‘ఖలిస్తాన్’ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులో సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి.
రెండు దేశాలు ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించాయి.
కెనడా ఆరోపణలను భారతదేశం ఖండించింది. అవి అసంబద్ధమైనవని కొట్టిపారేసింది.
ప్రస్తుత పరిణామాలకు దారి తీసిన అంశాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
కెనడాలో ఎంత మంది సిక్కులు ఉన్నారు?
ప్రపంచంలోని అతి పెద్ద మతాల్లో సిక్కిజం కూడా ఒకటి. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో 16వ శతాబ్ధంలో ఈ మతం పుట్టింది. దేశం విడిపోయిన తర్వాత పంజాబ్ ప్రాంతంతో పాటు సిక్కులు రెండు దేశాల్లోనూ ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండున్నర కోట్ల మంది సిక్కుల వల్ల ఈ మతం అతి పెద్ద మతాల్లో ఐదో స్థానంలో ఉంది.
ఇందులో ఎక్కువ మంది భారత్‌లోనే నివసిస్తున్నారు. భారత దేశంలోని 140 కోట్ల మందిలో సిక్కుల జనాభా రెండు శాతం. విదేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు.
భారత్ తర్వాత సిక్కులు ఎక్కువ మంది కెనడాలో జీవిస్తున్నారు. అక్కడ 7.80 లక్షల మంది ఉన్నారు. కెనడా జనాభాలోనూ సిక్కులు రెండు శాతం.
అమెరికా, బ్రిటన్‌లలో ఐదు లక్షల మంది, ఆస్ట్రేలియాలో రెండు లక్షల మంది సిక్కులు ఉన్నారు.

1980ల్లో వేల మంది మృతి
సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది.
1980లలో ఈ ఉద్యమం పంజాబ్‌లో పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలోనే ఈ ప్రాంతంలో చెలరేగిన హింసాత్మక ఘటనల వల్ల వేల మంది మరణించారు.
అప్పట్లో భారత సైనిక బలగాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లతో ఉద్యమ వేడి తగ్గిపోయింది.
పంజాబ్‌లో ప్రస్తుత రాజకీయాలు ప్రత్యేక దేశమనే ఉద్యమానికి దూరంగా జరుగుతున్నాయని, ప్రత్యేక దేశం కోరుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతోందని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ప్రొఫెసర్ శృతి కపిల చెప్పారు.
విదేశాల్లోని సిక్కులు మాత్రం ప్రత్యేక దేశం కోసం గళమెత్తుతూనే ఉన్నారు. కొన్నేళ్లుగా ఇది తీవ్రంగా మారుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వానికి ఖలిస్తాన్ ఎందుకంత సీరియస్ అంశం?
భారత ప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు పంజాబ్‌లోని పార్టీలు కూడా హింస, వేర్పాటువాదాన్ని ఖండిస్తున్నాయి.
ప్రత్యేక దేశం కోసం పంజాబ్‌లో చాలా కాలంగా జరుగుతున్న హింస ఆధునిక భారత చరిత్రలో రెండు అత్యంత వివాదాస్పద ఘటనలకు కారణమైంది. అవి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం మీద సైనిక దాడి, ఇందిరా గాంధీ హత్య.
1984 జూన్‌లో భారత సైన్యం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేసి అక్కడ తలదాచుకున్న వేర్పాటువాద మిలిటెంట్లను కాల్చి చంపింది.
నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వర్ణ దేవాలయంపై జరిపించిన ఆపరేషన్‌లో అనేక మంది ప్రాణాలు పోయాయి. సిక్కుల పవిత్ర స్థలానికి నష్టం జరిగింది.
ఈ ఆపరేషన్ జరిగిన కొన్ని నెలల తర్వాత ఇందిరా గాంధీకి బాడీ గార్డులుగా ఉన్న ఇద్దరు సిక్కులు ఆమెను కాల్చి చంపారు. ఇందిర హత్యతో దిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో మత పరమైన ఘర్షణలు జరిగాయి.
ఈ దాడుల్లో వేల మంది చనిపోయారు. అందులో ఎక్కువ మంది సిక్కులే. మత ఘర్షణల్లో 3 వేల నుంచి 17 వేల మంది చనిపోయి ఉంటారనే అంచనాలు ఉన్నాయి.
1980లలో జరిగిన హింస తాలూకు గాయాలు ఇంకా మానకపోవడంతో ఖలిస్తాన్ అనే డిమాండ్‌ను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
సిక్కులకు ప్రత్యేక దేశం అనే అంశాన్ని దేశంలోని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ద్వైపాక్షిక దౌత్య సంబంధాల కోణంలో ఖలిస్తాన్ సమస్యను ఏ ప్రభుత్వమూ పట్టించుకునే పరిస్థితి లేదు.

ఫొటో సోర్స్, SIKH PA
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం ఉన్న భారత సంతతి వ్యక్తి, వయసు 45 ఏళ్లు.
ఆయన్ను ఈ ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సరీలో ఓ సిక్కు గురుద్వారా బయట కాల్చి చంపారు.
భారత్‌లోని పంజాబ్‌లో జలంధర్‌కు సమీపంలో ఉన్న బార్సింగ్‌పూర్ అనే గ్రామంలో ఆయన జన్మించారు. 1997లో కెనడా వెళ్లారు.
మొదట్లో ఆయన వడ్రంగి పని చేశారు. తర్వాత బ్రిటిష్ కొలంబియాలో ప్రముఖ సిక్కు నాయకుడిగా ఎదిగారు.
పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్‌ను ‘ఉగ్రవాది’గా ప్రకటించింది.
ఈ ఆరోపణలు ఆధార రహితమైనవని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. గతంలో చేసిన పోరాటం వల్లే ఆయన లక్ష్యంగా మారారని వారు చెబుతున్నారు.
కెనడాలో ఆయన హత్య జరిగే సమయానికి, స్వతంత్ర సిక్కు దేశం కోసం ఇండియాలో అనధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు భారత మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇటీవల అనూహ్యంగా మరణించిన ప్రముఖ సిక్కు నాయకుల్లో నిజ్జర్ మూడో వ్యక్తి.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాల్లోని సిక్కులపై భారత్ ఎలా ఒత్తిడి పెంచుతోంది?
విదేశాల్లో సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ప్రభుత్వాల మీద భారత ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న తీరు దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది.
సిక్కు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం సత్సంబంధాలకు అడ్డంకిగా మారుతుందని భారత ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది.
ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంపై తాము విచారణ జరుపుతామని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు.
అయితే ప్రత్యేక దేశం కోసం సిక్కులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని తాము అడ్డుకోలేమని అంటున్నారు.
ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపడంలో కెనడా ప్రభుత్వం విఫలమైందంటూ దిల్లీ నాయకత్వం బహిరంగంగానే విమర్శిస్తోంది. ప్రస్తుత హింసను ఆపేందుకు ప్రయత్నిస్తానని, విదేశీ జోక్యాన్ని ఎంత మాత్రం సహించేది లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చెబుతున్నారు.
బ్రిటన్ విషయానికొస్తే ఈ ఏడాది మార్చ్‌లో లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట జరిగిన సిక్కుల ఆందోళనల్లో భాగంగా ఓ వ్యక్తి ఖలిస్తాన్ బ్యానర్లు, జెండాలను ప్రదర్శించడం, కార్యాలయ భవనం మొదటి అంతస్తు బాల్కనీలో ఉన్న భారతీయ జెండాను తొలగించడం వివాదంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















