గదర్ 2: సన్నీ దేవోల్ మూవీకి ఎందుకింత క్రేజ్? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది?

గదర్ 2

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, అభిజీత్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సన్నీ దేవోల్ నటించిన గదర్ 2 సినిమా ఆగస్ట్ 11న దేశవ్యాప్తంగా విడుదలైంది.

అప్పటి నుంచి ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తోంది.

ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమా విడుదలైన అయిదో రోజు స్వాతంత్య్ర దినోత్సవ సెలవు కావడంతో, థియేటర్లన్ని ప్రేక్షకులతో నిండిపోయాయి.

ఆ ఒక్క రోజే ఈ సినిమా రూ.55.40 కోట్లను వసూలు చేసింది.

‘‘ఆగస్ట్ 15న ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆగస్ట్ 11న రూ.40.10 కోట్లను, ఆగస్ట్ 12న రూ.43.08 కోట్లను, ఆగస్ట్ 13న రూ.51.70 కోట్లను, ఆగస్ట్ 14న రూ.38.70 కోట్లను, ఆగస్ట్ 15న రూ.55.40 కోట్లను ఈ సినిమా వసూలు చేసింది’’ అని సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

‘‘ఆగస్ట్ 15న కేవలం సింగిల్ స్క్రీన్లపైనే కాకుండా, మల్టిప్లెక్స్‌లలో కూడా టిక్కెట్లు దొరకలేదు. దీని బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో’’ అని అన్నారు.

ఆగస్ట్ 19 నాటికి గదర్ 2 సినిమా వసూళ్లు రూ.300 కోట్లను దాటాయి.

అత్యంత వేగంగా రూ.300 కోట్లను ఆర్జించిన సినిమాగా ఇది రికార్డులోకి ఎక్కింది.

ఈ వారం చివరి కల్లా గదర్ 2 బిజినెస్ రూ.400 కోట్లను క్రాస్ అవుతుందని సినీ విమర్శకులు అంచనావేస్తున్నారు.

గదర్ 2కి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు

ఫొటో సోర్స్, ANI

రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన

గదర్-2.. 2001లో బ్లాక్ బాస్టర్ అయిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కహాని’కి సీక్వెల్‌గా విడుదలైంది. ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు.

రెండు దశాబ్దాల తర్వాత విడుదలైన సీక్వెల్‌కి కూడా ప్రజల నుంచి ఈ స్పందన రావడం చాలా అరుదైన విషయం.

గదర్ 2 విడుదలైన రోజు సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ దీనికి నాలుగున్నర రేటింగ్ ఇచ్చారు. ఇది బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పారు.

23 ఏళ్ల తర్వాత ఆషికీ కూడా వెండి తెరపై సీక్వెల్‌గా వచ్చింది. 2013లో విడుదలైన ఆ సినిమా రూ.100 కోట్లను ఆర్జించింది.

పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఏ హిందీ సినిమా నమోదు చేయని వసూళ్ల రికార్డులను గదర్ 2 రాబడుతుందని పత్రికా ప్రకటనలో సినీ నిర్మాతలు చెప్పారు.

సన్నీ దేవోల్ నటించిన గదర్ 2 విజయానికి ప్రధాన కారణం జాతీయవాదమని సినీ విమర్శకురాలు భారతీ దుబే ‘బీబీసీ’తో చెప్పారు.

‘‘జాతీయవాదమనే యుగంలో మనం బతుకుతున్నాం. సన్నీ కూడా ఈ సినిమా ప్రమోషన్లను భారీగా చేపట్టారు’’ అని తెలిపారు.

‘‘స్వాతంత్య్ర దినోత్సవానికి కాస్త ముందు ఈ సినిమా విడుదల కావడం కూడా దీని విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ సినిమా విడుదలైన సమయం, పాటలు అన్ని కూడా సమయానికి అనుగుణంగా ఉన్నాయి’’ అని చెప్పారు.

‘‘సన్నీ దేవోల్‌కు ప్రస్తుతం 66 ఏళ్లు. ఆయనిప్పుడు సీనియర్ సిటిజన్. ఇది ఆయనకు గొప్ప పునరాగమనం’’ అని అన్నారు.

‘‘ఆగస్ట్ 15న ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనలు ఉంటాయి. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు, ఇండియా-పాకిస్తాన్ అంశాలు అన్ని కూడా ప్రజలను ఆకట్టుకుని, ఈ సినిమా హిట్ అయ్యేలా చేశాయి. ’’ అని మరో సినీ విమర్శకులు గిరీష్ వాంఖడే అన్నారు.

‘‘భారతీయ ప్రేక్షకులతో భావోద్వేగంగా ముడిపడటం అద్భుతంగా అనిపించింది. ఇది భారతీయ సినిమా. హిందూస్తాన్ సినిమాగా దీన్ని చెప్పొచ్చు. హిందువైనా, ముస్లిమైనా ప్రతి భారతీయుని హృదయాన్ని ఈ సినిమా తాకుతుంది. సన్నీ దేవోల్ ఇమేజ్ మతానికి అతీతం. ఇది చాలా పెద్ద విషయం. ఈ పరిధిలోకి మరే ఇతర నటులు రాలేరు’’ అని గిరీశ్ వాంఖడే చెప్పారు.

ఓఎంజీ-2, జైలర్‌ల నుంచి గట్టి పోటీ

గదర్- 2 బాక్సాఫీస్ వద్ద తనని తాను పరీక్షించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి నటించిన ఓఎంజీ(ఓ మై గాడ్)-2 ఆగస్ట్ 11నే విడుదలైంది.

బాక్సాఫీసు ట్రాకింగ్ వెబ్‌సైట్ గణాంకాలను చూస్తే ఓఎంజీ-2 ఇప్పటి వరకు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఆగస్ట్ 11నే తెలుగు నటుడు చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ నటించిన ‘భోళా శంకర్’ సినిమా విడుదలైంది. కానీ, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాట్‌గానే ఉంది.

మరోవైపు రజినీకాంత్ ‘జైలర్’ కూడా అదే రోజు విడుదలైంది. ఈ సినిమా కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

వసూళ్ల విషయంలో జైలర్ మూవీ శనివారం నాటికి రూ.250 కోట్లను క్రాస్ చేసింది.

జైలర్ ప్రపంచవ్యాప్తంగా నమోదైన వసూళ్లను కూడా కలుపుకుంటే, రూ.468 కోట్లుగా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను తీసుకుంటే గదర్ 2 సినిమాను జైలర్ సినిమా వెనక్కి నెట్టేసింది.

గదర్-2 విదేశీ వసూళ్లు ఇప్పటి వరకు కేవలం రూ.35 కోట్లే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

గదర్- 2 సినిమా ఎక్కువగా ఉత్తర భారత ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఉత్తర భారతంలో 88 శాతం థియేటర్లు నిండిపోతున్నట్లు సినీ విమర్శకులు చెప్పారు.

గదర్- 2 రోజే విడుదలైన ఓఎంజీ-2 సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటోంది.

ఒకవేళ గదర్ 2 సినిమా ఒక్కటే విడుదలై ఉంటే, దీనికి వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవి.

‘‘ఓ మై గాడ్ వంటి సినిమాతో పాటు ఇది విడుదలైంది. అప్పటికే ఓపెన్‌హైమర్, బార్బీ సినిమాలు బాక్సాఫీసు వద్ద వాటికంటూ ఒక బజ్‌ను క్రియేట్ చేసుకుని ఉన్నాయి. ‘రాకీ అండ్ రాణి లవ్ స్టోరీ’ కూడా బాగానే నడుస్తోంది.

ఈ సినిమా మంచి సమయంలో విడుదలైంది. వందేమాతరం ట్యూన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, భావోద్వేగ సన్నివేశాలు అన్ని కూడా ఈ సినిమాకు కలిసొచ్చాయి. తండ్రీకొడుకుల మధ్య ప్రేమ, యాంటీ-పాకిస్తాన్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది’’ అని గిరీష్ వాంఖడే అన్నారు.

గదర్ 2 సినిమా సీన్

ఫొటో సోర్స్, UNIVERSAL PR

సన్నీ దేవోల్ పవర్ ఇదంతా..

గతంలో కూడా సన్నీ దేవోల్ మంచి మంచి బ్లాక్ బస్టర్లను అందించారు. కానీ, ఈయన సినిమాలకు పోటీ కూడా అదే స్థాయిలో ఉండేది.

సన్నీ దేవోల్ సినిమా, మరో పెద్ద సినిమాతో కలిసి విడుదల కావడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఇలా జరిగింది.

గదర్ – ఏక్ ప్రేమ్ కథ విడుదలైనప్పుడు ఆమిర్ ఖాన్ ‘లగాన్’ సినిమా కూడా తెరపై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా జాతీయవాదంతోనే 2001 జూన్ 15న విడుదలయ్యాయి.

లగాన్ సినిమా రూ.60 కోట్లను వసూలు చేస్తే, గదర్-ఏక్ ప్రేమ్ కథ సినిమా రూ.130 కోట్లకు పైగా రాబట్టింది.

1990 జూన్ 22న సన్నీ దేవోల్ సినిమా ‘ఘాయల్’ విడుదలైంది. అదే రోజూ ఆమిర్ ఖాన్ ‘దిల్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఘాయల్ రూ.20 కోట్లను, దిల్ రూ.17 కోట్లను రాబట్టాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లని సినీ విమర్శకులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)