హెల్త్: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నారా, అయితే మీరు చేయించుకోవాల్సిన మెడికల్ టెస్ట్‌లు ఇవే

యోగా చేస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మయాంక్ భగవత్
    • హోదా, బీబీసీ మరాఠి ప్రతినిధి

చికిత్స కంటే నివారణ ముఖ్యమనే మాట వింటుంటాం. కానీ, నిజంగా దాన్ని మనం పాటిస్తున్నామా? మన శరీరంపై మనకు శ్రద్ధ ఉందా?

ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటేలోపే భుజాలపై బాధ్యతల బరువు పెరుగుతోంది. దానితోపాటే పని ఒత్తిడి. కుటుంబానికి కూడా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. వీటన్నింటిలో పడి తమ శరీరాలపై పెద్దగా శ్రద్ధ వహించరు.

అయితే, ఆ వయసు నుంచే తమ శరీరం గురించి తగినంత శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంపై శ్రద్ధ పెట్టడం ద్వారా వయసు పైబడడం, జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

హెల్త్

ఫొటో సోర్స్, GETTY IMAGES

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు ముప్పైలలోనే భయపెడుతున్నాయి. ఆహార అలవాట్లలో మార్పులు, శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అలాంటి రోగాలకు మనమే ఆహ్వానం పలుకుతున్నాం.

గతంలో గుండెపోట్లు యాభైలలో వచ్చేవి. కానీ ఇప్పుడు ముప్పైలలోనే వస్తున్న గుండెపోట్లు యువతను బలహీనపరుస్తున్నాయి.

''జబ్బులు వచ్చిన తర్వాత ఆస్పత్రులకు పరిగెత్తడం కంటే, నివారణపై దృష్టి పెట్టడం ఉత్తమం. సకాలంలో, సరైన రోగ నిర్థారణ ద్వారా వ్యాధి రాకుండా నివారించొచ్చు. దీని కోసం వైద్య పరీక్షలు చేయించుకోవాలి'' అని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సాన్‌వేద సామెల్ చెప్పారు.

హెల్త్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఏఏ టెస్టులు చేయించుకోెవాలి..

రోగ నిర్ధరణ పరీక్షలను క్లినికల్, స్పెషల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అనే మూడు టెస్టులుగా డాక్టర్ సాన్‌వేద వివరించారు.

రక్తపోటు(బీపీ) పరీక్ష: డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు మొదట రక్తపోటు చెక్ చేయించుకోవాలి. 120-80 ఉంటే సాధారణం. అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బుల ప్రమాదానికి సంకేతం. అందువల్ల ఎప్పటికప్పుడు రక్తపోటును చెక్ చేయించుకుంటూ ఉండాలి.

ఇంట్లో రక్లపోటును కొలిచే డిజిటల్ మానిటర్ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రక్త పరీక్ష: ఇది మీరు చాలా సార్లు వినే ఉంటారు. డాక్టర్లు సీబీసీ చేయించుకోవాలని చెబుతుంటారు. సీబీసీ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇది చాలా సాధారణమైన పరీక్ష. ఇది రక్తంలోని కణాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తుంది.

ఈ పరీక్ష రక్తహీనత (ఎనీమియా), ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని తెలియజేస్తుంది.

భారత్‌లో మహిళల్లో ఎనీమియా చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లొబిన్ శాతాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల కణాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాదు.

కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్లడ్ సుగర్ టెస్ట్ (రక్తంలో మధుమేహం స్థాయి):

దీన్ని షుగర్ టెస్టుగా వ్యవహరిస్తారు. ఈ పరీక్ష చేయించుకునే ముందు 12 గంటల పాటు ఆహారం కానీ, పానీయాలు కానీ తీసుకోకూడదు.

బ్లడ్ షుగర్ లెవెల్ 99 కంటే తక్కువ ఉంటే సాధారణంగా ఉన్నట్లు పరిగణిస్తారు.

బ్లడ్ షుగర్ లెవెల్ 100 నుంచి 125 ఉంటే ప్రీ డయాబెటిక్‌గా వ్యవహరిస్తారు. ఒకవేళ 126 కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్‌(మధుమేహం)గా నిర్ధారిస్తారు.

బ్లడ్ షుగర్ లెవెల్ బాగా ఎక్కువగా ఉంటే హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

లిపిడ్ ప్రొఫైల్: ఆరోగ్య పరీక్షల్లో ఇదొక ముఖ్యమైన పరీక్ష.

మీ గుండె ఎలా పనిచేస్తోంది? అనే పూర్తి సమాచారం లిపిడ్ ప్రొఫైల్ పరీక్షతో తెలుస్తుంది. ఇది సీరం ట్రిగ్లిసిరైడ్స్, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను చెక్ చేస్తుంది.

హెచ్‌డీఎల్(హై డెన్సిటీ లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్ శరీరానికి చాలా మంచిది. కనీసం 60కి పైగా ఉండాలి.

ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్. ఇది 130 కంటే తక్కువ ఉండాలి.

కనీసం రెండేళ్లకొకసారి అయినా ఈ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు ఏడాదికి ఒకసారి చేయించుకుంటే ఉత్తమం.

ఈసీజీ : గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులుంటే డాక్టర్లు ఈ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు.

ఈసీజీ పరీక్ష గుండె సరిగ్గా పనిచేస్తోందా లేదా అనేది తెలియజేస్తుంది.

లివర్ ఫంక్షన్ టెస్ట్: లివర్ సరిగ్గా పనిచేస్తోందా? లేక లివర్ పనితీరు తగ్గిందా? అనేది లివర్ ఫంక్షన్ టెస్టు ద్వారా తెలుస్తుంది.

ఈ టెస్టు ద్వారా హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ, ఫ్యాటీ లివర్ వంటి అవకాశాలను పసిగట్టొచ్చు.

బీఎంఐ చెక్: వైద్యపరంగా ఒబేసిటీ (ఊబకాయం)గా వ్యవహరిస్తారు. తప్పుడు జీవనశైలి వల్ల ఇది వస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు భారత్‌లో రోజురోజుకీ పెరుగుతున్నారు. ఊబకాయం వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

ఒక వ్యక్తి ఎంత బరువు ఉండాలనేది అతని ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) టెస్టు శరీరంలో ఎంత కొవ్వు ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. బీఎంఐ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతున్నారు.

యూరిన్ టెస్ట్: ఈ రోజుల్లో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతున్నారు. ప్రయాణాల సమయంలో పబ్లిక్ టాయిలెట్స్ వాడుతుంటారు. అలాంటి వాటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. యూరిన్ టెస్ట్ (మూత్ర పరీక్ష) చేయడం ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు.

యూరిన్ టెస్టులో యూరిన్‌లో ఎంత ప్రొటీన్, షుగర్, బ్లడ్ లెవెల్స్ తెలుస్తాయి. సిగరెట్లు తాగేవారిలో బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. యూరిన్‌లో రక్తం రావడం బ్లాడర్ క్యాన్సర్‌ లక్షణాల్లో ఒకటి.

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్: కిడ్నీలు(మూత్రపిండాలు) శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించే పనిచేస్తాయి. కిడ్నీలు సరగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు సీరమ్ క్రియాటిన్ పరీక్ష చేస్తారు. సీరం క్రియాటిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని అర్థం.

థైరాయిడ్ టెస్ట్: చాలా మందిలో ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్యలో థైరాయిడ్ వ్యాధి బారిన పడుతుంటారు. దీని వల్ల శరీర బరువు అమాంతంగా పెరగడం లేదా తగ్గుతుంది. రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్‌ను నిర్ధారిస్తారు.

ఏడాదికి ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

విటమిన్ డి టెస్ట్: ఈరోజుల్లో ఎండలో తిరగడం చాలా అరుదుగా మారింది. అందువల్ల శరీరానికి అవసరమైన మోతాదులో విటమిన్-డి అందదు.

వయసు పైబడే కొద్దీ ఎముకలు బలహీనమవుతాయి. చాలా మందికి 30-40లలోనే కీళ్లనొప్పులు మొదలవుతాయి. ఎముకలు పెళుసుగా మారడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఎముకల దృఢత్వానికి విటమిన్ - డి చాలా అవసరం.

విటమిన్ - డి లోపం ఉన్న మహిళలు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని మదర్‌హుడ్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా ఉన్న ప్రతిమ ధామ్కే చెప్పారు.

ప్యాప్ స్మియర్ టెస్ట్: ఇది గర్భాశయానికి సంబంధించిన పరీక్ష. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత యుటెరిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మహిళల్లో రోజురోజుకీ పెరుగుతున్నాయి.

ఇది క్యాన్సర్ రాకముందే గర్భాశయంలో ఏదైనా సమస్య ఉంటే గుర్తిస్తుంది. లైంగికంగా చురుగ్గా ఉన్న 21 ఏళ్లకు పైబడిన స్త్రీలకు ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే ఉత్తమం.

హెల్త్

ఫొటో సోర్స్, Getty Images

సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టెస్ట్: క్యాన్సర్‌ను నిర్ధారించేందుకు ఈ టెస్టు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. దీనినే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్‌గా వ్యవహరిస్తారు.

''మహిళలు తమ రొమ్ములను ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. రొమ్ములలో గడ్డలు ఉన్నాయా? చనుమొనల వద్ద ఇబ్బంది ఉందా? చర్మం రంగులో మార్పులు ఉన్నాయా? అనేవి చూసుకోవాలి'' అని గైనకాలజిస్ట్ థామ్మే చెప్పారు.

పీరియడ్స్ ప్రాబ్లమ్స్: పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నా, నొప్పి భరించలేనిదిగా ఉన్నా, మహిళలు పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే సోనోగ్రఫీ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: