సర్వాయి పాపన్న: విప్లవకారుడా, బందిపోటా... ఆయనపై ఔరంగజేబుకు ఫిర్యాదు చేసిన తర్వాత ఏమైంది?

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలుగు నేలలో ప్రసిద్ధి చెందిన వీరగాథల్లో ‘సర్వాయి పాపన్న’ కథ ఒకటి. వందల ఏళ్లుగా పల్లె జనం నోళ్లలో నానుతున్న సంప్రదాయ జనరంజక వీరగాథ ఇది.
సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
ఆగస్టు 18న జయంతి, ఏప్రిల్ 2న వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ తేదీల ప్రామాణికతపై చరిత్రకారుల్లో సందేహాలు ఉన్నాయి.
‘పాపన్న’ చరిత్ర చుట్టూ అనేక ఇతివృత్తాలు మనుగడలో ఉన్నాయి. బందిపోటుగా, దారి దోపిడీదారుగా చరిత్రలో కొంతమంది ప్రస్తావిస్తే, జానపదులు పాడుకునే వీరగాథల్లో.. పెద్దలను దోచి పేదలకు పంచిన ‘రాబిన్ హుడ్’ గా కీర్తించారు.
మరోవైపు ముస్లిం పాలకుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన హిందూ యోధుడనీ, బహుజన రాజ్యాధికార ఉద్యమ నిర్మాత అన్న విశ్లేషణలూ ఉన్నాయి.
ఇంతకీ ఆయన విప్లవకారుడా? బందిపోటా?

ఫొటో సోర్స్, SRIRAMOJU HARAGOPAL
ఎవరీ సర్వాయి పాపన్న
ఆయన ఓ ‘సామాజిక బందిపోటు’ (Social Banditry) అన్న సిద్ధాంతాన్ని కొంతమంది చరిత్రకారులు ప్రతిపాదించారు.
17వ శతాబ్దం చివరి అంకంలో ప్రారంభమై, 18వ శతాబ్ధం ఆరంభం వరకూ ‘పాపడు’ అనే పేరుతో సర్వాయి పాపన్న ప్రస్తావన చారిత్రక రచనల్లో కనిపిస్తుంది. 1650-1710 మధ్య కాలాన్ని పాపన్న జీవనకాలంగా చరిత్రకారులు భావిస్తారు.
మొఘలుల రికార్డులు, వీటి ఆధారంగా ఆ తర్వాతి కాలంలో వచ్చిన ఆంగ్లేయ రచనలు, జానపదుల వీరగాథలు, పల్లె పదాలు పాపన్న చరిత్రకు మూలాధారంగా ఉన్నాయి.
మొఘల్ ఆస్థానంలో పనిచేసిన ‘ఖాఫీ ఖాన్’ రచన ‘ముంతఖల్-అల్-లుబాద్’ లో తొలిసారి పాపన్న గురించిన ప్రస్తావన ఉంది. షాజహాన్, ఔరంగజేబు పాలనలో భారత దేశ చరిత్రకు ప్రముఖ ఆధారంగా ఈ రచనను భావిస్తారు.
పాపన్న అసలు పేరు ‘నాశగోని పాపన్న గౌడ్’. తెలంగాణలోని వరంగల్ జిల్లా (ప్రస్తుతం జనగామ జిల్లా) షాపూర్‌లో జన్మించారు. తల్లిందండ్రులు సర్వాయమ్మ, ధర్మన్న గౌడ్.
షాపూర్‌లో పాపన్న కోటను నిర్మించిన తర్వాత ఈ గ్రామాన్ని ‘ఖిలాషాపూర్’ గా పిలిచారు.
తల్లి సర్వాయమ్మ పేరు మీదుగా సర్వాయి పాపన్నగా పేరొచ్చిందని, తన నమ్మిన బంటు ‘సర్వడు’ కారణంగానే ‘సర్వాయి పాపన్న’ అనే పేరు వచ్చిందన్న వాదనలున్నాయి.
సిద్దిపేట జిల్లా ‘ధూల్ మిట్ట’లో దొరికిన వీరగల్లు రాతి విగ్రహంపై ఉన్న శాసనం ఆధారంగా అది సర్వాయి పాపన్న విగ్రహమేనని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు.
కొంపెల్లి వెంకట్ గౌడ్ తన ‘సర్దార్ సర్వాయి పాపన్న’ అనే బుక్ లెట్‌లో ‘ధూల్ మిట్ట’ వీరగల్లుపై చెక్కిన శాసనంలో వివరాలు పాపన్నవే అని, ఈ అంశం పురావస్తు శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ పీవీ పరబ్రహ్మ శాస్త్రి నిర్ధరించినట్లు చెప్పారు.
అయితే, ఈ అభిప్రాయంతో ‘కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధన బృందం’ కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ విభేదించారు. అది కల్యాణీ చాళుక్యుల కాలం నాటి శిల్పం అని ఆయన నిర్ధరణకు వచ్చారు.
''ఆ శాసనంలో ‘సౌదరుడు’ అనే పదం కల్యాణీ చాళుక్యుల కాలంలో ‘సవదొరై’ అనే ప్రభుత్వ ఉద్యోగి హోదాను తెలుపుతోంది. అంటే రాజ్యరక్షకుడు అని అర్థం.

ఫొటో సోర్స్, SRIRAMOJU HARAGOPAL
సర్వాయి పాపన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయలేదు కదా? నిజానికి అది అడవి పందిని వేటాడే వీరగల్లు. అందులో ఉన్న ‘పులి గౌడ’అనే పదం కులతంతులు నిర్వహించే పూజారి వర్గాన్ని సూచిస్తోంది. భోనగిరి(భువనగిరి) సమీపంలో దొరికిన బొల్లెపల్లి శాసనంలో కూడా పులి గౌడ అనే మాట ఉంది. శాసనంలో ఆ తర్వాతి అక్షరాలు స్పష్టంగా లేవు.
‘అయితే, ఆ శాసనంలోని లిపి మాత్రం 17, 18వ శతాబ్ధానికి సంబంధించిన తెలుగు లిపి. సర్వాయి పాపన్న పుట్టిన ఊరు తాడికొండ, లేదా సర్వాయిపేట అనే విషయంలో కూడా స్పష్టత లేదు'' అని శ్రీరామోజు హరగోపాల్ బీబీసీతో అన్నారు.
''బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన పాపన్న తల్లి సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యారు. తనకు ఇష్టంలేకపోయినా తల్లి కోరిక ప్రకారం కొన్నాళ్లు కులవృత్తి కల్లుగీత పని చేశారు. కల్లు మండువాకు (కల్లు అమ్మే ప్రదేశం) వచ్చిపోయే వారు మాట్లాడుకునే సందర్భాల్లో అప్పటి ప్రాపంచిక, రాజకీయ, సామాజిక పరిస్థితులపై అవగాహన పొందారు. ఆ క్రమంలో మొఘల్ సైనికులు, స్థానిక భూస్వామ్య జమీందార్లతో జరిగిన ఘర్షణతో ఆయన బందిపోటుగా మారారు'' తెలంగాణ జానపద కథల్లో ప్రస్తావిస్తారు.

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM
మెరుపు గెరిల్లా దాడులు..
రిచర్డ్ ఎం.యాటన్ రాసిన 'ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్, 1300-1761 ఎయిట్ ఇండియన్ లైవ్స్' (A social history of the Deccan, 1300-1761 Eight Indian lives) పుస్తకాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురించింది. సర్వాయి పాపన్న కవర్ పేజీ ఫోటోతో ప్రచురించిన ఈ పుస్తకంలో పాపన్న జీవితానికి సంబంధించిన అనేక పరిశోధనాత్మక విషయాలు రచయిత వెల్లడించారు.
ఆరిజోనా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్‌లో రిచర్డ్ ఎం.యాటన్ చరిత్ర విభాగం ప్రొఫెసర్. ఆధునిక పూర్వ భారతదేశ సామాజిక, సాంస్కృతిక చరిత్రపై ఆయన పరిశోధన సాగింది.
స్నేహితులతో కలిసి బృందంగా ఏర్పడ్డ పాపన్న మొదట్లో తన స్వగ్రామం ఖిలాషాపూర్, తరికొండ కేంద్రాలుగా వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై దారిదోపిడీలు చేశారు. ఈ దారివెంట వెళ్లే వర్తకులు, భూస్వాములు, ఉన్నత వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు.
స్థానిక ఫౌజుదార్లు, భూస్వామ్య జమీందార్లు పాపన్నను తరిమేయడంతో అతను నిజామాబాద్ జిల్లా ‘కౌలాస్’ పాలకుడు వెంకట్రావ్ సైన్యంలో నమ్మకమైన పనివాడుగా కొంతకాలం అజ్ఞాత జీవితం గడుపుతారు. అక్కడ కూడా ముఠాను ఏర్పాటు చేసి దారిదోపిడీలకు పాల్పడితే వెంకట్రావ్ పాపన్నను బంధిస్తారు.
అయితే, కొంతకాలానికి జైలును బద్దలుకొట్టి అక్కడి నుంచి తన అనుచరులతో తప్పించుకుంటారు పాపన్న. అయితే బందీలను విడిచేస్తే అనారోగ్యంతో ఉన్న తన కొడుక్కి నయం అవుతుందన్న నమ్మకంతో వెంకట్రావ్ భార్య ఖైదీలను విడుదల చేసిందని మరో జానపద కథనం.
స్వగ్రామం ఖిలాషాపూర్ చేరుకున్న పాపన్న తన కార్యకలాపాలు తిరిగి కొనసాగిస్తారు. తన అనుచరుల సంఖ్యను పెంచుకుంటారు.
సామాన్యులు, రైతు శ్రామిక వర్గాల భాగస్వామ్యంతో పాపన్న సైన్యం రూపొందిందని, వివిధ కోటలపై దాడి చేసిన సందర్భంలో అక్కడి బందిఖానాల్లో ఉన్న బందీలను విడిపించి తన సైన్యంలో చేర్చుకునే వారని చరిత్రకారుల అభిప్రాయం.
ఒకానొక సందర్భంలో దిల్లీ, గోల్కొండ రహదారిపై వర్తక, వ్యాపారాలపై పాపన్న చర్యలతో తీవ్ర ప్రభావం పడిందని ఖాఫీఖాన్ తన రచనల్లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SRIRAMOJU HARAGOPAL
ఔరంగజేబుకు ఫిర్యాదు
ఖిలాషాపూర్ కేంద్రంగా పాపన్న కార్యకలాపాలు పెరగడంతో అతనిపై మెఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు ఫిర్యాదు పోతుంది. ఈ సన్నివేశాన్ని ‘ఖాఫీఖాన్’ తన రచనలో ఇలా వివరించారు..
‘‘హిందూ, ముస్లిం తేడా లేకుండా అన్నివర్గాలు పాపన్న బాధితులుగా మారతారు. దీంతో అన్ని వర్గాల ప్రతినిధి బృందం ఔరంగజేబుకు ఫిర్యాదు చేయడంతో తన హైదరాబాద్ ప్రతినిధిని చర్యలకు ఆదేశిస్తారు. ఈక్రమంలో తనను అణచివేసేందుకు వచ్చిన ‘కొలనుపాక’ ఫౌజుదారు ఖాసిం ఖాన్‌ను పాపన్న, అతని అనుచరులు మట్టుబెడతారు.
దీంతో హైదరాబాద్‌లో మొఘల్ ప్రతినిధిగా ఉన్న ‘రుస్తం దిల్ ఖాన్’ ఖిలాషాపూర్ కోటను 1702లో ముట్టడిస్టారు. ఈ ముట్టడి రెండు నెలల పాటు సాగుతుంది. అయితే , పాపన్న అతని అనుచరుడు, సర్వడు తప్పించుకుంటారు. దీంతో రుస్తం దిల్ ఖాన్ షాపూర్ కోటను పేల్చేస్తాడు.
కొన్నాళ్లకు పాపన్న తిరిగి వచ్చి డంగు సున్నం, రాళ్లతో అదే కోటను పటిష్టపరిచి కోటపై ఫిరంగిని అమరుస్తారు. కాలక్రమంలో పాపన్న మరింత బలపడతాడు. మరిన్ని కోటలను స్వాధీనం చేసుకుంటారు.’’ అని పేర్కొన్నారు.
తన బలం చాలని సందర్భంలో కోటను వదిలి వళ్లిపోవడం లేదా సంధి చేసుకోవడంతో పాపన్న రాజనీతిజ్ఞత చూపేవాడని, 1707లో తిరిగి రుస్తం దిల్ ఖాన్ ఖిలాషాపూర్‌ను భారీ బలగంతో ముట్టడించినప్పుడు తప్పించుకునే మార్గం లేక భారీగా ధనం ముట్టజెప్పి బయటపడ్డాడని చరిత్ర పరిశోధకుడు రిచర్డ్ ఎం యాటన్ తన రచనలో ప్రస్తావించారు.
సర్వాయి పాపన్నను ఇతర బందిపోట్లతోనే అణచి వేసేందుకు ప్రయత్నించారన్న కథనాలు చరిత్రలో కనిపిస్తాయి.
‘రిజాఖాన్’ అనే బందిపోటును ఇందుకు నియమిస్తే అతని దాడి నుంచి తప్పించుకున్నాడని ఖాఫీఖాన్ తన రచనలో రాశారు. అదే సందర్భంలో కరీంనగర్ ప్రాంతానికి చెందిన బందిపోటు ‘బల్మూరి కొండలరాయుడు’ తో ఇలాంటి సందర్భంలోనే పాపన్న తలపడ్డాడని, అయితే చివరకు ఇద్దరూ మిత్రులుగా మారతారని జానపద గాథలు ఉన్నాయి.
పాపన్న కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్న కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో అస్తవ్యస్థ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.
1707లో ఔరంగజేబు మరణంతో దిల్లీ గద్దె కోసం వారసత్వ పోరాటం కొనసాగుతున్న సమయం అది. రాజు లేక లేక దక్కన్ (గోల్కొండ, బీజాపూర్) పాలన గాడి తప్పింది. ఈ పరిస్థితులను ఆసరా చేసుకుని పాపన్న కార్యకలాపాలు పెరిగాయి.
ఒక దశలో 20 కిపైగా కోటలు, సుమారు 12 వేల మంది సైన్యం పాపన్న దగ్గర ఉంది. వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పాపన్న ప్రాబల్యం కొనసాగింది.
ఔరంగజేబు మరణం తర్వాత నెలకొన్న అలజడి పరిస్థితుల్లో అతని ముగ్గురు కొడుకుల మధ్య సింహాసనం కోసం జరిగిన అంతర్యుద్ధంలో పెద్ద కొడుకు బహదూర్ షా చక్రవర్తిగా ప్రకటించుకుంటారు. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటారు సర్వాయి పాపన్న.

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM
వరంగల్ కోటపై దాడి - విదేశీ ఆయుధాలు
పాపన్న దాడుల్లో వరంగల్ కోటపై జరిపిన దాడిని ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఆ సమయంలో దేశంలోనే అతి విలువైన తివాచీలు, వస్త్రాల తయారీ కేంద్రంగా వెలుగొందుతున్న వరంగల్ కోటపై సర్వాయి పాపన్న సైన్యం 1708లో 3 వేల మంది సైనికులు, 500 ఆశ్విక దళంతో పీర్ల పండగ రోజు దాడి చేస్తుంది.
మూడు రోజుల పాటు దోపిడీ కొనసాగిస్తారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో ఉన్నత వర్గాలకు చెందిన వారిని, ముఖ్యంగా మహిళలను బందీలుగా ఖిలాషాపూర్‌కు తెస్తారు.
రిచర్డ్ రచన ప్రకారం... వరంగల్ నుంచి దోచుకున్న భారీ సొమ్ముతో మచిలీపట్నం కేంద్రంగా ఉన్న డచ్ వారి వద్ద నుంచి 700 డబుల్ బ్యారెల్ తుపాకులు, మందుగుండు సామగ్రి ఖరీదు చేస్తాడు. ఆ కాలానికి సంబంధించిన ఆధునిక ఆయుధ సంపత్తిని పోగుచేసుకుంటాడు.
అదే సందర్భంలో సమీప బంజారాల (లంబాడీ) నుంచి పశువులను స్వాధీనం చేసుకుని భారీ విస్తీర్ణంలో వ్యవసాయ పనులకు వినియోగించాడని, ధనం, పశు సంపదతో అతను పాలకుడు (రాజు) హోదాను అనుభవించాలనుకున్నాడని చెబుతారు.

ఫొటో సోర్స్, VEERAGONI PENTAIAH
వరంగల్ కోటను కొల్లగొట్టిన తర్వాత పాపన్న గుర్రంపై సాయుధుల పహారాలో పల్లకీలో తిరిగాడు. రాజులాగా తన వ్యవహారశైలిని మార్చుకున్నాడు. అయితే, అతను స్వతహాగా రాజ/పాలక కుటుంబాల వారసత్వం కలిగిన వాడు కాదు’.
సర్వాయి పాపన్న పెరకపల్లి సమీపంలో నిర్మించిన చెరువును సర్వాయి పాపన్న చెరువుగా పిలుస్తారు. ఇక్కడి కోటలోని ‘బయ్యన్న’ను పూజించేవారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను పాపన్నే ఏర్పాటు చేశారని, ఇక్కడ స్వయంగా ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించి ఆరాధించాడని చెబుతారు.
మొఘల్ వారసత్వం కోసం 1709లో దక్కన్ ప్రాంతంలో ఔరంగజేబు కుమారులు కాంభక్ష్, బహదూర్ షా మధ్య జరిగిన యుద్దంలో కాంభక్ష్ మరణిస్తాడు.

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM
పాలకుడి హోదా కోసం 14 లక్షల నజరానా
మొఘల్ చక్రవర్తి నుంచి పాలకుడి హోదా కోసం సర్వాయి పాపన్న ప్రయత్నించారనే కథలు ప్రచారంలో ఉన్నాయి.
హైదరాబాద్‌లో బహదూర్ షా దర్బార్ నిర్వహించిన సమయంలో 14 లక్షలు ధనం నజరానాగా సమర్పించి చక్రవర్తితో సత్కారం పొందుతాడు.
అయితే, వరంగల్ కోట నుంచి కులీన స్త్రీలను బలవంతంగా ఎత్తుకెళ్లి బంధించాడన్న ఫిర్యాదులు, స్థానిక భూస్వాముల పితూరీలతో పాపన్నకు వ్యతిరేకంగా ఖిలాషాపూర్ కోటపైకి మొఘల్ సైన్యం వస్తుంది. ఈ క్రమంలో తరికొండ కోటలో తలదాచుకోవడంతో అక్కడ జరిగిన యుద్దంలో తీవ్రంగా నష్టపోయి రహస్య జీవితం గడుపుతారు.
అజ్ఞాతంలో భాగంగా హుస్నాబాద్‌లో మొఘల్ సైన్యానికి చిక్కిన సర్వాయి పాపన్నకు శిరచ్ఛేదం చేశారని, శత్రువులకు చిక్కడం ఇష్టం లేక తానే ప్రాణత్యాగం చేశారన్న భిన్న వాదనలూ ఉన్నాయి.
అయితే, ఇవన్నీ జానపదాల్లో, జనబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథనాలు మాత్రమే.

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM
బందిపోటుగా ముద్ర
పాపన్న వ్యవసాయ, శ్రామిక సముదాయాల్లో హీరోగా గుర్తింపు పొందాడని, అయితే అనాటి పాలక వర్గంలో మాత్రం బందిపోటుగా ముద్రపడ్డాడని రైతాంగ తిరుగుబాట్లపై పరిశోధనలు చేసిన బ్రిటిష్ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బామ్ అభిప్రాయపడ్డారు.
సర్వాయి పాపన్న ‘సామాజిక బందిపోటు’ వర్గానికి చెందిన వ్యక్తి అని ఎరిక్ ప్రతిపాదించారు.
‘ఇలాంటి వారి చుట్టూ గొప్ప జానపద సాహిత్యం తయారవుతుంది. పాలకుల దృష్టిలో వీరు ఏమైనా కావొచ్చు కానీ, రాబిన్ హుడ్ తరహాలో సామాన్య వర్గాల్లో కీర్తిగడించిన బందిపోట్లు వీరు. ఎందుకంటే వీరు ఎదిగి వచ్చిన సమాజంలో అంతలా వీరి కార్యకలాపాలు పాతుకుపోయి ఉంటాయి. సరైన సందర్భాల్లో వీరు శ్రామికవర్గ పోరాటాలకు ఆజ్యం పోసే సత్తా కలవారు’ అని ఎరిక్ అభిప్రాయపడ్డారు.
అయితే, సర్వాయి పాపన్న పోరాటానికి ఒక క్రమబద్ధమైన సిద్ధాంత ప్రాతిపదిక లేదని చరిత్రకారుల అభిప్రాయం.
'‘వైరుధ్యాలతో నిండిన చరిత్ర పాపన్నది. తనపై మొఘలులు దాడికి వచ్చిన ప్రతిసారీ ఎదిరించి నిలిచిన సామర్థ్యం ఉంది. పోటీ ప్రభుత్వాన్ని నిర్మించేంతటి శక్తివంతుడయ్యాడు. దివిసీమను లూఠీ చేసి, అక్కడి రాజకుమార్తెలను తెచ్చిన గణపతి దేవున్ని కాకతీయ చక్రవర్తి అంటాం. సర్వాయి పాపన్నను దొంగ అంటాం. రాజైతే అలా చేయొచ్చా, పాపన్న చేసింది పాపంగా ఎందుకు పరిగణిస్తారు?
అరాచక పరిస్థితుల్లో బలం, యుక్తి ఉన్నవారికి పాలన అవకాశాలు వచ్చిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. పాపన్న పాలకుడు కావాలనే కోరికతో ఉన్నవాడు. అయితే, పాపన్నది పరిమిత సామర్థ్యం, పరిమిత ప్రాంతాలు, అంతగా ఆర్థిక వనరులు లేవు.’’ అని శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.
''ఊరు నుంచి మొదలై రాజ్యం, రాజు స్థాయికి రావడం గొప్ప విషయం. అతనికి రాజ్యం అంటూ లేదు. దానికి ఎల్లలు లేవు. సామాన్య ప్రజలతో ఆ ప్రాంతాన్ని అదుపులో పెట్టుకున్న వాడు. సాధారణ ప్రజల నుంచి వచ్చిన మనిషి చరిత్ర ఇది. కులం, మతం పరంగా చూసే వారికి సమాధానం చెప్పలేము'' అని వివరించారు.

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM
సర్వాయి పాపన్న వీరగాథలు..
సర్వాయి పాపన్నపై అనేక వీరగాథలు జానపదాల్లో ప్రచారమయ్యాయి. కాలక్రమంలో దూరప్రాంతాలకు ఈ గాథలు పాకాయి. 1974లో జెనీ రొఘయిర్ అనే ఆంగ్ల జానపద రచయిత గుంటూరు జిల్లాలోని తీరప్రాంతంలో సర్వాయి పాపన్నపై పాటను గుర్తించి పొందుపరిచారు.
దీనికి వందేళ్ల కిందట కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో జేఏ బొయ్‌లే అనే వ్యక్తి పాపడి పాటను గుర్తించారు.
బుర్రకథలు, బైండ్ల, గంగిరెద్దుల ఇతర సంచార కులాల వారి పాటల్లోనూ పాపన్న ప్రస్తావన ఉంది.
ఈ గాథల్లో పాపన్న జీవనానికి సంబంధించిన అనేక ఘట్టాలు ఉదాహరించారు. పాపన్న రాజ్యకాంక్షను తెలిపేలా ఎంగిలి ముంతలు ఎత్తను, కొడితే గోల్కొండనే కొట్టాలి అని తన తల్లితో వాదించే సందర్భం ఉదాహరణగా నిలుస్తుంది.
‘జానపదుల్లో చాలా వీరగాథలు ఉన్నాయి. కానీ కొందరికే చరిత్రలో అవకాశం దొరికింది. బ్రిటిష్ వారు ఎలివేట్ చేసిన కథ. అందుకే ఇది ఎక్కువ ప్రచారం లోకి వచ్చింది' అని శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.
‘వీరగాథ లోని నాయకుడు ప్రబంధేతిహాసములలోని నాయకుని వలే ధీరోదాత్తుడు, కులీనుడు, సద్గుణ సంపన్నుడునై యుండవలెనన్న నియమం లేదు. చిన్నపరెడ్డి వంటి మోసగాండ్రు, సర్వాయి పాపని వంటి బందిపోట్లు, మియాసాబ్ వంటి గజదొంగలు కూడా వీరగాథలలో నాయకులుగా ఉందురు'.
'వీరగాథలు ఎక్కువ పక్షపాత రచనలు అని చెప్పవచ్చు. శిష్ట సాహిత్యమున కూడా సగ భాగము పక్షపాత కావ్యాలే కనబడును. రామాయణము ఆర్య పక్షపాతముతోను, మహాభారతము పాండవ పక్షపాతముతోను వ్రాయబడినదని తలచు విమర్శకులు ఉన్నారు. తెలుగులో ప్రసిద్ధ వీరగాథలన్నియూ పాక్షిక దృష్టినే ప్రదర్శించుచున్నవి’’ అని బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బారావు తన పరిశోధన గ్రంథం (పేజీ 226, 257 ) ‘తెలుగు వీరగాథ కవిత్వం’ మొదటి సంపుటిలో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM
లండన్‌లో పాపన్న చిత్రం
పాపన్న పోరాటం ఆనాటి ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా సాగిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారూ ఉన్నారు. అయితే జెఎఫ్.రిచర్డ్స్, వెల్చేరు నారాయణ రావులు రాసిన ‘బాండిట్రీ ఇన్ మొఘల్ ఇండియా’: హిస్టారికల్ అండ్ ఫోక్ పర్సెప్షన్స్ అనే గ్రంథంలో..
‘పాపడు ముస్లిం పాలకుల మీద పోరాడిన హిందూ పాలకుడు అని కొంతమంది మేథావులు పునఃసృష్టించే ప్రయత్నం చేశారు’’ అని నారాయణ రావు అభిప్రాయపడ్డారు.
అయితే, ఖాఫీ ఖాన్ రచనల్లో ‘పాపన్న దారిదోపిడీ చేసిన వారిలో హిందూ మహిళలు ఉన్నారు. మతాలకతీతంగా అతనిపై ఔరంగజేబుకు ఫిర్యాదు చేశారు. అతన్ని వ్యతిరేకించిన వారిలో కింది స్థాయి హిందూ జమీందార్లే మొదట ఉన్నారు. పాపడ్ని అణచివేసేందుకు ఎక్కువగా సైన్యం పోగుచేసింది కూడా వారే అని వివరించారు.
జానపద గాథల్లో సర్వాయి పాపన్న అనుచరులుగా ప్రస్తావించిన వారిలో హసన్, హుస్సేన్, తురక ఇమామ్, దూదేకుల పీర్, కోత్వాల్ మీర్ సాహెబ్‌లు ముస్లింలు కాగా, హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి మనన్న, కుమ్మరి గోవిందు, మేదరి వెంకన్నలు హిందువులు. ఎరుకల సిట్టేలు, జక్కుల పెరుమాళ్లు, యానాది పాసేలు ఆదివాసీ వర్గానికి చెందిన వారు. దీని ఆధారంగా పాపన్నది ముస్లిం దౌర్జన్యాలపై హిందూ తిరుగుబాటు పోరాటం అని చెప్పడానికి వీలులేదు అని రిచర్డ్ ఎం.యాటన్ తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు.
ఇంతమంది శత్రువుల మధ్య పాపన్న సుమారు దశాబ్దకాలం పాటు ఎలా నిలదొక్కుకోగలిగారు అనే అంశానికి చరిత్ర పరిశోధకుడు హాబ్స్‌బామ్ వివరిస్తూ.. ‘రాజ్యం వారిని నేరస్తులుగా చూసినా స్థానికంగా సామాజిక, ఆర్థిక అవసరాల కోసం తాము దోచిన సొమ్మును వినియోగించారు’ అని అభిప్రాయపడ్డారు.
లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో 1750-80ల మధ్య గీసినదిగా భావించే సర్వాయి పాపన్న చిత్రాన్ని భద్రపరిచారు. ఈ చిత్రం ఆధారంగానే సర్వాయి పాపన్న విగ్రహాలు, ఛాయాచిత్రాలు రూపుదిద్దుకున్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- బిందేశ్వర్ పాఠక్ : భారత్‌లో టాయిలెట్లు కట్టే ఆయన్ను అమెరికా ఎందుకు సాయం కోరింది?
- మిస్ యూనివర్స్ పోటీలు: ‘టాటూల తనిఖీ పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- రాడ్‌క్లిఫ్: ఐదు వారాల్లో ఒక్క గీతతో భారత్, పాకిస్తాన్లను విభజించిన బ్రిటిష్ లాయర్
- అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వాన్ని వదులుకొని మళ్లీ భారత పౌరుడిగా ఎందుకు మారారు?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...














