చంద్రబాబు అరెస్ట్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

చంద్రబాబు నాయుడు అరెస్టు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, నోటీసులపై సంతకం పెడుతున్న చంద్రబాబు నాయుడు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం...

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకి శనివారం తెల్లవారు జామున పోలీసులు చేరుకున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో బస్సు నుంచి బయటకి పిలిచి అరెస్ట్ నోటీసు ఇచ్చారు.

ఆ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు, పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఇదే కేసులో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులతో చంద్రబాబు

ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు తరపు న్యాయవాదులు పోలీసుల్ని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించే సమయంలో వివరాలన్నీ ఇస్తామని పోలీసులు చంద్రబాబుతో చెప్పారు.

డీఐజీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని ముందుగా శిబిరం నుంచి కార్యకర్తలు, నాయకులను తరలించారు.

చంద్రబాబుకు ఇచ్చిన సీఆర్‌పీసీ నోటీసులో క్రైమ్ నం. 29/2021 కింద అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఐపీసీలోని సెక్షన్లు120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, ఇంకా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన అరెస్టు నోటీసు

ఆధారాలు అడిగిన చంద్రబాబు

అరెస్ట్ సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. దానికి పోలీస్ అధికారులు సమాధానమిస్తూ ‘‘మా వద్ద ఆధారాలు ఉన్నాయి. హైకోర్టుకు ఇచ్చాం. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉన్నాయి. విజయవాడ తీసుకెళ్లేలోపు రిమాండ్ రిపోర్ట్ ఇస్తాం’’ అని డీఐజీ రఘురామి రెడ్డి చంద్రబాబు తరపు న్యాయవాదులకు వివరించారు.

చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విజయవాడ తరలించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల మీద నమ్మకం లేదని, ఎన్‌ఎస్‌జీ పర్యవేక్షణలో తన కాన్వాయ్‌లో వస్తానని చంద్రబాబు చెప్పడంతో పోలీసులు అంగీకరించారు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TeluguDesamParty

ఫొటో క్యాప్షన్, నోటీసును చదివి వినిపిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు

‘‘ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’- చంద్రబాబు నాయుడు

తెలుగు వారి ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

అరెస్ట్ తర్వాత ఆయన ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘‘గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. భూమ్మీది ఏ శక్తి కూడా నన్ను తెలుగు ప్రజలకు, నా మాతృభూమి ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయకుండా ఆపలేదు’’ అని ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఏం జరిగింది?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్‌ఎస్‌డీసీ‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నడుస్తుందని తెలిపారు. యువతకు అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశం.

ఇందుకు కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అందులో సీమెన్స్, డిజైన్ టెక్ సిస్టమ్స్ వంటి సంస్థలున్నాయి.

దిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేసే సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో చేసుకున్న ఎంవోయూ ప్రకారం ఏపీలో ఆరు ప్రాంతాల్లో స్కిల్ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ యువతకు నైపుణ్యం పెంచే దిశలో శిక్షణ అందిస్తారు.

ఇందుకు అయ్యే ఖర్చులో 10శాతం ప్రభుత్వం పెట్టుకుంటుందని, మిగతా 90శాతం సీమెన్స్ గ్రాంటుగా ఇస్తుందని నాడు ప్రభుత్వం తెలిపింది.

ఆ తరువాత ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజ్, ఆదిత్యా ఇంజినీరింగ్ కాలేజ్ సహా పలు ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుని ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు

ఎందుకు కేసు

2017 నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి సీమెన్స్ సంస్థ పనిచేస్తోంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం సీమెన్స్ సాంకేతిక సహకారం అందించాల్సి ఉంది. కానీ ఆ సంస్థ అందించలేదనేది ఆరోపణ. రికార్డుల్లో మాత్రం టెక్ సహాయం అందించినట్టు రాశారని సీఐడీ రిపోర్టులో పేర్కొంది.

సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలతో రూ.3,356 కోట్లకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో టెక్ కంపెనీలు 90 శాతం మేర వాటాను భరించాలన్నది ఒప్పందం. కానీ అది ముందుకు సాగలేదు.

మొత్తం ఆరు క్లస్టర్లని ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ కు రూ. 560 కోట్ల రూపాయల వెచ్చించాల్సి ఉంది. అందుకు గానూ ఏపీ ప్రభుత్వం తన వాటాగా 10శాతం అంటే సుమారు రూ. 371 కోట్లని చెల్లిస్తుందని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు.

దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ వాటా చెల్లించారు. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ తొలుత 2021 డిసెంబర్ 10న సీఐడీ కేసు నమోదు చేసింది.

సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3,300 కోట్లకు పెంచారంటూ సీమెన్స్ సంస్థ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ సహా పలువురిపై సీఐడీ ఆరోపణలు చేసింది.

ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 371 కోట్లును చెల్లించినప్పటికీ సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సాఫ్ట్‌వేర్ విలువ కేవలం రూ.58 కోట్లుగా సీఐడీ పేర్కొంది.

ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తరుపున కీలకంగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా 26 మందిపై కేసు నమోదయ్యింది. వీరిలో 10 మంది వరకూ అరెస్ట్ అయ్యారు.

తాజాగా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని కూడా ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRA PRADESH CM

ఫొటో క్యాప్షన్, జగన్మోహన్ రెడ్డి

ఏపీ ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది?

నిరుద్యోగులు, విద్యార్థుల పేరుతో జరిగిన అతి పెద్ద ‘స్కామ్’ ఇదేనంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. మార్చి 20న ఆయన ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవల్మెంట్ కార్పొరేషన్‌లో ‘అవకతవకలకు’ సంబంధించి మాట్లాడారు.

"క్యాబినెట్‌లో చెప్పిన దానికి, జీవోకు భిన్నంగా ఎంవోయూ జరిగింది. ఏపీలో మొదలయ్యి, విదేశాలకు చెందిన షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి, తర్వాత వాటిని తిరిగి హైదరాబాద్ వరకూ తరలించారు. జీఎస్టీ, ఇంటిలిజెన్స్, ఐటీ, ఈడీ సహా అందరూ దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులు ముఠాగా ఏర్పడి రూ.371 కోట్లు దోచుకున్నారు. ఆధారాలు దొరక్కుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్ సంస్థ రూ.3వేల కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఏ విధంగా ఇస్తుందన్న ఆలోచన కూడా లేకుండా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారు" అంటూ జగన్ ఆరోపించారు.

సీమెన్స్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగిని అడ్డంగా పెట్టుకుని ఇంత పెద్ద కుంభకోణం నడిపారని జగన్ అన్నారు. డీపీఆర్ కూడా లేకుండానే టెండర్ కూడా పిలవకుండా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారని జగన్ ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు

ఫొటో సోర్స్, FACEBOOK/TDP, APSSDC

టీడీపీ ఏమన్నది?

సీమెన్స్ సంస్థ తొలుత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఆధారంగా ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నం చేశామని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో అన్నారు. ఒప్పందం ప్రకారం సెంటర్లు ఏర్పాటు చేసి, లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

"సీమెన్స్ సంస్థలో ఆనాటికి అధినేతగా ఉన్న సుమన్ బోస్ తన ప్రయోజనాల కోసం కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చారు. జీఎస్టీ కట్టలేదని ఈడీ దర్యాప్తులో తేలింది. సీమెన్స్ 160 దేశాల్లో ఉన్న జర్మన్ సంస్థ. దానికి చంద్రబాబు మూలం అన్నట్టుగా చెబుతున్న మాటలు ప్రజలను మోసగించడమే.

సీమెన్స్ పేరుతో రూ. 371 కోట్లు పక్కదారి మళ్లించారన్నది అబద్ధం. దాని అనుబంధ సంఘాలను సూపర్ వైజ్ చేయాల్సింది సీమెన్స్ బాధ్యత. ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు" అంటూ ఆయన వివరించారు.

సీమెన్స్లో తప్పు జరిగితే చంద్రబాబు బాధ్యత అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీమెన్స్ తమకు సంబంధం లేదని చెప్పినదానిని పట్టుకుని అభియోగాలు చేయడం తగదన్నారు. సుమన్ బోస్, డిజైన్ టెక్ వికాస్ మధ్య జరిగిన నేరానికి తమ బాధ్యత లేదన్నారు.

వీడియో క్యాప్షన్, చంద్రబాబు అరెస్ట్: కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని పోలీసుల్ని ప్రశ్నించిన చంద్రబాబు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)