కేరళం: సామాజికంగా వెలి వేస్తారనే భయంతో చిన్నారికి ‘సెక్స్ మార్పిడి’ చేయించాలనుకుంటున్న పేరెంట్స్... కోర్టు ఏం చెప్పిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
జననేంద్రియాలు స్పష్టంగా ఏర్పడకుండా పుట్టిన శిశువు లింగాన్ని తల్లిదండ్రులు నిర్ణయించవచ్చా? కేరళ హైకోర్టుకు ఈ ప్రశ్న ఎదురైంది.
తమను సామాజికంగా వెలి వేస్తారేమోనని భయపడి ఒక ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు సెక్స్ మార్పిడికి అనుమతి కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, తల్లిదండ్రుల విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు.. ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటును చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ చిన్నారిలో జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. చిన్నారిలో క్లిటోరిస్ ఆకారం పెద్దగానూ, మగవారి జననేంద్రియాలను పోలినట్లుగా ఉంటుంది.
పైగా శిశువులో గర్భాశయం, అండాశయాలు కూడా ఉన్నాయి. మూత్రాశయం, యోని నిష్క్రమణ మార్గం ఒకటే ఉంది. ఇక్కడ నుంచి ప్రత్యేక నాళాలు గర్భాశయం, మూత్రాశయానికి వెళతాయి.
దీనితో పాటు శిశువులో కార్యోటైప్ 46XX అనే క్రోమోజోములు ఉన్నాయి. జన్యుపరంగా ఇవి మహిళల క్రోమోజోములు.
సాంకేతికంగా వైద్య శాస్త్రంలో ఈ పరిస్థితిని 'కంజెనైటల్ అడ్రినల్ హైపర్‌ప్లెక్సియా (సీఏహెచ్)’ అని పిలుస్తారు.
సులభంగా చెప్పాలంటే దీన్ని జననేంద్రియాల అభివృద్ధిలో వైకల్యంగా చెప్పవచ్చు. 130 కోట్ల జనాభాలో 10 లక్షల మందిలో ఈ పరిస్థితి సంభవించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
స్పష్టమైన చట్టం లేదు
చిన్నారి తల్లిదండ్రుల తరఫు న్యాయవాది టీపీ సాజిద్ ఈ అంశం గురించి బీబీసీతో మాట్లాడారు.
‘‘చిన్నారి తల్లిదండ్రులు పండ్లు అమ్ముకుని జీవిస్తుంటారు. బిడ్డ పుట్టినప్పుడే ఆపరేషన్ చేయించాలనుకున్నారు. కానీ తిరువనంతపురం, కోజికోడ్‌లోని రెండు మెడికల్ కాలేజీ వైద్యులు లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించారు. కోర్టు ఆదేశిస్తేనే ఇది చేయగలమని వైద్యులు చెప్పారు.
చిన్నారిని సమాజం బహిష్కరిస్తుందేమో అని తల్లిదండ్రుల భయం. అందుకే కోర్టును ఆశ్రయించాం’’ అని చెప్పారు.
కార్యోటైప్ 46XX క్రోమోజోముల విశ్లేషణ నివేదిక ప్రతిపాదికగా లింగ మార్పిడి శస్త్రచికిత్సకు అనుమతి ఇవ్వలేమని ఈ కేసును విచారించిన జస్టిస్ వీజీ అరుణ్ వ్యాఖ్యానించారు.
ఎందుకంటే, చిన్నారి కౌమార దశకు వచ్చేసరికి ఈ క్రోమోజోములు పురుష జననేంద్రియాల్లాగా పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు.
‘‘జననేంద్రియాల పున:నిర్ధరణ శస్త్రచికిత్స’’కు సంబంధించి భారత్‌లో స్పష్టమైన చట్టం లేదని అమికస్ క్యూరీ ఇందులేఖ జోసెఫ్ బీబీసీతో అన్నారు.
ఈ విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని, పిల్లల నిర్ణయంగా పరిగణించలేమని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఇందులేఖ తెలిపారు.
ఒక పురుషుడిని వివాహం చేసుకోవాలనుకున్న ట్రాన్స్ వుమెన్ జనన ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్ (లైంగికత), జెండర్ (లింగం) రెండూ విభిన్న భావనలు
సాధారణ వాడుకలో సెక్స్, జెండర్‌లను ఒకటిగా పరిగణిస్తున్నారని తన ఉత్తర్వుల్లో జస్టిస్ అరుణ్ పేర్కొన్నారు.
అయితే మానవ గుర్తింపు, జైవికత (జీవసంబంధిత) పరంగా ఈ రెండూ భిన్నమైన భావనలు అని జస్టిస్ అరుణ్ వ్యాఖ్యానించారు.
“ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ, క్రోమోజోముల కలయికకు సంబంధించి సెక్స్, జెండర్ అనేవి ఒక వ్యక్తిలోని జీవసంబంధమైన విలక్షణతను సూచిస్తాయి.
మరోవైపు జెండర్ అనేది సామాజికంగా, సాంస్కృతిక పరంగా ఉండే భావన. ఇది స్త్రీ, పురుష, తృతీయ లింగాలకు సంబంధించిన గుర్తింపు, వైఖరులకు చెందినది.
జననేంద్రియ పునర్నిర్మాణ శస్త్రచికిత్సను అనుమతించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 కింద ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. అనుమతి లేకుండా శస్త్రచికిత్స చేయడం పిల్లల గోప్యత, గౌరవానికి భంగం కలిగిస్తుంది" అని జస్టిస్ అరుణ్ తీర్పులో పేర్కొన్నారు.
‘‘ఒకవేళ పిల్లలు కౌమారదశకు చేరుకునేసరికి శస్త్రచికిత్స చేసిన దానికి భిన్నంగా, ఒక జెండర్ నిర్ధరణ అయ్యేలా స్పష్టమైన జననేంద్రియాలు అభివృద్ధి చెందితే ఎలా? అప్పుడు ఈ శస్త్రచికిత్స తీవ్రమైన మానసిక సమస్యలకు దారి తీస్తుంది.
జెండర్‌ను ఎంచుకునే హక్కు కేవలం ఆ వ్యక్తికి తప్ప మరెవరికీ ఉండదు’’ అని జస్టిస్ అరుణ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యం, మానసిక సమస్యలు
మూత్రాశయం, యోని మార్గానికి ఒకటే నిష్క్రమణ ఉండటం కారణంగా శస్త్రచికిత్స చేస్తే మూత్రాశయానికి ఇన్ఫెక్షన్లు సోకడం వంటి వైద్య సమస్యలు కూడా తలెత్తవచ్చని ఇందులేఖ చెప్పారు.
“కౌమారదశలో ఇది మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. కానీ, ఈ సమస్యకు కేవలం శస్త్రచికిత్స పరిష్కారం కాదు’’ అని ఇందులేఖ అన్నారు.
బంధువులు, స్నేహితుల కారణంగా చిన్నారిపై, తల్లిదండ్రులపై ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని ఇందులేఖ అంగీకరించారు.
‘‘ఎదుగుతున్నకొద్దీ చిన్నారి లైంగిక ధోరణిని మార్చే పరిస్థితులను కల్పించడం కంటే, సామాజిక ఒత్తిడిని ఎదుర్కోవడమే ఉత్తమం’’ అని ఇందులేఖ వ్యాఖ్యానించారు.
వివిధ రంగాలకు చెందిన నిపుణులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ అరుణ్ ఆదేశించారు.
ఈ కమిటీలో పీడియాట్రిషియన్, ఎండోక్రినాలజిస్ట్, పీడియాట్రిక్ సర్జన్, చైల్డ్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఉంటారు.
ఈ కమిటీ రెండు నెలల్లో చిన్నారిని పరీక్షించి, బైసెక్సువల్‌గా ఉండటం కారణంగా చిన్నారికి ఏదైనా ప్రాణహాని ఉందా, లేదా ? అని నిర్ణయిస్తుంది. ఒకవేళ ప్రమాదం ఉన్నట్లు తేలితే శస్త్రచికిత్సను ఆమోదించవచ్చు.
శిశువులు, పిల్లల్లో లింగమార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి ప్రభుత్వం మూడు నెలల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు పేర్కొంది.
పిటిషనర్ దంపతులకు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ మగపిల్లలే.
ఇవి కూడా చదవండి:
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- ఆస్ట్రేలియా: 91 మంది బాలికలపై 246 సార్లు అత్యాచారం - చివరకు పోలీసులకు ఎలా దొరికాడంటే
- హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?
- కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














