భారత దగ్గు మందు మరణాలు: ‘ఈ ఔషధాన్ని ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’

- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ హిందీ, బంజుల్, గాంబియా
నిరుడు సెప్టెంబర్‌లో తన కళ్ల ముందే తన కొడుకు ప్రాణాలు వదలడంతో, ఎబ్రిమా సాగ్నియా ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో నిస్సహాయంగా మారారు.
ద గాంబియాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు సాగ్నియా. తన మూడేళ్ల కొడుకు లామిన్‌కి జ్వరం వచ్చినప్పుడు మరికొన్ని వారాల్లో బాబు నర్సరీ స్కూల్‌కి వెళ్లాల్సి ఉంది. దీంతో బాబుని స్థానిక క్లినిక్‌కి తీసుకెళ్లారు.
దగ్గు మందుతో పాటు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్లను బాబుకు రాసింది స్థానిక క్లినిక్. కానీ, జ్వరంతో ఉన్న తమ బాబు వాటిని వేసుకోవడానికి అంత ఆసక్తి చూపలేదు.
‘‘నేను బలవంతం చేసి దగ్గు ముందు తాగించాను’’ అని గాంబియా రాజధాని బంజుల్‌లోని తన ఇంట్లో కూర్చుని సాగ్నియా గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత కొన్ని రోజుల్లో లామిన్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తినడానికి, మూత్రం వెళ్లేందుకు కూడా బాగా ఇబ్బంది పడ్డాడు.
వెంటనే బాబును స్థానిక ఆస్పత్రిలో చేర్చామని, అక్కడ వైద్యులు బాబుకు కిడ్నీ సమస్యలున్నట్లు గుర్తించినట్లు సాగ్నియా చెప్పారు. ఏడు రోజుల్లోనే తమ బాబు లామిన్ తమ కళ్ల ముందే కన్ను మూసినట్లు సాగ్నియా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఐదేళ్లలోపు వయసులో చనిపోయిన 70 మంది పిల్లల్లో లామిన్ కూడా ఒకడు.
ఈ 70 మంది పిల్లలు గత ఏడాది జులై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కిడ్నీ సంబంధిత సమస్యలతో మరణించారు.
భారతీయ ఫార్మా కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన నాలుగు దగ్గు మందుల్లో ఒకదాన్ని తీసుకున్న తర్వాతనే ఈ పిల్లలందరికీ ఈ సమస్య వచ్చి, ప్రాణాలు కోల్పోయారు.
ఈ మరణాలకు కారణం దగ్గు మందు అని అక్టోబర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) తెలిపింది.
ఈ ఔషధాల్లో ఆమోదనీయం కానీ మోతాదుల్లో డైథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ కలుషితాలుగా ఉన్నట్లు నిర్ధరణ అయింది'' అని డబ్లూహెచ్‌వో తెలిపింది.
ఈ దగ్గు మందులు తాగిన తర్వాతే పిల్లలు మరణించారని గాంబియన్ పార్లమెంటరీ ప్యానల్ విచారణలో కూడా తేలింది.
అయితే, మైడెన్ ఫార్మాస్యూటికల్స్, భారత ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి.

‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవడానికి కూడా భయపడ్డాను’
దేశీయంగా పరీక్షించినప్పుడు ఈ దగ్గు మందులు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని తేలిందని భారత్ డిసెంబర్‌లో తెలిపింది.
మరణాలను విచారించిన గాంబియన్ పార్లమెంటరీ ప్యానల్ చైర్‌పర్సన్ అమదౌ కమరా భారత్ చెబుతున్న దాన్ని తీవ్రంగా విభేదిస్తున్నట్లు చెప్పారు.
‘‘మా వద్ద సాక్ష్యాధారాలున్నాయి. ఈ డ్రగ్‌లను మేం పరిశీలించాం. ఈ ఔషధాల్లో ఆమోదనీయం కానీ మోతాదుల్లో డైథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ కలుషితాలుగా ఉన్నట్లు నిర్ధరణ అయింది. వీటిని భారత్ నుంచి దిగుమతి చేసుకున్నాం. మైడెన్ వీటిని తయారు చేసింది’’ అని ఆయన తెలిపారు.
డైథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ మనుషులకు విషపూరితమైనవి, వీటిని తీసుకుంటే ప్రాణాపాయం సంభవించవచ్చు.
ఆఫ్రికాలో అతిచిన్న దేశాలలో ఒకటైన గాంబియాకు ఇవి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు. ఈ దేశం అత్యధికంగా ఔషధాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది.
భారత్‌లో తయారై, దిగుమతి అయ్యే ఏ ఔషధాలను తాము ఇక నమ్మబోమని ఈ మరణాల తర్వాత కొంత మంది తల్లిదండ్రులు చెబుతున్నారు.
‘‘ఆ ఔషధం భారత్ నుంచి వచ్చిందని నేను చదివినప్పుడు, దాన్ని ముట్టుకోవడానికి కూడా నేను భయపడ్డాను’’ అని తన తొమ్మిది నెలల కొడుకును కోల్పోయిన లామిన్ డాన్సో చెప్పారు.
కానీ, భారతీయ డ్రగ్స్‌పై ఆధారపడటం మాత్రం ఇప్పటికిప్పుడు మారే అంశం కాదు.
‘‘చాలా ఔషధ విక్రేతలు ఇంకా భారత్ నుంచే ఔషధాలను దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే భారత్ నుంచే చౌకగా ఔషధాలు దిగుమతి అవుతున్నాయి’’ అని జర్నలిస్ట్ ముస్తాఫా దర్బోయ్ తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఔషధ అవసరాలను చాలా వరకు భారతే తీరుస్తోంది. జనరిక్ ఔషధాల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారిగా ఉంది.
గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో విషాదకర ఘటనలకు ఈ ఔషధాలు కారణమయ్యాయని ప్రస్తుతం భారత్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది.
అమెరికా కూడా తయారీ విధానాలు, నాణ్యత ప్రమాణాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
‘‘ఒకవేళ ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు, డబ్ల్యూహెచ్‌వో నుంచి పలు హెచ్చరికలు జారీ అయినప్పుడు, చాలా దేశాలు ఉత్పత్తిని కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. వీటిపై క్రమం తప్పకుండా విచారిస్తాయి. ఇదంత తేలికైన విషయం కాదు. తీవ్ర ఉల్లంఘనగా దీన్ని పేర్కొంటాయి ’’ అని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ చెప్పారు.
గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలలో నమోదైన ఈ సంఘటనలతో భారత ఔషధ పరిశ్రమ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. కానీ, ఇది ఎగుమతులపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.

2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 25.4 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. దీనిలో 3.6 బిలియన్ డాలర్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో ఇప్పటికే 6 బిలయన్ డాలర్లకు పైగా ఔషధాలు దేశం ఎగుమతి చేసిందని భాస్కర్ చెప్పారు.
అయితే, ఎగుమతి చేసే ముందు ప్రభుత్వ ఆమోదిత ల్యాబ్‌లలోనే దగ్గు మందు సిరప్‌లను కంపెనీలు పరీక్షించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
జులై నుంచి భారత్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని ఔషధాలకు ప్రీ-షిప్‌మెంట్ క్వాలిటీ టెస్టింగ్ చేపట్టాలని గాంబియా కూడా నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూహెచ్‌వో ప్రామాణిక తయారీ విధానాలను అనుసరించాలని అన్ని ఫార్మా కంపెనీలకు భారత్ తుది గడువులు విధించింది.
దీర్ఘకాలంగా భారత్‌లో ‘రెండంచెల తయారీ విధానం’ అమల్లో ఉందని కొందరు భారత యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు.
‘‘స్థానికంగా వినియోగించే, నియంత్రణ తక్కువగా ఉండే మార్కెట్లకు ఎగుమతి అయ్యే ఔషధాలకు ఒకరకమైన ప్రమాణాలు.. అమెరికా, యూరప్ వంటి దేశాలకు ఎగుమతి అయ్యే ఔషధాలకు మరొక రకమైన ప్రమాణాలను అనుసరిస్తున్నారు’’ అని ప్రజారోగ్య కార్యకర్త దినేశ్ ఠాకూర్ ఆరోపించారు.
కానీ, దీన్ని భాస్కర్ ఖండించారు.
ఎగుమతుల్లో ఆఫ్రికా తమకు మూడో అతిపెద్ద మార్కెట్ అని, దక్షిణాఫ్రికా, ఘనా, నైజీరియా లాంటి చాలా దేశాల్లో బలమైన నియంత్రణా వ్యవస్థలు ఉన్నాయని భాస్కర్ చెప్పారు.
అయితే, ఈ విషాదాలపై గాంబియా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలో, నాణ్యతా ప్రమాణాల ల్యాబ్‌ను, రెండు డ్రగ్ రెగ్యులేటరీల ఏర్పాటును కొట్టివేసింది.
‘‘సమాజంలో కోపం ఉందని మాకు తెలుసు. బాధితులు చాలా కోపంతో ఉన్నారు’’ అని గాంబియా నేషనల్ అసెంబ్లీ నేత, ప్రభుత్వ వ్యాపారాల అధినేత బిల్లే జీ టంకారా అన్నారు.
కానీ, గత ఏడాది కాలంగా కూడా దేశీయ వైద్య రంగంలో ఎలాంటి మార్పులు రాలేదని బాధితుల తల్లిదండ్రులు చెబుతున్నారు. జ్వరం కేసులతో దేశీయ వైద్య విధానం తీవ్రంగా సతమతమవుతోందని అన్నారు.
కొంత మంది పిల్లల తల్లిదండ్రులు అప్పు చేసి మరీ వైద్యానికి తమ పిల్లల్ని పక్కనే ఉన్న సెనెగల్ దేశానికి పంపిస్తున్నారు.

ఇలాంటి తల్లిదండ్రుల్లో ఒకరు చెక్కలను అమ్ముకుంటూ జీవించే మోమోదౌ డామ్‌బెల్లే.
ఆస్పత్రి బెడ్‌పై స్పందించలేని స్థితిలో పడుకుని ఉన్న తన 22 ఏళ్ల కూతురు అమినటాపేను వీడియో కాల్‌లో చూసి మోమోదౌ కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘ఆమె తల కదపడాన్ని మాత్రమే నేను చూశాను. నేను, మీ నాన్నని అని ఆమెకి నేను చెప్పేందుకు ప్రయత్నం చేశాను’’ అని తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే తన కళ్లముందే కూతురు చనిపోయిందన్నారు.
ఆరోగ్య మంత్రితోపాటు ఈ నేరంలో భాగమైన అందరూ కచ్చితంగా శిక్షను ఎదుర్కోవాలని బాధిత తల్లిదండ్రుల తరపున పోరాడుతున్న బృంద అధికార ప్రతినిధి ఎబ్రిమా ఈఎఫ్ సైదీ చెప్పారు.
దీనిపై ఇంటర్వ్యూ ఇవ్వాలన్న బీబీసీ అభ్యర్థనపై గాంబియా ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మదౌ లామిన్ సమాతే స్పందించలేదు.
తమకు ఎదురైన బాధ గాంబియాలో మరెవరికీ కలగకూడదని చాలా మంది తల్లిదండ్రులు చెబుతున్నారు.
19 మంది చిన్నారుల కుటుంబాలు దేశ ఆరోగ్య అధికారులు, మైడెన్ ఫార్మాస్యూటికల్‌కు వ్యతిరేకంగా గాంబియా హైకోర్టులో దావా వేశారు. అవసరమైతే భారత, అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించేందుకు కూడా వెనుకాడబోమని చెప్పారు.
‘‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోయారు’’ అని ఈ గ్రూప్‌కు చెందిన సాగ్నియా చెప్పారు.

జమ్మూలో కూడా ఇలాంటి కేసులు
గాంబియాతోపాటు భారత్‌లోని జమ్మూలో కూడా దగ్గు మందు తాగి చిన్న పిల్లలు చనిపోయిన కేసులు నమోదయ్యాయి. రెండు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూ రామ్‌నగర్‌లో 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్య కాలంలో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఆరోగ్య కార్యకర్త దినేష్ ఠాకూర్, న్యాయవాది ప్రశాంత్ రెడ్డి ‘‘ది ట్రూత్ పిల్’’ పేరుతో రాసిన పుస్తకంలో రామ్‌నగర్ మరణాలు గురించి రాశారు. చనిపోయిన వారిలో చాలా మంది పేదవారని ప్రస్తావించారు.
జమ్మూలో చనిపోయిన వారిలో రెండున్నరేళ్ల అనిరుధ్ ఒకడు. అతడు చనిపోవడానికి మూడు రోజుల ముందు వీడియో రికార్డు చేశారు.
ఆస్పత్రి బెడ్‌పై కదలలేని స్థితిలో అనిరుధ్ పడిపోయి ఉన్నాడు.
తన తల్లి వీణా కుమారి కన్నీళ్లతో స్పూన్‌తో బాబుకి తినిపించాలని ప్రయత్నించారు. కానీ, బాబు తినలేకపోయాడు.
బాబు ఈ పరిస్థితులోకి రావడానికి కంటే కొన్ని రోజుల ముందు జ్వరం, ఛాతీ సమస్యలు రావడంతో దగ్గు మందు తాగించారు తల్లిదండ్రులు.
ఆ దగ్గు మందును దగ్గర్లోని మెడికల్ షాపులో కొన్నారు. ఈ దగ్గు మందు తాగిన తర్వాత బాబుకు మూత్రం రావడం ఆగిపోయింది. కాళ్లు లావయ్యాయి. ఏం తిన్నా వాంతి చేసుకునే వాడని తల్లిదండ్రులు చెప్పారు.
ఆ తర్వాత డాక్టర్లు బాబు కిడ్నీలు దెబ్బతిన్నట్లు చెప్పారు.
‘‘మా కాళ్ల కింద భూమి బద్దలైనట్లు అనిపించింది. ఇదెలా జరుగుతుంది? వాంతులు, నీళ్ల విరోచనాలతో కిడ్నీలు పాడవుతాయా’’ అని అని అనిరుధ్ తండ్రి అశోక్ కుమార్ అన్నారు.
జనవరి 9ని తామసలు మర్చిపోలేమని చెప్పారు.

ఈ కేసులలో దగ్గు మందును తయారు చేసిన డిజిటల్ విజన్ కంపెనీపై తీవ్ర ఆరోపణలున్నాయి.
‘‘మేం లీగల్ శాంపుల్ సేకరించాం. దాన్ని తొలుత స్థానిక ఔషధ నియంత్రణ సంస్థ చండీగఢ్‌కు పంపాం. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం డైథిలీన్ గ్లైకాల్ 34 శాతం అధికంగా ఉందని గుర్తించాం. అది ఫైనల్ రిపోర్ట్ కాదు. మళ్లీ శాంపుల్ సేకరించాం. దాన్ని సీడీఎల్ కోల్‌కతా అప్పీలేట్ ల్యాబ్‌కి పంపాం. అక్కడి నుంచి అదే రకమైన రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత విచారణ ప్రారంభించాం’’ అని జమ్మూ కశ్మీర్ డ్రగ్ కంట్రోలర్ లోతిక ఖజురియా చెప్పారు.
రామ్‌నగర్‌లోని పిల్లల మరణాలపై చిన్న పిల్లల వైద్యురాలు భావనీత్ భారతి నేతృత్వంలోని టీమ్ విచారణ చేసింది.
పోలీసులు కూడా ఈ కేసుపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.
తమ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును పిల్లలు తాగలేదని ఈ కంపెనీ ఓనర్ పురుషోత్తమ్ గోయల్ అన్నారు. ‘‘పిల్లల్ని చంపేందుకు మేం ఇక్కడ కూర్చొని లేము. మరొకరి పిల్లల్ని మేమెందుకు చంపుతాం? మేం మందులు తయారు చేస్తున్నాం. పాయిజన్ కాదు’’ అని వ్యాఖ్యానించారు.
పిల్లల మరణాల తర్వాత ఫ్యాక్టరీ ఆరు నెలలు మూత పడింది. కానీ, కోర్టు ఆదేశాల తర్వాత మళ్లీ తెరుచుకుంది.
ఇవి కూడా చదవండి:
- గదర్ 2: సన్నీ దేవోల్ మూవీకి ఎందుకింత క్రేజ్? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది?
- తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్?
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- లూనా-25: చంద్రుడి మీద కూలిపోయిన రష్యా స్పేస్‌క్రాఫ్ట్
- ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా... సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















