భారత్, కెనడా మధ్య సిక్కు వేర్పాటువాదులే చిచ్చు పెట్టారా? ట్రూడో ప్రభుత్వంపై మోదీ కోపానికి కారణాలేమిటి?

జస్టిన్ ట్రూడో, మోదీ

ఫొటో సోర్స్, NARENDRAMODI

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కెనడా - భారత్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంటోంది.

ఇటీవల జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానం చెడిపోవడంతో రెండు రోజులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

కానీ, ఆయన స్వదేశం చేరుకోగానే భారత్‌తో కెనడా ట్రేడ్ మిషన్‌ను నిలిపివేసినట్లు వార్తలొచ్చాయి.

ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను కెనడా నిలిపివేసినట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జీ శుక్రవారం వెల్లడించారు.

జీ20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వాడీవేడీ చర్చ జరిగినట్లు తెలిసింది.

కెనడాలో సిక్కు వేర్పాటువాదుల 'ఆందోళనలు', భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించే ఘటనలపై భారత ప్రధాని ఆగ్రహంగా ఉన్నారు. కెనడా అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని జస్టిన్ ట్రూడో కూడా గతంలో అన్నారు.

సిక్కు వేర్పాటు వాద ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

సిక్కు వేర్పాటువాద ఉద్యమ ప్రభావం

కొద్దికాలంగా కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సంస్థల కార్యకలాపాల కారణంగా భారత్‌ - కెనడా సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఏడాది జులైలో కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సంస్థలు, భారతీయ దౌత్యవేత్తల పోస్టర్లు అంటించి, వారిని టార్గెట్‌గా ప్రకటించాయి.

ఈ సంఘటన తర్వాత కెనడా హైకమిషనర్‌ను పిలిపించిన భారత్, అక్కడ జరుగుతున్న ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

2023 జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని పబ్లిక్ మార్కెట్‌లో 'ఖలిస్తానీ' నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది.

ఈ హత్య తర్వాత సిక్కు వేర్పాటువాదులకు, భారత ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ ప్రభావం చాలా దేశాల్లో కనిపించింది.

నిజ్జర్ హత్యకు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతుదారులు టొరంటో, లండన్, మెల్‌బోర్న్, శాన్‌ఫ్రాన్సిస్కో సహా అనేక నగరాల్లో ప్రదర్శనలు చేశారు.

నిజ్జర్ కంటే ముందు, భారత ప్రభుత్వం తీవ్రవాదిగా ప్రకటించిన పర‌మ్‌జీత్ సింగ్ పంజ్వాడ్ కూడా మే నెలలో లాహోర్‌లో హత్యకు గురయ్యారు.

ట్రూడో, మోదీ

ఫొటో సోర్స్, JUSTINTRUDEAU

అవతార్ సింగ్ ఖండా మృతి: భారత్‌పై ఆరోపణలు

ఇదే ఏడాది జూన్‌లో అవతార్ సింగ్ ఖండా బ్రిటన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనను 'ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్' చీఫ్‌గా చెబుతున్నారు.

ఆయనపై విషప్రయోగం చేసి హత్య చేశారని సిక్కు వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు.

వేర్పాటువాద సిక్కు సంస్థలు దీన్ని 'టార్గెట్ కిల్లింగ్‌'గా పేర్కొన్నాయి. సిక్కు వేర్పాటువాద నాయకులను భారత ప్రభుత్వం చంపేస్తోందని వారి ఆరోపణ.

అయితే, ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు.

ట్రూడో, మోదీ సమావేశమైన రోజే అక్కడ ‘రెఫరెండం’

భారత్‌లో సిక్కుల జనాభా రెండు శాతం. అయితే, కొంత మంది సిక్కు వేర్పాటువాదులు ప్రత్యేక దేశం 'ఖలిస్థాన్' కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కెనడాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సిక్కు వేర్పాటువాదులను అణచివేయడంలో ట్రూడో ప్రభుత్వం విఫలమైందని భారత్ ఆరోపిస్తోంది.

ఈ వేర్పాటువాదులు కెనడా, బ్రిటన్, అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని చెబుతోంది.

కెనడాలో సిక్కు వేర్పాటువాదులు క్రియాశీలంగా ఉండడమే భారత్, కెనడా సంబంధాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతకు ప్రధాన కారణం.

ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగిందంటే కెనడాలో ఖలిస్థాన్ అనుకూల ఉద్యమం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.

జీ20 సదస్సు సందర్భంగా దిల్లీలో ట్రూడో, మోదీ సమావేశమైన రోజే కెనడాలోని వాంకోవర్‌లో భారత్ నుంచి పంజాబ్‌ను విడదీయాలంటూ సిక్కు వేర్పాటువాదులు ‘రెఫరెండం’ నిర్వహించారు.

ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

బీటలు వారిన సంబంధాలు

జీ20 సమావేశాల సమయంలో, సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలపై మోదీ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో భారత్, కెనడా మధ్య దూరం పెరిగింది.

కాన్ఫరెన్స్‌లో అధికారికంగా శుభాకాంక్షలు చెప్పే సమయంలోనూ ట్రూడో, మోదీతో కరచాలనం చేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ దృశ్యం ఇరుదేశాల సంబంధాల్లో నెలకొన్న 'ఉద్రిక్తత'కు తార్కాణంగా కనిపించింది.

ఆ తర్వాత ట్రూడోతో చర్చల సందర్భంగా కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలు పెరగడాన్ని మోదీ లేవనెత్తారు.

ఈ విషయంలో ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మీడియాలో కథనాలొచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం, ''ఖలిస్థానీ అనుకూల శక్తులు భారత దౌత్యవేత్తలపై దాడులకు ప్రేరేపిస్తున్నాయి. భారత రాయబార కార్యాలయాలపై దాడులు చేసేలా రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. వారిని అడ్డుకోవడంలో కెనడా విఫలమైందని చెప్పారు.''

అయితే, శాంతియుత ప్రదర్శనలు, భావప్రకటనా స్వేచ్ఛను కెనడా ఎప్పుడూ కాపాడుతుందని జస్టిన్ ట్రూడో చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇది కెనడాకు చాలా ముఖ్యమైన విషయం. హింసను నిరోధించేందుకు, ద్వేషాన్ని తగ్గించేందుకు కెనడా ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారని వార్తాకథనాలు వెలువడ్డాయి.

"కొంత మంది చర్యలు మొత్తం కెనడా సమాజానికి వర్తించవని గుర్తుంచుకోవాలి" అని ట్రూడో చెప్పారు.

సంబంధాలు ఇంకా దెబ్బతింటాయా?

ట్రూడో ప్రకటన భారత ప్రభుత్వానికి రుచించకపోవడంతో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

దానికి తోడు, కెనడా అంతర్గత వ్యవహారాలను భారత్ ప్రభావితం చేస్తోందని ట్రూడో ఆరోపించారు.

ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను కెనడా నిలిపివేయడం ఇరుదేశాల సంబంధాలు క్షీణించినట్టేనా, లేదా మరింత మరింత దిగజార్చనుందా అని ఇండియన్ థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హర్ష్.వి.పంత్‌ని బీబీసీ అడిగింది.

''ట్రూడో అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితి మెరుగుపడేలా కనిపించడం లేదు. ట్రూడో దానిని వ్యక్తిగతంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. తమపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని వారు భావిస్తున్నారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రి మేరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంత్రి మేరీ

ఎఫ్‌టీఏ సమస్యల్లో పడిందా?

భారత్, కెనడా మధ్య నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులతో కెనడా ప్రభుత్వ నిర్ణయంతో ఎఫ్‌టీఏ (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) చర్చలు కూడా సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది.

దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతి కనిపించింది. ఈ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే ఆరుసార్లు చర్చలు జరిగాయి.

మార్చి 2022లో జరిగిన మధ్యంతర ఒప్పందంతో ఇరుదేశాలు చర్చలను పునఃప్రారంభించాయి.

ఈ ఒప్పందాల ప్రకారం, చాలా వస్తువులపై ఇరుదేశాలు సుంకాన్ని గణనీయంగా తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంటుంది.

కెనడియన్ మార్కెట్లలో తమ టెక్స్‌టైల్, లెదర్ వస్తువులపై సుంకం రద్దు చేయాలని భారత కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. నిపుణుల కోసం వీసా నిబంధనలను సులభతరం చేయాలన్న డిమాండ్ కూడా ఉంది.

కెనడా తన డైరీ, వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్‌లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది.

వాణిజ్య సంబంధాలు ఎంత బలమైనవి?

2022లో కెనడాకు పదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది.

2022-23లో కెనడాకు 4.10 బిలియన్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. 2021-22లో ఇది 3.76 బిలియన్ డాలర్లు.

2022-23లో భారత్‌కు 4.05 బిలియన్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను కెనడా ఎగుమతి చేసింది. 2021-22లో ఇది 3.13 బిలియన్ డాలర్లు.

సేవల రంగంలో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ భారత్‌లో 55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 2000 సంవత్సరం నాటి నుంచి భారత్‌లో కెనడా 4.07 బిలియన్ల ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది.

కెనడాకు చెందిన సుమారు 600 కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో 1000 కంపెనీలు వ్యాపార అవకాశాల కోసం చూస్తున్నాయి.

అటు కెనడాలో ఐటీ, సాఫ్ట్‌వేర్, సహజ వనరులు, బ్యాంకింగ్ రంగాల్లో భారతీయ కంపెనీలు చురుగ్గా ఉన్నాయి.

కెనడాకు భారత్ ఎగుమతి చేస్తున్న వాటిలో ఆభరణాలు, విలువైన రాళ్లు, ఫార్మా ఉత్పత్తులు, రెడీమేడ్ వస్త్రాలు, సేంద్రీయ రసాయనాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు ప్రధానంగా ఉన్నాయి.

కెనడా నుంచి పప్పులు, న్యూస్‌ప్రింట్, కలప గుజ్జు, ఆస్బెస్టాస్, పొటాష్, ఐరన్ స్క్రాప్, ఖనిజాలు, పారిశ్రామిక రసాయనాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)