అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వాన్ని వదులుకొని మళ్లీ భారత పౌరుడిగా ఎందుకు మారారు?

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాను మరోసారి భారతీయ పౌరుడిని అయ్యానంటూ మంగళవారం ప్రకటించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు.
అక్షయ్ కుమార్‌కు గతంలో కెనడా పౌరసత్వం ఉండేది. దీనికి సంబంధించి ఆయన తరచూ విమర్శలు ఎదుర్కొనేవారు.
అయితే, మంగళవారం తన భారత పౌరసత్వానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ట్విటర్‌లో అక్షయ్ కుమార్ పంచుకున్నారు.
‘‘ఇప్పుడు హృదయం, పౌరసత్వం రెండూ హిందుస్థాన్‌కు చెందినవే. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’’ అంటూ 55 ఏళ్ల అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Akshay Kumar
అక్షయ్ కెనడా పౌరసత్వం ఎందుకు తీసుకున్నారు?
కెరీర్ పరంగా 1990లలో తనకు చెడు దశ నడిచిందని గతంలో అక్షయ్ కుమార్ చెప్పారు.
అప్పుడే కెనడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
వార్తాసంస్థ పీటీఐ సమాచారం ప్రకారం, ఆ సమయంలో అక్షయ్ కుమార్ నటించిన 15 సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయ్యాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఓటు వేయకపోవడంతో, సోషల్ మీడియాలో ఆయన పౌరసత్వం గురించి దుమారం రేగింది.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని మోదీతో అక్షయ్ ఇంటర్వ్యూపై విమర్శలు
అక్షయ్ కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ 2019 జనవరి 24న ప్రసారమైంది.
67 నిమిషాల ఈ ఇంటర్వ్యూను దేశంలోని చాలా వార్తా చానళ్లు ప్రసారం చేశాయి.
నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో మోదీ దినచర్య, ఆహారపు అలవాట్లు, చిన్ననాటి విశేషాల గురించి అక్షయ్ కుమార్ ప్రశ్నించారు.
ఇది రాజకీయాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదని అక్షయ్ కుమార్ చెప్పారు.
ఎన్నికల సమయంలో ఒక రాజకీయేతర ఇంటర్వ్యూకు హాజరు కావడం సంతోషంగా ఉందంటూ మోదీ హర్షం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండ్ అయ్యింది.
ఆ సమయంలో కూడా అక్షయ్ కుమార్ పౌరసత్వంపై ప్రశ్నలు వచ్చాయి.
ప్రధాని మోదీ, బాలీవుడ్‌లో పనిచేసే భారత సంతతికి చెందిన ఒక కెనడా పౌరుడైన అక్షయ్ కుమార్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారనే విమర్శలు వచ్చాయి.

ఫొటో సోర్స్, ANI
భారత పౌరసత్వం కోసం దరఖాస్తు
2019లో ఒక ఈవెంట్ సందర్భంగా, తాను భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినట్లు అక్షయ్ కుమార్ అందరి ముందు చెప్పారు.
తన భారతీయతను నిరూపించడం కోసం డాక్యుమెంట్లు అవసరమవుతాయని ఎప్పుడూ అనుకోలేదని హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
‘’14 సినిమాలు పరాజయం పాలైన తర్వాత, వేరే ఇంకేదైనా ప్రయత్నించి ఉండాలని అనిపించింది. నా సన్నిహిత మిత్రుడొకరు కెనడాలో ఉంటారు. కెనడాకు వస్తే కలిసి ఏదైనా చేద్దామంటూ ఆయన నన్ను కెనడాకు ఆహ్వానించారు. ఆయన భారతీయుడే. కానీ కెనడాలో నివసిస్తారు. ఇక్కడ నా కెరీర్ ముగిసిందనుకున్నా. అందుకే అక్కడి పాస్‌పోర్ట్ తీసుకున్నా. కానీ, అప్పుడే నా 15వ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నేను ముందుకు సాగాను. ఆ తర్వాత నా పాస్‌పోర్ట్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నాకెప్పుడూ అనిపించలేదు’’ అని అక్షయ్ వివరించారు.

ఫొటో సోర్స్, ANI
పౌరసత్వంపై రగడ తర్వాత భారత పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయాలని అక్షయ్ నిర్ణయించుకున్నారు.
అదే ఈవెంట్‌లో అక్షయ్ మాట్లాడుతూ, ‘‘నేను భారత పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చింది. దీన్నొక సమస్యగా చేశారు. నా భారతీయతను నిరూపించుకోవడానికి పాస్‌పోర్ట్‌ను చూపించాల్సి ఉంటుందని అనుకునేలా చేశారు. ఇది నన్ను బాధించింది. ఈ విషయంలో ఎవరికీ ఏ అవకాశం ఇవ్వకూడదనుకున్నా. అందుకే భారత పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేశాను.
నా భార్య భారతీయ పౌరురాలు. నా కొడుకు కూడా భారతీయుడే. నా కుటుంబంలో అందరూ భారతీయులే. నేను భారత ప్రభుత్వానికే పన్ను చెల్లిస్తాను. నా జీవితం ఇక్కడే. కానీ కొందరు ఇంకా ఏదో అనాలని చూస్తున్నారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
అక్షయ్ కుమార్: తల్లి కశ్మీరీ, తండ్రి పంజాబీ
అక్షయ్ కుమార్ 1967 సెప్టెంబర్ 9న జన్మించారు. ఆయన తల్లి కశ్మీరీ మహిళ. తండ్రి పంజాబీ.
అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ భాటియా.
తండ్రి ఎప్పుడైనా మందలిస్తే, తాను చదువుకోవడమో లేదా హీరో అవ్వడమో జరుగుతుందని చిన్నతనంలో తండ్రితో రాజీవ్ అనేవారు.
తర్వాతి కాలంలో రాజీవ్ భాటియా, హీరో అక్షయ్ కుమార్‌గా మారి తాను చెప్పిన మాటలను నిజం చేశారు.
రాజీవ్ భాటియా తండ్రి హరి ఓం భాటియా తొలుత ఆర్మీలో పనిచేశారు. తర్వాత అకౌంటెంట్‌గా మారారు.
కొంత కాలం తర్వాత భాటియా కుటుంబం దిల్లీ నుంచి ముంబయికి మారింది. మాతుంగాలోని డాన్‌బాస్కో స్కూల్‌లో రాజీవ్ చదువుకున్నారు.
క్రీడలంటే రాజీవ్‌కు చాలా ఇష్టం. పొరుగింటి అబ్బాయి కరాటే చేయడం చూసి రాజీవ్ క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.
10వ తరగతి పూర్తి కాగానే, తండ్రితో వాదించి మరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం బ్యాంకాక్ వెళ్లారు.
మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించారు. అయిదేళ్ల తర్వాత కోల్‌కతా-ఢాకాలో ట్రావెల్ ఏజెంట్, హోటల్ వ్యాపారం చేస్తూ దిల్లీకి చేరుకున్నారు.
కొంతకాలం లాజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో కుందన్ అభరణాలను కొని, వాటిని ముంబయిలో అమ్మేవారు.

ఫొటో సోర్స్, ANI
రాజీవ్ భాటియా, అక్షయ్ కుమార్‌గా ఎలా మారారంటే?
వ్యాపారాలు చేస్తున్నప్పటికీ రాజీవ్ మనస్సు మళ్లీ మార్షల్ ఆర్ట్స్ వైపు మొగ్గింది.
తొలి రోజుల్లో పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మొదలుపెట్టారు. ఆరోజుల్లో ఈ విద్య ద్వారా నెలకు 4,000 రూపాయలు సంపాదించేవారు.
రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం, ఎవరో సలహా ఇవ్వడంతో రాజీవ్ భాటియా మోడలింగ్ వైపు అడుగులు వేశారు.
ఫర్నీచర్ దుకాణంలో చేసిన తొలి ఫొటోషూట్‌కు రాజీవ్ భాటియా రూ. 21,000 చెక్‌ను అందుకున్నారు.
తర్వాత తన పేరును అక్షయ్ కుమార్‌గా మార్చుకున్నారు.
యాదృచ్ఛికంగా పేరు మార్చుకున్న మరుసటి రోజే హీరోగా నటించాల్సిందిగా సినిమాల్లో ఆయనకు తొలి అవకాశం వచ్చింది.
1991లో వచ్చిన ‘సౌగంధ్’ సినిమా హీరోగా అక్షయ్ నటించిన తొలి చిత్రం.
అంతకుముందే, ‘ఆజ్’ అనే సినిమాలో అక్షయ్ కుమార్ ఒక చిన్న పాత్రలో కనిపించారు.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ అందాల పోటీలు: ‘తనిఖీల పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














