పప్పు: ఇండియా మెచ్చిన శుద్ధ శాకాహార పోషకాహార వంటకం.. నోరూరించేలా వండడం ఇలా

ఫొటో సోర్స్, Balázs Glódi
- రచయిత, చారుకేశి రామదురై
- హోదా, బీబీసీ ట్రావెల్
పప్పు అనేది భారతదేశంలో చాలా మందికి కేవలం ఒక ఆహార పదార్థం కాదు, అదొక సౌకర్యం, పోషకాహారం. అచ్చమైన ఇంటి రుచి కూడా.
‘‘పప్పు నాకు చాలా సౌకర్యవంతమైన ఆహారం. రోజూ తింటాను. బాగా అలసిపోయినప్పుడు కానీ, బేడ్ డే అనుకున్న రోజున కానీ అన్నం, పప్పు తింటాను. దాంతో నా మూడ్ మారుతుంది. మూడ్ బాగా లేనప్పుడు నన్ను మళ్లీ సాధారణ స్థితికి తేవడానికి పప్పును మించింది లేదు’’ అని చెప్పారు వంటల పుస్తక రచయిత పిడతల అర్చన.
చాలా మంది భారతీయులు పప్పు గురించి ఇలాగే చెప్తారు. చాలా మందికి ఇది రోజువారీ వంటకం మాత్రమే కాదు. ప్రోటీన్ అందించే ఒక బలవర్థక ఆహారం. శాకాహారులు, వీగన్లు కూడా తినగలిగేలా ఆహారం.

ఫొటో సోర్స్, Balázs Glódi
ఆ రుచే వేరు
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పప్పు వండుతారు. వండేటప్పుడు వాడే మసాలాలు, అందులో కలిపే ఇతర పదార్థాలు, వండే విధానం మారినా పప్పు మాత్రం భారత్‌లో దేశమంతా కనిపించే వంటకం.
దక్షిణ భారతదేశంలో కందిపప్పు సాంబారులో కలుపుతారు. పంజాబ్‌లో ‘దాల్ మఖానీ’ని మినప పప్పుతో వండుతారు.
ఏ పప్పునైనా మెత్తగా ఉడికించి ఆవాలు, జీలకర్ర వంటివాటితో తాళింపు వేసి కొత్తి మీర తురుము పైన కొద్దిగా వేసి వడ్డిస్తే ఆ రుచే వేరు.
పప్పులో కాస్త గోంగూర వేసుకుంటే పుల్లపుల్లగా మరింత బాగుంటుందని అర్చన పిడతల చెప్పారు.
పప్పులో ఆనప కాయ ముక్కలు వేసి ఆనపకాయ పప్పు చేసుకున్నా బాగుంటుందని ఆమె చెప్పారు.
పప్పుతో ఎన్ని రకాల వంటలైనా చేయొచ్చని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఫొటో సోర్స్, Balázs Glódi
90 వంటకాలతో పుస్తకం
అర్చన రాసిన ‘వై కుక్: టైమ్‌లెస్ రెసపీస్ ఫ్రం లైఫ్ లెసన్స్ ఫ్రమ్ ఇన్‌స్పైరింగ్ వుమన్’ పుస్తకంలో, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 16 మంది మహిళలు చెప్పిన 90 వంటకాలకు స్థానమిచ్చారు.
అందులో అర్చన తల్లి చెప్పిన ఓ వంటకం కూడా ఉంది.
అర్చన దేశవ్యాప్తంగా 11,265 కిలోమీటర్లు ప్రయాణించి ఈ మహిళలందరినీ కలిసి, వారి జీవితాలు, వారి వంటకాలు తెలుసుకున్నారు. వారు వండుతుంటే చూసి నేర్చుకున్నారు.
ఈ పుస్తకంలో వంటలు చెప్పిన మహిళలెవరూ వంట వృత్తిగా ఉన్నవారు కాదు. కానీ, తమకు, తాము వండి పెట్టే కుటుంబ సభ్యులకు పోషకాలు అందించడంలో వంటను కీలక మార్గంగా మార్చుకున్న మహిళలు వీరంతా.
ఈ పుస్తకంలో అర్చన 16 మంది మహిళల జీవితాలను కూడా చెప్పారు. ఉదాహరణకు ఇందులో పేర్కొన్న నటి అరుంధతి నాగ్ తన భర్త తరఫు కుటుంబంలో అలవాటుగా ఉన్న వంటలేవీ వండేవారు కాదు. అలా చేయడం వల్ల సొంత అస్తిత్వం పోతుందని భావించారామె. కానీ, భర్త మరణం తరువాత ఆయన్ను గుర్తు చేసుకుంటూ నిత్యం ఆయన తరపు కుటుంబ సభ్యులకు సంబంధించిన వంటలే చేస్తున్నారిప్పుడు.

ఫొటో సోర్స్, Balázs Glódi
ఈ పుస్తకంలో పరిచయం చేసిన మరో మహిళ విశాలాక్షి పద్మనాభన్. ఆమె సేంద్రియ వ్యవసాయం చేయడమే కాకుండా బెంగళూరు సమీపంలోని రాగిహళ్లి గ్రామ మహిళలకు కుకీస్ తయారు చేసి అమ్మడం నేర్పించి జీవనోపాధి కల్పిస్తున్నారు.
బెంగాలీలు ఎక్కువగా వండే మసూర్ దాల్(మొసర పప్పు) ఎలా చేయాలో మనీశా కైరాలీ వివరించారు. అర్చన తన పుస్తకంలో దీనికి స్థానమిచ్చారు. మనీశా బెంగాలీ అయిన తన అమ్మమ్మ నుంచి ఈ వంటకం నేర్చుకున్నట్లు చెప్పారు.
నిమిషాలలో రెడీ అయ్యే మసూర్ దాల్
బాగా ఉడికించిన పప్పును ఆవ నూనెలో నల్ల జీలకర్ర, ఇతర దినుసులతో తాళింపు వేశారు. అందులో కాస్త నిమ్మ రసం పిండారు.
అంతే, బ్రహ్మాండమైన రుచి వచ్చింది దానికి.
ఈ పప్పును నిమిషాల్లో తయారుచేయొచ్చు.
అన్నం, రొట్టెలు, చపాతీలు.. ఇలా దేంతోనైనా తినొచ్చు.
సూప్‌లా కూడా తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మసూర్ దాల్ తయారీ విధానం
కావలసినవి:
200గ్రా (1 కప్పు) పొట్టు తీసిన మసూర్ పప్పు
¼ టీస్పూన్ పసుపు పొడి
1 టేబుల్ స్పూన్ ఆవ నూనె
½ టీ స్పూన్ నల్ల జీలకర్ర. ప్రత్యామ్నాయంగా జీలకర్ర కూడా వాడొచ్చు.
2 ఎండు మిరపకాయలు,
3-4 పచ్చి మిరపకాయలు. వీటిని నిలువుగా సగానికి కోయాలి.
ఉప్పు తగినంత.
తరిగిన కొత్తిమీర సరిపడా.
కోసిన నిమ్మకాయలు.
వేడి అన్నం
కుక్కర్‌లో ఉడికించి..
మసూర్ పప్పును బాగా కడిగి కన్నాల పాత్రలో వేసి నీరంతా దిగిపోయేలా చేయాలి.
తరువాత దాన్ని కుక్కర్‌లో వేసి రెండున్నర కప్పుల నీరు కలిపి మూతపెట్టి మూడు విజిళ్లు వచ్చే వరకు స్టవ్‌పై ఉంచాలి. 10 నుంచి 12 నిమిషాలలో మూడు విజిళ్లు వచ్చేస్తాయి.
కుక్కర్‌లో ప్రెజర్ తగ్గిన తరువాత ఉడికిన పప్పును ఒక గిన్నెలోకి తీసి మెత్తగా చేయాలి.
తరువాత దానికి పసుపు పొడి కలిపి ఉంచాలి.
మెత్తగా చేసే పని వేరేగా పెట్టుకోకూడదనుకుంటే, కుక్కర్‌లో మరో విజిల్ వచ్చే వరకు ఉంచి దించాలి.
అంటే సుమారు 15 నిమిషాలు ఉడికిస్తే మెత్తగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
తాళింపు ఇలా..
అలా బాగా ఉడికించిన పప్పును తాళింపు వేయాలి.
ఇందుకోసం కళాయిలో ఆవ నూనె కొద్దిగా వేసి మరిగించాలి. అందులో నల్ల జీలకర్ర కానీ సాధారణ జీలకర్ర కానీ వేయాలి, ముందే సిద్ధం చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు వేసి అర నిమిషం వేయించాలి.
ముందే ఉడికించి సిద్ధం చేసిన పప్పులో తగినంత ఉప్పు వేసి కలిపి ఆ మొత్తాన్నీ కళాయిలోని తాళింపులో వేయాలి.
రెండు నిమిషాలు అలా స్టవ్ మంటపైనే ఉంచి దించేయాలి.
తరువాత దానిపై తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి.
అన్నంలో కలుపుకొని కానీ నంచుకుని కానీ దీన్ని తినొచ్చు. నిమ్మకాయ రసం తగినంత పైపాటుగా పిండుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














