మేడ్ ఇన్ హెవెన్: అట్టహాసంగా జరిగే వివాహ వేడుకల వెనుక దాగిన చేదు నిజాలు

ఫొటో సోర్స్, PRIME VIDEO
- రచయిత, చెరిలాన్ మొలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబై
భారతదేశంలో పెళ్ళిళ్ళు చాలా వరకు అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరుగుతుంటాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న కొత్త వెబ్ షో ఆ అట్టహాసం వెనుక దాగిన రుచించని వాస్తవాలను చూపించే ప్రయత్నం చేసింది.
‘మేడ్ ఇన్ హెవెన్’ రెండో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
దిల్లీలోని ప్రముఖుల ‘‘డ్రీమ్ వెడ్డింగ్స్’’ను నిర్వహించేందుకు ఒక వెడ్డింగ్ ప్లాన్లర్ల బృందం వెళ్తుంది.
వారు ఈ డ్రీమ్ వెడ్డింగ్స్‌లో ఎదుర్కొనే సమస్యలు, పెళ్లి వేడుకల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
తారా, కరణ్ ఈ పెళ్లి వేడుకల నిర్వహణ బృందాన్ని నిర్వహిస్తూ ఉంటారు.
అప్పటికే ఉన్న వారి సొంత సమస్యలతో పాటు, వధూవరుల సమస్యలు కూడా వీరికి పెద్ద తలనొప్పిగా మారతాయి.
భారత్‌లో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూస్తున్న సిరీస్‌లలో ఇదొకటి.
ఈ సిరీస్ చూపించిన పెళ్లి వేడుకల వెనకాల ఉన్న డ్రామాతో పాటు విలాసవంతమైన పెళ్లిళ్లు, అద్భుతమైన వస్త్రధారణను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
పెళ్లి వేడుకలపై ప్రభావం చూపే సామాజిక కట్టుబాట్లు, పక్షపాత ధోరణులను ఎత్తిచూపడం కూడా ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతోంది.
కానీ, ఈ సామాజిక కట్టుబాట్ల గురించి పెద్దగా ఎవరూ మాట్లాడరు.

ఫొటో సోర్స్, Sobhita Dhulipala/facebook
అయితే, ముస్లింలను చూపించిన తీరుపై కూడా ఈ షో విమర్శలు ఎదుర్కొంటోంది.
ఒక ఎపిసోడ్‌లో తన జీవిత అంశాలకు, పనికి సంబంధించిన వాటిని తీసుకున్నారని, వాటికి తనకు క్రెడిట్ ఇవ్వలేదని దళిత రచయిత్రి ఆరోపించారు.
ఈ ఆరోపణలను సిరీస్ రూపకర్తలు కొట్టిపారేశారు.
పెళ్లిళ్లపై భారతీయులకు ఉన్న ప్రేమను, ఆసక్తిని పలు రియాల్టీ షోలలో చూపిస్తూనే వస్తున్నారు.
ఇండియన్ మ్యాచ్‌మేకింగ్, బ్యాండ్ బాజా బ్రైడ్, పలు సినిమాలు వచ్చాయి.
మెట్రోపాలిటన్ నగరాల్లో నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నప్పటికీ, పెళ్లి అనేది ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయంగానే ఉంటోంది.
ఒంటరి వ్యక్తులు ముఖ్యంగా మహిళలు స్థిరపడాలంటూ కుటుంబాలు వారిపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తుంటారు.
భారత్‌లో ఎక్కువగా పెళ్లిళ్లను వారి కుటుంబాలే నిర్ణయిస్తాయి. వారి కులం, సామాజిక వర్గానికి చెందిన వారినే జీవిత భాగస్వాములుగా తీసుకొస్తుంటాయి.
పెళ్లి అనే ఈ సామాజిక ఆచారం ఇద్దరు వ్యక్తుల్ని కాకుండా రెండు కుటుంబాలను ఒకటి చేస్తుంది.
కేవలం పెళ్లిళ్లలో మాత్రమే కాక, భారతీయ సమాజంలో వేళ్లూనుకుని ఉన్న ఎన్నో సమస్యలను ఈ షో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఒక ఎపిసోడ్‌లో వధువుకు తన కుటుంబం నల్లగా ఉన్నావని పదే పదే గుర్తుకు చేస్తూ ఉంటోంది. ట్రీట్‌మెంట్ తీసుకోవాలని ప్రోత్సహిస్తూ ఉంటోంది. దీంతో ఆమె స్కిన్ తెల్లబడుతుందని, శుభ్రంగా మారుతుందని వారు చెబుతుంటారు.
వధువు కూడా తన ముఖం రంగు తెల్లగా మారేందుకు వాడని ఫేర్‌నెస్ క్రీమ్‌లుండవు. తనెలాగుందో అలానే అందంగా ఉన్నావని ఎన్నిసార్లు వరుడు చెప్పినప్పటికీ, ఆమె ఫేర్‌నెస్ క్రీమ్‌లు వాడుతూనే ఉంటుంది.
మరో ఎపిసోడ్‌లో, వధువు ముఖంపై తన కొడుకు చేయి చేసుకున్న రక్తపు దెబ్బలు చూసిన తర్వాత కూడా నిజంగానే నువ్వు పెళ్లిని ఆపాలనుకుంటున్నావా? అంటూ వరుడి తల్లి అడిగే సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.
ఆ తర్వాత జనమంతా ఏం అనుకుంటారో అని భయపడి తన లెస్బియన్ కూతురి పెళ్లికి హాజరు కావడానికి ఒక తండ్రి నిరాకరిస్తాడు.
ఫ్రాన్స్‌లోని ఒక పెద్ద వేడుకలో ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి చేసుకుంటారు. ఆర్భాటంగా జరిగే ఈ పెళ్లిలో ప్రేమ కంటే ఎక్కువగా అవకాశమే మనకు కనబడుతుంది.

ఫొటో సోర్స్, PRIME VIDEO
‘‘ఈ సీజన్‌లో ప్రతి ఎపిసోడ్ కూడా పెళ్లి ద్వారా బలపడే సామాజిక దురాచారాన్ని చూపించారు’’ అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫిల్మ్ స్కాలర్ దేబాశ్రీ ముఖర్జీ అన్నారు.
ప్రతి ఎపిసోడ్ కూడా పెళ్లి గురించి అద్భుతమైన మెసేజ్‌ను అందిస్తూ ముగుస్తోంది.
ప్రతి రిలేషన్‌షిప్ కూడా ఎన్నో రకాల టెన్షన్లతో ముడిపడి ఉంటుంది.
పెళ్లి అనే ఒక సామాజిక కట్టుబాటులో ఈ టెన్షన్ మన లోపల నుంచే మొదలవుతోంది. కానీ, పెళ్లిని మనం ఒక అద్భుతమైన దృశ్యంగానే చూస్తామని ముఖర్జీ అన్నారు.
ప్రధాన వినోద మాధ్యమంలో అరుదుగా కనిపించే దళిత వివాహాన్ని అంగరంగవైభవంగా చూపించిన తీరుతో కూడా ఈ సిరీస్ బాగా ప్రశంసలు పొందింది.
దళిత విద్యావేత్త అయిన పల్లవి మెంకే అనే కథానాయకురాలు, తన పెళ్లి వేడుకలో బౌద్ధ వివాహ ఆచారాలను కూడా పాటించాలని ఉన్నత వర్గానికి చెందిన తన భర్త, అత్తామామలతో పోట్లాడిన తీరు ఆకట్టుకుంటోంది.
చదువుల్లో ఆమె సాధించిన విజయాలను చూసి అత్తామామలు చాలా గౌరవంగా భావిస్తారు. కానీ, ఆమె కులాన్ని మాత్రం ఒప్పుకోరు.
ఉదారభావాలు కలిగిన తన భర్త మాత్రం తన కుటుంబంలో ఉన్న కులపిచ్చిని చూడలేకపోతాడు.
కానీ, ఈ షోపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. బహుభార్యత్వాన్ని పరిష్కరించేందుకు రూపొందించిన ఒక ఎపిసోడ్‌పై కొందరు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో ఒక ముస్లిం వ్యక్తి తన మొదటి భార్యకి ఇష్టం లేకుండా రెండో సారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
దీనిపై యూజర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
తనకు క్రెడిట్ ఇవ్వకుండా బౌద్ధ వివాహ ఆచారాల ఎపిసోడ్‌లో తన జీవితాన్ని, పదాలను వాడుకున్నారని ఈ సిరీస్ రూపకర్తలపై దళిత రచయిత్రి యషికా దత్ ఆరోపణలు చేయడం ఇది మరో వివాదానికి కారణమైంది.
అయితే, దత్ జీవితాన్ని, ఆమె పనిని వారు వాడుకున్నారనే ఆరోపణలను సిరీస్ రూపకర్తలు కొట్టిపారేశారు.

ఫొటో సోర్స్, PRIME VIDEO
ఈ షో తత్వాన్ని బోధించే విధంగా ఉందని ప్రచురణ సంస్థలో పనిచేసే సయాంతన్ ఘోస్ అన్నారు.
మరింత వివరంగా ఈ కథాంశం ఉంటే ఇంకా బాగుండేదన్నారు.
ఈ సిరీస్‌లో కొన్ని కథాంశాలు చాలా కచ్చితంగా ఉన్నాయని, 20 ఏళ్ల వ్యక్తిని ఒక కార్యకర్తగా మార్చే విధంగా ఉన్నట్లు సినీ విమర్శకులు సుచిరితా త్యాగి అన్నారు.
ఈ షోపై ఎన్ని వివాదాలున్నప్పటికీ, పెళ్లి, రిలేషన్‌షిప్‌లో చీకటి కోణాలను ఈ షో ఎత్తిచూపినప్పటికీ, ఈ నిషేధిత అంశాలపై చర్చ ప్రారంభించినప్పుడే దీన్ని చాలా మంది తమకు దగ్గరగా భావిస్తారు.
తారా, కరణ్‌ల మధ్యనున్న స్నేహబంధాన్ని కూడా ఈ షోలో బాగా చూపించారు.
తారా తన జీవిత భాగస్వామితో విడాకులు తీసుకునే ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటోంది.
కరణ్ ఒక గే. తన లైంగికత గురించి తనని ఎంతో ప్రేమించే, ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోన్న తల్లికి చెప్పేందుకు సతమతమవుతూ ఉంటాడు.
ఈ ఇద్దరూ ఒకరికొకరు కష్టసమయాల్లో అండంగా నిల్చుంటూ ఉంటారు. మంచి రోజులైనా, చెడ్డ రోజులైనా ఇద్దరు ఒకరికి ఒకరు తోడు.
‘‘ఎక్కడైతే స్నేహముంటుందో, అక్కడ ప్రేమ, ఆప్యాయత, సాంగత్యం ఉంటాయి’’ అని ముఖర్జీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
- భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














