ఆంధ్రప్రదేశ్: 'ట్రాన్స్‌జెండర్ మహిళగా సర్జరీ చేయించుకున్నా... ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే... ' - మదనపల్లె భాను

ట్రాన్స్‌జెండర్
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

“ఏ పని ఇచ్చినా సంతోషంగా చేసుకుంటా. బాత్రూంలు కడిగే పని ఇచ్చినా, మున్సిపాలిటీలో చెత్త ఊడ్చే పని ఇచ్చినా చేస్తాను.”

టమాటా మార్కెట్లో కూలీగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ భాను మాటలు ఇవి. గత ఆరేళ్లుగా భాను ఇదే పని చేస్తున్నారు.

ఇంటర్ వరకూ చదివిన 21 ఏళ్ల భానుది మదనపల్లెలోని కనికిలి తోట. ప్రస్తుతం మదనపల్లె టమాటా మార్కెట్‌లో పనిచేస్తున్నారు.

ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన తర్వాత చాలా మంది ట్రాన్స్‌జెండర్లలా కాకుండా కష్టపడి కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న భాను కథ ఇది.

అమ్మ కోసం...

భాను తండ్రి ఆరు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. భానుకు అన్న, వదిన ఉన్నారు. కానీ, తన భార్యాబిడ్డలతో ఆయన వేరుగా ఉంటున్నారు. తల్లిని అన్నయ్య పట్టించుకోకపోవడంతో తానే చూసుకోవాలని భాను నిర్ణయించుకున్నారు.

సర్జరీలు చేయించుకుని మహిళగా మారిన భాను భిక్షాటన నచ్చకపోవడంతో కూలీ పనులైనా చేసుకుని తల్లిని పోషించాలని నిర్ణయించుకున్నారు.

‘‘నేను కమ్యూనిటీ వాళ్లతో వెళ్లి కలిసి ఉండి, తర్వాత సర్జరీ చేయించుకొని వచ్చినాను. వచ్చిన తర్వాత ఒకరి దగ్గరికి వెళ్లి అడుక్కోవడం నాకు నచ్చలేదు. వాళ్లు తిడతారు. కష్టపడి పని చేసుకుంటే తప్ప ఎవరూ పెట్టరు అనుకుని ఈ టమాటా మార్కెట్లో పనిచేసుకుంటున్నాను. ఇక్కడికి రాకముందు నేను పొలం పనులకు, అంటే టమాటా తోటలో కాయలు కోయడం, వరి నాట్లకు వెళ్లేదాన్ని.’’

ట్రాన్స్‌జెండర్
ఫొటో క్యాప్షన్, భాను

'సెక్స్ వర్క్ నాకొద్దు'

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీతో ఉండి సెక్స్ వర్క్ చేయడం తనకు నచ్చలేదని, అలా ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే కష్టపడి పనిచేసుకుని జీవించడమే మంచిదని అనిపించిందని భాను చెప్పారు.

“అలాంటి వాళ్లు పిలిచినా కూడా నేను పోలేదు. నేను లేకపోతే మా అమ్మకు కష్టం అని చెప్పి వచ్చేశాను. నేను ఈ మార్కెట్లో కష్టపడుతుంటాను. పని చేసుకుంటాను. ఇక వేరే పనులు, అంటే సెక్స్ వర్క్ లాంటివి చేయను. నాకు అలాంటి ఆలోచనలే రాలేదు. కష్టపడి బతకాలి గానీ, సెక్స్ వర్కర్‌గా ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు అనిపించింది. దానికంటే ఇలా పనిచేసుకోవడమే బాగుందనుకుని, ఇందులోనే ఉండిపోయా'' అని భాను చెప్పారు.

ట్రాన్స్‌జెండర్

ఇంటా, బయటా ఎన్నో అవమానాలు

ట్రాన్స్ జెండర్‌గా ఇంటా, బయటా ఎన్నో అవమానాలు భరించారు భాను. అయినవాళ్ల నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. చదువుకుంటున్న సమయంలో కాలేజీలోనూ హేళనకు గురయ్యారు.

‘‘కాలేజీలో అందరూ నన్ను ఎగతాళి చేసేవారు. వీడేంటి అమ్మాయిలా మాట్లాడుతాడు అని. వీడు హిజ్రా అనేవాళ్లు. అలా అంటుంటే నేను ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. మా ఇంట్లో వాళ్లే నన్ను దగ్గరికి రానిచ్చేవాళ్లు కాదు. అన్నీ వదిలేసి ఇంట్లోనే ఉండు. లేదంటే ఉండొద్దు.. నీ వల్ల పరువు పోతుంది అనేవాళ్లు.’’

అయిన వాళ్లే అవమానించడంతో భరించలేక ట్రాన్స్‌జెండర్ కావాలని నిర్ణయించుకున్నానని భాను చెప్పారు.

‘‘చదువుకునే సమయంలో చీర కట్టుకోవడం, అబ్బాయిలు ఎవరైనా అందంగా కనిపిస్తే వారితో మాట్లాడాలని, వారితో స్నేహం చేయాలని అనిపించేది. కానీ, ఇంట్లో వాళ్లకు భయపడి చాలా రోజులు బయటపడలేదు. ఇంట్లో వాళ్లు నన్ను హిజ్రా అని ఎగతాళి చేసేవారు. మావాళ్లే నన్ను అలా అనేసరికి నేను ఇల్లు వదిలి ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిపోవాలని వాళ్లలోకి వెళ్లిపోయా.’’

ట్రాన్స్ మహిళగా జెండర్‌గా మార్చుకున్న తర్వాత సాధారణంగా చాలామంది పేర్లు మార్చుకుంటారు. కానీ, భాను అదే పేరుతో జీవిస్తున్నారు.

ట్రాన్స్‌జెండర్

'సెక్స్ వర్క్ చేయాలని వేధించేవాళ్లు'

పీలేరులో ఉన్న ట్రాన్స్‌జెండర్లతో కలిసి విజయవాడ వెళ్లి ట్రాన్స్‌జెండర్‌ మహిళగా ఆపరేషన్లు చేయించుకున్నానని భాను చెప్పారు. ఆ తర్వాత తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయన్నారు.

“మా కమ్యూనిటీ వాళ్లతో విజయవాడకు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత మా నాన్నకు సీరియస్‌గా ఉంది, ఇంటికి వెళ్లాలని చెప్పినా పంపించే వాళ్లు కాదు. భిక్షాటన చేయాలని, లేదంటే సెక్స్ వర్క్‌‌కు వెళ్లాలని నన్ను వేధించేవాళ్లు. సరిగ్గా తిండి కూడా పెట్టేవాళ్లు కాదు. సర్జరీ జరిగినప్పుడు కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదు. మా అమ్మే మదనపల్లె నుంచి వంట చేసుకుని వచ్చి నాకు పెట్టేవారు.’’

ట్రాన్స్‌జెండర్లలో ఎంతో మంచి వాళ్లు ఉంటారని భాను చెబుతున్నారు. మదనపల్లెలో, పీలేరులో ఉన్న ట్రాన్స్‌జెండర్ల హెడ్ చాందిని తనను కాపాడారని, ఆమే తన సొంత డబ్బులతో తనకు సర్జరీలు చేయించారన్నారు.

తనను అందరూ హిజ్రా అని పిలుస్తుండడం, భిక్షాటన, సెక్స్ వర్క్ చేయమని బలవంతం చేస్తుండడంతో అవి నచ్చక చివరికి కూలీ పనులు చేసి జీవించాలనుకున్నారు.

‘‘ముందు పీలేరు వెళ్లాను. అక్కడే జనాలతో ఉండి సర్జరీ చేయించుకున్నా. అమ్మాయిగా మారిపోయా. అక్కడే ఉంటే భిక్షాటనకు పోయినప్పుడు.. పోదాం రా, ఇట్లా రా, అది, ఇది, కొజ్జా, చెక్క అట్లా అంటారు. అది నాకు ఇష్టం లేక అందరితోపాటు ఒక ఆడదానిలాగానే పని చేసుకోవాలా, ఒక ఆడదానిలాగానే ఉండాలా అనే ఫీలింగ్ కలిగి నేను పని చేసుకుంటున్నాను.’’

ఇప్పటికీ సమాజంలో చాలా మంది ఎగతాళి చేస్తుంటారని, కానీ, ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నానని చెబుతున్నారు భాను.

“సొసైటీలో వీళ్లు, వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. నా కష్టం నాది. నేను కూలి పని చేసుకోవాలి అనుకున్నా. నేను ఏ పనైనా చేస్తాను. కష్టపడి సంపాదిస్తాను” అన్నారు.

ట్రాన్స్‌జెండర్

నిన్ను పనికి పెట్టుకుంటే కస్టమర్లు రారు అనేవాళ్లు

మహిళగా మారిన తర్వాత పని వెతుక్కోడానికి భాను చాలా ఇబ్బంది పడ్డారు.

అటు భిక్షాటనకు వెళ్లలేక, ఎవరూ పని ఇవ్వకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ అని తనను ఎవరూ పనిలో పెట్టుకోలేదని పీఏకే టమాటా మండీలో దినసరి కూలీగా చేస్తున్నానని చెప్పారు.

‘‘నేను పనికోసం ఎక్కడకు వెళ్లి అడిగినా, నేరుగా నాకు ఇవ్వలేం అని చెప్పేవారు కాదు. నిన్ను పనికి పెట్టుకుంటే కస్టమర్స్ రారు అని వేరేవాళ్లతో చెప్పించేవాళ్లు. టమాటా మార్కెట్‌లో కూడా చాలా మందిని పని ఇవ్వమని అడిగాను. ఎవరూ పెట్టుకోలేదు. చివరికి పీఏకే కంపెనీలో సార్ మంచివాడు కాబట్టి నన్ను పనిలో పెట్టుకున్నారు’’ అని అన్నారు.

భాను ప్రస్తుతం మదనపల్లి టమాటా మార్కెట్‌కు వచ్చిన టమాటాలను లోడింగ్, అన్ లోడింగ్ చేస్తుంటారు. కాయలు గ్రేడింగ్ లాంటివి అంటే పాడైన టమాటాలు ఏరడం, వాటిని గ్రేడ్ వారీగా వేరు చేయడం చేస్తారు.

ట్రాన్స్‌జెండర్

నాకు పెళ్ళయింది... కానీ

అవమానాల వల్ల సరిగ్గా కాలేజీకి వెళ్లలేకపోయానని, చదువు అబ్బలేదని భాను చెప్పారు. గతంలో ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయానన్నారు.

ఇప్పుడు భాను పెళ్లి కూడా చేసుకున్నారు. వైవాహిక జీవితం మొదట బాగానే ఉండేదని, కానీ ఇప్పుడు అది కూడా అంతంతమాత్రంగానే ఉందని చెప్పారు.

‘‘నాకు పెళ్లయింది. భర్త ఉన్నా నన్ను ఏం పట్టించుకోడు. ఏమంటే ఏమని చెబుతాను... ముందు బాగానే ఉండేవాళ్లం. ఇప్పుడు పెద్దగా పట్టించుకోడు. నేను అంతకు ముందు ఒక అబ్బాయిని నమ్మి మోసపోయా. అప్పుడు అంటే పెళ్లి కాలేదు. అయితే, ఇప్పుడు నేను తనను పెళ్లి చేసుకున్నా. ఈ జీవితం ఇలా గడిచిపోతోంది. కూలి పనులు చేసుకుంటూ అమ్మను పోషిస్తూ సంతోషంగానే గడిపేస్తున్నా.’’

ట్రాన్స్‌జెండర్

మార్కెట్‌లో చాలా మంది స్నేహితులు

మదనపల్లె మార్కెట్లో కూలి పనులు చేసుకుంటున్న భానుకు ఇప్పుడు అక్కడ చాలా మంది స్నేహితులు కూడా అయ్యారు.

‘‘మార్కెట్లో నాకు అందరూ చాలా బాగా పరిచయం అయ్యారు. స్నేహితులు అయ్యారు. ఒక్క రోజు పనికి రాకపోయినా, ఏమైంది ఎందుకు రాలేకపోయావ్ అని అడుగుతారు. మార్కెట్లో అందరితో కలిసి పని చేస్తుంటే, సంతోషంగా ఉంటుంది. ఇంటి దగ్గర కాసేపు కూడా ఉండాలని అనిపించదు. ఇక అక్కడే అందరితో కలిసి పనిచేస్తూ, జీవితం ఇలాగే సంతోషంగా గడిపేయాలి అనుకుంటున్నా.’’

భాను కష్టపడి పనిచేయాలని తన దగ్గరకు వచ్చిందని, అందుకే ఆమెకు పని ఇచ్చానని మార్కెట్లో మేస్త్రిగా ఉన్న రాజు చెప్పారు.

“చాలా మంది ఇతర ట్రాన్స్‌జెండర్లలా కాకుండా, భాను సొంతంగా కష్టపడి బతకాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి పని అడిగింది. అందుకే నేను ఆమెను మా దగ్గర పనిలో పెట్టుకున్నాం. భానుకు రోజూ వెయ్యి రూపాయలు కూలి ఇస్తుంటాం. ఈ ఆరు నెలలూ మార్కెట్లో పని బాగానే ఉంటుంది. తర్వాత పని ఆగిపోతుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి: