చిన్నారి జననేంద్రియంలో గాయం.. పాప అప్పగింతపై భారత్, జర్మనీ మధ్య వివాదం.. తల్లడిల్లుతున్న తల్లి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
ఆ చిన్నారి భారతీయ ఆహారాన్ని ఇష్టపడుతుంది. తల్లిదండ్రులతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తోంది.
ఇదంతా ఆమె తల్లిదండ్రులు తీసిన వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది.
ఆ చిన్నారి వయస్సు రెండున్నరేళ్లు. ఇప్పుడు ఆమెను జర్మనీలోని బెర్లిన్‌లో ‘‘ప్రత్యేక అవసరాలున్న పిల్లలను సంరక్షించే’’ ఒక కేంద్రంలో ఉంచినట్లు ఆమె తల్లి చెబుతున్నారు.
గోప్యత కోసం చిన్నారి అసలు పేరును చెప్పకుండా ప్రస్తుతం ఆమెను ‘బేబీ ఎం’ అని పిలుస్తున్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు భారతీయులు. వారి పేర్లు దియా, అమిత్ (చట్టపరమైన కారణాలతో వారి పేర్లు మార్చాం).
తల్లిదండ్రులు లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో పాపకు 7 నెలల వయస్సున్నప్పుడు, అంటే 2021 సెప్టెంబర్‌లో తల్లిదండ్రుల నుంచి పాపను జర్మనీ అధికారులు తీసుకెళ్లిపోయారు.
అప్పటినుంచి ‘బేబీ ఎం’ కేంద్రంగా భారత్, జర్మనీ మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తోంది.
ఈ ఏడాది జూన్ నెలలో బెర్లిన్‌లోని ఒక కోర్టు, ‘‘బేబీ ఎం”పై తల్లిదండ్రులుగా దియా-అమిత్‌ల హక్కులను రద్దు చేసింది. ‘‘బేబీ ఎం’’ కస్టడీని జర్మనీలోని యూత్ వెల్ఫేర్‌కు ఆఫీసుకు అప్పగించింది.
పాపను తిరిగి స్వదేశానికి (భారత్)కు పంపించాలనే తల్లిదండ్రుల డిమాండ్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లిన తల్లిదండ్రులు, అదొక బూటకపు విచారణ అని అన్నారు.
దియా ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. తన కూతుర్ని భారత్‌కు రప్పించేందుకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ఆమె చేస్తున్నారు.
కూతురుకు దూరంగా ఉండటం గురించి ఆమె బీబీసీతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
జర్మనీలో అమిత్‌కు ఉద్యోగం రావడంతో 2018లో వారు అక్కడికి వెళ్లారు. 2021 ఫిబ్రవరి 2వ తేదీన ‘బేబీ ఎం’’ అక్కడే పుట్టింది.
కోర్టు పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం, పాపకు ఏడు నెలల వయస్సున్నప్పుడు జననేంద్రియంలో అయిన గాయానికి సంబంధించి అధికారులకు, తల్లిదండ్రులకు మధ్య ఈ వివాదం మొదలైంది.
ఒక శిశువులో ఇంత తీవ్రమైన జననేంద్రియ గాయాన్ని తామెప్పుడూ చూడలేదని, దానికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని ఒక డాక్టర్ చెప్పారు.

చిన్నారిపై లైంగిక హింస జరిగి ఉంటుందనే అనుమానాన్ని వెలిబుచ్చుతూ ‘‘జర్మనీ పిల్లల సంరక్షణ సేవల’’ అధికారులు చిన్నారిని తల్లిదండ్రుల దగ్గర్నుంచి తీసుకెళ్లిపోయారు. తమపై వచ్చిన ఆరోపణలను తల్లిదండ్రులు ఖండించారు.
చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగినట్లు సూచించే ఆధారాలేమీ లేవని డాక్టర్లు ధ్రువీకరించినట్లు పాపకు చికిత్స అందించిన ఆసుపత్రి వర్గాలు తర్వాత స్పష్టం చేశాయి. అందుకే అభియోగాలు నమోదు చేయకుండా పోలీసులు కేసును మూసేశారని వెల్లడించాయి.
ప్రమాదవశాత్తు పాపకు ఆ గాయమై ఉంటుందని తాము నమ్ముతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
పాప వైద్య రికార్డులను పరిశీలించిన అమెరికా, భారత్‌లకు చెందిన ఇద్దరు వైద్యులు కూడా తల్లిదండ్రుల వాదనతో ఏకీభవించారు.
‘‘ఆ గాయం ఎక్కువగా ప్రమాదవశాత్తు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా ఆమెను పదేపదే గాయపరిచి, తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశమే లేదు’’ అని కోర్టుకు నివేదించిన పత్రాల్లో వైద్యులు పేర్కొన్నారు.
ఆమెకు అయిన గాయాలు ‘ఇన్వేసివ్ ఎగ్జామినేషన్’ కారణంగా మరింత తీవ్రంగా మారి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.
అయితే, ‘బేబీ ఎం’’ ఇంట్లో సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం తమకు లేదని జర్మనీ పిల్లల సంరక్షణ అధికారులు వాదించారు. కోర్టు కూడా వారి వాదనను అంగీకరించింది.

దీంతో ఆ చిన్నారి రెండేళ్లుగా పిల్లల సంరక్షణ కేంద్రంలోనే ఉంది. ఈ కాలంలో పాపతో గడిపేందుకు చాలా తక్కువ సమయాన్ని తమకు కేటాయించారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
తల్లిదండ్రులను కలిసినప్పుడు పాప ఎప్పుడూ సానుకూలంగా, సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తుందని ఆ కుటుంబాన్ని పరిశీలించే సామాజిక కార్యకర్తలు చెప్పారు. వారిద్దరూ ప్రేమ, జాగ్రత్తగల తల్లిదండ్రులని తెలిపారు.
ఒక సంరక్షకుని పర్యవేక్షణలో ‘పేరెంట్-చైల్డ్’ వసతిలో తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు పాపతో ఉండొచ్చని కోర్టు నియమించిన మానసిక నిపుణులు సిఫార్సు చేశారు.
కానీ, పాపను అటూ ఇటూ తీసుకెళ్లేందుకు ఎవరూ లేనందున అన్ని సందర్శనలను రద్దు చేస్తున్నట్లు యూత్ వెల్ఫేర్ ఆఫీసు అధికారులు గత వారం తమతో చెప్పినట్లు దియా తెలిపారు.
పాపకు వీడియో కాల్ చేసేందుకు కూడా వారు అనుమతించట్లేదని ఆమె ఆరోపించారు.
‘‘పిల్లల సంరక్షణ కేంద్రం (ఫోస్టర్ కేర్) నుంచి ప్రత్యేక అవసరాలున్న పిల్లల సంరక్షణ కేంద్రానికి పాపను తరలించినప్పటి నుంచి ఆమె బాగోగులు ఎవరు చూస్తున్నారో మాకు తెలియదు. పాప చుట్టూ జరుగుతున్న ఈ రహస్య వ్యవహారాలే మాకు చాలా వింతగా అనిపిస్తున్నాయి.
సాంస్కృతిక బేధాలు, సమాచార లోపం కారణంగా జర్మనీ అధికారులు నా నుంచి నా బిడ్డను లాక్కున్నారు. నేను జర్మన్ మాట్లాడలేను. నాకోసం కేటాయించిన ట్రాన్స్‌లేటర్‌కు హిందీ వచ్చు కానీ, గుజరాతీ రాదు’’ అని దియా వివరించారు.
దీనిపై జర్మనీ యూత్ వెల్ఫేర్ ఆఫీసును బీబీసీ సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, జర్మనీలో ‘బేబీ ఎం’ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక భారత నగరాలతోపాటు ఫ్రాంక్‌ఫర్ట్, డార్మ్‌స్టాడ్‌లో తల్లిదండ్రులకు మద్దతుగా భారతీయ ప్రవాసులు నిరసనలు చేశారు.
దిల్లీలో దియా తమకు సహాయం చేయాల్సిందిగా కోరుతూ భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికారులను, పదుల కొద్దీ ఎంపీలను కలిశారు. వారంతా పాపను తిరిగి భారత్‌కు పంపించాలని కోరుతూ జర్మన్ రాయబారి ఫిలిప్ అకెర్‌మన్‌కు ఉత్తరాలు పంపారు.
పాపను భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఒక ఎంపీ కోరారు.
జీ-20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చే నెలలో దిల్లీ రానున్న జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీని మరో రాజకీయ నాయకుడు అడిగారు.
ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని దియా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
‘‘ఇప్పుడు నాకున్న ఏకైక ఆశ ప్రధాని మోదీ. ఆయన జోక్యం చేసుకుంటే నా కూతురు తిరిగొస్తుంది’’ అని ఆమె అన్నారు.
‘‘బేబీ ఎం’’పై ఇప్పుడు చెలరేగిన వివాదం, 2011లో నార్వేలో భారతీయ తల్లిదండ్రుల నుంచి ఇద్దరు పిల్లలను అధికారులు తీసుకున్న కేసు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ఏడాది తర్వాత ఇద్దరు పిల్లలను భారత్‌కు పంపించారు.
నార్వేలోని భారతీయ కుటుంబానికి అప్పుడు సహాయం చేసిన సురణ్య అయ్యర్, ఇప్పుడు ‘‘బేబీ ఎం’’ తల్లిదండ్రులకు కూడా సహాయం చేస్తున్నారు.
సురణ్య అయ్యర్ మాజీ లాయర్, యాక్టివిస్ట్.
ఇలాంటి కేసులు అసాధారణం కాదని సురణ్య అన్నారు.
సరిహద్దు కుటుంబ వివాదాల్లో (క్రాస్-బోర్డర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్) జర్మనీ యూత్ వెల్ఫేర్ ఆఫీస్ పాత్రను యూరోపియన్ పార్లమెంట్ (ఈపీ) కూడా విమర్శించింది.
ఈ సంస్థ వివక్ష చూపుతుందని, వలసదారుల పిల్లలతో అన్యాయంగా వ్యవహరిస్తుందని, తల్లిదండ్రుల-పిల్లల హక్కులకు హాని కలిగిస్తోందని ఈపీ ఒక నివేదికలో ఆరోపించింది.

ఫొటో సోర్స్, Getty Images
బేబీ ఎం కేసులో ఉత్తమ పరిష్కారం ప్రభుత్వం జోక్యం చేసుకోవడమేనని సురణ్య అయ్యర్ అభిప్రాయపడ్డారు.
‘‘బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు. ఆమెను తిరిగి భారత్‌కు పంపించండి. ఆమె భారతీయ పౌరురాలు. ఆమెకు ఇక్కడ ఉండేందుకు అన్ని హక్కులు ఉన్నాయి’’ అని ఆమె అన్నారు.
‘‘బేబీ ఎం’’ కేసుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం చెప్పింది.
భారత ఆందోళనలను పేర్కొంటూ ఈ నెల మొదట్లో జర్మన్ రాయబారికి సమన్లు పంపించామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు.
‘‘పాపకు ఉన్న సాంస్కృతిక హక్కులు, భారతీయ పౌరుల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నట్లు మేం నమ్ముతున్నాం. వీలైనంత త్వరగా పాపను భారత్‌కు అప్పగించాలని మేం కోరాం. ఈ విషయంలో జర్మనీపై తరచూ ఒత్తిడి చేస్తూనే ఉంటాం’’ అని బాగ్చి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసుపై స్పందించడానికి దిల్లీలోని జర్మనీ ఎంబసీ ప్రతినిధి ఒకరు నిరాకరించారు.
ఈ కేసు కోర్టులో ఉందని తమ చేతుల్లో ఏమీ లేదని జర్మనీలోని ప్రభుత్వ వర్గాలు అన్నాయి. దీనికి ఒక పరిష్కారం కోసం భారత్‌తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పాయి.
గుజరాత్‌లో ఒక కుటుంబాన్ని గుర్తించామని అక్కడ ‘‘బేబీ ఎం’’ను సంరక్షణలో ఉంచవచ్చని భారత అధికారులు అంటున్నారు.
బిడ్డ, తల్లిదండ్రులతోనే ఉండాలని ప్రభుత్వ రిటైర్డ్ పీడియాట్రీషియన్, దిల్లీ ప్రభుత్వ పిల్లల సంరక్షణ కమిటీ మాజీ సభ్యుడు డాక్టర్ కిరణ్ అగర్వాల్ అన్నారు.
‘‘భారత్‌లో చాలా పటిష్టమైన పిల్లల సంరక్షణ చట్టాలు ఉన్నాయి. జర్మనీ కోర్టు పాపను భారత్‌కు తిరిగి పంపిస్తే, భారత్‌లో ఆమె బాగోగులు చూసుకోవచ్చు’’ అని కిరణ్ చెప్పారు.
సమయం గడుస్తున్నకొద్దీ, రోజురోజుకూ క్రమంగా తన బిడ్డకు దూరమవుతున్నాననే ఆందోళన కలుగుతోందని దియా అన్నారు.
‘‘పాప తన మాతృభాష అయిన గుజరాతీని నేర్చుకోలేకపోతోంది. ఆమె అక్కడ కేవలం జర్మన్ మాత్రమే నేర్చుకుంటుంది. నేనెలా ఆమెతో జర్మన్‌లో మాట్లాడగలను?’’ అని దియా ఆవేదన వ్యక్తం చేశారు.
పాప సంరక్షణ, కోర్టు ఖర్చుల కోసం 90 లక్షలు చెల్లించాల్సిందిగా వారిని ఆదేశించారు. ఈ డబ్బు చెల్లింపు కోసం వారు తీవ్రంగా సతమతం అవుతున్నారు.
‘‘క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బు సేకరించాం. ఇప్పటికే 50 లక్షల రూపాయలు చెల్లించాం. మాది ఒక మధ్య తరగతి కుటుంబం. వారు మమ్మల్ని నైతికంగా, మానసికంగా చంపేశారు. ఇప్పుడు ఆర్థికంగా కూడా కుదేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని దియా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో శాంతియుత ఎన్నికలు సాధ్యమేనా? బాంబు పేలుళ్లు, మరణాల లెక్కలు ఏం చెబుతున్నాయి
- నైజర్ తిరుగుబాటు: పశ్చిమ ఆఫ్రికా దేశాలలో సైనిక తిరుగుబాట్ల వెనుక ఫ్రాన్స్ హస్తం ఉందా?
- అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వాన్ని వదులుకొని మళ్లీ భారత పౌరుడిగా ఎందుకు మారారు?
- రాడ్‌క్లిఫ్: ఐదు వారాల్లో ఒక్క గీతతో భారత్, పాకిస్తాన్లను విభజించిన బ్రిటిష్ లాయర్
- ఓడ కింద రడ్డర్ బ్లేడ్ మీద దాక్కుని నడి సముద్రంలో 14 రోజుల ప్రమాదకర ప్రయాణం... చివరికి ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














