ఎలిఫెంట్ విస్పరర్స్: ఆస్కార్ గెలిచిన డాక్యుమెంటరీ ‌దర్శక, నిర్మాతలపై కేసు వేసిన బొమ్మన్, బెల్లీ జంట.. ఏమిటీ వివాదం?

ఎలిఫెంట్ విస్పరర్స్

ఫొటో సోర్స్, BBC TAMIL

    • రచయిత, ఎస్ ప్రశాంత్, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆస్కార్ అవార్డు గెలిచిన భారత డాక్యుమెంటరీ ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శక, నిర్మాతలపై ఆ డాక్యుమెంటరీలో కనిపించిన జంట కేసు వేసింది. తమకు ఇచ్చిన మాట తప్పారని ఆ జంట ఆరోపిస్తోంది.

దక్షిణ తమిళనాడులోని ముదుములై టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గాయాలపాలైన ఓ అనాథ ఏనుగు పిల్లను బొమ్మన్, బెల్లీ జంట ఎలా కాపాడారు, వన్యప్రాణులతో వారి అనుబంధం ఇతివృత్తంతో ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ రూపొందించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలిచిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.

డాక్యుమెంటరీలో ఏనుగు ఆలనాపాలనా చూసుకున్న బొమ్మన్, బెల్లీ జంట రాత్రికిరాత్రే ఫేమస్ అయిపోయారు.

ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ జంటను సత్కరించి, లక్ష రూపాయలు బహుమతిగా అందజేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏనుగుల శిబిరం సందర్శనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఈ జంట కలిసింది.

అయితే, ఈ డాక్యుమెంటరీలో నటించినందుకు తమకు సరైన పారితోషికం చెల్లించలేదని ఆరోపిస్తూ బొమ్మన్, బెల్లీ జంట దర్శకురాలు కార్తీకి గొంజాల్వెజ్, నిర్మాణ సంస్థ సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత గునీత్ మొంగాపై కేసు వేసింది.

డాక్యుమెంటరీలో నటించినందుకు గుడ్‌విల్ కింద 2 కోట్ల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ డబ్బుతో ఇంటితోపాటు వృద్ధాప్యంలో తమ అవసరాలు తీరతాయని చెబుతున్నారు.

ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే, తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని వారి తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు.

బొమ్మన్-బెల్లీ జంట ఆరోపణలను సినిమా దర్శక, నిర్మాతలు ఖండిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీకి పనిచేసిన అందరిపై తమకు చాలా గౌరవం ఉందని వారు బీబీసీ తమిళ్‌‌కు చెప్పారు.

''బొమ్మన్, బెల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు'' అని దర్శకురాలు కార్తీకి గొంజాల్వెజ్ వాట్సాప్ మెసేజ్ పంపించారు.

ఎలిఫెంట్ విస్పరర్స్

ఫొటో సోర్స్, THE ELEPHANT WHISPERERS / NETFLIX

నీలగిరి పర్వతాల్లోని అందమైన అటవీ ప్రాంతంలో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఏనుగుల మంద నుంచి తప్పిపోయి, గాయపడిన ఏనుగు పిల్ల 'రఘు'‌ని బొమ్మన్, బెల్లి జంట సంరక్షిస్తారు.

ఈ జంట అడవులనే నమ్ముకుని బతుకుతున్న కట్టునాయకన్ అనే గిరిజన తెగకు చెందిన వారు.

వన్యప్రాణులను కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నం, వాటితో వారికి ఏర్పడిన అనుబంధాన్ని చూపించిన తీరుకు ప్రశంసలు దక్కాయి.

జూన్‌లో సినిమా దర్శక, నిర్మాతలకు ఈ జంట లీగల్ నోటీసులు పంపింది. అయితే, ఈ విషయం గత నెలలో ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో వెలుగులోకి వచ్చింది.

డాక్యుమెంటరీ షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు కొన్ని వాగ్దానాలు చేశారని, కానీ వాటిని నెరవేర్చలేదని ఈ జంట ఆరోపిస్తోంది. ఈ డాక్యుమెంటరీలో నటిస్తే ఇల్లు కొనిపెడతామని, ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని అంటోంది.

''కార్తీకి గొంజాల్వెజ్ మమ్మల్ని కలిశారు. మా మీద డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ డాక్యుమెంటరీకి అవార్డు వస్తుందని మాకు తెలియదు. ఆమె ఏం చెప్తే అది చేశాం'' అని బొమ్మన్ బీబీసీ తమిళ్‌‌తో చెప్పారు.

''ఇల్లు కట్టిస్తాను. కారు కొనిపెడతానని షూటింగ్ సమయంలో దర్శకురాలు చెప్పారు'' అని ఆయన అన్నారు.

''కానీ మా బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకుంటే, అందులో డబ్బులు లేవు'' అని వారు ఆరోపించారు.

''ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం తప్ప మాకు ఏమీ రాలేదు. ఇచ్చిన హామీలను దర్శకురాలు కార్తీకి గొంజాల్వెజ్ నిలబెట్టుకోలేదు. ఆమె మాకు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు'' అని బొమ్మన్ చెప్పారు.

షూటింగ్ సమయంలో ఖర్చుల కోసం సొంత డబ్బులు వాడాల్సి వచ్చిందని, కార్తీకి గొంజాల్వెజ్‌కు రూ.40 వేలు అప్పు ఇచ్చామని, అవి కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపారు. అయితే ఈ ఆరోపణలను దర్శకురాలు ఖండించారు.

ఎలిఫెంట్ విస్పరర్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

నిర్మాణ సంస్థ సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు, నిర్మాత మొంగా, దర్శకురాలు కార్తీకి గొంజాల్వెజ్‌కు భారీగా లాభాలు వచ్చినా తమకు దక్కాల్సిన న్యాయమైన ప్రయోజనాలు కూడా దక్కలేదని బొమ్మన్, బెల్లీ చెప్పారు.

''కనీసం డాక్యుమెంటరీ ఘన విజయం సాధించిన తర్వాత అయినా, మేం కేటాయించిన సమయం, మా కృషికి తగ్గట్టుగా ప్రతిఫలం అందించాల్సిన అసవరం ఉంది'' అని వారు అంటున్నారు.

బొమ్మన్, బెల్లీ జంట

ఫొటో సోర్స్, KARTIKIGONSALVES/INSTAGRAM

బొమ్మన్-బెల్లీ జంట ఆరోపణలను ఖండిస్తూ గత వారం సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, కార్తీకి గొంజాల్వెజ్‌ కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. ''వారి ఆరోపణలు అబద్ధం. ఇందులో నటించిన వారందరిపై మాకు గౌరవం ఉంది. ఆశావాహ దృక్పథంతోనే ముందుకు సాగుతాం'' అని వారు అందులో తెలిపారు.

ఈ డాక్యుమెంటరీ వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచడంతో పాటు సమాజంపై నిజమైన ప్రభావం చూపించిందని వారు తెలిపారు.

''డాక్యుమెంటరీ ఘన విజయం సాధించడం దేశానికే గర్వకారణం. ఇందులో భాగమైన బొమ్మన్, బెల్లీ వంటి వారికి ఇది విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

భారీ విజయం సాధించిన, అవార్డులు గెలిచిన సినిమాలపై వివాదాలు కొత్తేం కాదు.

సమాజంలో అణగారిన దళిత, ముస్లిం, గిరిజన మహిళలతో నిర్వహిస్తున్న వార్తా సంస్థ నేపథ్యంలో దర్శకులు రింటు థామస్, సుశ్మిత్ ఘోష్ 2021లో ఖబర్ లహరియా అనే డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ 2022 ఆస్కార్ అవార్డ్స్‌‌‌కు నామినేట్ అయింది.

సరిగ్గా ఆస్కార్ వేడుకకు వారం రోజుల ముందు దర్శక, నిర్మాతలు కథను వక్రీకరించారంటూ సదరు మీడియా సంస్థ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను చిత్ర దర్శక, నిర్మాతలు ఖండించారు.

ఇవి కూడా చదవండి: