పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' బిల్లు కోసమేనా?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై ప్రకటన చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశం 18 నుంచి 22 వరకు జరుగుతాయని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటనేది అధికారికంగా ఏమీ చెప్పలేదు.

మరోవైపు జమిలి ఎన్నికల (ఒకే దేశం- ఒకే ఎన్నికలు) సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గురించి మంత్రి ప్రహ్లాద్ జోషిని అడిగితే ఇప్పుడే కమిటీ వేశామని, అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.

‘’కమిటీ నివేదిక సిద్ధం చేస్తుంది. తర్వాత దానిపై చర్చ జరుగుతుంది. తర్వాత కమిటీ నివేదిక పార్లమెంట్‌లోకి వస్తుంది. సభలో నివేదికపై చర్చ జరుగుతుంది. పార్లమెంట్‌లో విజ్ఞులు, మేధావులు ఉన్నారు. భారత్ ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో కొత్త కొత్త విషయాలను తీసుకొచ్చేటప్పుడు దానిపై చర్చించడం అవసరం. ఇదేమీ తెల్లారగానే అమలు చేసే అంశం కాదు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏం చర్చిస్తామనే దానిపై రెండు, మూడు రోజుల్లో చెబుతాం. 1967 వరకు భారతదేశంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగేవి. దీనిపై చర్చ జరగాల్సిందే’’ అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం- ఒకే ఎన్నికలు బిల్లును ప్రవేశపెడతారని సభ్యులు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణను పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్చేందుకే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అనూహ్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక బిల్లుని ఆమోదించే అవకాశం లేకపోలేదని కొంతమంది చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అదే సందర్భంలో ప్రత్యేక సమావేశాల తేదీలపై మిగతా పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఒకే దేశం- ఒకే ఎన్నికలు

లోక్‌సభ- అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి (జమిలి ఎన్నికలు) నిర్వహించాలనే ప్రతిపాదన గురించి ప్రధానమంత్రి మోదీ కొన్నాళ్లుగా ప్రస్తావిస్తున్నారు.

ఇప్పుడా బాధ్యతను మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు అప్పగించడం ద్వారా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే దానికి ఇదొక సంకేతమని భావించవచ్చు.

2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కూడా... లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న మోదీ ఆలోచనకు మద్దతు పలికారు.

2018‌లో అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ఆయన పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ “ పదేపదే ఎన్నికలు జరగడం వల్ల మానవ వనరులపై ప్రభావం చూపడమే కాకుండా ఎన్నికల నియమావళి అమలు కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని” అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత మోదీ ప్రభుత్వ పదవీకాలం కొన్నినెలల్లో ముగియనుంది. దీంతో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ అనే ప్రతిపాదన ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని.. ఇకపై నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

జమిలి ఎన్నికల మీద స్పష్టత వస్తే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపై బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని ఆ పార్టీలో సీనియర్లు భావిస్తున్నారు. అందువల్ల ఈ నిర్ణయం రాజకీయంగానూ బీజేపీకి కలిసొచ్చే అంశమని, దీనివల్ల ప్రతిపక్షాలను సులువుగా ఓడించవచ్చని కమలం నేతలు నమ్ముతున్నారు.

ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మధ్య తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత వచ్చే ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

అయితే, ప్రభుత్వం కనుక జమిలి ఎన్నికల బిల్లు తీసుకొస్తే లోక్‌సభ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.

సోనియా గాంధీ, రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఒక్కసారిగా ప్రత్యేక సమావేశాలు ఎందుకు?

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఐదు రోజులు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అమృత్‌కాలంలో జరిగే ఈ ప్రత్యేక సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరుగుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. అయితే, ఏ అంశం మీద చర్చ జరుగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

ప్రత్యేక సమావేశాల అజెండాపై ప్రభుత్వం మౌనంగా ఉంది. సమావేశాల కారణాలను ప్రస్తావిస్తూ, ఈ సెషన్ జీ20 శిఖరాగ్ర సదస్సు, 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించినదని ఆంగ్ల వార్తా పత్రిక ద హిందూ రాసింది. అలాగే మేలో ప్రారంభించిన పార్లమెంట్ కొత్త భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఈ కథనంలో తెలిపింది.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని కూడా ఈ సమావేశాల్లోనే ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.

చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో పాటు ఇటీవల స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రస్తావించిన లక్ష్యాల గురించి ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చించవచ్చని హిందూ రిపోర్ట్ చేసింది.

“ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఒకే దేశం- ఒకే ఎన్నికలు లేదా మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక బిల్లులను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో తెలిపింది. ఈ సమావేశాలు పార్లమెంట్ కొత్త భవనంలో జరుగుతాయని అందులో వివరించింది.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పార్లమెంటులోని పాత భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగియవచ్చని ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.

సెప్టెంబర్ 9-10 తేదీల్లో దిల్లీలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ ఐదు రోజుల సెషన్‌ నిర్వహిస్తున్నారు.

దీంతో ప్రపంచ సదస్సు నిర్వహణ నుంచి చంద్రయాన్-3 విజయం వరకూ మోదీ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ఏకరవు పెట్టడానికి ఈ సెషన్‌ను వినియోగించుకునే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం రాసింది.

స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 మధ్య జరిగిన ప్రత్యేక సెషన్ మాదిరే ఈ సెషన్ నిర్వహించే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయం.

ఇది కాకుండా, ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌లో రాబోయే పీ-20 సదస్సు (G20 దేశాల పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌ల సమావేశం) కోసం ఫ్రేమ్‌వర్క్‌ను కూడా సిద్ధం చెయ్యవచ్చు. పీ-20 సదస్సు అక్టోబర్‌లో దిల్లీలో జరగనుంది. ఈ సదస్సుకు 30కి పైగా దేశాల స్పీకర్లు హాజరు కానున్నారు.

పాత పార్లమెంట్ భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత పార్లమెంట్ భవనం

ఎప్పుడైనా ఇలా జరిగాయా?

మోదీ ప్రభుత్వం ఇంతకు ముందు 2017 జూన్ 30న వస్తు, సేవల బిల్లుని అమలు చేసేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం 2015 నవంబర్ 26న బీ ఆర్ అంబేద్కర్‌కు శ్రద్ధాంజలి అర్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆ ఏడాది దేశవ్యాప్తంగా అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ అదే ఏడాది నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు 2002లో బీజేపీ నాయకత్వంలోని తాత్కాలిక ఎన్డీయే ప్రభుత్వం మార్చి 26న ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉగ్రవాద నిరోధక బిల్లును ఆమోదించింది, ఎందుకంటే అప్పట్లో ఎన్డీయే కూటమికి రాజ్యసభలో బిల్లుల్ని ఆమోదించుకోగలిగినంత మెజారిటీ లేదు.

క్విట్ ఇండియా ఉద్యమం 50వ వార్షికోత్సవం సందర్భంగా 1992 ఆగస్టు 9న అర్ధరాత్రి భారత పార్లమెంటు సమావేశాలు నిర్వహించారు.

ముంబైలో ఇండియా కూటమి సమావేశం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ముంబైలో ఇండియా కూటమి సమావేశం జరిగింది

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని విపక్ష నేతలు విమర్శించారు. విపక్ష పార్టీల ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైన సమమయంలోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. తమ సమావేశానికి ప్రతి స్పందనగానే స్పెషల్ సెషన్ ప్రకటన వచ్చిందని ఇండియా కూటమి అంటోంది.

ప్రత్యేక సమావేశానికి సంబంధించిన అజెండా ప్రతిపక్ష పార్టీలను కూడా విభజించే అవకాశం ఉందని సీనియర్ బీజేపీ నేత ఒకరు చెప్పినట్లు ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాసంస్థ పేర్కొంది.

‘ఇది విపక్షాలను విభజించే అంశం కావచ్చు. చాలా పెద్ద పార్టీలు ఈ బిల్లును తిరస్కరించే స్థితిలో లేకపోవచ్చు’ అని ఆ బీజేపీ నేత అన్నారని ఆ కథనం తెలిపింది.

ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా శీతాకాల సమావేశాల నిర్వహణను పక్కన పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దాని వల్ల త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలను సమయానికి ముందే నిర్వహించే అవకాశాలను అన్వేషించవచ్చని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు హిందూ దిన పత్రికతో చెప్పారు.

ప్రభుత్వం భయపడుతోందని తాజా నిర్ణయంతో తెలుస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అదానీ గురించి ప్రస్తావించినప్పుడల్లా ప్రధానమంత్రి చాలా అసౌకర్యంగా, ఒత్తిడికి లోనవుతున్నారని రాహుల్ గాంధీ ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అన్నారు.

ప్రత్యేక సమావేశాల నిర్వహణ సమయంపై మహారాష్ట్ర నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

‘వినాయక చవితి పండుగ సమయంలో ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం దురదృష్టకరం, ఇది హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఉంది. దీనికి ఎంచుకున్న తేదీలను చూసి షాకయ్యాను’ అని శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విటర్‌లో పోస్టు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఇండియా కూటమి సమావేశం

ఫొటో సోర్స్, TWITTER

'ఇండియా కూటమి వార్తలు రావొద్దని'

అదే సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ప్రత్యేక సమావేశ తేదీలను మార్చాలని కోరారు.

"మనమందరం అర్ధవంతమైన చర్చను కోరుకుంటున్నాం. సమావేశాలు జరిగే రోజులు వినాయక చవితి పండగతో కలుస్తున్నాయి. అందుకే ఈ తేదీలను మార్చాలని కేంద్ర పార్లమెంటరీ మంత్రిని అభ్యర్థిస్తున్నాం" అని ఆమె ట్వీట్ చేశారు.

గౌతమ్ అదానీ వ్యాపారాలపై తాజాగా మరో విదేశీ సంస్థ విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.

'మోదీ స్టైల్ ఆఫ్ న్యూస్.. ఈరోజు మోదానీ స్కామ్‌లో కొత్త విషయాలు బయటకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముంబైలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశ వార్తలను కవర్ చేస్తారు. దీన్ని ఎలా ఆపాలి?. ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్ని ఏర్పాటు చెయ్యండి. అది కూడా వర్షాకాల సమావేశాలు ముగిసిన మూడు వారాల తర్వాత" అని ఆయన ట్వీట్ చేశారు.

విపక్ష ఇండియా కూటమి మూడో సమావేశం జరుగుతున్నప్పుడే ప్రత్యేక సమావేశాల గురించి ప్రకటించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 12న ముగిశాయి.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 23 బిల్లులను ఆమోదించింది. ఈ సెషన్‌లో మణిపూర్ హింస గురించి ప్రస్తావించడంతో పాటు దిల్లీలో అధికారుల పోస్టింగులు, బదిలీల బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై కూడా మూడు రోజుల పాటు చర్చ జరిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)