బ్యాంక్ జాబ్స్: లోన్లు కట్టకపోయినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోయినా ఈ ఉద్యోగాలు రావా?

బ్యాంకు ఉద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్యాంకుల్లో ఉద్యోగం కావాలంటే డిగ్రీలు మాత్రమే కాదు క్రెడిట్ స్కోర్ కూడా తప్పనిసరి అంటోంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్).

భారత్‌లోని ప్రభుత్వరంగ బ్యాంకుల(ఎస్‌బీఐ మినహా) ఉద్యోగ నియామకాలకు ఐబీపీఎస్ పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రొబెషనరీ ఆఫీసర్స్ (పీఓ) పోస్టుల నియామక నోటిఫికేషన్‌ను జులై 31న ఐబీపీఎస్ విడుదల చేసింది.

అభ్యర్థుల క్రెడిట్ స్కోరు ‘బాగా’ ఉండాలని నోటిఫికేషన్‌లో ఐబీపీఎస్ నిబంధన పెట్టింది. అంతకు ముందు విడుదల చేసిన క్లర్క్స్ నోటిఫికేషన్‌లోనూ క్రెడిట్ స్కోర్ నిబంధన ఉంది.

ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ 2023

ఫొటో సోర్స్, ibps po notification 2023

కనీసం 650...

ఐబీపీఎస్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం...

బ్యాంకు ఉద్యోగంలో చేరే సమయానికి అభ్యర్థుల సిబిల్ స్కోర్ కనీసం 650, అంతకంటే ఎక్కువ ఉండాలి.

సిబిల్ స్కోర్ ‘కనీసం’ ఎంత ఉండాలి? అనే దాన్ని ఆయా బ్యాంకులు తమ విధానాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండొచ్చు.

ఉద్యోగంలో చేరే తేదీ నాటి కల్లా అప్‌డేట్ చేసిన సిబిల్ స్కోరును బ్యాంకులకు సమర్పించాలి.

లేదా అప్పు తీసుకున్న బ్యాంకు/ఇతర రుణ సంస్థల నుంచి ‘‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ)’’ తీసుకుని బ్యాంకులకు సబ్‌మిట్ చేయాలి.

ఇలా సిబిల్ స్కోర్ లేదా ఎన్‌ఓసీ సమర్పించలేక పోతే ఆ అభ్యర్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో తుది నిర్ణయం బ్యాంకులదే.

బ్యాంకు ఖాతాలు లేని అభ్యర్థులు సిబిల్ స్కోర్‌ను సబ్‌మిట్ చేయాల్సిన అవసరం లేదు.

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం సిబిల్ స్కోర్‌తో పని లేదు. జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొనే సమయానికి సిబిల్ స్కోర్‌ను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది.

క్రెడిట్ రేటింగ్స్ ఇచ్చే సంస్థల్లో సిబిల్ ఒకటి

ఫొటో సోర్స్, WWW.CIBIL.COM

సిబిల్ స్కోరు అంటే?

అవసరం కోసం బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిటూషన్స్ నుంచి కొందరు అప్పు తీసుకుంటూ ఉంటారు. క్రెడిట్ కార్డులు కూడా వాడుతుంటారు. అలాంటప్పుడు...

  • ఒకేసారి ఎన్ని బ్యాంకులు/ఇతర సంస్థల దగ్గర అప్పులు చేశారు?
  • ఎంత అప్పు తీసుకున్నారు?
  • తీసుకున్న అప్పులను సకాలంలో తీరుస్తున్నారా?
  • వాయిదాలు కట్టడంలో విఫలమయ్యారా?
  • అసలు బాకీని పూర్తిగానే తీర్చలేదా?
  • అప్పును కావాలనే ఎగ్గొట్టారా?
  • క్రెడిట్ కార్డు బిల్లులు గడువులోపే కడుతున్నారా?
  • అప్పులు ఉండగానే మరొక అప్పు కోసం వెతుకుతున్నారా?

... ఇలాంటి విషయాలను కొన్ని సంస్థలు రికార్డు చేస్తూ ఉంటాయి. అటువంటిదే సిబిల్(క్రెడిట్ ఇన్ఫరేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్).

పైన చెప్పిన అంశాల ఆధారంగా వ్యక్తులకు ఒక స్కోరు ఇస్తుంది. దాన్నే సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ అంటారు. ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను క్రెడిట్ స్కోర్ తెలుపుతుంది. ఇందులో నాలుగు గ్రూపులు ఉంటాయి.

క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి చదవొచ్చు.

వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణను అంచనా వేయడమే క్రెడిట్ రేటింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

క్రెడిట్ స్కోర్

300-500: చాలా తక్కువ

500-650: తక్కువ

650-750: బాగుంది

750-900: చాలా బాగుంది

బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు వ్యక్తుల క్రెడిట్ స్కోరును చూస్తాయి.

ఆ స్కోరు ఆధారంగా ఆ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను అవి అంచనా వేస్తాయి. అప్పు ఇవ్వాలా వద్దా? ఇస్తే ఎంత ఇవ్వొచ్చు? వడ్డీ రేటు ఎంత ఉండాలి? వంటి విషయాలను క్రెడిట్ స్కోరు ఆధారంగా బ్యాంకులు నిర్ణయిస్తాయి.

బ్యాంకు ఉద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకు ఉద్యోగాల అభ్యర్థులకు ఎందుకు?

చదువుల కోసం విద్యార్థులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు.

అయితే ఇలాంటి వారిలో కొందరు అప్పులు సరిగ్గా తీర్చడం లేదనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు క్రెడిట్ స్కోర్‌ను ఒక ప్రామాణికంగా పెట్టినట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2016 నుంచి అభ్యర్థులకు క్రెడిట్ స్కోర్‌ను తప్పనిసరి చేస్తోంది.

తమ బ్యాంకులో పని చేసే వారి క్రెడిట్ హిస్టరీ బాగా ఉండాలని చెబుతోంది.

చదువు కోసం తీసుకున్న రుణాల ఎగవేతలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో క్రెడిట్ స్కోరు నిబంధనను తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీగురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి.దస్తగిరి రెడ్డి తెలిపారు.

‘‘విద్యార్థి తల్లిదండ్రులు ఉద్యోగులు అయితే తీసుకున్న రుణం మీద వడ్డీని వారే చెల్లించాలి.

అప్పుడు ఉద్యోగం వచ్చాక అసలును విద్యార్థి కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు రైతులు అయితే వడ్డీ, అసలు రెండింటిని విద్యార్థే తీర్చాలి.

కొంతకాలంగా చదువు కోసం తీసుకున్న రుణాల్లో ఎగవేతలు పెరుగుతున్నాయి. కాబట్టి బ్యాంకులు ఉద్యోగాలు ఇచ్చే సమయంలో క్రెడిట్ స్కోర్ చూడటం ప్రారంభించాయి.

బాకీలు ఎగేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. అలాంటి రెండు మూడు కేసులను మేం చూశాం.

కోచింగ్ కోసం మా దగ్గరకు వచ్చే అభ్యర్థులకు మేం అవగాహన కల్పిస్తున్నాం. చదువు కోసం తీసుకున్న అప్పులను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నాం’’ అని దస్తగిరి రెడ్డి బీబీసీతో అన్నారు.

అయితే క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలనే బ్యాంకుల నిర్ణయం వల్ల ఇబ్బందులు పడుతున్నఅభ్యర్థులు కూడా ఉన్నారని దస్తగిరి రెడ్డి చెప్పారు.

‘‘కొందరు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్యుకేషన్ లోను తీసుకునేందుకు కొందరు భయపడుతున్నారు.

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చుతున్న ఈ రోజుల్లో కూడా విద్యా రుణాలను కట్టక పోవడం మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది.

అప్పు తీర్చాల్సిన బాధ్యత తీసుకున్నవారి మీద ఉంటుంది. తిరిగి చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చే కదా లోన్లు తీసుకుంటారు అనేది బ్యాంకుల వాదన. దీర్ఘ కాలంలో అయితే ఈ నిర్ణయం వలన ఆర్థికవ్యవస్థకు మేలు కలుగుతుంది’’ అని దస్తగిరి రెడ్డి వివరించారు.

విద్యా రుణాలతో పాటు కొందరు అభ్యర్థులు క్రెడిట్ కార్డులు తీసుకొని, బిల్లులను చెల్లించకుండా ఎగవేస్తున్నారని ఐబీపీఎస్ తెలిపింది. ఈ తీరు పెరుగుతున్నందునే క్రెడిట్ స్కోర్‌ను ఒక ప్రామాణికంగా పెట్టినట్లు అది చెబుతోంది.

తమ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకునేందుకు అభ్యర్థులకు సుమారు 5-6 నెలల సమయం ఉంటుందని ఐబీపీఎస్ అంటోంది.

క్రెడిట్ స్కోరు

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘‘వెనుకబడిన వర్గాలకు మంచిది కాదు’’

ఇలా క్రెడిట్ స్కోరును అడగడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. రుణాలు తీర్చడంలో విఫలమైన వారు ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం సరైనది కాదంటూ విమర్శించారు.

2016లో ఎస్‌బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎస్.గురుకృష్ణ గోకుల్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

‘‘ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి వర్గాల వారిని బ్యాంకు ఉద్యోగాలకు ఇది దూరం చేస్తుంది. పేదవారిలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాల కోసం చూస్తుంటారు. ఇలా ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం వల్ల రుణాలు కట్టలేని వారి సంఖ్య మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో చేరే అవకాశం ఇస్తే వారు అప్పులు తీరుస్తారు. ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రుణ ఎగవేతలు మరింత పెరుగుతాయి’’ అని ఆ పిటిషన్‌లో గోకుల్ పేర్కొన్నారు.

ఐబీపీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని బ్యాంకు యూనియన్లు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

క్రెడిట్ స్కోర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాన్పూర్ బ్యాంకర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్‌ పేర్కొంది.

ఐబీపీఎస్ ఏంటి?

ప్రభుత్వరంగ బ్యాంకులకు సంబంధించి ఉద్యోగ నియామకాలు చేపట్టే స్వతంత్ర సంస్థ ఐబీపీఎస్.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వరంగ బ్యాంకులు, సెంట్రల్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూటషన్స్ కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి.

1969లో 14 బ్యాంకులను జాతీయం చేసిన తరువాత వాటికి సంబంధించి నియామకాల కోసం ఒక సంస్థ అవసరం ఏర్పడింది. అలా 1984లో ఐబీపీఎస్ ఏర్పడింది.

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ దానికి తొలి చైర్మన్‌గా పని చేశారు. డాక్టర్ ఏఎస్ దేశ్‌పాండే తొలి డైరెక్టర్‌గా సేవలందించారు.

2022-23లో వివిధ పోటీ పరీక్షల కోసం 87.60 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నట్లు ఐబీపీఎస్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)