ఆన్‌లైన్ ప్రాడక్ట్ రివ్యూలలో ఏవి అసలైనవి, ఏవి నకిలీవి? తెలుసుకోవడానికి 3 టిప్స్...

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా వస్తువు కానీ, సేవలు కానీ ఆన్‌లైన్‌లో పొందడం వల్ల కలిగే ప్రయోజనాలే వేరు.
ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే వస్తువులను ఆర్డర్ చేయొచ్చు, సేవలను బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుత ఈ ఆన్‌లైన్ ప్రపంచంలో అన్నిటికీ రివ్యూలు కీలకమవుతున్నాయి.
ఏదైనా వస్తువు కొనాలన్నా, హోటల్ గది బుక్ చేయాలన్నా కూడా రివ్యూలు బాగుంటేనే క్లిక్‌మనిపిస్తున్నారు.
సింగిల్ స్టార్ రివ్యూ ఉండే వస్తువులను కొనడానికి కానీ... సర్వీసులను పొందడానికి కానీ సాధారణంగా ఎవరూ ముందుకురారు.
ఈ నేపథ్యంలోనే చాలా సంస్థలు తమ వస్తువులు, సేవలకు మంచి రివ్యూలు ఉండేలా డబ్బులిచ్చి పాజిటివ్ కామెంట్లు పెట్టిస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.
బ్రిటన్‌లో కొన్ని మెడికల్ క్లినిక్‌లు కూడా ఇలా చేస్తున్నట్లు తేలింది.
అయితే... ఆన్‌లైన్ వ్యాపారంలో ముందుండేందుకు పాజిటివ్ రివ్యూలు డబ్బులిచ్చి రాయించుకోవడం ఒక్కటే కాదు... వ్యాపార ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వారి వస్తువులు, సేవలకు వ్యతిరేకంగా నెగటివ్ రివ్యూలు రాయించేవారూ ఉన్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు.
ఇలాంటి పరిస్థితులలో రివ్యూలలో వచ్చే కామెంట్లలో ఏవి అసలైనవి.. ఏవి కావనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
1) అవసరానికి మించి పొగిడితే...
సాధారణంగా నకిలి పాజిటివ్ రివ్యూలు 5 స్టార్ రేటింగ్ ఇస్తాయి. అలాగే నకిలీ నెగటివ్ రివ్యూలు ఒకటే స్టార్ ఇస్తాయి.
అసలైన రివ్యూలు రాసేవాళ్లు సాధారణంగా మంచీచెడ్డా అన్నీ ప్రస్తావించి మధ్యేమార్గంగా స్టార్ రేటింగ్ ఇస్తారు.
వస్తువు లేదా సేవకు సంబంధించిన వివరాలు లేకుండా సాధారణ అంశాలతో విపరీతంగా పొగిడేసే కామెంట్లు కనిపిస్తే అవి కచ్చితంగా పెయిడ్ రివ్యూలుగానే భావించాలి.
‘ఇది నిజంగా అద్భుతమైన వస్తువు. ఈ కంపెనీ అంటే నేను పడిచస్తాను’ అనే స్థాయిలో కామెంట్లు కనిపిస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు. అలాంటివి చాలావరకు జెన్యూన్ కస్టమర్లు రాసినవి కాకపోవచ్చు.
అసలైన రివ్యూలో ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదనేది స్పష్టంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
2) అనుమానాస్పద అంశాలు
కామెంట్లలో గ్రామర్ తప్పులు, అక్షర దోషాలు ఉన్నాయేమో చూడాలి.
అలాగే రెండు మూడు కామెంట్లు ఒకేలా ఉన్నా కూడా అనుమానించాలి.
అలాంటివి కాపీ పేస్ట్ కామెంట్లు కావొచ్చు.
జెన్యూన్ రివ్యూలు సహజంగా ఉంటాయి.
రివ్యూల్లో బ్రాండ్ ప్రస్తావన బాగా ఎక్కువగా ఉంటే అనుమానించాల్సిందే.
అది మార్కెటింగ్ క్యాంపెయిన్ కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3) ప్రపంచవ్యాప్తంగా రివ్యూలు ఉంటే...
మీరు చదివే రివ్యూ రాసిన యూజర్ స్థానిక ప్రోడక్ట్స్‌కే రివ్యూలు రాశారా లేదంటే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రోడక్ట్స్‌కు రివ్యూలు రాసినట్లుగా ఆన్‌లైన్‌లో ఉందా అనేది చూడాలి.
ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఆ యూజర్ రివ్యూలు కనిపిస్తే ఫేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే రివ్యూయర్ ప్రొఫైల్ చూడాలి.
ఇంకా ఎలాంటి ఇతర వస్తువులకు రివ్యూలు రాశారు, ఆ రివ్యూలు ఎలా ఉన్నాయనేది గమనించాలి.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్, బ్రిటానిక్: మునిగిపోతున్న ఓడల నుంచి మూడు సార్లు ప్రాణాలతో బయటపడిన నర్స్.. ‘క్వీన్ ఆఫ్ ద సింకింగ్ షిప్స్’
- కచ్చతీవు: తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య తగవుకు కారణమైన ఈ దీవి కథ ఏంటి?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
- రోజులో ఎప్పుడు, ఎంత తినాలి?
- ఖుదీరామ్ బోస్: స్వాతంత్ర్య పోరాటంలో 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన యోధుడు














