నైజర్ తిరుగుబాటు: పశ్చిమ ఆఫ్రికా దేశాలలో సైనిక తిరుగుబాట్ల వెనుక ఫ్రాన్స్ హస్తం ఉందా?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, లియెనార్డ్ ఎంబులె-ఎంజీగె, నిక్ చీజ్‌మన్
- హోదా, ఆఫ్రికా అనలిస్ట్స్
పశ్చిమ ఆఫ్రికాలో బుర్కినా ఫాసో, మాలి, గినియా, చాద్ తరువాత సైనిక పాలనలోకి వెళ్లిన మరో దేశం నైజర్. ఇవన్నీ ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీలే.
1990 నుంచి ఇప్పటివరకు ఆఫ్రికాలోని సబ్ సహారన్ దేశాలలో 27 సైనిక తిరుగుబాట్లు జరగ్గా అందులో 78 శాతం ఫ్రెంచ్ మాట్లాడే దేశాల్లోనే జరిగాయి. దీంతో ఈ తిరుగుబాట్లకు ఫ్రాన్స్, ఫ్రాన్స్ వలసవాదమే కారణమా అనే చర్చ కూడా ఒకటి ఉంది.
తిరుగుబాటుదారులలో చాలా మంది మనం అలా ఆలోచించడాన్ని ఇష్టపడతారు.
2022 సెప్టెంబరులో మాలిలో అక్కడి మిలటరీ గ్రూప్ ప్రధాని పదవికి ప్రతిపాదించిన కల్నల్ అబ్దులాయా మైగా ఫ్రాన్స్‌పై తీవ్రమైన విమర్శల దాడి ప్రారంభించారు.
ఫ్రాన్స్‌వి ‘‘కొత్తవలసవాద, అహంకారపూరిత, పితృవాద, ప్రతీకార విధానాలు’’ అంటూ మైగా విమర్శించారు. ఫ్రాన్స్ ‘సార్వత్రిక నైతిక విలువలు’ వదిలేసిందని, మాలిని వెన్నుపోటు పొడిచిందని మైగా ఆరోపించారు.
బుర్కినాఫాసోలో కూడా ఫ్రెంచ్ వ్యతిరేకత తీవ్రమైంది. ఫ్రాన్స్ సేనలు తమ దేశంలో ఉండేందుకు అనుమతిస్తూ సుదీర్ఘకాలంగా అమలులో ఉన్న ఒక ఒప్పందాన్ని బుర్కినా ఫాసో ఈ ఏడాది ఫిబ్రవరిలో రద్దు చేసుకుంది. దాంతో మార్చి నెలలో ఫ్రాన్స్ సేనలు బుర్కినా ఫాసో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
మాలి, బుర్కినాఫాసోలతో సరిహద్దు ఉన్న నైజర్‌లో అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ బజూమ్‌ను సైనిక తిరుగుబాటుతో తొలగించడానికి ముందు కూడా ఆయనపై ఫ్రాన్స్ చేతిలో కీలుబొమ్మ అన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను తొలగించిన తరువాత అధికారం చేపట్టిన అబ్దురహ్మాని చియానీ ఫ్రాన్స్‌తో అమలులో ఉన్న అయిదు సైనిక ఒప్పందాలను రద్దు చేశారు.
నైజర్‌లో సైనిక తిరుగుబాటు తరువాత ఆందోళనలు జరగడంతో పాటు ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపైనా దాడులు జరిగాయి.
ఈ దేశాల వారి ఆవేదనకు అర్థం ఉందనడానికి చరిత్రలో ఆధారాలున్నాయి.

ఫొటో సోర్స్, EPA
విలువైన వనరులు, సంపదను పొందడానికి అణచివేత వ్యూహాలను అమలుచేసేందుకు వీలుగా ఫ్రెంచ్ వలస పాలన నియంత్రణలో ఉండేలాంటి రాజకీయ వ్యవస్థలను ఈ దేశాలలో ఏర్పాటు చేశారు.
బ్రిటిష్ పాలన కూడా ఇలాంటిదే అయినప్పటికీ ఆఫ్రికాలో ఫ్రాన్స్ పాత్ర మరింత భిన్నమైనది. స్వాతంత్ర్యం ఇచ్చిన తరువాత కూడా ఆయా దేశాల రాజకీయాలు, ఆర్థిక విషయాల్లో ప్రమేయం ఉంటోంది. విమర్శకులు దాన్నే జోక్యం అంటుంటారు.
పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రెంచ్ మాట్లాడే 9 దేశాలలో 7 ఇప్పటికీ ‘సీఎఫ్ఏ ఫ్రాంక్’నే కరెన్సీగా వాడుతున్నారు. ఇది యూరోతో ముడిపడిన కరెన్సీ.
ఫ్రాన్స్ అనుకూల నాయకుల తరఫున సైనిక జోక్యానికి, అధికారంలో ఉండేలా చేయడానికి వీలుగా అనధికార రక్షణ ఒప్పందాలు చేసుకుంది.
అనేక సందర్భాలలో ఇది అధికారంపై అవినీతిపరుల పట్టు బిగిసేలా చేసింది. చాద్ మాజీ అధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ, బుర్కినాబె అధ్యక్షుడు బ్లైస్ కంపారె వంటివారిని బలపరుస్తూ ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటాలకు కొత్త సవాళ్లు సృష్టించింది.
ఇటీవల కాలంలో ఆఫ్రికాలో పదవీచ్యుతులైన నేతలలో ఎవరినీ తిరిగి అధికారంలో కూర్చోబెట్టడానికి ఫ్రాన్స్ ఆయా దేశాలలో సైనిక జోక్యం చేసుకోనప్పటికీ వారంతా ఫ్రెంచ్ అనుకూల నేతలుగానే పేరుపడ్డారు.
ఇంకా దారుణమైన విషయమేమిటంటే.. ఫ్రాన్స్ నాయకులు, ఆఫ్రికాలోని వారి మిత్రుల మధ్య సంబంధాలు ఆఫ్రికా ప్రజలను పణంగా పెట్టి తాము శక్తిమంతులుగా, సంపన్నులుగా ఎదగడానికి దారులువేస్తున్నాయి.
ఫ్రాన్స్ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో ఉన్నత స్థాయిలో చేసే రహస్య నేరాలు నియోకలొనియల్ (రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి) సంబంధాలు వెలుగులోకి రాకుండా చేస్తాయని ప్రముఖ ఫ్రెంచ్ ఆర్థిక వేత్త ఫ్రాంకోయిస్ జేవియర్ వర్సావె అభిప్రాయపడ్డారు.
ఇతర దేశాల వ్యవహారాల్లో ఫ్రాన్స్ ప్రభావం ఉండే పరిస్థితిని తెలియజేసేందుకు ఫ్రాంకఫ్రిక్ (ఫ్రెంచ్ ప్రభావాన్ని తెలి) అనే పదాన్ని ఆయన వాడారు. ఈ సంబంధాల వల్ల పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమయ్యాయని ఆయన ఆరోపించారు.
ఇటీవలి ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఫ్రాంకఫ్రిక్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ ఫ్రాన్స్, ఫ్రెంచ్ వ్యాపారస్తులకు ఆఫ్రికా దేశాలతో ఉన్న సమస్యాత్మక సంబంధాలకు సంబంధించిన అనేక వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో చాలా అవినీతి కేసులు కూడా ఉన్నాయి.
దానిని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే, ''యురేనియం లాంటి మా దేశ విలువైన సంపదను ఫ్రాన్స్ దోచుకుంటోంది. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఫ్రాన్స్‌ను వ్యతిరేకిస్తున్నాను. '' అని ఒక నైజీరియన్ బీబీసీకి చెప్పారు.
ఫ్రాన్స్, ఆఫ్రికా రాజకీయ సంబంధాలు బలంగా ఉండడంతో అలాంటి కుంభకోణాలను బయటకు రాకుండా దాచిపెట్టారు. అలాగే, ఇక్కడ ప్రభుత్వాలను స్థిరంగా కొనసాగించేందుకు ఫ్రాన్స్ మిలటరీ సాయంగా ఉండేది.
గత కొన్నేళ్లుగా ఫ్రాన్స్, ఇతర పశ్చిమ దేశాల సామర్థ్యం తగ్గిపోవడంతో వాటిపై విమర్శలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
ఫ్రాన్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ శక్తులకు గణనీయమైన నిధులు, దళాలు ఉన్నప్పటికీ సాహెల్ ప్రాంతంలోని ఇస్లామిక్ తిరుగుబాట్లను ఎదుర్కొని ఆఫ్రికా ప్రభుత్వాలు తమ భూభాగాలపై నియంత్రణ సాధించేలా చేయడంలో విఫలమయ్యాయి.
బుర్కినా ఫాసో, మాలికి ఎదురుగాలి వీయడంలో అదే ప్రధానం. ఎందుకంటే, వారు సొంత పౌరులను కాపాడుకోవడం కంటే వారికి అసమర్థ ఫ్రాన్స్ మద్దతు, ఆశీర్వాదమే ముఖ్యమనే భావనను కలిగించాయి.
అది క్రమంగా, తిరుగుబాటును ప్రజలు ఆమోదిస్తారని అప్పటికే కోపంగా ఉన్న సైనిక నాయకుల్లో విశ్వాసం కల్పించింది. వారికి ప్రజల్లో ఆదరణ కూడా ఉంది.
తన వలస పాలన కొనసాగిన ఆఫ్రికాలోని ఫ్రెంచ్ కాలనీలతో సంబంధాల్లో ఫ్రాన్స్ నేటికీ అవే తప్పులు చేస్తూ వస్తోంది. ఫ్రాన్స్ ప్రభావమున్న దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న అస్థిరతను అడ్డుకునే పరిస్థితుల్లో లేవు.
విదేశాల్లో నిరంకుశ నాయకులను ఆసరాగా చేసుకుని తమ విధానాలు కొనసాగిస్తున్న మాజీ వలస శక్తి ఇది మాత్రమే.
ప్రచ్చన్న యుద్ధం కొనసాగిన చీకటి రోజుల్లో తమకు విధేయులుగా ఉన్న అనేక మంది నియంతలను యూకే, అమెరికా ప్రోత్సహించాయి. కెన్యాకు చెందిన డేనియల్ అరాప్ మోయి నుంచి అప్పటి జైర్, ఇప్పటి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆప్ కాంగోకి చెందిన మొబుటు సెసె సెకో వరకూ ఆ జాబితాలో ఉన్నారు.
గతంలో వలస పాలకులకు, తిరుగుబాటుదారులకు మధ్య అంత బలమైన సంబంధాలు లేవు. 1952 నుంచి నాలుగు దేశాల్లో అత్యధికంగా తిరుగుబాట్లు జరిగాయి. నైజీరియాలో 8 సార్లు, ఘనా 10, సియెర్రా లియోన్ 10, సూడాన్‌లో 17 సార్లు తిరుగుబాట్లు జరిగాయి. అవన్నీ ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న దేశాలు.
గత మూడేళ్లుగా జరిగిన తిరుగుబాట్లు దేశీయ కారణాలతోనే జరిగాయి. అవి రాజకీయ, సైనిక నాయకుల బలాన్ని తెలియజేస్తోంది.
మాలిలో తిరుగుబాటుకు 2011లో లిబియా పతనంలో తీవ్రవాద శక్తుల ప్రభావం, స్థానిక ఎన్నికలను అధ్యక్షుడు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నిరసన ప్రదర్శనలు కారణమయ్యాయి.
మిలటరీ హైకమాండ్‌లో సంస్కరణలు తెచ్చేందుకు, జనరల్ ట్చియానిని అతని పదవి నుంచి తప్పించేందుకు అధ్యక్షుడు బెజౌమ్ సిద్ధమవడం నైజర్‌లో తిరుగుబాటుకు కారణమైంది.
ఈ తిరుగుబాటు నైజీరియా సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసేందుకో, లేదంటే దేశంలోని పేద ప్రజలకు సాయమందించేందుకో జరగలేదని, సైన్యం అధికారాలను కాపాడుకోవడం కోసమే జరిగినట్టుగా బలంగా సూచిస్తోంది.

ఇటీవల తిరుగుబాట్లకు పాల్పడి అధికారంలోకి వచ్చిన కొత్త సైనిక ప్రభుత్వాలు సమస్యాత్మక సంబంధాలను భర్తీ చేసేందుకు మరో స్నేహితుడితో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన రష్యా - ఆఫ్రికా సమ్మిట్‌లో బుర్కినాఫాసో, మాలి నాయకులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలియజేశారు. యుక్రెయిన్‌పై దాడిని సమర్థించారు.
గతంలో మాదిరిగానే, ఈ అంతర్జాతీయ సంబంధాల వల్ల సాధారణ ప్రజల కంటే రాజకీయ ప్రముఖులకే ఎక్కువ ప్రయోజనాలు కలగొచ్చు.
అప్పట్లో పుతిన్ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న వాగ్నర్ గ్రూప్‌కి చెందిన దళాలు, తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా మాలిలో వందలాది మంది పౌరులను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు ఊచకోతలకు పాల్పడినట్లు మే నెలలో అనేక నివేదికలు వచ్చాయి.
ఫ్రెంచ్ ప్రభావాన్ని తగ్గించడం రాజకీయ స్థిరత్వానికి నేరుగా వరం కాకపోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో హానికరమైన రష్యా ప్రభావం నుంచి తమ దేశాలను విముక్తి పొందడానికి రాబోయే దశాబ్దాలలో కొత్తతరం సైనిక నాయకులు మరిన్ని తిరుగుబాట్లు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది.
లియెనార్డ్ ఎంబులె ఎంజీగె యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రసీ, సిటిజన్‌షిప్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఆఫ్రికాలో పరిశోధకుడిగా ఉన్నారు. నీక్ చీజ్‌మన్ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో సెంటర్ ఫర్ ఎలక్షన్స్, డెమొక్రసీ, అకౌంటబిలిటీ అండ్ రిప్రజెంటేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్, బ్రిటానిక్: మునిగిపోతున్న ఓడల నుంచి మూడు సార్లు ప్రాణాలతో బయటపడిన నర్స్.. ‘క్వీన్ ఆఫ్ ద సింకింగ్ షిప్స్’
- కచ్చతీవు: తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య తగవుకు కారణమైన ఈ దీవి కథ ఏంటి?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
- రోజులో ఎప్పుడు, ఎంత తినాలి?
- ఖుదీరామ్ బోస్: స్వాతంత్ర్య పోరాటంలో 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన యోధుడు














