పాకిస్తాన్‌లో ఈసారైనా శాంతియుత ఎన్నికలు సాధ్యమేనా? బాంబు పేలుళ్లు, మరణాల లెక్కలు ఏం చెబుతున్నాయి?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గతంలో కంటే ఎక్కువగా హింసాత్మక పరిస్థితులు నెలకొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
    • రచయిత, ఫర్హాత్ జావెద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముప్పై ఐదేళ్ల షా మీనా సంప్రదాయ బురఖా ధరించి ఉన్నారు. ఆమె ఆస్పత్రిలో ఒక వార్డు నుంచి మరో వార్డుకు ఆందోళనతో పరిగెడుతున్నారు.

మీనా వెంట ఆమె తల్లి కూడా ఉన్నారు. ఆమె మధ్యమధ్యలో పెద్దగా ఏడుస్తున్నారు.

అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో, మీనా ముందు ఆమె తల్లిని ఓదార్చారు. ఆమె కాస్త కుదుటపడిన తర్వాత మళ్లీ ఆస్పత్రిలో గాయాలపాలైన వారి కోసం వెతుకుతున్నారు.

అంతకు కొద్ది గంటల క్రితమే పాకిస్తాన్‌లోని బజౌర్ జిల్లాలో ఆత్మాహుతి దాడి జరిగింది. అప్పటి నుంచి తన పదేళ్ల కొడుకు అబుజర్ ఆచూకీ తెలియకపోవడంతో మీనా కంగారుపడుతున్నారు.

వారం రోజుల తర్వాత, బజౌర్‌లోని తన చిన్న ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్న షా మీనా ''అదొక ప్రళయం'' అని ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ చెప్పారు.

ఆమె కొడుకు అబుజర్ దగ్గర్లోని మదర్సాకు వెళ్లారు. అక్కడి నుంచి జమియాత్-ఉలేమా-ఇ-ఇస్లాం (ఫజ్లూర్ రహ్మాన్) పార్టీ మీటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు.

ఆ వేడుకలు జరుగుతున్న వేదిక బయట చిప్స్ అమ్మేందుకు వెళ్లినట్లు అబుజర్ తండ్రి చెప్పారు.

షా మీనా చేతులు వణుకుతున్నాయి. ''నాకు ఆరుగురు కూతుళ్లు, ఒక్కడే కొడుకు. అల్లా.. ఇంతే రాసిపెట్టాడు''

బాంబు పేలుడు గురించి తెలిసిన కొద్దిసేపటికి తర్వాత ఆమె తన తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పారు. అప్పటికే తన భర్త, ఆమె సోదరుడు ఆస్పత్రికి చేరుకున్నారు.

''ఆ సమయంలో నాకేం అర్థం కాలేదు. నేను స్పృహలో లేను. నా కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. నాకు ఏడవాలనిపిస్తుంది కానీ రావడం లేదు. ఎవరిని గుర్తుపట్టడం కోసం వచ్చారని ఆస్పత్రిలో వాళ్లు అడుగుతున్నారు. ఏది జరిగినా, ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారమే జరిగిందని అనుకోవడమేనని నా భర్త చెప్పారు'' అని మీనా చెప్పారు.

కొద్దిసేపటి తర్వాత కొడుకు మృతదేహాన్ని ఆమె భర్త గుర్తించారు. అయితే, మృతదేహాన్ని గుర్తించడం షా మీనాకు మరో పరీక్ష.

తన కొడుకు కోసం తాను తయారు చేసిన నడుముపట్టీ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు ఆమె చెప్పారు.

''నా భర్త జేబులో నుంచి నడుముపట్టీ బయటకు తీశారు. నేను గుర్తుపట్టాను. అంతే నా గొంతు మూగబోయింది. నేను గట్టిగా అరవలేకపోయాను. మా అమ్మను పిలిచి చనిపోయాడని చెప్పాను. మన కొడుకు అమరుడయ్యాడని నా భర్త అన్నారు.'' అని ఆమె అక్కడి పరిస్థితిని వివరించారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, REUTERS

ఇస్లామిక్ స్టేట్ దాడి

షా మీనా ఒక్కరిదే ఆ పరిస్థితి కాదు. ఆరోజు బజౌర్‌లోని ఖర్‌ ప్రభుత్వాస్పత్రిలో డజన్ల కొద్దీ పడి ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు వచ్చిన వందలాది మందితో ఆస్పత్రి నిండిపోయింది.

జమాత్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. 60 మందికి పైగా చనిపోయారు. దాదాపు 150 మందికి పైగా గాయాలపాలయ్యారు.

ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు చెప్పారు. తీవ్రవాద సంస్థ దాయేశ్ సౌత్ ఏషియన్ చాప్టర్ 'ఐఎస్‌కేపీ' (ఐఎస్‌ఖోర్సాన్) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిందని వారు తెలిపారు.

ఈ ఏడాది జరిగిన అతిపెద్ద తీవ్రవాద దాడుల్లో ఇదొకటి. సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీ (జేయూఐఎఫ్)‌పై జరిగిన మొదటి దాడి.

పాకిస్తాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఇటీవల జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో దేశంలో ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ప్రస్తుతం కేంద్రంతో పాటు, ఖైబర్ పంఖ్తున్‌ఖ్వా , పంజాబ్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం, దేశంలో శాంతిభద్రతలను కాపాడుతూ పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం ఆపద్ధర్మ ప్రభుత్వాల బాధ్యత.

దేశంలో, రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వాటికి ఇబ్బంది కలిగేలా ఎలాంటి పరిస్థితులు ఉండకూడదు.

అయితే, పాకిస్తాన్‌లో శాంతిభద్రతల పరిస్థితి, ఇటీవల జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో దేశంలో ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్‌లో కొత్తేమీ కాదు. రెండు దశాబ్దాలుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గతంలో కంటే ఎక్కువగా హింసాత్మక పరిస్థితులు నెలకొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

ఎన్నికల వేళ పెరుగుతున్న హింస

పాకిస్తాన్‌లో 2013లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తా పత్రికలు ''అత్యంత ఘోరమైన ఎన్నికలు''గా ప్రకటించాయి.

2013 ఎన్నికల సమయంలో డజన్ల కొద్దీ జరిగిన బాంబు పేలుళ్లు, దాడుల్లో వందల మంది చనిపోయారు.

ఖైబర్ పంఖ్తున్‌ఖ్వాలో పేలుళ్ల కారణంగా ఆవామి నేషనల్ పార్టీ వంటి పార్టీలు ఎన్నికల ప్రచారం ఆపేశాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేయడంతో ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యాయి.

‘సౌత్ ఏసియా టెర్రరిజం పోర్టల్’ గణాంకాల ప్రకారం, 2013లో పాకిస్తాన్‌లో ‘టెర్రరిజం’ కారణంగా చిన్న, పెద్దవి కలిపి రెండు వేలకు పైగా ఘటనలు జరిగాయి. వాటిలో 5 వేల మందికి పైగా చనిపోయారు. వారిలో సాధారణ పౌరులు, ఎన్నికల సభల్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందే ఎక్కువ.

2013తో పోలిస్తే 2018 ఎన్నికలు కాస్త సజావుగానే జరిగినప్పటికీ, ప్రత్యర్థులే లక్ష్యంగా జరిగిన హత్యలు, ఆత్మాహుతి దాడులు తక్కువేం కాదు.

2018లో రాజకీయ పార్టీల సమావేశాలు లక్ష్యంగా కాకుండా అభ్యర్థులు, రాజకీయ నాయకులే లక్ష్యంగా దాడులు జరిగాయి.

దేశవ్యాప్తంగా 2018లో 164 భారీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 600 మందికి పైగా భద్రతాధికారులు, సాధారణ పౌరులు, ఇతరులు చనిపోయారు.

ప్రస్తుతం 2023 చివర్లో కానీ 2024 ప్రారంభంలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, శాంతిభద్రతలు పరిరక్షణలో విఫలమైతే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

2023లో మొదటి ఆరు నెలల్లో జరిగిన తీవ్రవాద దాడులు, వాటి వల్ల సంభవించిన మరణాల సంఖ్య 2018లో జరిగిన దాడులు, మరణాల సంఖ్య కంటే ఎక్కువ. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 230 తీవ్రవాద దాడులు జరగ్గా, సుమారు 500 మందికిపైగా చనిపోయారు.

గతం కంటే భిన్నంగా పరిస్థితులు

జమియాత్-ఉలేమా-ఇ-ఇస్లాం (ఫజ్లూర్ రహ్మాన్) వంటి మతతత్వ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకోవడం కొత్త మలుపు అని నిపుణులు అంటున్నారు.

ఆవామీ నేషనల్ పార్టీ (ఏఎన్‌పీ)కి చెందిన సీనియర్ నేత మియాన్ ఇఫ్తికార్ దీన్ని అంగీకరిస్తున్నారు.

మరే ఇతర పార్టీలపై జరగనంత స్థాయిలో ఆవామీ నేషనల్ పార్టీపై 2008, 2013లో దాడులు జరిగాయి. ఎన్నికల ముందు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని ఒత్తిడి కూడా వచ్చింది.

''మా కార్యకర్తలు పార్టీ జెండాను కూడా ఎగురవేయలేకపోయారు. జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తే చంపేస్తామని బెదిరించేవారు'' అని మియాన్ ఇఫ్తికార్ గుర్తు చేసుకున్నారు.

ఖైబర్ ఫంఖ్తున్‌ఖ్వా రాజధాని పెషావర్‌లోని ఏఎన్‌పీ ప్రధాన కార్యాలయం బచా (కింగ్) ఖాన్ మర్కజ్‌లో తన ఎన్నికల ప్రచారం గురించి మియాన్ ఇఫ్తికార్ మాకు చెప్పారు.

''2013లోనూ ఇదే నా కార్యాలయం.. ఆ సమయంలో ఇతర పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసుకుంటుంటే, నేను మాత్రం ఇక్కడే కూర్చోవాల్సి వచ్చింది. పరిస్థితి అధ్వానంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో మేము బయటికి వెళ్లలేకపోయాం'' అన్నారు.

''మీరు ప్రమాదంలో ఉన్నారని నాకు చెప్పారు. మీ ప్రాణాలకు ప్రమాదం ఉందంటారు. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని చెబుతారు. లేదంటే ఒక చిన్న పిల్లాడు ఒంటికి బాంబు చుట్టుకుని మిమ్మల్ని చంపేందుకు వచ్చే అవకాశం ఉందంటారు. ఎవరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారో తెలిసినప్పుడు, వారిని పట్టుకోవడానికి బదులు మాకు చెప్పడమెందుకు?'' అని ఆయన ప్రశ్నించారు.

తన రాజకీయాలు, రాజకీయ అభిప్రాయాల కారణంగా మియాన్ ఇఫ్తికార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా తీవ్రవాద గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయి.

పాకిస్తాన్

'నా కొడుకును కాల్చి చంపేశారు' : మంత్రి

ఆయన కార్యాలయంలో ఓ వైపు గోడపై అతని చిన్న కుమారుడు మియాన్ రషీద్ హుస్సేన్ చిత్రపటం ఉంది.

ఆయన ఆ ఫోటో చేతుల్లోకి తీసుకుని చూపిస్తూ, ''ఇతను నా కొడుకు. నా ఇంటి బయటే కాల్చి చంపేశారు'' అని చెప్పారు.

ఆయన కొడుకును హత్య చేసిన హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ గ్రూపు సభ్యుడు. ఈ దాడి తామే చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

''నా కొడుకు తన సోదరుడితో ఉన్నాడు. టెర్రరిస్టులు వచ్చి నువ్వు మియాన్ ఇఫ్తికార్ కొడుకువేనా అడిగారు. అందుకు అవును నేనే అని చెప్పాడు. ఆ వెంటనే కాల్పులు జరిపారు. ఛాతీలో నాలుగు బుల్లెట్లు, తలలో నాలుగు బుల్లెట్లు దింపారు. నేను అప్పుడు రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్నాను. మంత్రి కొడుకుపై దాడి జరిగింది. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదనే సందేశం పంపారు. మూడోరోజు నా ఇంటి బయట ఆత్మాహుతి దాడి జరిగింది'' అని ఆయన చెప్పారు.

''ఈ పోరాటం ఎంతకాలం కొనసాగుతుందో నాకు అర్థం కావడంల ేదు. ఈ దేశం నుంచి టెర్రరిజం అంతం కాదా? అఫ్గాన్ సరిహద్దులోని దేశాల్లో పాకిస్తాన్‌లో మాత్రమే టెర్రరిజం ఎందుకు? ఇండియా, ఇరాన్, చైనాలో ఎందుకు లేదు? మన విధానాలను మనం సమీక్షించుకోవాలి. మన జాతీయ, అంతర్జాతీయ విధానాలు దేశ ప్రయోజనాల కోసమే ఉండాలి. ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు'' అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఖైబర్ పంఖ్తున్‌ఖ్వాన్ రాష్ట్రమంతటా టెర్రరిజం ప్రమాదం పొంచి ఉందని ఇఫ్తికార్ చెప్పారు.

''ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇక్కడ చాలా మిలిటెంట్ గ్రూప్‌లు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనే తేడా ఉండకూడదు. అన్నీ ప్రమాదకరమే. ఇప్పుడు ఈ ప్రాంతంలో తీవ్రవాదాన్ని నియంత్రిస్తే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. గత ఎన్నికల సంవత్సరాలలో తీవ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నాయి'' అని ఇఫ్తికార్ వివరించారు.

అయితే, మియాన్ ఇఫ్తికార్‌‌తో సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకుడు మొహమూద్ జాన్ బాబర్ ఏకీభవించలేదు. పెషావర్‌లోని కిస్సాఖ్వానీ బజార్‌లో నడుస్తూ ఆయన మాట్లాడారు.

ఈసారి ఎన్నికల్లో ''టెర్రరిస్ట్ గ్రూపులు పెద్ద నగరాలు, పెద్ద రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకునేంత బలంగా లేవని అర్థమవుతోంది'' అని ఆయన అన్నారు.

అలాగే, భారత్‌లో ప్రముఖ సినీ నటులుగా పేరొందిన కపూర్ కుటుంబానికి చెందిన పూర్వీకుల భవనానికి సమీపంలో ఉన్న ఓ పాఠశాలను ఆయన మాకు చూపించారు. 2013లో సీనియర్ నేత బషీర్ బిల్లౌర్ ఇక్కడే ఎన్నికల సమావేశం ముగించుకుని బయలుదేరారని, వీధి చివరలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోయారని చెప్పారు.

బిల్లౌర్ కుటుంబానికి చెందిన చాలా మంది రాజకీయ నాయకులపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి. ఖైబర్ పంఖ్తున్‌ఖ్వాలోని పలు ప్రాంతాల్లో తాలిబన్‌లపై పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన దాడులను సమర్థించడమే అందుకు కారణం.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

ప్రజల్లో భయం

''గత రెండు, మూడు ఎన్నికల్లో ఎవరినైతే లక్ష్యంగా చేసుకున్నారో వారు అసెంబ్లీకి రాలేకపోయారు. అలాంటి దాడులు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇబ్బంది పడతాయి. జనం భయపడతారు. అంతటా భయాందోళన నెలకొంటుంది'' అని బాబర్ చెప్పారు.

''ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం చేయలేరు. ప్రజలను కలవలేరు. దాని వల్ల వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజలకు చేరదు. ఆయా పార్టీలకు ఓట్లు వేసినా, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా వారిని టార్గెట్ చేసుకుంటారు''

ఈ భయం ఎలా ఉంటుందో బజౌర్‌లోని ఖర్ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది.

జమియాత్ ఉలేమా ఇ ఇస్లాం పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాయేశ్ ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో పదిహేడేళ్ల జునైద్ ప్రార్థన మందిరం వద్దే ఉన్నారు.

అతని సోదరుడు జియావుల్లా ఖాన్ పార్టీ స్థానిక శాఖకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు కొన్ని నెలలుగా బెదిరింపులు వస్తున్నాయి.

''మీరు కూడా లక్ష్యం కావొచ్చు. కానీ భద్రత కల్పించరు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో బజౌర్ రావొద్దని పెషావర్‌లో ఓ ఇల్లు తీసుకున్నాం. కానీ ఆయన రాజకీయాలు చేసేవారు. ప్రజలకు సేవ చేసేవారు. అందుకే బజౌర్‌కి వచ్చేవారు'' అని జునైద్ చెప్పారు.

అది చెప్తున్నప్పుడు, జునైద్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన తన సోదరుడి సమాధిపై పడి ఏడవడం మొదలుపెట్టారు.

ఆయన సోదరుడితో పాటు ఆ దాడిలో చనిపోయిన మరో నలుగురిని కూడా అదే శ్మశానంలో ఖననం చేశారు.

''నా సోదరుడు నా ఒడిలోనే చివరి శ్వాస తీసుకున్నాడు. నేను ఆయన్ను కాపాడలేకపోయాను'' అని జునైద్ చెప్పారు.

ఆ సమయంలో జునైద్ వేదికకు దగ్గరకు ఉండడంతో ఆ దాడి నుంచి బయటపడ్డారు.

మరోవైపు, ఇక్కడ పేలుళ్లు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానం కోసం షా మీనా కళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

''నా కొడుకు చేసిన తప్పేంటి? పది, పన్నెండేళ్ల పిల్లోడు. ఎవరికీ ఏ హానీ చేయలేదు'' అని ఆమె అన్నారు.

''వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ తీవ్రవాద కార్యకలాపాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. ఇలాంటివి సాధారణంగా ఎన్నికల ఏడాదిలోనే జరుగుతాయి. ఎందుకంటే, ఈ సమయంలో తీవ్రవాదుల లక్ష్యం సులభం'' అని విశ్లేషకుడు అమీర్ జియా బీబీసీకి చెప్పారు.

''పరిస్థితి ఇంకా దారుణంగా తయారవ్వొచ్చు. కానీ ఈసారి భద్రతా సమస్యలు 2008, 2013 తరహాలో లేవు. అప్పుడు చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అన్నింటిపై నియంత్రణ ఉంది. కానీ 2008, 2013లో ఆ పరిస్థితి లేదు. సరిహద్దుల నుంచి తీవ్రవాదులు వచ్చి దాడులు చేసి తప్పించుకుని పారిపోయేవారు. ఇటీవల జరిగిన ఘటనల్లోనూ అదే కనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.

''భద్రతా సంస్థలు కొన్ని దాడులను విఫలమయ్యేలా చేసినా, ఏదో ఒక దాడి విజయవంతమయ్యేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌లో భద్రతా సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలు లేవు. కాబట్టి మెరుగైన వ్యూహంతో ఈ పరిస్థితిని నియంత్రించొచ్చు'' అని చెప్పారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు, అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వంతో పాకిస్తాన్ కఠిన వైఖరిని మానుకుని, పరిష్కారం గురించి మాట్లాడి ఉండాల్సిందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: