ఇస్రోకు శ్రీహరికోట కంటే కులశేఖర పట్నంతోనే ఎక్కువ ఉపయోగమా, ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ కోసం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఒకే ప్రయోగ వేదిక ఉంది. ఆంధప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్‌డీఎస్‌సీ) నుంచి ఇస్రో, రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతుంటుంది.
సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రెండు ‘‘లాంచ్ ప్యాడ్స్’’ ఉన్నాయి. వీటి నుంచి పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ అనే రాకెట్ లాంచింగ్ వెహికిల్స్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇస్రో దేశంలో రెండో ప్రయోగ వేదిక నిర్మాణాన్ని మొదలుపెడుతోంది. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మొత్తం 2,300 ఎకరాలు సేకరించి పనులు ప్రారంభించింది.
నిర్మాణంలో ఉన్న ఈ ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ (ఎస్‌ఎస్‌ఎల్వీ) ప్రయోగాలను చేపట్టాలని ప్రతిపాదించింది.
రెండేళ్లలో ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
దేశంలో రెండో ప్రయోగ వేదికను తమిళనాడులో నిర్మించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దీని సమీపంలో అంతరిక్ష పరిశ్రమ, ప్రొపెల్లంట్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.
ఇస్రో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కులశేఖరపట్నంను ఎందుకు ఎంచుకుంది? తమిళనాడులో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు గతంలో కూడా ఇస్రో ప్రయత్నించిందా? ఇలాంటి ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఇళంగోవన్ సమాధానాలు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీహరికోట మొదటి ఆప్షన్ కాదు
దేశంలో తొలి ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు తొలుత తమిళనాడును పరిగణనలోకి తీసుకున్నారు. రామనాథపురం జిల్లా సయల్‌కుడి సమీపంలోని వలినోక్కమ్‌లో తొలి ప్రయోగ వేదికను నిర్మించేందుకు 1960ల చివర్లో ప్రయత్నాలు జరిగినట్లు ఇళంగోవన్ బీబీసీతో అన్నారు.
అప్పటి ఇస్రో చైర్మన్ ప్రొఫెసర్ సతీశ్ ధావన్ నేతృత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ సభ్యుడిగా ఉన్న ఒక కమిటీ ప్రయోగ వేదిక ఏర్పాటు కోసం వలినోక్కమ్ సైట్‌కు వెళ్లి పరిశీలించినట్లు ఇళంగోవన్ తెలిపారు.
సైట్ పరిశీలనకు వెళ్లిన ఇస్రో బృందానికి గ్రామస్థులు, క్రైస్తవ మతాధికారులు ఆత్మీయ స్వాగతం పలికారని, కానీ కొన్న నిర్ధిష్ట కారణాల వల్ల ఆ ప్రతిపాదనను పక్కకుబెట్టారని ఆయన వెల్లడించారు.
ఆ తర్వాతే శ్రీహరికోటలో ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించారని ఆయన చెప్పారు.

కులశేఖరపట్నం ఎందుకు?
ఇస్రో తాజాగా కులశేఖరపట్నాన్ని ఎందుకు ఎంచుకుందనే దానికి ఇళంగోవన్ మూడు కారణాలను చెప్పారు. అందులో మొదటిది, లాంచ్‌ప్యాడ్ అనేది భూమధ్యరేఖకు దగ్గరగా ఉండాలి. దక్షిణ ధృవపు కక్ష్యలోకి పంపే అంతరిక్షనౌకలను తూర్పు తీరం సమీపంలోని ప్రాంతం నుంచే ప్రయోగించాలి. అలాగైతేనే భూమి తిరిగే వేగంలో 0.5కి.మీ/సెకండ్ అదనపు వేగం లభిస్తుందని ఆయన వివరించారు.
ఉపగ్రహ ప్రయోగాల్లో పై అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే భారీ పేలోడ్‌లను కూడా సులభంగా ప్రయోగించవచ్చని, రాకెట్ల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవచ్చని ఆయన తెలిపారు.
ఈ కారణం వల్లనే చాలా దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి వేరే ఖండాల నుంచి పంపిస్తాయని చెప్పారు.
ఉదాహరణకు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) తన ఉపగ్రహాలను ఫ్రెంచ్ గయానాలోని గయానా స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తుంది. ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ భూమధ్యరేఖకు సమీపంలో ఉండటంతో పాటు దాని తూర్పువైపు సముద్రం ఉంటుంది.
రెండో కారణం ఏంటంటే, అంతరిక్ష వాహక నౌకలను ప్రయోగించిన తర్వాత వాటినుంచి విడిపోయి కిందపడే భాగాలు సముద్రాల్లోనే పడాలి. నివాసిత ప్రాంతాల్లో పడితే భారీ నష్టం కలుగుతుంది.
అందుకే ప్రయోగ వేదికలు భూమధ్యరేఖకు, సముద్ర తీరానికి సమీపాన ఉండే విధంగా చూసుకోవడం తప్పనిసరి.
శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్ల విడి భాగాలు శ్రీలంకలో పడకుండా నిరోధించేందుకు డాగ్లెగ్ మ్యాన్యువర్ అనే పద్ధతిని ఇస్రో అనుసరిస్తుందని ఎలాంగోవన్ చెప్పారు.
ఇక మూడో కారణం గాలి. ప్రయోగ వేదికలు ఉండే చోట గాలి వేగం గంటకు 30 కి.మీ కంటే తక్కువగా ఉండాలని, అధిక గాలి వేగం వల్ల రాకెట్లను ప్రయోగించే సమయంలో ప్రమాదాలు కలగవచ్చని ఆయన తెలిపారు.
అంతరిక్ష కేంద్రం వద్ద అల్పపీడన పరిస్థితులు అసలే ఉండకూడదని ఆయన అన్నారు. ఏరియాను ఎంపిక చేసేటప్పుడు అనువైన వాతావరణ పరిస్థితులు ఉండేలా చూసుకోవడం చాలా కీలకమని ఆయన సూచించారు.
‘‘కులశేఖరపట్నానికి పైన పేర్కొన్న అన్ని లక్షణాలు ఉన్నాయి. అందుకే అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ఈ తీరప్రాంత పట్టణాన్ని ఇస్రో ఉత్తమ ప్రదేశంగా ఎంచుకుంది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBELANGOVAN RAJAGOPALAN
భూమధ్యరేఖకు సమీపాన కులశేఖరపట్నం
భూమధ్యరేఖకు ఉత్తరాన 8.36 డిగ్రీల స్థానంలో కులశేఖరపట్నం, 13.74 డిగ్రీల వద్ద శ్రీహరి కోట ఉంటుంది. కాబట్టి, కులశేఖర పట్నం నుంచి రాకెట్లను ప్రయోగిస్తే ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చని బీబీసీతో మాట్లాడుతూ మరో సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త నెల్లై ఎస్. ముత్తు చెప్పారు.
‘‘ శ్రీహరికోట నుంచి పంపించే రాకెట్లు శ్రీలంక గగనతలం మీదుగా ప్రయాణించకుండా, వాటి విడిభాగాలు శ్రీలంక భూభాగంలో పడకుండా నిరోధించేందుకు వాటిని తూర్పు వైపుకు ప్రయోగించి తర్వాత దక్షిణ ధ్రువం దిశగా మళ్లిస్తారు. కానీ, కులశేఖరపట్నం నుంచి ప్రయోగించే రాకెట్లకు ఇలా చేయనవసం లేదు. నేరుగా దక్షిణం వైపే వాటిని ప్రయోగించవచ్చు’’ అని ముత్తు వివరించారు.
క్రయోజెనిక్ ఇంజిన్లలో వాడే ద్రవ హైడ్రోజన్‌ను తిరునల్వేలీ జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఉత్పత్తి చేస్తారు. రాకెట్ భాగాలను కేరళలోని తుంబలో తయారు చేస్తారు.
ఈ భాగాలన్నింటిని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటకు చేర్చడంలో భద్రతా సమస్యలు, తరలించేటప్పుడు విడి భాగాలు ముక్కలు కావడం, రవాణా ఆలస్యం కావడం వంటి సమస్యలను ఇస్రో ఎదుర్కొంటుంది. ఇంధనం, రాకెట్ విడి భాగాలు తయారయ్యే పట్టణాలను కులశేఖరపట్నం దగ్గరగా ఉండటంతో ఇస్రోకు ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ముత్తు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ పటంలో కులశేఖరపట్నం
కులశేఖరపట్నం ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా వేస్తున్నారు.
‘‘తమిళనాడులోని దక్షిణ జిల్లాల ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్టుతో ప్రపంచ పటంలో కులశేఖరపట్నం చేరుతుంది’’ అని ముత్తు అన్నారు.
కులశేఖరపట్నం ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్వీలను ప్రయోగించాలన్నది ఇస్రో ప్రణాళిక.
చిన్న రాకెట్ భాగాలను తయారు చేయడం, వాటిని అమర్చడం, వాటిని ప్రయోగించడం సులభం అయినందున కులశేఖరపట్నంలో ఒక ప్రత్యేక అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారు.
చిన్న చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి పెద్ద రాకెట్లు తయారయ్యే వరకు ఎదురు చూడకుండా, ఆలస్యం చేయకుండా డిమాండ్‌ను బట్టి వాటిని ప్రయోగిస్తే వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ అందాల పోటీలు: ‘తనిఖీల పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














