విశాఖపట్నం - అమెరికన్ కార్నర్: యూఎస్ వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సేవలు

వర్క్ షాప్
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలోని అమెరికన్ కార్నర్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉన్నత విద్య, ఉద్యోగం కోసం చాలామంది భారతీయులు అమెరికా వైపు చూస్తుంటారు. అయితే, అమెరికా వెళ్లాలంటే ఏం చేయాలి? వివరాలు ఎవరిస్తారు? అనే విషయాలు చాలామందికి తెలియదు.

కన్సల్టెన్సీలను అడిగి, కొన్నిసార్లు మోసపోతుంటారు కూడా.

ఇలాంటివి జరగకుండా అభ్యర్థులకు సమాచారం అందించడానికి యూఎస్ ప్రభుత్వం దేశంలోని ఆయా నగరాల్లో అమెరికన్ కార్నర్ పేరుతో సేవలను అందిస్తోంది.

ఇలాంటి అమెరికన్ కార్నర్ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో కూడా ఉంది. ఏయూ భాగస్వామ్యంలో యూఎస్ కాన్సులేట్ దీనిని ఏర్పాటు చేసింది. ఇక్కడ అన్ని సేవలు ఉచితమే.

అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో కూడా అమెరికన్ కార్నర్‌లు ఉన్నాయి. విశాఖలో ఈ కార్నర్ 2021 సెప్టెంబర్ 23న ప్రారంభించారు.

వర్క్ షాపు

ఫొటో సోర్స్, American Corner, AU

ఫొటో క్యాప్షన్, విద్యార్థులు, ఉద్యోగార్థులకు యూఎస్ గురించిన సమాచారం అమెరికన్ కార్నర్‌లో అందజేస్తున్నారు.

ఇటీవలే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులను అమెరికా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో తని‌‍ఖీలలో భాగంగా ఆ విద్యార్థుల వద్ద సరైన పత్రాలు లేవని, తిప్పి పంపించారు అమెరికా అధికారులు.

ఇలాంటి పరిస్థితే చాలామంది భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. సరైన సమాచారం, అవగాహన లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని విశాఖలోని అమెరికా కార్నర్ మెంటార్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ బీబీసీతో అన్నారు.

అమెరికన్ కార్నర్

ఎవరైనా సంప్రదించవచ్చు

ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్‌లో అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి అక్కడి విద్యా, ఉద్యోగావకాశాలతో పాటు అక్కడి విద్యాసంస్థలు, వాటి ప్రవేశ పరీక్షల తీరు, అక్కడి భాష, సంస్కృతి, ఆ దేశ రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని జేమ్స్ స్టీఫెన్ చెప్పారు.

తాము అందించే సమాచారమంతా యూఎస్ కాన్సులేట్ అధికారికంగా అందించే సమాచారం కాబట్టి ఎటువంటి తప్పు జరిగే అవకాశం ఉండదన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని విద్యార్థులు ఎవరైనా తమని సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.

“అమెరికాలో విద్యార్థికి అవసరమయ్యే ప్రతి అంశంపై అవగాహన కల్పిస్తాం. దీని కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని నియమించడంతో పాటు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంచాం. అమెరికాకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా పూర్తిగా అందిస్తాం. అంతేకాకుండా అమెరికా కాన్సులేట్ అధికారులతో విద్యార్థులే నేరుగా మాట్లాడే అవకాశం కూడా అమెరికన్ కార్నర్‌లో లభిస్తుంది” అని జేమ్స్ స్టీఫెన్ వివరించారు.

అమెరికా కార్నర్
ఫొటో క్యాప్షన్, అమెరికన్ కార్నర్ బృందం

ఖర్చు భరిస్తున్న యూఎస్

భారత యువత అమెరికా కలల్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలు చేస్తున్నారని ప్రొఫెసర్ శోభ శ్రీ తెలిపారు. వీసా పొందడం, అక్కడ చదువుకునే విద్యా సంస్థను ఎంచుకోవడంలో కొందరు పొరపాట్లు చేస్తున్నారని ఆమె అన్నారు.

ఆమె ఇద్దరు పిల్లలు 1995లోనే అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. అమెరికా వెళ్లాలని అమెరికన్ కార్నర్‌కి వచ్చే వారికి శోభశ్రీ గైడ్ చేస్తారు.

“అమెరికన్ కార్నర్‌కి వచ్చిన విద్యార్థులు సులభంగా అమెరికా వెళ్లగలుగుతున్నారు. వారికి అవసరమయ్యే సలహాలు, సూచనలు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం నేర్పుతున్నాం. అమెరికాకు సంబంధించిన పుస్తకాలతో ఒక మినీ లైబ్రరీని నిర్వహిస్తున్నాం” అని శోభశ్రీ తెలిపారు.

ఈ అమెరికన్ కార్నర్ నిర్వహణ వ్యవహారాలను ఏయూ పర్యవేక్షిస్తున్నప్పటికీ, నిర్వహణ ఖర్చును యూఎస్ కాన్సులేట్ భరిస్తోంది.

అమెరికా వెళ్లాలనుకునే వారికి ఉపయోగపడే కార్యక్రమాలను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాలను అమెరికన్ కార్నర్ ముందుగానే తెలియజేస్తుంది.

అమెరికన్ కార్నర్ నిర్వహించే కార్యక్రమాల్లో మహిళా సాధికారత, పర్యావరణ అంశాలతోపాటు ఆంగ్ల భాషా నైపుణ్యాల శిక్షణకు ప్రాధాన్యం ఉంటుందని ప్రొఫెసర్ శోభశ్రీ వివరించారు.

వర్క్ షాపు

ఫొటో సోర్స్, American Corner, AU

ఆశావహులకు వర్క్ షాపులతో శిక్షణ

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అవసరమయ్యే వర్క్ షాపులను అమెరికన్ కార్నర్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ వివిధ అంశాలపై సమగ్రమైన సమాచారాన్ని పొందవచ్చు.

అమెరికన్ కార్నర్‌లో ఉన్న కంప్యూటర్లలో ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇక్కడికి ఎవరైనా నేరుగా వచ్చి ఆ సమాచారాన్ని పొందవచ్చు.

అమెరికా దేశానికి సంబంధించిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌ ఇక్కడ పొందవచ్చు. ఒకేసారి 30 మంది సేవలు పొందే విధంగా ఈ సెంటర్లో ఏర్పాట్లు ఉన్నాయి.

అమెరికాకు, భారతీయ విద్యార్థులకు మధ్య వారధిగా అమెరికన్ కార్నర్ పని చేస్తుందని విశాఖ అమెరికన్ కార్నర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. లక్ష్మయ్య బీబీసీతో చెప్పారు.

‘’అమెరికా కల్చర్, ఫుడ్, బీహేవీయర్ అన్నింటిని కూడా ఇక్కడ విశ్లేషిస్తూ విద్యార్థులకు వివరిస్తాం. చాట్ విత్ డిప్లొమట్ అనే కార్యక్రమం ప్రతి నెల హైదరాబాద్‌లో ఉండే యూఎస్ కాన్సుల్ జనరల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతుంది. యూఎస్‌లో ఉండే ఉద్యోగ అవకాశాలు, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి? వివిధ యూనివర్సిటీలలో సీట్లు పొందాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది? వీసా పొందే సమయంలో వచ్చే సమస్యలను ఎలా అధిగమించాలి? వంటి విషయాలను ఈ కాన్ఫరెన్స్‌లలో వివరిస్తారు’’ అని ఆయన తెలిపారు.

అమెరికన్ కార్నర్

ఫొటో సోర్స్, American Corner, AU

ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల కోసం..

అమెరికా వెళ్లేందుకు గ్రామీణ, పేద ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గవర్నమెంట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అమెరికా వెళ్లే సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు అమెరికన్ కార్నర్ శిక్షణ ఇస్తోంది.

“ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే వారు అమెరికా వెళ్లేందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీలను సంప్రదించలేరు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నది. ఒక వేళ వాళ్లు ఎవరినైనా సంప్రదించినా ఆ సమాచారం నమ్మదగినదా, కాదా? అనేది అనుమానమే. అందుకే వాళ్లకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందించడం కోసం మేం మొదట శిక్షణ తీసుకుంటున్నాం. ఆ విషయాలను కళాశాలల్లో విద్యార్థులకు వివరిస్తున్నాం” అని విశాఖలోని డాక్టర్ వీఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ నిఖిత అన్నారు.

వర్క్ షాపు

ఫొటో సోర్స్, American Corner, AU

'పెట్టుబడులు ఎలా రాబట్టాలో చెప్పారు'

అమెరికా కార్నర్ కేవలం అమెరికా వెళ్లి విద్య, ఉద్యోగం సంపాదించాలనుకునే వారి కోసమే కాకుండా మహిళా సాధికారత, స్టార్టప్ కంపెనీల కోసం పెట్టుబడులు, దేశాల మధ్య సత్సంబంధాలు తదితర అంశాల్లో కూడా కృషి చేస్తుందని విశాఖ అమెరికన్ కార్నర్ మెంటార్ జేమ్స్ స్టీఫెన్ చెప్పారు.

అందులో భాగంగానే తూర్పు నౌకదళంతో విన్యాసాలు చేసేందుకు అమెరికా నేవీ, ఆర్మీ అధికారులు వచ్చేటప్పుడు వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఎన్‌సీసీ క్యాడెట్లను పంపుతున్నామని ఆయన తెలిపారు.

“అమెరికా ఆర్మీ, నేవీ అధికారులను ఎన్‌సీసీ క్యాడెట్లుగా మేం కలుసుకోగలిగామంటే దానికి అమెరికన్ కార్నరే కారణం. దేశ రక్షణలో భాగంగా సముద్రంపై, నేలపై మహిళలకు ఎలాంటి సవాళ్లు ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వంటి అంశాలు మాతో మాట్లాడారు. వాళ్ల అనుభవాలు చెప్పారు. మేం ఇక్కడ పరిస్థితులను వివరించాం. మాకది ఎంతో ఉపయోగకరంగా ఉంది” అని ఇంజినీరింగ్ విద్యార్థిని బీవీ శ్రీవర్షిణి తెలిపారు.

“అమెరికన్ కార్నర్ వాళ్లు నిరుడు స్టార్టప్ ఎంట్రప్రెన్యూర్స్ కోసం ఒక కార్యక్రమం చేశారు. అందులో స్టార్టప్ పిచ్‌ని వివరించారు. అంటే స్టార్టప్ కంపెనీ పెట్టుబడులు ఆకర్షించేందుకు తమ ఐడియాని ఎలా చెప్పాలి? తద్వారా ఇన్వెస్టర్‌ని ఎలా ఒప్పించాలి? అనేవి ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా నేను పెట్టుబడి పొందగలిగాను” అని సేంద్రీయ ఆహార ధాన్యాల స్టార్టప్ ప్రారంభించిన బిందు బీబీసీతో చెప్పారు.

అమెరికన్ కార్నర్

ఫొటో సోర్స్, American Corner, AU

సమాచారం ఉంది, కానీ నమ్మలేం..

“చాలా మంది ఎవరో ఇచ్చిన సమాచారం ఆధారంగా అమెరికా వెళతారు. ఆ తర్వాత మాకు ఇండియాలో చెప్పింది ఒకటి, ఇక్కడున్నది మరొకటి అంటుంటారు. ఇంటర్నెట్, కన్సెల్టెన్సీల ద్వారా చెప్పిన ఫీజుకు, కోర్సుకు, కళాశాల వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అటువంటి తప్పులు జరగకుండా అమెరికా కాన్సులేట్ ఇచ్చిన అధికారిక సమాచారాన్నే అమెరికన్ కార్నర్ అందిస్తుంది. ఇది విద్యార్థికి ఎంతో ఉపయోగపడుతుంది” అని స్టీఫెన్ అన్నారు.

విద్యార్థుల వద్ద అమెరికాకు సంబంధించిన సమాచారం ఉంటే దానిని తమ వద్దకు తీసుకుని వచ్చినా వెరిఫై చేసి చెబుతామని ఆయన తెలిపారు.

‘‘యూఎస్ వెళ్లాలంటే ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. వాటికి ఎలా సిద్ధమవ్వాలి? ఏ యూనివర్సిటీని మన అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవాలి? అమెరికాలో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ల అలవాట్లతో మనం ఎలా ముందుకు వెళ్లాలి? లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తాం. అమెరికన్ కార్నర్‌కు ఎవరైనా ఏయూ పనివేళల్లో రావొచ్చు” అని లక్ష్మయ్య వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)