ఆసియా కప్ 2023 : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే టెన్షన్ తప్పదా, ఎందుకీ భావోద్వేగాలు?

శ్రీలంకలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, సురేష్ మీనన్
    • హోదా, స్పోర్ట్స్ రైటర్

భారత్, పాకిస్తాన్‌లు ఆయుధాలతో తలపడే పరిస్థితులు లేవు. కానీ, క్రికెట్ వరల్డ్ కప్, ఆసియాకప్ లాంటివి బ్యాట్లతో యుద్ధానికి అవకాశం కల్పిస్తుంటాయి.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే రెండు దేశాలలోనే కాదు, క్రికెట్ ఆడే దేశాలలో సైతం ఆసక్తే. ఆ రోజు భారత్, పాకిస్తాన్‌లలో కోట్లమంది మంది ప్రేక్షకులు టీవీకే అతుక్కుపోతారు.

అణ్వాయుధాలున్న ఈ రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం వాటి క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపుతూనే ఉంటుంది.

2012 నుంచి భారత్-పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడలేదు. కానీ, క్రికెట్ ఆడే దేశంగా మనుగడ సాధించాలంటే పాకిస్తాన్‌కు భారత్ అవసరం ఉంది. విజయవంతమైన జట్టుగా నిరూపించుకునేందుకు భారత్‌కి కూడా పాకిస్తాన్ అవసరం అంతే ఉంది.

ఆడితే ఆ దేశంతోనే ఆడాలని, క్రికెట్‌లో తమ సిసలైన ప్రత్యర్ధి ఆ దేశమేనని రెండు దేశాలు కూడా చెప్పుకుంటుంటాయి.

కానీ గెలుపోటములనేవి నిత్యం ఒకరి చేతుల్లోనే ఉండేవి కావు. అటూ ఇటూ మారుతుంటాయి.

ఓటమి గురించి మితిమీరిన ఆందోళన, గెలుపు విషయంలో అత్యుత్సాహం అనేవి ఈ రెండు దేశాలకు చాలా సహజమైన అంశాలు. అయితే, ఏది ఎలాగున్నా, వీరిద్దరి మధ్య ఆట ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీ అన్న వాస్తవాన్ని మాత్రం కాదనలేం.

ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ శనివారం జరగనుంది.

మ్యాచ్‌ షెడ్యూళ్ల విషయంలో ఎవరి నుంచి పెద్దగా అభ్యంతరాలు వినిపించలేదు. ఎందుకంటే, భారత్-పాకిస్తాన్‌ల మధ్య కనీసం ఒక మ్యాచ్ ఉండేలా ఈ షెడ్యూల్ ఉంది.

నేపాల్‌తో పాటు భారత్, పాకిస్తాన్‌ టీమ్‌లు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. మూడు జట్ల ఈ గ్రూప్‌లో నేపాల్ బలహీనమైన జట్టు.

వీటిలో రెండు జట్లు ‘‘సూపర్ ఫోర్’’ రౌండ్ రాబిన్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ రౌండ్‌లో ప్రతి ఒక్క జట్టు, ప్రతి జట్టుతో ఆడాల్సి ఉంటుంది. అంటే ప్రతి జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడుతుంది.

గెలిచే ఈ జట్ల మధ్య ఫైనల్‌లో మూడోసారి పోటీ ఉంటుంది.

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లను ఇరు దేశాల్లో లక్షలాది మంది ప్రేక్షకులు వీక్షించే అవకాశం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లను ఇరు దేశాల్లో లక్షలాది మంది ప్రేక్షకులు వీక్షించే అవకాశం

భారత్, పాకిస్తాన్‌ల జట్ల మధ్య అనేక సామ్యాలు కనిపిస్తాయి. ఒకే సంస్కృతి ఉన్న దేశాలుగా విభజనకు గురైనప్పటికీ, రెండు దేశాల మధ్య భావోద్వేగాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఈ భావోద్వేగాలు రాజకీయ నాయకుల నిర్ణయాల నుంచి టీవీ ప్రకటనల అమ్మకాల వరకు ప్రభావితం చేస్తాయి.

భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలను నిర్ణయించడంలో చరిత్ర, భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ, సైకాలజీలు కీలకపాత్ర పోషిస్తాయి.

భారత్‌లో తనని ఎక్కువ మంది ప్రేమిస్తారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చెప్పిన కొన్నాళ్లకే ఆయనకు లాహోర్ హైకోర్ట్‌ నుంచి లీగల్ నోటీసు వచ్చింది.

గతంలో ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా అఫ్రిదీ ఆట తీరును మెచ్చుకున్నందుకు మేరఠ్ యూనివర్సిటీకి చెందిన 67 మంది విద్యార్థులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారు దేశద్రోహం ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు.

ఆటలను ఆటగానే చూడాలని, ఇవి ప్రజల మధ్య సుహృద్భావం పెంచేలా ఉండాలని అంటుంటారు. కానీ, భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అందుకు భిన్నంగా ఉంటాయి. ఒక యుద్ధాన్ని తలపిస్తాయి.

ఆటల్లో గెలుపోటములు ఆయ దేశాల మధ్య రాజకీయాలు, అందాల పోటీలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లాంటి అంశాల మీద ప్రభావం చూపేలా ఉండకూడదు. కానీ, ఈ రెండు దేశాల విషయంలో అలా ఎప్పుడూ జరగదు. ఓడినా, గెలిచినా అవతలి దేశంపై కామెంట్లు వెల్లువెత్తుతూనే ఉంటాయి.

పాకిస్తాన్, భారత్‌లు శనివారం తటస్థ వేదిక శ్రీలంకలో తలపడతాయి. పాకిస్తాన్ నిర్వహించే టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత్ అంగీకరించిన ఏకైక వేదిక ఇదే.

ఇరుదేశాల మధ్యనున్న రాజకీయ ఘర్షణతో భారత్ జట్టు పాకిస్తాన్‌‌ వెళ్లి ఆడటానికి నిరాకరించింది. దీంతో ఈ మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను తటస్థ దేశానికి మార్చారు..

ఈ విషయంలో భారత్ కాస్త మెతకగా వ్యవహరిస్తే తమకు లాభాల పంట పండుతుందని నిర్వాహకులకు తెలుసు. కానీ, అది జరగలేదు.

భారత్ పాక్‌లు టాప్ బ్యాటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత్ పాక్‌లు టాప్ బ్యాటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

ఇరు దేశాల జట్లకు ఒకే రకమైన సమస్యలున్నాయి. రెండు జట్లకు కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కాస్త అస్థిరంగా ఉండటంతో, టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడ్డాయి. అంతేకాక, రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు.

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇఫ్తిఖర్ అహ్మద్ చేసిన సెంచరీ, పాకిస్తాన్‌కు సరికొత్త ఊపును ఇచ్చి ఉండొచ్చు. బాబర్ అజామ్ బ్యాటింగ్ విరాట్ కోహ్లి అభిమానులను రెచ్చకొడుతుండొచ్చు.

పాకిస్తాన్‌ను ఓడిచేందుకు కోహ్లి ఎక్కువ పరుగులు చేయాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఒకవేళ భారత్ ఇషాన్ కిషన్‌ను మూడవ ప్లేయర్‌గా దించితే, తన అటాకింగ్ నైపుణ్యంతో మిడిల్ ఆర్డర్‌కు నేతృత్వం వహించేలా విరాట్ కోహ్లి నాలుగో స్థానానికి వెళ్లాల్సి రావచ్చు.

బ్యాటింగ్‌లో కొన్ని సమస్యలను కూడా తప్పనిసరిగా పరిష్కరించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుంటున్నందున అతను ఈ మ్యాచ్‌లో ఆడలేకపోవచ్చు.

టాప్ 5లో ఉన్న బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ బౌలింగ్ చేయకపోవడం, చివరిలో స్థిరమైన హిట్టర్ లేకపోవడం భారత్‌కు మైనస్ పాయింటే.

మిగతా మ్యాచుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయని తెలిసినా, ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు చేయడానికి భారత్ ప్రయత్నించకపోవచ్చు. ఎందుకంటే ఇది గెలిచి తీరాల్సిన మ్యాచ్ మరి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)