993 మార్చి 8న చిలకలూరిపేట బస్సు దహనం కేసులో సుమారు 35 మంది సజీవ దహనం అయ్యారు. ఆ బస్సు దహనం కేసులో హంతకులుగా సాతులూరి చలపతిరావు, గంటల విజయవర్ధన్ రావులకు ఉరిశిక్ష ఖరారైంది.
1995 నవంబర్ 6న వారిద్దరిని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషాల్లో రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ క్షమాభిక్ష పెట్టడంతో వారిద్దరి ప్రాణాలు నిలిచాయి.
పరివర్తనతో ఉపాధి అవకాశాలు
ఈ కేంద్ర కారాగారంలో ఎన్నో ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నట్టు జైళ్ల శాఖ చెబుతోంది. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు వారికున్న అనుభవం మేరకు వివిధ పనులను అప్పగిస్తామని డీఐజీ రవి కిరణ్ తెలిపారు.
‘‘పండ్లతోటలు, డెయిరీతో పాటు ఫర్నీచర్, దుస్తులు తయారీ వంటి పనులు అప్పగిస్తాం. పలు చేతివృత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తాం. అలాగే మానసిక ఉల్లాసానికి పలు రకాల క్రీడలు, యోగ వంటివి ఖైదీలకు నేర్పిస్తాం. ఈ జైలులోనే చదువుకునే అవకాశం కూడా ఉంది. ఈ జైలు నుంచి శిక్షా కాలంలోనే 300 మంది వరకు డిగ్రీ పూర్తి చేసి పట్టాలు పొందారు" అంటూ ఆయన వివరించారు.
ఓపెన్ జైలు ఖైదీలతో రెండు పెట్రోల్ బంకులు కూడా నిర్వహిస్తున్నారు. ఖైదీలు తమ నైపుణ్యంతో సంపాదించిన డబ్బును కొంత ఇంటికి పంపుకోవచ్చని డీఐజీ అన్నారు.

ఫొటో సోర్స్, SB Rajeswara Rao
వరదల్లోనూ సహాయంగా
గోదావరి వరదల సమయంలో కూడా సెంట్రల్ జైలు సహాయక చర్యలకు తోడ్పడింది. 1986లో గోదావరికి కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో జైలులో సిద్ధం చేసిన ఆహార పొట్లాల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడిన చరిత్ర ఉందని రాజమహేంద్రవరం నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వి.ఎస్.ఎస్ కృష్ణ కుమార్ అన్నారు.
"సెంట్రల్ జైలును గుర్తు చేస్తే రాజమండ్రి, రాజమండ్రి అనగానే జైలు గుర్తుకి వచ్చేటంత చరిత్ర ఉంది. 1986 వరదల్లో ప్రజల ప్రాణాల రక్షణకి కూడా జైలు ఉపయోగపడింది. ఆహారం అందక అలమటిస్తున్న సమయంలో లక్షలాది ఆహార ప్యాకెట్లు జైలు నుంచి అందించారు" అంటూ ఆయన గుర్తు చేశారు
సుదీర్ఘ చరిత్ర ఉన్న జైల్లో అర్ధరాత్రి తలుపులు తెరిచిన ఘటన అరుదని, చంద్రబాబుని రిమాండ్ కోసం జైలుకి అర్ధరాత్రి ఒంటి గంట సమయలో తరలించారని ఆయన తెలిపారు.
అంతకుముందు 1987లో గుర్తేడులో ఐఏఎస్ అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేసిన ఘటనలో కూడా జైల్లో ఉన్న నక్సలైట్లని అర్ధరాత్రి పూట గేట్లు తెరిచి తరలించారని కృష్ణకుమార్ చెప్పారు.
ఆ ఘటన తర్వాత చంద్రబాబు రిమాండ్ కోసమే జైలు గేట్లు అర్ధరాత్రి తెరిచారని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఖలిస్తాన్’ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















